year ender 2020 : కమ్యూనిస్టులకు మంచి రోజులు- బీహార్, కశ్మీర్ విజయాలతో గొప్ప ఊరట
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ పార్టీతో ఢీ అంటే ఢీ అనే పరిస్ధితి నుంచి మూడో, నాలుగో స్ధానాల్లో ఉన్న పార్టీలతో పొత్తులకు వెంపర్లాడే పరిస్ధితికి చేరుకున్న కమ్యూనిస్టులకు ఈ ఏడాది జరిగిన పలు ఎన్నికలు ఊపిరి పోశాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీతో ఢీ అన్నా, అనంతరం వారికే మద్దతిచ్చి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా కమ్యూనిస్టులకే చెల్లింది. ఓ రకంగా ఇదే కమ్యూనిస్టు పార్టీల ఉనికిని ప్రశ్నార్ధకం చేసింది. యూపీఏ పరాజయం తర్వాత అంతే స్ధాయిలో కుదేలైన కమ్యూనిస్టులు ఈ ఏడాది మాత్రం కాంగ్రెస్ పార్టీయే కాదు ఇతర విపక్ష పార్టీలతో పోల్చినా మంచి విజయాలు నమోదు చేసుకోవడమే కాక దేశంలో తమ ఉనికినీ చాటుకున్నారు.

కమ్యూనిస్టుల ప్రాభవం...
దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల పేర్లే వినిపించేవి. రెండు, మూడు దశాబ్దాల వరకూ ఇదే పరిస్ధితి. ఆ తర్వాత ఇందిరాగాంధీ హయంలో విధించిన ఎమర్జెన్సీతో జనతా పార్టీ, సోషలిస్టు పార్టీ, జనసంఘ్ ప్రభావం మొదలైనా కమ్యూనిస్టులకు ఉన్న ప్రత్యేకత చెప్పుకోదగింది. దశాబ్దాల పాటు సిద్ధాంతాల ప్రాతిపదికన పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ఎదుర్కొన్న కమ్యూనిస్టులు బెంగాల్, త్రిపుర, మిజోరం, కేరళ వంటి రాష్ట్రాల్లో వరుస విజయాలతో దుర్భేద్యంగా కనిపించేవారు. ఆయా రాష్ట్రాల్లో అప్పట్లో ముఖ్యమంత్రులుగా ఉన్న జ్యోతిబసు, బుద్దదేవ్ భట్టాచార్య, మాణిక్ సర్కార్ వంటి నేతలు తర్వాతి తరానికి మార్గదర్శకులుగా కనిపించారు. కానీ ఎప్పుడైతే సిద్ధాంతాలను వదిలిపెట్టి పొత్తుల కోసం వెంపర్లాడటం మొదలుపెట్టారో అప్పటి నుంచి వారి ఉనికి ప్రశార్ధకంగా మారిపోయింది.

ఈ ఏడాది బీహార్, కశ్మీర్ విజయాలు..
ఒకప్పుడు కమ్యూనిస్టు పాలిత రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు ప్రత్యర్ధులుగా మాత్రమే మిగిలిన కమ్యూనిస్టులు అనంతర కాలంలో వారి మిత్రులుగా మారిపోయేవారు. కానీ సోషలిస్టు పార్టీల పాలిత బీహార్‌తో పాటు ప్రాంతీయ పార్టీలు మాత్రమే ప్రభావం చూపే కశ్మీర్ వంటి చోట్ల ఈ ఏడాది కమ్యూనిస్టులు మంచి విజయాలు సాధించారు. సిద్ధాంతాల ప్రాతిపదికన బీజేపీని వ్యతిరేకించి ఈ రెండు చోట్లా కమ్యూనిస్టులు సత్తా చాటుకున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తాజాగా జరిగిన కశ్మీర్ జిల్లా అభివృద్ధి కౌన్సిళ్ల ఎన్నికల్లోనూ సత్తా ఉన్న మేరకే సీట్లు తీసుకోవడమే కాక అందులో మెజార్టీ సీట్లు గెలిచి చూపించారు.

బీహార్‌లో కాంగ్రెస్‌ను మించిన ప్రదర్శన...
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయేకు గట్టి పోటీ ఇచ్చిన మహాకూటమి అధికారానికి ఆమడ దూరంలో నిలిచిపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ. 70 సీట్లలో పోటీ చేసి కేవలం 19 సీట్లలోనే గెలిచిన కాంగ్రెస్ మహాకూటమిని విజయానికి దూరం చేసింది. కానీ కమ్యూనిస్టు పార్టీలైన సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) మూడు కలిసి 29 సీట్లతో పోటీ చేసి 16 సీట్లు గెల్చుకున్నాయి. కాంగ్రెస్ పోటీ చేసిన సీట్లలో కనీసం 10 నుంచి 20 సీట్లు కమ్యూనిస్టులకు ఇచ్చినా లేదా ఆర్జేడీ పోటీ చేసినా మహాకూటమి ఇప్పటికి అధికారంలో ఉండేదన్న విశ్లేషణ వినిపించింది. కాంగ్రెస్‌తో పోలిస్తే కమ్యూనిస్టుల ప్రదర్శన కచ్చితంగా వారి ఉనికిని చాటిచెప్పింది.

కశ్మీర్‌లోనూ కమ్యూనిస్టుల ప్రభావం
తాజాగా జమ్మూ-కశ్మీర్ జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికలు జరిగాయి. మొత్తం 280 స్ధానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలతో కూడిన గుప్తర్ కూటమి 110 సీట్లతో విజయం సాధించింది. బీజేపీ 75 సీట్లతో అత్యధిక సీట్లు గెల్చిన పార్టీగా నిలిచింది. అయితే గుప్తర్ అలయన్స్‌లో భాగస్వామిగా పోటీ చేసిన సీపీఎం ఆరు సీట్లలో పోటీ చేసి ఐదు సీట్లు గెల్చుకుంది. ఇక్కడ కూడా మరికొన్ని ఎక్కువ సీట్లు కేటాయిస్తూ కశ్మీర్‌లో సీపీఎం మరింత మెరుగైన ప్రదర్శన చూపేదన్న వాదన వినిపిస్తోంది. తమకు పట్టున్న దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం రీజియన్‌లో మరోసారి సీపీఎం పట్టు నిలుపుకోవడమే కాకుండా ఇక్కడ జాతీయ పార్టీలకు సైతం సవాళ్లు విసిరే పరిస్ధితిలో నిలిచింది.
దీంతో ఈ ఏడాది రెండో రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రభావం కనిపించిందని చెప్పుకోవచ్చు.