
40 మంది విద్యార్థులు.. 8 కి.మీ కాలినడక.. పోలండ్ సరిహద్దు వరకు
ఉక్రెయిన్‌లో భారత విద్యార్థుల కష్టాలు వర్ణణాతీతం. దేశం విడిచి వెళ్లే మార్గం తెలియక ఆందోళన చెందుతున్నారు. 40 మంది భారత విద్యార్థుల బృందం 8 కిలోమీటర్లు నడిచి పోలెండ్ సరిహద్దు వద్దకు చేరుకున్నారు. వారందరూ ల్వీవ్ నగరంలోని ఓ మెడికల్ వర్సిటీలో మెడిసన్ చేస్తున్నారు. ఉక్రెయిన్ గగనతలం మూసివేయడంతో స్వదేశం చేరడానికి ఇబ్బందులు తప్పడం లేదు.
భారత విద్యార్థులను వర్సిటీకి చెందిన ఓ బస్సు 70 కిలోమీటర్ల దూరం తీసుకువచ్చింది. పోలెండ్ సరిహద్దుకు 8 కిలోమీటర్ల దూరంలో విడిచిపెట్టింది. ఆపై వారందరూ సరిహద్దు వద్దకు కాలినడకన చేరుకున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతాలైన ల్వీవ్, చెర్న్ విట్సిలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసింది. పోలెండ్ వెళ్లాలనుకునే భారత విద్యార్థులకు సహకరించేందుకు రష్యన్ భాష మాట్లాడే అధికారులను అక్కడ నియమించింది.

ప్రస్తుతం రష్యా తన సరిహద్దుకు సమీపంలో తూర్పు ఉక్రెయిన్ భాగంలోనే దాడులు చేస్తోంది. దాంతో పశ్చిమ ఉక్రెయిన్ లో కొద్దిమేర సాధారణ వాతావరణం కనిపిస్తోంది. భారత్‌కు చెందిన మరో విద్యార్థుల బృందం ఉక్రెయిన్-రుమేనియా సరిహద్దుల వద్దకు వెళ్లినట్టు తెలుస్తోంది. భారత ప్రభుత్వం ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక విమానాలు పంపిస్తోన్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌తో సరిహద్దులు పంచుకుంటున్న దేశాల ద్వారా భారత విద్యార్థులను స్వదేశానికి తరలించాలన్నది కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బుడాపెస్ట్ కు రెండు చార్టర్డ్ విమానాలు ఇవాళ బయల్దేరనుండగా, బుడాపెస్ట్‌కు ఓ విమానం రేపు బయల్దేరనుంది.
ఇటు ఉక్రెయిన్‌లోని భారత విదేశాంగశాఖ అధికారుల సాయంతో భారతీయులు హంగేరి సరిహద్దులోని హుజూర్ద్, రొమేనియా సరిహద్దులోని చెర్నీవెస్ట్కు చేరుకోవాలని సూచించింది. విద్యార్థులు బృందాలుగా బయల్దేరాలని.. పాస్‌పోర్టులు, అత్యవసర ఖర్చుల కోసం కొంచెం డబ్బు, కావాల్సిన వస్తువులతో సిద్ధంగా ఉండాలని ప్రకటించింది. కరోనా డబుల్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ మస్ట్ అని సూచించింది.తాము ప్రయాణిస్తున్న వాహనాలపై జాతీయ జెండాను మస్ట్‌గా ఉంచాలని సూచించింది భారత ఎంబసీ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల వివరాలను ఇప్పటికే సేకరించింది. ప్రస్తుతం 16 వేల మంది భారతీయులు ఉన్నారని అంచనా వేస్తున్నారు. రష్యా దాడులతో భారతీయులకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లు, బాంబ్ షెల్టర్లు, హాస్టల్స్‌ల్లో తలదాచుకుంటున్నారు.