
అగ్నిపథ్: ఇలాంటి సైనిక నియామకాల పథకం ఏఏ దేశాల్లో ఉంది? అక్కడి నియమ నిబంధనలు ఏమిటి

భారత సైన్యంలో స్వల్పకాలిక నియామకాలకు సంబంధించి 'అగ్నిపథ్ పథకా'న్ని కేంద్ర ప్రభుత్వం గత మంగళవారం ప్రకటించింది. ఈ పథకం కింద సైన్యంలో నాలుగేళ్ల పాటు పని చేయటానికి నియామకాలు జరుగుతాయి. అలా నియమితులయ్యే వారిని 'అగ్నివీర్' అని పిలుస్తారు.
ఈ పథకం కింద నియమితులైన వారిలో 25 శాతం మందికి నాలుగేళ్ల తర్వాత సైన్యంలో కొనసాగటానికి అవకాశం లభిస్తుంది. మిగతా అగ్నివీరులు ఉద్యోగం వదిలి వెళ్లాల్సి ఉంటుంది.
ఈ అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించినప్పటి నుంచీ దేశంలోని చాలా ప్రాంతాల్లో విద్యార్థులు, యువకులు దీనికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఈ నిరసనలు హింసాత్మకంగా కూడా మారాయి.
ఈ నేపథ్యంలో అస్సాం రైఫిల్స్ సహా పారామిలటరీ దళాల నియామకాల్లో 10 శాతం సీట్లను.. అగ్నిపథ్ పథకం కింద నాలుగేళ్లు సర్వీస్ పూర్తిచేసిన అగ్నివీర్ల కోసం రిజర్వు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ శనివారం ప్రకటించింది.
భారతదేశం సైన్యంలో స్వల్పకాలిక నియామకాలు చేపట్టటం ఇదే మొదటిసారి. సైన్యంలో ఇలాంటి నియామకాలు విదేశాల్లో కూడా జరుగుతున్నాయని ప్రభుత్వం చెప్తోంది.
అయితే.. ప్రపంచంలో చాలా దేశాల్లో సైన్యంలో స్వల్పకాలిక నియామకాలు జరుగుతున్నది నిజమే అయినా.. ఆయా దేశాల్లో యువత నిర్దిష్ట కాలం పాటు సైన్యంలో పనిచేయటం తప్పనిసరి. అందుకోసం చట్టాలు కూడా ఉన్నాయి. కానీ అగ్నిపథ్ పథకం అటువంటిది కాదు.
ఏఏ దేశాల్లో నిర్బంధ సైనిక సర్వీసు నిబంధనలు ఉన్నాయినేది ఇక్కడ చూద్దాం.
- భారత ఆర్మీ: అగ్నిపథ్ పథకం అంటే ఏంటి? జీతం ఎంత? ఎవరు అర్హులు?
- 'అగ్నిపథ్' పథకంతో ప్రయోజనం ఎవరికి? ఇండియన్ ఆర్మీకి మేలు ఎంత? అగ్నివీర్లకు మేలు ఎంత?

ఇజ్రాయెల్
ఇజ్రాయెల్‌లో పురుషులు, మహిళలు ఇద్దరూ సైన్యంలో పని చేయటం తప్పనిసరి. ఇజ్రాయెల్ రక్షణ దళంలో పురుషులు మూడేళ్లు పని చేస్తారు. మహిళలు సుమారు రెండేళ్లు పని చేస్తారు. స్వదేశంలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా ఇజ్రాయెల్ పౌరులందరికీ ఇది వర్తిస్తుంది.
కొత్తగా వచ్చే వలసలకు, కొన్ని ఇతర మతాల వారికి, వైద్య కారణాల ప్రాతిపదికన ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది.
అలాగే ప్రత్యేక పరిస్థితుల్లో క్రీడాకారులు ఇంకా తక్కువ కాలం పాటు సైన్యంలో పనిచేయవచ్చు.
దక్షిణ కొరియా
దక్షిణ కొరియాలో జాతీయ సైన్యంలో పనిచేయటానికి సంబంధించి బలమైన వ్యవస్థ ఉంది. శారీరక సామర్థ్యమున్న పురుషులందరూ 21 నెలల పాటు సైన్యంలో, 23 నెలల పాటు నౌకాదళంలో, 24 నెలల పాటు వైమానిక దళంలో పని చేయటం తప్పనిసరి.
ఇది కాకుండా.. పోలీస్, కోస్ట్ గార్డ్, ఫైర్ సర్వీస్‌లలో పని చేసే వెసులుబాటు ఉంది. కొన్ని ప్రత్యేక కేసుల్లో ప్రభుత్వ విభాగాల్లో కూడా పనిచేయవచ్చు.
అయితే.. ఒలింపిక్స్‌లో కానీ ఏషియన్ గేమ్స్‌లో కానీ స్వర్ణ పతకాలు గెలిచిన క్రీడాకారులకు సైన్యంలో తప్పనిసరిగా పనిచేయాలన్న నిబంధన నుంచి మినహాయింపు ఉంది. పతకాలు తీసుకురాని క్రీడాకారులు వెనుదిరిగి వచ్చి తిరిగి సైన్యంలో పనిచేయాల్సి ఉంటుంది.
- ఇండియన్ ఆర్మీ నియామకాలు ఎందుకు జరగట్లేదు? భారత సైన్యాన్ని తగ్గిస్తున్నారా?
- మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఒక్క ఆయుధాన్ని కూడా కొనలేదా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వాదనలో నిజమెంత?

