మాస్కో థియేటర్లో 140 మంది చనిపోయిన భయంకరమైన ఘటనకు 18 ఏళ్లు.. అప్పుడు ఏం జరిగిందంటే..

2002, అక్టోబర్ 23 రాత్రి 9 గంటలు. సెంట్రల్ మాస్కోలో క్రెమ్లిన్ నుంచి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబ్రోవ్కా థియేటర్లో సరికొత్త రష్యా రొమాంటిక్ మ్యూజికల్ షో 'నార్డ్ ఓస్ట్' ప్రదర్శిస్తున్నారు.
1100 మంది సామర్థ్యం ఉన్న ఆ థియేటర్లో ఇంటర్వెల్ తర్వాత వేదిక మీదున్న నటులు సైనిక యూనిఫాంలలో డాన్సులు వేస్తూ పాటలు పాడుతున్నారు. సరిగ్గా అప్పుడే థియటర్లో ఒక మూల నుంచి ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. తను కూడా సైనిక దుస్తుల్లోనే ఉన్నాడు. వచ్చీ రాగానే గాల్లోకి కాల్పులు జరిపాడు.
ప్రేక్షకులు మొదట దానిని వేదిక మీద నడుస్తున్న షోలో ఒక భాగం అనుకున్నారు. కానీ అక్కడ అతడు నటుడు కాదని, ఆ ఘటన తమను జీవితాంతం వెంటాడబోతోందని, తమ ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని తెలుసుకోడానికి వారికి ఎంతోసేపు పట్టలేదు.
ఆ థియేటర్లోకి వచ్చిన దాదాపు 50 మంది సాయుధ చెచెన్ తిరుగుబాటుదారులు నాటకం చూస్తున్న 850 మందిని తమ బందీలుగా చేసుకున్నారు.
రష్యా సైనికులు బేషరతుగా చెచెన్యా నుంచి వెళ్లిపోవాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే బందీలను ఒక్కొక్కరుగా కాల్చిచంపుతామని హెచ్చరించారు.
- రష్యా ఎన్నికలు: మేయర్‌ను ఓడించిన క్లీనర్.. పుతిన్ పార్టీకి ఝలక్
- రష్యా విప్లవ చరిత్రను కళ్లకు గట్టే పోస్టర్లు

అధ్యక్షుడు పుతిన్, బుష్ సమావేశం రద్దు
ప్రేక్షకుల్లో ఆస్ట్రేలియాకు చెందిన అలెక్స్ బాబిక్ ఉన్నారు. అతడు తన రష్యా స్నేహితురాలితో కలిసి ఆ నాటకం చూడ్డానికి వచ్చాడు. బీబీసీతో మాట్లాడుతూ ఆ ఘటనను గుర్తు చేసుకున్నాడు.
"మాకు థియేటర్ వెనుక నుంచి బూట్ల శబ్దం వినిపించింది. తర్వతా ఎవరో గాల్లో ఒక రౌండ్ పేల్చారు. నేను నా ఫ్రెండ్ వైపు తిరిగి ఇది నాటకంలో భాగం కాదు అన్నాను. ఏదో జరగరానిది జరగబోతున్నట్లు, ఏదో చాలా ఘోరం జరగబోతోందని నాకు అప్పుడే అనిపించింది" అన్నారు.
కాసేపటి తర్వాత థియేటర్లోని ఓల్గా ట్రిమెన్ అనే బార్ మెయిడ్ చెచెన్ తిరుగుబాటుదారులతో ఒక యువతి గొడవపడడం చూశారు. తర్వాత అక్కడి నుంచి "ఈమెను కాల్చిపారేయండి".. అనే మాట వినిపించింది. క్షణాల్లో ఒకటి తర్వాత ఒకటిగా ఐదు బుల్లెట్లు పేలిన శబ్దం, యువతి అరుపులు ఓల్గాకు వినిపించాయి.
మొదటి రోజు చెచెన్ తిరుగుబాటుదారులు దాదాపు 150 మంది బందీలను విడుదల చేశారు. తమ ఆఫరేషన్‌కు అడ్డంకిగా మారుతారని అనిపించిన వాళ్లందరినీ వాళ్లు విడిచిపెట్టారు. వారిలో కొంతమంది విదేశీయులు, రష్యా మహిళలు, పిల్లలు ఉన్నారు.
