2019 సుప్రీంకోర్టు తీర్పులు: అయోధ్య నుంచి శబరిమల ఆర్టీఐ రాఫెల్ వరకు..!
ఈ ఏడాది సుప్రీం కోర్టు పలు కీలక కేసులపై తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్ 17న రాజీనామా చేశారు. అయితే తాను పదవీవిరమణ చేయబోయే ముందు అయోధ్య భూవివాదం కేసుతో సహా శబరిమల, ఆర్టీఐ పరిధిలోకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం లాంటి కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చారు. అంతేకాదు రాఫెల్ వివాదంలో కూడా తీర్పులు ఇచ్చారు. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పుల సమాహారం క్లుప్తంగా మీకోసం.

అయోధ్య బాబ్రీ మసీదు భూవివాదం తీర్పు
దశాబ్దాలుగా కోర్టుల్లోనే ఎలాంటి పరిష్కారం లేకుండా ఉన్న కేసు అయోధ్య బాబ్రీ మసీదు భూవివాదం కేసు. హిందు ముస్లిం వర్గాల మధ్య గత కొన్నేళ్లుగా అయోధ్య రామమందిరం బాబ్రీ మసీదు భూవివాదం కేసుకు పరిష్కారం రాలేదు.వివాదాస్పదంగా మారిన 2.77 ఎకరాల భూమి మాకు చెందుతుందని హిందూ సంఘాలు వాదిస్తుంటే కాదు ఆ భూమికి హక్కుదారులం తామేనంటూ ముస్లిం వర్గాలు వాదించాయి. ట్రయల్ కోర్టు నుంచి అలహాబాదు హైకోర్టుకు కేసు చేరుకోగా దీనికి కాస్త రాజకీయ రంగు పులుముకుంది. అయితే 2010లో అలహాబాదు కోర్టు కేసులో పిటిషనర్లుగా ఉన్న మూడు పార్టీలు సమానంగా భూమిని పంచుకోవాలని తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై 2011లో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి హిందూ ముస్లిం సంఘాలు.

జస్టిస్ రంజన్ గొగోయ్
ఈ కేసును అప్పటి చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేసి ఏకాభిప్రాయానికి వచ్చింది. బాబ్రీ మసీదును కూల్చడం నేరమే అని చెబుతూ వివాదాస్పదంగా ఉన్న భూమి రామ్‌లల్లాకే చెందుతుందని చెప్పింది. అంతేకాదు మసీదు నిర్మాణానికి అయోధ్యలోనే ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలంటూ తీర్పు వెలువరించింది సర్వోన్నత న్యాయస్థానం. అదే సమయంలో ఆలయ నిర్మాణంకు ట్రస్టును ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే దీనిపై దేశవ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూనే ఈ కేసులో ఎవరూ గెలవలేదు ఎవరూ ఓడలేదు అనే సంకేతాలను పంపాయి. తీర్పుతో సంతృప్తి చెందని ముస్లిం పార్టీలు తిరిగి రివ్యూ పిటిషన్ వేశాయి.

సీజేఐ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుంది
దేశ సర్వోన్నత న్యాయస్థానం మరో ల్యాండ్‌మార్క్ జడ్జిమెంట్‌ను ఇచ్చింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది. పారదర్శకత పేరుతో న్యాయవ్యవస్థను ధ్వంస చేయలేమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పారదర్శకతను మెయిన్‌టెయిన్ చేయడం వల్ల న్యాయవ్యవస్థకు భంగం వాటిల్లదని చెప్పింది కేసును విచారణ చేసిన చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం. జస్టిస్ రంజన్ గొగోయ్‌తో పాటు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్ , జస్టిస్ దీపక్ గుప్తా మరియు జస్టిస్ సంజీవ్ ఖన్నాలు సభ్యులుగా ఉన్నారు. ఈ తీర్పు అప్పటి చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా రావడం విశేషం. అప్పట్లో సీజేగా ఉన్న కేజీ బాలకృష్ణన్ జడ్జీలకు సంబంధించిన సమాచారం వెల్లడించరాదని అది ఆర్టీఐ పరిధిలోకి రాదని తీర్పు చెప్పారు.

విస్తృత స్థాయి బెంచ్‌కు బదిలీ
అయోధ్య తీర్పులో ఐదుగురి జడ్జీల మధ్య ఏకాభిప్రాయం కుదరగా శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై మాత్రం న్యాయమూర్తుల మధ్య బేధాభిప్రాయాలు నెలకొన్నాయి. ప్రతిష్ఠాత్మకమైన శబరిమల ఆలయంలో అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశాన్ని కల్పించడానికి ఉద్దేశించిన రివ్యూ పిటీషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం తన తుది తీర్పును పెండింగ్ లో ఉంచింది. దీనిపై మరింత విస్తృత పరిశీలన అవసరమని ఐదుగురు సభ్యుల ధర్మాసనం అభిప్రాయ పడింది. ఈ కేసును ఏడుమంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పరిశీలనకు బదిలీ చేసింది. అయితే 2018లో ఇచ్చిన తీర్పుపై మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు కానీ స్టే ఇస్తున్నట్లుగానీ సుప్రీంకోర్టు చెప్పలేదు. మొత్తం ఐదుగురు న్యాయమూర్తుల్లో ముగ్గురు జడ్జీలు అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిషేధించడాన్ని సమర్థించగా మరో ఇద్దరు దీన్ని తిరస్కరించారు.

రాఫెల్ పై దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టేసిన ధర్మాసనం
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై తీర్పు ఇచ్చిన కొన్ని క్షణాల్లోనే రాఫెల్ అంశంపై దాఖలైన రివ్యూ పిటిషన్‌పై తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. రాఫైల్ అంశంలో దాఖలైన అన్ని పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు పేర్కొంది. రివ్యూ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీం కోర్టు... రాఫెల్ యుద్ధ విమానకొనుగోలు ఒక ఒప్పందం అనే సంగతి విస్మరించరాదని వెల్లడించింది. రాఫెల్ విషయంలో ఎఫ్ఐఆర్కు ఆదేశాలు ఇవ్వలేమని జస్టిస్ ఎస్కే కౌల్ తీర్పు సందర్భంగా చదివారు. అదే సమయంలో విచారణకు ఆదేశించేంతగా కోర్టుకు ఏమీ కనిపించడం లేదని వెల్లడించారు.

రాహుల్ గాంధీకి మందలింపు..నోరు జారరాదని సూచన
మరోవైపు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ చౌకీదార్ చోర్‌హే అన్న వ్యాఖ్యలను కోర్టుకు ఆపాదిస్తూ కోర్టు రాహుల్ గాంధీపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి వేసిన ధిక్కార పిటిషన్‌కు సుప్రీంకోర్టు ముగింపు పలికింది. ఇక రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని చెప్పిన సర్వోన్నత న్యాయస్థానం భవిష్యత్తులో నోరు జారరాదని వెల్లడించింది. గతంలో న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పాలని కోర్టు కోరగా.... అందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పారు. రాహుల్ క్షమాపణ చెప్పినందున కోర్టు అంగీకరిస్తోందని పేర్కొంది.