హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 'ఇంటి నుంచే ఓటు వేయవచ్చు' -ప్రెస్ రివ్యూ

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చార్మినార్

బల్దియా ఎన్నికల్లో పోలింగ్‌ బూత్‌లకు వెళ్లకుండానే.. ఇంటి నుంచే ఓటు వేసేలా.. పోస్టల్‌ బ్యాలెట్‌కు బదులు 'ఈ-ఓటింగ్‌ విధానాన్ని తెచ్చేందుకు తెలంగాణ ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు చేస్తున్నదని 'నమస్తే తెలంగాణ' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. వృద్ధులు, దివ్యాంగులు, ఎన్నికల సిబ్బంది మాత్రమే ఆన్‌లైన్‌లో ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నది. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంలోనే 'ఈ- ఓటింగ్‌' ప్రవేశపెట్టిన మొదటి నగరంగా హైదరాబాద్‌ నిలుస్తుంది.

కరోనా మహమ్మారి ఇప్పటికే అనేక మార్పులు తీసుకురాగా.. ఇప్పుడు ఎన్నికలపై సైతం ప్రభావం చూపుతున్నది. రానున్న బల్దియా ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్ల పద్ధతికి కూడా స్వస్తి పలికే పరిస్థితి తీసుకువచ్చింది. ఎన్నికల సంఘం ఇంటినుంచే ఓటు హక్కును వినియోగించుకునేలా.. ఈ ఓటింగ్‌ విధానాన్ని తెరపైకి తీసుకువస్తున్నది.

ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రజాస్వామిక దేశాలు ఉన్నప్పటికీ ఈ-ఓటింగ్‌ విధానాన్ని అమలుచేసే సాహసం చేయడంలేదు. దేశంలో మొట్టమొదటి సారిగా హైదరాబాద్‌ నగరం ఈ సాహసం చేసేందుకు అడుగులు వేస్తున్నది. ఈ-ఓటింగ్‌ విధానం సఫలమైతే భారత ఎన్నికల చరిత్రలో ఇది ఓ విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా కొంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ముఖ గుర్తింపు సాంకేతికత విధానం సఫలం కావడంతో బల్దియా ఎన్నికల్లో డివిజన్‌కు ఒకటి చొప్పున 150 పోలింగ్‌ కేంద్రాల్లో అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ఐరోపా ఖండంలోని ఎస్టోనియా అనే చిన్న దేశంలో ప్రస్తుతం ఈ-ఓటింగ్‌ విధానం అమలవుతున్నది. ఈ విధానంలో ఓటర్లు ఎన్నికలకు వారం-పది రోజుల ముందుగానే ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో తమ పేర్లను ఈ-ఓటింగ్‌ కోసం నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇలా నమోదు చేసుకున్నవారికి ఈ-మెయిల్‌ ద్వారా, లేక రిజిస్ట్రర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఒక కోడ్‌ను పంపిస్తారు. ఆ కోడ్‌ ఆధారంగా ఎన్నికల రోజు సంబంధిత వెబ్‌సైట్‌లో ఈ-బ్యాలెట్‌ పేపర్‌ తెరుచుకుంటుంది. మనకు ఇష్టమైన గుర్తుపై ముద్రవేసిన అనంతరం అది రిటర్నింగ్‌ అధికారి లాగిన్‌లో నిక్షిప్తమైపోతుంది.

ఇలా పోలైన ఓట్లను ఓట్ల లెక్కింపురోజున తెరిచి లెక్కిస్తారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి లాగిన్‌లో పోలైన ఓట్లు విడివిడిగా లెక్కించే అవసరం లేకుండా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రం (ఈవీఎం)లో మాదిరిగా ఆయా గుర్తుల ఆధారంగా నమోదవుతాయి. మొత్తం పోలైన ఓట్లు, ఆయా గుర్తుల వారీగా పోలైన ఓట్లు విడివిడిగా ఉంటాయి.