రష్యా సైన్యం తమను చంపడానికి ప్రయత్నిస్తే ఒక్కో తిరుగుబాటుదారుడి మృతికి ప్రతీకారంగా లోపలున్న పది మందిని కాల్చి చంపుతామని ఆ బందీలతో బయటున్న వారికి ఒక సందేశం పంపించారు.
రెండో రోజు మరో 39 మంది బందీలను విడుదల చేశారు. అధ్యక్షుడు పుతిన్ తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నారు. తిరుగుబాటుదారులతో చర్చలకు మాస్కోలో ఉండాల్సిన అవసరం ఉంటుందని, ఆయన అమెరికా అధ్యక్షుడు బుష్‌తో జరగాల్సిన సమావేశాన్ని కూడా రద్దు చేసుకున్నారు.
తర్వాత మంత్రిమండలిని సంప్రదించిన పుతిన్, చెచెన్ తిరుగుబాటుదారులను రష్యా నుంచి సురక్షితంగా మరో దేశానికి వెళ్లడానికి అనుమతిస్తామని, బందీలు అందరినీ బేషరతుగా విడుదల చేయాలని ఆఫర్ ఇచ్చారు.
- ''ఆ విషప్రయోగంతో నరకానికి వెళ్లొచ్చినట్లు ఉంది.. పుతిన్ వల్లే ఇదంతా’’ - రష్యా ప్రతిపక్ష నాయకుడు నావల్నీ
- 'రాజకీయ వేత్తలకు వల వేసే రష్యా గూఢచారి’ అరెస్టు

నలువైపులా మూత్రం కంపు
ఆ రోజు అక్కడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అలెక్స్ బాబిక్ బీబీసీకి చెప్పారు.
"వాళ్లు ఆర్కెస్ట్రా పిట్‌ను లోపలున్న వారికి టాయిలెట్‌గా మార్చేశారు. ప్రతి నాలుగు గంటలకూ బందీలను మూత్ర విసర్జనకు అక్కడికి అనుమతించేవారు. వాళ్లంతా క్యూలో నిలుచుని తమ వంతు కోసం వేచిచూసేవారు. ఆ పిట్లో దాదాపు రెండున్నర అంగుళాలు వరకూ మూత్రం నిండిపోయింది. కానీ, అందరూ దాన్లోంచి వెళ్లే పని పూర్తి చేసుకునేవారు" అన్నారు.
"చుట్టూ దుర్వాసనతో ముక్కులు పగిలిపోతున్నాయి. వాళ్లు మాకు తినడానికి ఏమీ ఇవ్వలేదు. అప్పుడప్పుడూ థియేటర్లో ఉన్న ఒక స్టోర్ నుంచి కొన్ని టాఫీలు తీసుకొచ్చి మా మధ్య విసిరేస్తున్నారు. అప్పుడప్పుడు తాగడానికి నీళ్లిస్తున్నా, అవి సరిపోవడం లేదు. మమ్మల్ని ఫ్లోర్ మీద పడుకోనివ్వడం లేదు.. మేం కూర్చునే తూగుతున్నాం.. వాళ్లు మేం మేలుకుని ఉండేలా అప్పుడప్పుడూ గాల్లో కాల్పులు జరుపుతున్నార"ని చెప్పారు.

వెంటిలేటర్ నుంచి గ్యాస్ వదిలారు
బ్రిటన్‌లో ఉంటున్న ఎస్ఎఎస్ టీమ్ మాజీ సభ్యుడు రాబిన్ హార్స్ ఫాల్ ఇలాంటి పరిస్థితిని ఎలా ఎదుర్కుంటారో చెప్పారు.
"బందీలను విడిపించడానికి సాధారణంగా రకరకాల ఎంట్రీ పాయింట్ల నుంచి హఠాత్తుగా లోపలికి చొరబడి తిరుగుబాటుదారులు నిర్ఘాంతపోయేలా చేస్తారు.