ఉత్తర కొరియా
ఉత్తర కొరియాలో దేశ పౌరులు సైన్యంలో పని చేయటం తప్పనిసరిగా అత్యంత సుదీర్ఘ కాలంగా అమలులో ఉంది.
పురుషులు 11 సంవత్సరాల పాటు, మహిళలు 7 సంవత్సరాలు పాటు సైన్యంలో పనిచేసి తీరాలి.
ఎరిత్రియా
ఆఫ్రికా దేశమైన ఎరిత్రియాలో కూడా జాతీయ సైన్యంలో తప్పనిసరిగా పనిచేయాలన్న నిబంధన ఉంది. ఈ దేశంలో పురుషులు, యువకులు, అవివాహితులైన మహిళలు సైన్యంలో 18 నెలల పాటు పనిచేయాలి.
ఈ 18 నెలల సర్వీసును కూడా తరచుగా మరి కొన్ని సంవత్సరాల పాటు పొడిగిస్తుంటారని కొన్ని మానవ హక్కుల సంస్థలు చెప్తున్నాయి. ఒక్కోసారి ఇళా పొడిగించే కాలానికి పరిమితి కూడా ఉండదని పేర్కొన్నాయి.
ఇలాంటి నిర్ణయం వల్ల ఎరిత్రియా నుంచి యువత పారిపోతున్నారు. చాలా మంది తమ దేశంలో నిర్బంధ సైనిక సర్వీసులో చేరటం ఇష్టం లేక.. బ్రిటన్‌లో కూడా ఆశ్రయం పొందారు.
- 'అమర జవాను జ్యోతి'ని శాశ్వతంగా ఆర్పివేస్తున్నారా? అసలేం జరుగుతోంది?
- 30 వేల మంది పాకిస్తాన్ సైనికులు 3 వేల మంది భారత సైనికులకు ఎందుకు లొంగిపోయారు?

స్విట్జర్లాండ్
స్విట్జర్లాండ్‌లో 18 ఏళ్ల నుంచి 34 ఏళ్ల మధ్య వయసున్న పురుషులు సైన్యంలో పని చేయటం తప్పనిసరి.
ఇలా తప్పనిసరిగా పనిచేయటం 21 వారాలు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత ప్రతి ఏటా సైనిక శిక్షణ కొనసాగుతుంది.
దేశంలోని మహిళలకు ఈ నిబంధన వర్తించదు. అయితే వారు తమ ఇష్టప్రకారం సైన్యంలో చేరవచ్చు.
ఈ నిబంధనకు ముగింపు పలికే అంశంపై 2013లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ప్రజలు ఈ నిబంధనను కొనసాగించటానికే మొగ్గుచూపారు.
సైన్యంలో తప్పనిసరిగా పనిచేసే అంశంపై రిఫరెండం నిర్వహించటం అది మూడోసారి.
- 'మాది ప్రపంచంలోనే సూపర్ సైన్యం అనుకున్నా. కానీ..' - యుక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న రష్యా సైనికుడి అనుభవాలు
- యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం: నెల రోజులుగా యుక్రేనియన్లు 'చాలా తెలివిగా, చురుకుగా, సృజనాత్మకంగా యుద్ధం’ ఎలా చేస్తున్నారు?