ఎవరు ఏ గుర్తుపై ఓటు వేశారో తెలిసే వీలుండదు. ఉదాహరణకు సంబంధిత డివిజన్‌లో ఐదు గుర్తులు ఉన్నాయనుకుంటే, 100 ఈ-ఓట్లు పోలైతే ఆ ఐదు గుర్తుల్లో ఏ గుర్తుకు ఎన్ని పోలయ్యాయో తెలుస్తుంది తప్పా.. ఎవరు ఏ గుర్తుపై వేశారో తెలిసే అవకాశం ఉండదు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం: ''న్యాయవ్యవస్థపై నమ్మకం లేకపోతే హైకోర్టును మూసేయండి''

న్యాయవ్యవస్థపై నమ్మకం లేనివారు పార్లమెంటుకు వెళ్లి హైకోర్టును మూసేయాలని కోరడం మంచిదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో చెప్పింది.

ఆ కథనం ప్రకారం.. ''అసలు రాష్ట్రంలో చట్టబద్ధ పాలన (రూల్‌ ఆఫ్‌ లా) ఉందా? రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా సరిగా అమలు కావడంలేదు. చట్టబద్ధ పాలన జరగకపోతే... మేమే ఇతర నిబంధనల ప్రకారం అధికారాన్ని ఉపయోగిస్తాం'' అని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

వివిధ అంశాలపై తీర్పులు వెలువరించిన న్యాయమూర్తులను, న్యాయవ్యవస్థలను కించపరిచేలా కొంతమంది అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై తాము ఫిర్యాదు చేసినా సీఐడీ చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టు ఇన్‌చార్జ్‌ రిజిస్ట్రార్‌ గతంలో హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని, పోస్టింగులకు సంబంధించి సామాజిక మాధ్యమ సంస్థలు స్వీయ క్రమబద్ధీకరణ పాటించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆ పిటిషన్‌లో అభ్యర్థించారు.

దీనిపై గురువారం జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కుట్రలో భాగంగానే హైకోర్టుపై సోషల్‌ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అనుమానం వ్యక్తం చేసింది. ఇతరుల ప్రభావం లేకుండా ఎవరూ న్యాయమూర్తులను దూషించరని.. దీని వెనుక ఉన్న కుట్రను తేల్చుతామని స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చడాన్ని సహించబోమని హెచ్చరించింది.

''ప్రజాస్వామ్యం మూడు స్తంభాలపై ఆధారపడి ఉంది. న్యాయం అనే స్తంభం బలహీనమైతే అది అంతర్యుద్ధానికి దారి తీస్తుంది'' అని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ''న్యాయ వ్యవస్థపై నమ్మకం లేని రోజున ప్రతి ఒక్కరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారు. వ్యవస్థను రక్షించాల్సిన అవసరం అందరిపైనా ఉంది'' అని పేర్కొంది.

న్యాయమూర్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఏకంగా హైకోర్టే పిటిషన్‌ దాఖలు చేసుకోవాల్సి వచ్చిందని, ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి అభ్యంతరకర పోస్ట్‌లను అనుమతించరాదని సామాజిక మాధ్యమాల సంస్థలకు సూచించింది.

సామాజిక మాధ్యమాల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, సజన్‌ పూవయ్య, ముకుల్‌ రోహత్గీ తదితరులు హాజరయ్యారు. ఆయా సంస్థల తరఫున కౌంటర్లు దాఖలు చేసినట్లు వారు వివరించారు. న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను పెంపొందించేందుకు తమ వంతు సలహాలు, సూచనలు అందిస్తామని సాల్వే, సజన్‌ పూవయ్య కోర్టుకు హామీ ఇచ్చారు. కేసులకు సంబంధించి సీఐడీ దాఖలు చేసిన అదనపు అఫిడవిట్‌ను పరిశీలించేందుకు తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది.