కానీ, ఇక్కడ సర్ప్రైజ్ ఎలిమెంట్ అసలు పనిచేయదనే చెప్పాలి. ఎందుకంటే చెచెన్ తిరుగుబాటుదారులు దానికి సిద్ధంగా ఉన్నారు. అలా చేయాలంటే సైనికులు దాదాపు 100 అడుగుల వరండా దాటి హాల్లోకి చొరబడాలి. అక్కడ తిరుగుబాటుదారులు నక్కి ఉన్న మెట్లదారిని కూడా దాటుకుని వెళ్లగలగాలి.
"ఆ మెరుపు దాడిని ముగించడానికి కచ్చితంగా కొన్ని నిమిషాలు పట్టచ్చు. కానీ, ఆలోపే చెచెన్ తిరుగుబాటుదారులు బాంబులతో ఆ థియేటర్‌ను పేల్చేయవచ్చు" అన్నారు.
48 గంటల తర్వాత మరుసటి రోజు తెల్లవారుజామున థియేటర్లోని చెచెన్ తిరుగుబాటుదారులను అదుపులోకి తీసుకోడానికి రష్యా సైనికులను పంపించాలని పుతిన్ నిర్ణయించారు.
ఉదయం 3 గంటలకు రష్యా సైనికులు దాడి చేయబోతున్నారనే వార్తను కావాలనే లీక్ చేశారు. కానీ ఉదయం 5 గంటలకు ఆ దాడికి టైం ఫిక్స్ చేశారు. తిరుగుబాటుదారులు స్పృహతప్పేలా థియేటర్ వెంట్ నుంచి గ్యాస్ వదలాలని, తర్వాత వారందరినీ అదుపులోకి తీసుకోవాలని అనుకున్నారు. కానీ చెచెన్ తిరుగుబాటుదారులంతా మాస్కులు వేసుకున్నారు. దాంతో వారిపై గ్యాస్ ఎలాంటి ప్రభావం చూపించడం లేదు.
థియేటర్లో కూచున్న అన్యా అండ్రియానోవాకు మొదట ఉదయం ఐదున్నరప్పుడు ఒక వింత వాసన వచ్చింది. అప్పుడు, చాలా మంది బందీల్లాగే ఆమె సీటులో కూర్చుని కునికిపాట్లు పడుతున్నారు.
థియేటర్ మీద దాడి జరగబోతోందని గుర్తించిన అండ్రియానోవా స్నేహితుడు తన మొబైల్ ఫోన్ నుంచి మాస్కోలోని 'ఎఖో మోస్కవి' రేడియో షోకు ఫోన్ చేశాడు. "వాళ్లు మాపైన గ్యాస్ వదులుతున్నారు" అని దాదాపు అరిచినట్టు చెప్పాడు.
అండ్రియనోవా వెంటనే అతడి నుంచి ఫోన్ లాక్కుని రేడియో షో వ్యాఖ్యాతతో "మాకు అది తెలుస్తోంది కూడా" అన్నారు. ఒక్క క్షణం తర్వాత రేడియోలో ఆ కార్యక్రమం వింటున్న శ్రోతలకు కాల్పుల శబ్దం వినిపించింది. అండ్రియనోవా అప్పుడు "గట్టిగా మీరు కూడా విన్నారు. మమ్మల్ని అందరినీ కాల్చి చంపేయబోతున్నారు" అని అరిచారు.
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక 'దేశం’ ఇదేనా?
- చైనా, రష్యా, ఇరాన్‌లు అమెరికా ఎన్నికల్లో ఎవరిని ఓడించాలనుకుంటున్నాయి

ప్రధాన హాలు తలుపును బాంబుతో పేల్చేశారు
టైమ్ మ్యాగజైన్ 2002 నవంబర్ 4 ఎడిషన్‌లో.. జోహానా మెక్గియరీ, పాల్ క్విన్ జజ్ ఆనాటి ఘటన గురించి చెప్పారు.
"ఈ గ్యాస్‌ను భవనం వెంటిలేషన్ సిస్టం ద్వారా లోపలికి పంపించారు. రష్యా సైనికులు భవనం ఫ్లోర్ కింద సొరంగం తవ్వి దానిలో రంధ్రం చేసి, అక్కడి నుంచి కూడా గ్యాస్ వదిలారు. కొంతమంది మహిళా తిరుగుబాటుదారులు పరిగెత్తుకుని బాల్కనీ దగ్గరకు వెళ్లాలని ప్రయత్నించారు. కానీ అక్కడికి చేరుకునేలోపే వాళ్లు కింద పడిపోయారు. గ్యాస్ వదిలిన గంట తర్వాత 6.33 నిమిషాలకు 200 మంది రష్యా సైనికులు లోపలికి చొరబడ్డారు. ఏడు నిమిషాల తర్వాత వాళ్లు ప్రధాన హాలు తలుపును బాంబుతో పేల్చారు.
