2020లో కన్నీరు తెప్పించిన అత్యంత బాధాకర దృశ్యాలు .. నెలల తరబడి రోడ్ల మీదే వలస కార్మిక వెతలు
2020లో ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవితాలలో ఊహించలేని కష్టాలకు కారణమైన కరోనా మహమ్మారి అందరికీ గుర్తుండిపోయే చేదు జ్ఞాపకం కాగా , కరోనా మహమ్మారి కారణంగా కరోనా వ్యాప్తికి జరగకుండా విధించిన లాక్ డౌన్ తో పనులు లేక ,తినడానికి తిండి లేక, రవాణా సౌకర్యాలు లేక ఇంటికి వెళ్లే దారి లేక బతుకు జీవుడా అంటూ వేల కిలోమీటర్ల మేర నడిచిన వలస కార్మికుల కష్టాలు 2020లో ప్రతి ఒక్కరికి కన్నీటిని చెప్పించిన అత్యంత బాధాకరమైన దృశ్యాలు.
2020 బిగ్గెస్ట్ డిజాస్టర్ కరోనా .. కేరళలో మొదలై తబ్లీగీ జమాత్ తో దేశమంతా వ్యాప్తి

వేల కిలోమీటర్లు నడిచిన వలస కార్మికుల కష్టాలు
పాలకుల అసమర్థతకు సాక్ష్యంగా లక్షలాది మంది వలస కార్మికులు, ఉన్న చోట పని లేక, తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితుల్లో సొంతగూటికి చేరుకోవాలని కాలినడకనే పయనమయ్యారు. వేల కిలోమీటర్ల దూరాన్ని, మండుటెండను లెక్కచేయకుండా బహు దూరపు బాటసారులు అనుభవించిన కష్టాలు, పడిన వేదన, కాళ్లకు పుండ్లు పడుతున్నా ఇంటికి చేరాలనే వారి తపన దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవింపజేసింది .ఇలాంటి కష్టాలు ఎవరికి రావద్దు భగవంతుడా అనేంతగా వలస కార్మికుల కష్టాలు మనసును బాధించాయి .

వలస కార్మికులు పడరాని పాట్లు పడుతున్నా పాలకుల తీరు సైలెంట్
తమ వారికి దూరంగా బతుకు భారంగా, కరోనా కారణంగా ఉంటామో పోతామో తెలియని పరిస్థితుల్లో కనీసం ఉన్నన్ని రోజులు కుటుంబంతో గడపాలన్న ఆశతో వలస కార్మికులు నడక మొదలుపెట్టారు. కరోనా వ్యాప్తి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రవాణా సౌకర్యాన్ని కూడా ఆపేసిన కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది వలస కార్మికులు నడిచి వెళుతున్నా , వాళ్లు దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వలస కార్మికుల కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.ఎక్కడివాళ్లు అక్కడే ఉండేలా వారికి మౌలిక సదుపాయాల కల్పన ఎండమావులుగానే మిగిలిపోయాయి.

వలస కార్మికులకు అడుగడుగునా కష్టాలే
కరోనా కారణంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. అసలు ముగుస్తుందో లేదో కూడా తెలియదు. దీంతో వేల కిలోమీటర్లు పిల్లా జెల్లాతో, సామాన్ల మూటలతో బయలుదేరారు. రోజంతా అలుపెరుగని నడక సాగించారు. తినటానికి తిండి లేక , మండుటెండలో గొంతు ఎండిపోతున్నా , నాలుక పిడస కడుతున్నా కొడిగట్టే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని తమ వారి కోసం పయనం సాగించారు వలస కార్మికులు. కాళ్ళు పుండ్లు పడినా, నడవలేని స్థితిలో సైతం నడక సాగించారు వలస కార్మికులు.

