వెక్కివెక్కి ఏడ్చిన మెమెన్, ఏ టైంలో ఏం జరిగింది?
ముంబై: ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమెన్ బుధవారం నాగపర్ కేంద్ర కారాగారంలో సహ ఖైదీలకు, జైలు సిబ్బందికి తుది వీడ్కోలు చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. తన వల్ల ఏమైనా పొరపాటు జరిగితే క్షమించాలని వేడుకున్నాడని సమాచారం.
సోదరుడు సులేమాన్ మెమెన్ వచ్చినప్పుడు యాకూబ్ వెక్కివెక్కి ఏడ్చాడు. నాగపూర్ కేంద్ర కారాగారంలో యాకూబ్‌ను ఉంచిన బ్యారెక్‌లో 15 మంది ఖైదీలున్నారు. ఉరిశిక్షను అమలు చేసేందుకు ముందు రోజు ఖైదీలందర్నీ యాకూబ్ నుంచి వేరు చేశారు.
ప్రత్యేక సెల్‌కు తరలించే ముందు తోటి ఖైదీలు, జైలు సిబ్బందితో కాసేపు మాట్లాడాడు. తనవల్ల పొరపాటు జరిగితే మన్నించాలని భావోద్వేగానికి లోనయ్యాడు. ఉరి తీయడానికి ముందు రోజు నిద్ర పోలేదని లేదా మూడు నాలుగు గంటల ముందు నిద్రలేచాడని తెలుస్తోంది.

అయితే, ఇదే యాకూబ్ మెమెన్ తన కారణంగా 257 మంది మృతి విషయంలో గతంలో ఓ సందర్భంలో పశ్చాత్తాపం కూడా ప్రకటించలేదు. ఇప్పుడు తన వరకు వచ్చేసరికి వెక్కివెక్కి ఏడ్చాడు.
ఏ సమయంలో ఏం జరిగింది?
ఉదయం నాలుగుంపావుకు నిద్ర లేచాడు.
నాలుగున్నరకు దుస్తులు ధరించాడు.
పావుతక్కువ అయిదు గంటలకు అల్పాహారం తీసుకున్నాడు.
ఐదు గంటలకు వైద్య బృందం పరీక్షలు నిర్వహించింది.
ఐదున్నరకు ఖురాన్ పఠించాడు. ప్రార్థించాడు.
ఆరు గంటలకు మరో గదికి తరలించారు.
ఆరంపావుకు జైలు పర్యవేక్షకులు, అదనపు డిజిపి ఉరికంబాన్ని, ఉరితాడును పరిశీలించారు.
ఆరున్నరకు నల్లని ముసుగును ముఖానికి తొడికి ఉరికంబం వద్దకు తీసుకెళ్లారు.
పావు తక్కువ ఏడు గంటలకు టాడా కోర్టు తీర్పును చదివి వినిపించారు. ఉరికంబం ఎక్కించారు. అంత సవ్యంగా ఉందని ధ్రవీకరించుకొని, కోర్టు తీర్పును అమలు చేశారు.
ఏడున్నరకు.. అరగంట నుంచి వేలాడుతున్న మెమెన్ మృతదేహాన్ని కిందకు దించి, అతను మరణించినట్లు వైద్యులు ధ్రవీకరించారు. శవపేటికలో పెట్టి, సోదరులకు అప్పగించారు.
న్యాయం గెలిచిందని అటార్నీ జనరల్, తొందరెందుకని ప్రశాంత్ భూషణ్
యాకూబ్ మెమెన్ ఉరి అనంతరం అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ మాట్లాడారు. దోషికి 22 ఏళ్ల తర్వాత శిక్ష పడిందని, న్యాయం గెలిచిందని చెప్పారు. మెమెన్ అన్ని న్యాయమార్గాలను ఉపయోగించుకున్నాడని చెప్పారు.
మరోవైపు, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. యాకూబ్ మెమెన్‌ను ఆదరబాదరాగా ఉరి తీయాల్సిన అవసరం ఏమొచ్చింది అన్నారు. మెమెన్‌కు ఉరి అమలును నిలిపివేయాలని వాదిస్తున్న వారిలో ప్రశాంత్ భూషణ్ ఒకరు. మెమెన్‌ను మరణ దండ నుంచి మార్చి ఉండాల్సిందన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!