లోపల స్పృహలో ఉన్న తిరుగుబాటుదారులందరినీ రష్యా సైనికులు కాల్చి చంపారు. గ్యాస్ ప్రభావంతో స్పృహతప్పి ఉన్న వారిని కూడా మగతలోనే కాల్చి చంపేశారు.
రష్యా బలగాలు తర్వాత ఒక తిరుగుబాటుదారుడిని విలేకరులకు చూపించారు.

"మేం వీరిపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపాం. ఇది క్రూరమే, కానీ ఒక వ్యక్తి తన నడుముకు 2 కిలోల ప్లాస్టిక్ పేలుడు పదార్థాలు కట్టుకుని ఉన్నప్పుడు, వారిని ఇలాగే చేయాల్సుంటుంది. వీళ్లు థియేటర్ ఫ్లోర్ అంతా బాంబులు పెట్టారు" అన్నారు.
థియేటర్లో పెట్టిన అతిపెద్ద బాంబు కోసం తిరుగుబాటుదారులు 50 కిలోల టీఎన్టీ ఉపయోగించారు. దానిని 15వ నంబర్ లైన్ మధ్యలో ఉంచారు.
ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే వాటిని పెట్టడానికి వాళ్లు బందీల సాయం కూడా తీసుకున్నారు. కానీ సైన్యం ఆ బాంబుల్లో ఒక్కటి కూడా పేలకుండా నిర్వీర్యం చేసింది.
దాడి జరిగినప్పుడు కొంతమంది బందీలు పారిపోడానికి ప్రయత్నించారు. కానీ బయట గేటు దగ్గర ఉన్న చెచెన్ తిరుగుబాటుదారులు వారిని కాల్చి చంపారు.
- రష్యా వర్సెస్ పశ్చిమ దేశాలు.. 'ఇది నూతన ప్రచ్ఛన్న యుద్ధం’
- రష్యా మంత్రి బంపర్ ప్రైజ్: సరైన సమాధానం చెబితే 2.5 ఎకరాల భూమి ఫ్రీ

దారుణ ఘటనలో 140 మంది మృతి
ఆ సమయంలో తను ఏ పరిస్థితిలో ఉన్నాడో అలెక్స్ బాబిక్ గుర్తు చేసుకున్నారు.
"నేను తల వంచుకుని ఉన్నాను. అప్పుడే నాకు బయట కాల్పుల శబ్దం వినిపించింది. కాసేపటి, తర్వాత నా స్నేహితురాలు నాకు ఏదో వాసన వస్తోందని చెప్పింది. కానీ నాకు అలా ఏం అనిపించలేదే అన్నాను. థియేటర్ లోపల గ్యాస్ చేరిందని తనే నాకు చెప్పింది. ఆమె తన ముఖానికి కర్చీఫ్ కట్టుకుంది. నన్ను కూడా అలాగే చేయమంది. కానీ అలా కట్టుకునేలోపే స్పృహతప్పి పడిపోయా. నాకు, మెలకువ వచ్చేసరికి రష్యా సైనికులు అటూ, ఇటూ పరుగులు తీస్తున్నారు" అన్నారు.
ఈ మొత్తం ఆపరేషన్‌లో 90 మందికి పైగా బందీలు, 50 మందికి పైగా తిరుగుబాటుదారులు చనిపోయారు. కానీ రష్యా సైనికుల్లో ఎవరికీ చిన్న గాయం కూడా కాలేదు.
- భారత్ సాయం లేకుండా ప్రపంచ కోవిడ్ వ్యాక్సీన్ కల నెరవేరదు... ఎందుకంటే...