ప్రతి నిత్యం లక్షల్లో నడిచి వెళ్ళిన వలసజీవులు
ప్రభుత్వాలు మాత్రం వారికి అన్నీ సదుపాయాలూ కల్పిస్తున్నామని, భోజనం అందిస్తున్నామని చెప్పి, వారిని పంపించటానికి ప్రయత్నం చేస్తున్నామని చేతులు దులుపుకున్నాయే తప్ప అంతటి విపత్తు కాలంలో వారికి మాత్రం ఎలాంటి సాయం అందించలేదు . ప్రభుత్వం వలసకార్మికుల కోసం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పిన మాటలన్నీ కేవలం మాటల్లోనే .. కానీ వాస్తవం నడిరోడ్డు మీద నడిచింది . ప్రతి నిత్యం లక్షల్లో వలస కార్మికులు సాగించిన ప్రయాణం నిజంగా ప్రతి ఒక్కరి మనసును పిండేసింది .
అన్నం కోసం రోజంతా క్యూలలో .. సోషల్ మీడియాలో మనసు పిండేసిన వలస వెతలపై పాట
ఇక వలస జీవులు బతుకు జీవుడా అంటూ పట్టెడు మెతుకుల కోసం పడిగాపులు పడ్డారు . రోజంతా అన్నం కోసం క్యూలలో నిల్చున్నారు ., కొన్ని చోట్ల ఆహారం కోసం కుళ్ళిన కూరగాయల్లో తినటానికి పనికి వచ్చే వాటిని వెతుక్కు తిన్నారు . ఆకలి తీర్చే మానవత్వం ఉన్న మనుషుల కోసం ఆశగా ఎదురు చూశారు .ఇక కడుపు మంట చల్లారక, ఆకలి బాధ తాళలేక ఆత్మహత్యలకు పాల్పడ్డవారు కూడా లేకపోలేదు.వలస జీవులు తమ కుటుంబాలను తలుచుకుని తీవ్ర మానసిక సంఘర్షణకు లోనవుతున్న సమయంలో వారిపై ఒక పాత సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది . పిల్లా జెల్లా ఇంటికాడ ఎట్లా ఉండ్రో.. నా ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుందో అంటూ సాగిన పాటలో తమ ఆవేదన వెళ్లగక్కారు . విడిచిపెడితే నచి నేను పోతాసారూ అంటూ సాగిన ఆ పాట వలస కార్మికుల వెతలకు అద్దం పట్టింది .

కరోనా సమయంలో వైరల్ అయిన బాధామయ చిత్రాలు
కరోనా లాక్డౌన్ సమయంలో ఇంటికి వెళ్ళాలనే తపన పడిన కొందరు వడ దెబ్బకు , కొందరు అనారోగ్యంతో దారిలోనే ప్రాణాలు కోల్పోయారు. కొందరు ఆకలితో బాధ పడలేక ఉసురు తీసుకున్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో సామాన్యుల మరణ మృదంగం మోగింది. ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించాయి.
చంటి పిల్లలను చంకనెత్తుకుని కొందరు , సూట్ కేస్ మీద నిద్ర పోతున్న పిల్లాడితో ఒక తల్లి తన ఇంటికి చేరటానికి సాగిస్తున్న ప్రయాణం ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

కరోనా లాక్ డౌన్ సమయంలో వలస వెతలే అత్యంత ట్రాజెడీ అనిపించిన దృశ్యాలు
తినటానికి తిండి లేక ఒక్కో వలస కూలీ పట్టెడు మెతుకుల కోసం పడరాని పాట్లు పడ్డారు. ఇక ఎవరైనా ఏమైనా పెడుతున్నారు అంటే ఆ ఆహారం కోసం చేతులు చాస్తున్న తీరు నిజంగా హృదయ విదారకం . కేవలం ఒక్క అరటి పండు కోసం వందల చేతులు చాచిన తీరు ఇప్పటికీ మనసును కలచివేస్తుంది. స్వతంత్ర భారతావనిలో ఎక్కడ ఎవరు ఆపుతారో ఎక్కడ నిర్బంధిస్తారో అన్న భయంతో లక్షల మంది బ్రతుకు నెలల కాలంగా రోడ్డు మీదే నడిచింది . అత్యంత విషాదంగా, ప్రతి ఒక్కరికి కన్నీరును తెప్పించిన అత్యంత బాధాకరమైన దృశ్యాలుగా కరోనా లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల వెతలు నిలిచాయి.