అమరావతి

దర్యాప్తు ప్రారంభానికి ముందే స్టే ఎలా ఇస్తారు?: అమరావతి భూముల కేసులో సుప్రీంకోర్టు

''గత విచారణ సందర్భంగానే మీకు చెప్పాం. ఇలా దర్యాప్తు ప్రారంభం కూడా కాకముందే స్టే ఆర్డర్లు ఇవ్వడాన్ని మేం ఆమోదించం. అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప దర్యాప్తుపై స్టే ఇవ్వరాదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటిస్తూ వచ్చినందునే ఇప్పుడు మేం హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకుంటున్నాం. సంబంధిత పిటిషన్‌ను హైకోర్టు త్వరితగతిన విచారించాల్సిన అవసరం ఉంది. వచ్చే వారమే ఈ పిటిషన్‌ను విని, పరిష్కరించాలని హైకోర్టుకు సూచిస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించినట్లు 'సాక్షి’ ఒక కథనంలో పేర్కొంది.

ఆ కథనం ప్రకారం.. గత ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతమైన గుంటూరు జిల్లా తూళ్లూరు మండలంలో ఎస్సీ, బీసీలకు చెందిన అసైన్డ్‌ భూములను ప్రభుత్వం రాజధాని కోసం తీసుకుంటే పరిహారం రాదని నమ్మించి.. రాజకీయ నాయకులు, అధికారులు కలిసి భూములు బదలాయించిన వ్యవహారంపై దర్యాప్తు జరుపుతుండగా హైకోర్టు స్టే విధించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారించింది. ప్రభుత్వం తరుఫున సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, పి.ఎస్‌.నరసింహా, మెహఫూజ్‌ నజ్కీ వాదనలు వినిపించారు.

తొలుత ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ 'ఒక వారం రోజుల్లోనే తుది విచారణ చేపట్టి ఉత్తర్వులు ఇస్తామని సెప్టెంబర్‌ 11 నాటి విచారణ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది..’’ అంటూ ప్రస్తావించారు. ఈ సందర్భంలో జస్టిస్‌ లావు నాగేశ్వరరావు స్పందిస్తూ 'హైకోర్టులో విచారణ ఎప్పుడు ఉంది?' అని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సమాధానం ఇస్తూ 'హైకోర్టు విచారణ తేదీ ఇవ్వలేదు..' అని నివేదించారు.

ఈ నేపథ్యంలో 'హైకోర్టు వచ్చే వారం సంబంధిత పిటిషన్‌ను పరిష్కరించాలని అడుగుతాం' అని ధర్మాసనం పేర్కొంది. ఈ దశలో ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ "అందుకు సమ్మతమే.. అయితే ఈ పిటిషన్‌ను ఇక్కడ పెండింగ్‌లో ఉంచండి..' అని కోరగా.. ధర్మాసనం ఎందుకని ప్రశ్నించింది. "ఎందుకంటే అక్కడ పరిష్కరించకపోతే మళ్లీ మీ వద్దకు రావాలి. హైకోర్టు ఉత్తర్వులు పూర్తిగా చట్టవిరుద్ధం..' అని రోహత్గీ నివేదించారు.

ప్రతివాది తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించేందుకు ప్రయత్నించగా జస్టిస్‌ లావు నాగేశ్వరరావు జోక్యం చేసుకుంటూ "అది మధ్యంతర ఉత్తర్వు మాత్రమే కాబట్టి వచ్చే వారం పరిష్కరించాలని మేం హైకోర్టుకు సూచిస్తున్నాం.. కేసును పరిష్కరించనివ్వండి'’ అని ఉత్తర్వు వెలువరించి ముగించబోయారు. ఈ సందర్భంలో ప్రతివాది తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా మాట్లాడుతూ "హైకోర్టు దర్యాప్తుపై స్టే ఇచ్చి ఉండాల్సింది కాదన్న మీ అబ్జర్వేషన్‌ను ఉత్తర్వుల్లో నమోదు చేస్తే దాని ప్రభావం హైకోర్టు విచారణపై పడుతుంది..’’ అని నివేదించారు. అయితే దానిని ఉత్తర్వుల నుంచి తొలగిస్తామని, ఈ పిటిషన్‌ను ఇక్కడ పెండింగ్‌లో ఉంచుతున్నామని ధర్మాసనం పేర్కొంది.