- రష్యా ప్రతిపక్ష నేత ప్రాణాలు ఎలా కాపాడారు? ఆ రెండు గంటల్లో ఏం జరిగింది

సాధారణ మోతాదు కంటే ఐదు రెట్లు స్లీపింగ్ ఏజెంట్
చెచెన్ తిరుగుబాటుదారుల కమాండర్ 27 ఏళ్ల మోవసార్ బరెథేవ్ను రెండో అంతస్తులో వంటగది దగ్గర కాల్చి చంపారు.
ఆ రోజు ఘటన గురించి జోహానా మెక్గియరీ, పాల్ క్విన్ జజ్ చెప్పారు.
"కొంతమంది బందీలు తమకుతాముగా బయటకు నడిచొచ్చారు. కానీ ఎక్కువ మందిని రష్య సైనికులు, అత్యవసర సిబ్బంది తమ చేతుల్లో ఎత్తుకుని బయటకు తీసుకొచ్చారు. బయట సిద్ధంగా ఉన్న అంబులెన్సుల్లోకి ఎక్కించారు. అవి వారిని మాస్కోలోని వివిధ ఆస్పత్రులకు తీసుకెళ్లాయి. అక్కడ దాదాపు 450 మందికి చికిత్స చేశారు.
ఆ సమయంలో సాధారణ మోతాదుకు ఐదు రెట్లు ఎక్కువ స్లీపింగ్ ఏజెంట్ ఉపయోగించారని, చనిపోయిన బందీలు అందరూ గ్యాస్ దుష్ప్రభావాల వల్ల చనిపోయారు" అని క్రెమ్లిన్‌లోని ఒక వ్యక్తి చెపారు.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ సమయంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డాక్టర్ వేషంలో ఆ బందీలను చూడ్డానికి మాస్కోలో న్న ఒక ఆస్పత్రికి వెళ్లారు.
"కాల్పులు జరపడం మొదలవగానే, తిరుగుబాటుదారులు మమ్మల్ని మీ సీట్లలో వంగి ఉండండి. మీ తలను చేతులతో కప్పుకోండని చెప్పారు. కానీ తర్వాత అందరూ స్పృహతప్పిన స్థితిలో ఉండిపోయార"ని థియేటర్ డైరెక్టర్ జార్జ్ వసిల్థేవ్ అప్పుడు రాయటర్స్ కు చెప్పారు.

దాడి చేసినవారిలో మూడో వంతు మహిళలే
చెచెన్ తిరుగుబాటుదారుల్లో మూడో వంతు మహిళలే ఉన్నారు. వారంతా ఎక్కువగా రష్యాతో జరిగిన యుద్ధంలో భర్తనో, సోదరులనో కోల్పోయిన మహిళలని రష్యా అంతర్గత రక్షణ ఏజెన్సీ ఎఫ్ఎస్బీ చెప్పింది..
వారు తమ లక్ష్యం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధమయ్యారు. కళ్లు మినహా మొత్తం శరీరాన్ని నల్లటి వస్త్రంతో కప్పుకున్న ఆ మహిళలు ఒక చేతిలో పిస్టల్, మరో చేతిలో బెల్టు వరకూ ఉన్న పేలుడు పదార్థాలకు కనెక్ట్ చేసిన కేబుల్ పట్టుకుని కనిపించారు. నల్ల ముసుగులు వేసుకున్న మగ చెచెన్ తిరుగుబాటుదారులు థియేటర్లోని స్తంభాలకు, సీట్లలో బాంబులు పెట్టారు.
రష్యా సైనికులు భవనం లోపలికి చొరబడ్డానికి ప్రయత్నిస్తే మొత్తం థియేటర్ భవనాన్ని బాంబులతో పేల్చేస్తామని వారు పదే పదే హెచ్చరించారు.

డాక్టర్లను అప్రమత్తం చేయలేదు
ఇంతమంది చనిపోయినప్పటికీ ఈ ఆపరేషన్ విజయవంతం అయ్యిందని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. దానికి ఒక వింత వాదన కూడా వినిపించింది. చనిపోయిన బందీలు అంతకు ముందే ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారని చెప్పింది.
"ఎక్కువ కేసుల్లో ఒత్తిడి, అలసట వల్ల గుండెపోటు రావడంతో బందీలు చనిపోయారని చెప్పారు. కానీ, జనం వారు చెప్పిన మాటలను నమ్మలేదు" అని 'రష్యన్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మెడిసిన్'కు చెందిన విక్టర్ పియోబ్రెజెన్సకీ చెప్పారు.
