మార్చి 21న యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్న యోగి ఆదిత్యనాథ్, కేబినెట్‌పై కీలక చర్చ
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. యోగి ఆదిత్యనాథ్ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. మార్చి 21న యోగి యూపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
యూపీలో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే ఢిల్లీలోని పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. దేశ రాజధానిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యూపీ కేబినెట్ కూర్పుపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. తాజా ఎన్నికల్లో పలువురు మంత్రులు కూడా ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రివర్గంపై దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
మార్చి 21న మధ్యాహ్నం 3 గంటలకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. యూపీలో ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ పై బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ పెద్దల కోర్ కమిటీ సమావేశం సుమారు ఆరు గంటలపాటు జరిగింది.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, యూపీ కాబోయే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, యూపీ బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. యూపీ లేజిస్టేలటివ్ కౌన్సిల్ కోసం 36 మంది పేర్లను పరిశీలించినట్లు తెలుస్తోంది.
కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేష్ శర్మలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. హోళీ అనంతరం జరిగే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించాల్సిన ప్రముఖుల గురించి కూడా ఇక్కడ చర్చ జరిగింది. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో బీజేపీ 255 సీట్లను సాధించి తిరిగి అధికారాన్ని నిలుపుకుంది. 41.29 శాతం ఓట్ షేర్ లభించింది.
ఐదేళ్లు పూర్తి పదవీ కాలంలో ఉండి రెండోసారి తిరిగి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రుల్లో గత 37 ఏళ్లలో యోగి ఆదిత్యనాథ్ మొదటివారు కావడం గమనార్హం. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ అర్బన్ నుంచి పోటీ చేసి ఏకంగా లక్షకుపైగా ఓట్ల మెజార్టీతో యోగి ఆదిత్యనాథ్ గెలుపొందారు. యోగిపై పోటీ చేసిన సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి సుభావతి ఉపేంద్ర దత్ శుక్లాకు 62,109 ఓట్లు వచ్చాయి.