
Yogi Adityanath : రెండోసారి సీఎంగా యోగీ-ఈసారి సక్సెస్ అయితే మోడీకే సవాల్-అరుదైన ప్రస్ధానం
ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా వరుసగా రెండోసారి యోగీ ఆదిత్యనాథ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. గత మూడు దశాబ్దాల్లో ఇదో అరుదైన ఘటన. ఈ ముఫ్పయ్యేళ్లలో ఓసారి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి.. మరోసారి గెలిచి ముఖ్య మంత్రి పగ్గాలు చేపట్టడం ఇదే తొలిసారి. దీంతో యోగీ పేరు మార్మోగిపోతోంది. అయితే ఈ స్ధాయికి చేరుకోవడానికి ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, ఆయన ప్రస్ధానం కూడా అంతే స్ధాయిలో ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడూ సవాళ్లకు సిద్ధంగా ఉండే యోగీ మనస్తత్వమే ఆయన్ను ఇక్కడిదాకా తెచ్చిందని చెప్పొచ్చు.

యూపీ సీఎంగా రెండోసారి యోగీ
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్ కు జరిగిన తాజా ఎన్నికల్లో ఘన విజయంతో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టారు యోగీ ఆదిత్యనాథ్. ఈ ఎన్నికల్లో బీజేపీని ముందుండి నడిపించిన యోగీ.. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ రెండోసారి అధికారంలోకి వచ్చారు. అంతకు ముందు ఐదేళ్ల పాలనలో తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమైనా చివరికి సంక్షేమం, అభివృద్ధి విషయంలో వేసిన కీలక అడుగులు యోగీని మరోసారి యూపీ ముఖ్యమంత్రిగా రెండోసారి అధికారం కట్టబెట్టాయి. దీంతో యూపీ చరిత్రలో అరుదైన ఘనతను యోగీ సొంతం చేసుకున్నారు.

2017లో అనూహ్యంగా తెరపైకి
2017లో బీజేపీ భారీ మెజారిటీతో యూపీలో అధికారంలోకి వచ్చే నాటికి యోగీ గోరఖ్ పూర్ ఎంపీగా ఉన్నారు. దీంతో ఆయన్ను యూపీ సీఎంగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే గోరఖ్ పూర్ ఎంపీ సీటుకు రాజీనామా చేసి శాసన మండలికి ఎన్నికయ్యారు. ఈ ఐదేళ్ల పాటు మండలి సభ్యుడిగా ఉంటూనే సీఎం బాద్యతల్లో కొనసాగిన యోగీ ఆదిత్యనాథ్.. తొలిసారి అసెంబ్లీ సీటు నుంచి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. తనకు పట్టున్న గోరఖ్ పూర్ నుంచే బరిలోకి దిగడం ద్వారా యోగీ ఆదిత్యనాథ్ అనాయాస విజయం సాధించారు.

ఐదేళ్ల ప్రస్ధానం సాగిందిలా
2017లో అధికారం చేపట్టిన తర్వాత పాలనపై తనదైన మార్కుతో యోగీ సంచలనం సృష్టించారు. ముఖ్యంగా పాలనపై అనతికాలంలోనే పట్టు సంపాదించడం, శాంతిభద్రతల విషయంలో రాజీపడకపోవడం, నేరస్తులను భారీగా ఎన్ కౌంటర్లు చేయడం ద్వారా ప్రజల్లో విశ్వాసం నింపారు. అలాగే మహిళలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయడం, కేంద్రం సాయంతో అభివృద్ధిలోనూ యూపీని పరుగులు తీయించడం వంటివి యోగీకి మంచి మార్కులు తెచ్చిపెట్టాయి. చివరిగా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, వాటిని అమలు చేసి తీరుతానన్న విశ్వాసం నింపడంలో యోగీ సక్సెస్ అయ్యారు. కబేళాల మూసివేత, మతమార్పిళ్ల చట్టం అమలుతో కొన్ని విమర్శలు ఎదురైనా చివరికి అవి కూడా యోగీకి మేలు చేశాయి.

యోగీ ఈసారి సక్సెస్ అయితే మోడీకే సవాల్ ?
వరుసగా రెండోసారి అధికారం చేపడుతన్న యోగీ ఆదిత్యనాథ్.. ఈసారి సక్సెస్ అయితే మాత్రం కచ్చితంగా ప్రధాని మోడీకి బీజేపీలో ప్రత్యామ్నాయ నేతగా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో అనాయాసంగా పాలన సాగిస్తూ ప్రధాని తర్వాత ప్రత్యామ్నాయ నేతగా యోగీ మారుతున్నారు. ముఖ్యంగా హిందూత్వ రాజకీయాలతో పాటు అభివృద్ధి, పాలనపై యోగీ వేస్తున్న మార్క్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. హిందూత్వ వాదులకు సైతం మోడీ తర్వాత ఎవరనే ప్రశ్నకు యోగీ రూపంలో సమాధానం దొరుకుతోంది. చేయాల్సిందల్లా ఈ ఐదేళ్ల పాటు మరింత పట్టు పెంచుకోవడం, తనను తాను జాతీయ స్ధాయి నేతగా నిరూపించుకోవడం ఒక్కటే యోగీకి మిగిలుంది. దీంతో రాబోయే రోజుల్లో యోగీపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.