కానీ, ఇంతమంది చనిపోవడానికి, ఈ రెస్క్యూ ఆపరేషన్ కూడా కారణం అయ్యుండవచ్చనే ప్రశ్నలు వెల్లువెత్తాయి.
సైనికులు థియేటర్‌ను తమ నియంత్రణలోకి తీసుకోగానే, మాస్కో రెస్క్యూ సర్వీస్ డాక్టర్లు బందీలకు చికిత్స అందించేందుకు చేరుకున్నారు. కానీ వారికి ఎవరికీ అక్కడ గ్యాస్ ఉందనే సంగతి ముందు చెప్పలేదు.
"గ్యాస్ ఉపయోగించామని చెప్పి మమ్మల్ని ఎవరూ అప్రమత్తం చేయలేదు, మాకు సూచనలన్నీ ప్రభుత్వ రేడియో ద్వారా అందాయి. బాధితులకు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వెంటనే మా మెడికల్ కిట్ తీసుకురావాలని మాత్రమే చెప్పారు" అని మాస్కో రెస్క్యూ సర్వీస్ డాక్టర్ అలగ్జాండర్ షవలోవ్ బీబీసీకి చెప్పారు.
స్పృహతప్పిన దాదాపు వెయ్యి మంది బందీలకు కేవలం 17 డాక్టర్లే అందుబాటులో ఉన్నారు. చివరికి స్పృహతప్పిన వారిని సైనికులే తమ చేతుల్లోకి ఎత్తుకుని బయటకు తీసుకొచ్చారు. ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్లలో వారికెలాంటి అనుభవం లేదు.
చాలామందిని సైనికులు మోసుకెళ్లి అంబులెన్సుల్లో పడేయడంతో వారిలో చాలా మందికి శ్వాస ఆడలేదు. అంబులెన్సుల్లో ఉన్నవారిలో ఎవరికి ఎలాంటి చికిత్స అందించాలో తెలుసుకోవడం డాక్టర్లకు కష్టమైంది.
ఈ ఘటన నుంచి రష్యా సైనికులు ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదు. రెండేళ్ల తర్వాత చెచెన్ తిరుగుబాటుదారులు బెస్లాన్ స్కూల్లో వందలాది పిల్లలను బందీలుగా పట్టుకున్నప్పుడు రష్యా సైనికులకు మరోసారి పరీక్ష ఎదురైంది.
ఆ ఆపరేషన్‌లో కూడా 300 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువమంది పిల్లలే. ఈ దాడులతో రష్యా భద్రతా బలగాలు ప్రతిష్ఠకు కోలుకోలేని దెబ్బ తగిలింది.
ఇవి కూడా చదవండి:
- భారత్‌ను ఆక్రమించుకోవాలని రష్యా, కాపాడుకోవాలని బ్రిటన్... చివరికి ఏమైంది?
- రష్యా అధ్యక్షుడిగా పుతిన్ జీవితాంతం ఉండిపోతారా? రిఫరెండం ఉద్దేశం ఏమిటి?
- మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా!!
- ఉత్తర కొరియా ప్రదర్శించిన భారీ క్షిపణి సత్తా ఏంటి? దాని వల్ల అమెరికాకు ముప్పు ఉందా?
- న్యాయమూర్తులపై జగన్ ఫిర్యాదు: 'జడ్జిలకు రాజ్యాంగం మినహాయింపు ఇవ్వలేదు.. వారిని ప్రశ్నించాల్సిందే’ - అభిప్రాయం
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- వీరప్పన్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. గంధపు చెక్కల స్మగ్లర్ నేరాల్లో వారి పాత్రేమిటి
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...
- 'బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- విశాఖ తెన్నేటి పార్క్ తీరానికి కొట్టుకొచ్చిన నౌకను మళ్లీ సముద్రంలోకి ఎలా పంపిస్తారంటే...
- 'మాకు #MeToo తెలియదు... ఇల్లు, రోడ్డు, పనిచేసే చోటు ఏదీ మాకు సురక్షితం కాదు’
- 'సోషల్ మీడియాలో సవాళ్లకు టెంప్ట్ అవుతున్నారా.. జాగ్రత్త కపుల్స్’
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)