ప్రతివాది తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా మరో నివేదినను ధర్మాసనం ముందుంచారు. "వారం సమయం మాత్రమే ఇవ్వడం వల్ల ఇబ్బంది ఉంటుంది. రెండు వారాలు గడువు ఇవ్వండి..’’ అని కోరారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ "ముందుగా ఉత్తర్వులు రానివ్వండి.. వచ్చాక ఇక్కడ మూడు వారాలు ఆగి విచారణ జరుపుదాం.. తొందర ఏం లేదు.. దానిలో ఆందోళన అక్కర్లేదు..’’ అని పేర్కొంది. ఈ సమయంలో సిద్ధార్థ లూత్రా తిరిగి వాదనలు వినిపిస్తూ దర్యాప్తు అంశాన్ని ప్రస్తావించారు. వాంగ్మూలాలు నమోదు చేస్తోందని నివేదించారు. ఈ సందర్భంలో జస్టిస్‌ లావు నాగేశ్వరరావు జోక్యం చేసుకుంటూ "అదేమైనా కావొచ్చు. కానీ ఇలాంటి (దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇవ్వడం) ఉత్తర్వులు నిలబడడం చాలా కష్టం. అది మీకు తెలుసు. మీరు నిపుణులు కూడా. ఒకసారి ఫిర్యాదు నమోదైన తర్వాత దర్యాప్తు ప్రారంభం కాకుండానే ఇందులో కేసు ఏముంది? అంటూ హైకోర్టు స్టే ఇవ్వడం ఏంటి?’’ అని ప్రశ్నించారు.

"2014కు సంబంధించి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తోంది..’’ అని లూత్రా నివేదించగా, "మేం ఏం సహాయం చేయలేం. యంత్రాంగం ముందుకు నడవాల్సి ఉంటుంది. చట్టం తన పని తాను చేసుకుపోవాల్సి ఉంటుంది..’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. "మేం పదే పదే చెబుతున్నాం. సాధారణ పరిస్థితుల్లో స్టే ఇవ్వకూడదు..’’ అని పేర్కొన్నారు. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు.

సుప్రీంకోర్టు

కరోనా సాకుతో కార్మికుల శ్రమ దోచుకుంటారా?: గుజరాత్‌ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

కార్మికుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పని గంటలను పెంచుతూ గుజరాత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేసిందని 'నవ తెలంగాణ' ఒక కథనంలో తెలిపింది.

ఆ కథనం ప్రకారం.. పని గంటలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు డివై చంద్రచూడ్‌, కెఎం జోసెఫ్‌, ఇందు మల్హోత్రలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

కరోనావైరస్‌ అనేది పబ్లిక్‌ ఎమర్జెన్సీ కాదని ఈ సందర్భంగా న్యాయస్థానం అభిప్రాయపడింది. ఆర్థిక వ్యవస్థ మందగమన భారం మొత్తాన్ని ఒక కార్మికులపై మోపడం సరికాదని తెలిపింది.

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ సమయంలో గుజరాత్‌లోని బీజేపీ సర్కారు ఏప్రిల్‌ నెలలో ఫ్యాక్టరీస్‌ యాక్ట్‌ నుంచి పరిశ్రమలకు మినహాయింపును కల్పించింది. అలాగే కార్మికుల పని గంటలు 12 గంటలకు పెంచింది. అదనపు పని గంటలకు ఓటీ చెల్లింపులు లేకుండా ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ గుజరాత్‌ మజ్దూర్‌ సభ, ట్రేడ్‌ యూనియన్‌ సెంటర్‌ ఆఫ్‌ ఇండియాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. కార్మికుల కనీస భద్రత, ప్రాథమిక హక్కులు, రక్షణకు తూట్లు పొడిచేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఉన్నదని పిటిషన్‌లో కార్మిక సంఘాలు తెలిపాయి.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. గుజరాత్‌తో పాటు హరియాణా, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌లు కూడా కార్మికుల పని గంటలను పెంచిన రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
we can cast the vote from home in the Hyderabad municipal elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X