థ్యాంక్స్ టూ కరోనా- క్షీణించిన ధరలు- ఓడలకు ఉపయోగపడుతున్న జెట్ ఇంధనం...
ఓడలు బండ్లు కావడం వినే ఉంటాం. కరోనా కారణంగా ఓడలు బండ్లు అవుతున్న ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. కానీ కరోనా కారణంగా ఒకప్పుడు విమానాలకు ఇంధనంగా వాడిన జెట్ ఫ్యూయల్ ఇప్పుడు ధరలు పడిపోయి ఓడలకు ఉపయోగపడుతుందంటే అతిశయోక్తి కాదు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో లాక్ డౌన్ కారణంగా విమానాలు ఎయిర్ పోర్టులకే పరిమితం కావడంతో జెట్ ఇంధనం ధరలు భారీగా పడిపోయాయి. దీంతో ఇప్పట్లో విమానాలు సాధారణ స్ధాయిలో తిప్పే అవకాశాలు లేవని తేలిపోవడంతో విమానయాన రంగం పక్కచూపులు చూస్తోంది. ఈ పరిణామం చమురు రంగంలోనూ పెను మార్పులకు కారణమవుతోంది.

బండ్లవుతున్న ఓడలు...
కరోనా దెబ్బకు అంతర్జాతీయ వాణిజ్యంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన రంగాలన్నీ క్షీణిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా వైద్యం, ఆరోగ్యం, ఫార్మసీ రంగాల పేర్లే వినిపిస్తున్నాయి. కరోనాకు టీకా ఎప్పుడు కనిపెడతారంటూ ప్రపంచమంతా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. ఏ చిన్న పరిశోధనా సంస్ధ నుంచి ఏ చిన్న కబురు వచ్చినా దాని గురించి జనం ఆరా తీస్తున్నారు. ప్రైవేటు రంగంలో టీకా అభివృద్ధి కోసం జరగని ప్రయత్నం లేదు. అయినా కచ్చితంగా కరోనా వ్యాక్సిన్ వస్తుందని, అది కచ్చితంగా కరోనాను మాన్పుతుందన్న గ్యారంటీ లేదు. మరోవైపు కరోనా కారణంగా అన్ని రంగాలతో పాటే కుదేలైన విమానయాన రంగం కూడా ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదు.

జెట్ ఇంధన ధరల పతనం...
కరోనాకు ముందు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన ఇంధనాల్లో ఒకటిగా ఉన్న జెట్ ఇంధనం ధరలు ఇప్పుడు పతనావస్ధకు చేరుకున్నాయి. విమానాల కోసం ప్రత్యేకంగా పెట్రోలియం ఉత్పత్తుల నుంచి తయారు చేసే ఈ ఇంధనం కొనలేక గతంలో పలు విమానయాన సంస్ధలు దివాలా తీసిన సందర్భాలున్నాయి. కానీ ఇప్పుడు కరోనా కారణంగా విమానాలు నడవకపోవడంతో జెట్ ఇంధనం ధరలు పాతాళానికి చేరాయి. కరోనా నేపథ్యంలో మూలనపడిన విమానయానరంగం ఇప్పట్లో కోలుకునే అవకాశాలు లేవనే వాదన పెరుగుతోంది. తాజాగా అంతర్జాతీయ వాయు రవాణా సంఘం కూడా విమానయానం పూర్వ కరోనా పరిస్ధితికి చేరుకోవాలంటే 2024 వరకు వేచి చూడక తప్పదని తేల్చేసింది.

ఓడలకు ఇంధనంగా జెట్ ఫ్యూయల్..
సాధారణంగా జెట్ ఇంధనం తయారీలో వాడే కిరోసిన్ ఇప్పుడు విమానాల రాకపోకలు లేకపోవడంతో మారిటైమ్ ఇండస్ట్రీలో తక్కువ సల్ఫర్ ఉన్న ఇంధన నూనె తయారీలో వాడుతున్నారు. సాధారణంగా డీజిల్‌తో పాటు ఎక్కువ పరిమాణంలో గ్యాసోలిన్‌ను వాడుతున్న ఓడలకు ఇప్పుడు ఈ కిరోసిన్ వాడకం చాలా చౌకగా తయారైంది. వైట్ కిరోసిన్‌గా పేర్కొనే దీన్ని బ్లెండ్ చేసి ఇప్పుడు ఓడలకు వాడేందుకు వాటి యజమానులు ఇష్టపడుతున్నారు. చాలా దేశాల్లో ఇదే పరిస్ధితి కనిపిస్తోంది. అంతర్జాతీయంగా వైట్ కిరోసిన్ డిమాండ్ తగ్గిపోవడంతో ఓడలు వాడుతున్న డీజిల్‌కు బదులుగా దీన్ని వాడుకోవడం ద్వారా కోట్లలో డబ్బు ఆదా అవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రమాదాలు జరిగే అవకాశమున్నా...
ప్రస్తుతం విమాన, రోడ్డు రవాణా రంగాలు కరోనా కారణంగా రాకపోకలు తగ్గించడంతో వీటి స్ధానంలో సముద్ర రవాణాకూ డిమాండ్ పెరుగుతోంది. అలాగే రోడ్లపై తిరిగే వాహనాలకు వాడే డీజిల్ ధరలు కూడా ఆకాశాన్నంటుతుండటంతో వీటి స్ధానంలో జెట్ ఇంధనాల్లో వాడే కిరోసిన్‌ను బ్లెండ్ చేసి ఓడల్లో వాడుతున్నారు. కానీ ఓడల్లో ఉండే ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఈ ఇంధనాన్ని వాడటం ప్రమాదకారి కావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం వాణిజ్య కోణంలో చూస్తే మాత్రం చౌక ఇంధనాన్ని వదులుకుని డీజిల్ ఖర్చు చేసుకోవడం ఎందుకని మారిటైమ్ రంగంలో నౌకల యజమానులు భావిస్తున్నారు.