బ్రెజిల్
బ్రెజిల్లో 18 ఏళ్ల వయసు దాటిన పురుషులు సైనిక సర్వీసులో పని చేయటం తప్పనిసరి. ఈ సర్వీసు కాలం 10 నెలల నుంచి 12 నెలల వరకూ ఉంటుంది.
ఆరోగ్య కారణాల ప్రాతిపదికన ఈ తప్పనిసరి మిలటరీ సర్వీసు నుంచి మినహాయింపు ఇవ్వవచ్చు.
ఒకవేళ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నట్లయితే.. ఆ చదువు పూర్తయిన తర్వాత సైన్యంలో తప్పని సర్వీసుకు వెళ్లాల్సి ఉంటుంది.
ఈ సర్వీసుకు గాను సైనికులకు స్వల్ప వేతనం, ఆహారం, బ్యారక్స్‌లో బస లభిస్తుంది.

సిరియా
సిరియాలో పురుషులు సైన్యంలో పనిచేయటం తప్పనిసరి. ఈ నిర్బంధ సైనిక సర్వీసు కాల పరిమితిని 21 నెలల నుంచి 18 నెలలకు తగ్గిస్తూ 2011 మార్చిలో అధ్యక్షుడు బషర్ అల్-అసద్ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వ్యక్తులు తప్పనిసరి సైనిక సర్వీసు చేయకపోయినట్లయితే వారు ఉద్యోగాలు కోల్పోతారు.
ఈ సర్వీసును తప్పించుకునే వారికి 15 ఏళ్ల వరకూ జైలు శిక్ష విధించే అవకాశముందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది.
- 'ఇక్కడ బతకడం కన్నా యుక్రెయిన్‌లో యుద్ధం చేయడం బెటర్'
- నాటో అంటే ఏమిటి? రష్యా దానిని ఎందుకు నమ్మట్లేదు?

జార్జియా
జార్జియాలో ఏడాది పాటు తప్పనిసరిగా సైన్యంలో పనిచేసి తీరాలి. ఇందులో మూడు నెలల పాటు యుద్ధ శిక్షణ ఇస్తారు. మిగతా 9 నెలల పాటు ప్రొఫెషనల్ సైన్యానికి సాయం చేసే డ్యూటీ ఆఫీసర్‌గా పనిచేయాల్సి ఉంటుంది.
జార్జియాలో ఈ తప్పనిసరి మిలటరీ సర్వీసు నిబంధనను కొన్నేళ్ల కిందట నిలిపివేశారు కానీ మళ్లీ 8 నెలల్లోనే 2017లో పునరుద్ధరించారు.
లిథువేనియా
లిథువేనియాలో తప్పనిసరి సైనిక సర్వీసును 2008లో రద్దు చేశారు. కానీ 2016లో దీనిని మళ్లీ పునరుద్ధరించారు.
రష్యా నుంచి సైనిక ముప్పు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని అప్పుడు ప్రభుత్వం చెప్పింది.
ఇక్కడ 18 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్య వయసులోని పురుషులు ఏడాది పాటు తప్పనిసరిగా సైన్యంలో పనిచేయాల్సి ఉంటుంది.
యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులు, ఒంటరి తండ్రులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది.
- అఫ్గానిస్తాన్ యుద్ధంతో వేల కోట్లు లాభం పొందిన 5 కంపెనీలు ఇవే..
- ఉత్తర, దక్షిణ కొరియా క్షిపణుల రేస్.. ఈ రెండు దేశాలూ ఆయుధాలను ఎందుకు పెంచుకుంటున్నాయి?

స్వీడన్
స్వీడన్లో 100 ఏళ్ల పాటు అమలులో ఉన్న నిర్బంధ సైనిక సర్వీసు నిబంధనను 2010లో రద్దుచేశారు. అయితే.. ఈ నిబంధనను పునరుద్ధరించటానికి 2017లో ప్రజాభిప్రాయ సేకరణ మొగ్గుచూపింది.
దీంతో 2018 జనవరి నుంచి 4,000 మంది స్త్రీ, పురుషులను తప్పనిసరి సైనిక సర్వీసులోకి తీసుకోవాలని నిర్ణయించింది.
2025 నాటికి 8,000 మంది స్త్రీ, పురుషులను తప్పనిసరి సైనిక సర్వీసులోకి తీసుకుంటారని రాయిటర్స్ వార్తా సంస్థ ఒక కథనంలో చెప్పింది.
మరికొన్ని దేశాల్లో...
టర్కీలో 20 ఏళ్లు దాటిన పురుషులందరూ 6 నెలల నుంచి 15 నెలల వరకూ తప్పనిసరిగా సైన్యంలో పనిచేయాలి.
గ్రీస్‌లో 19 ఏళ్ల యువకులు 9 నెలల పాటు సైన్యంలో పనిచేయటం తప్పనిసరి.
ఇరాన్లో 18 ఏళ్లు పైబడిన పురుషులు 24 నెలల పాటు తప్పనిసరిగా సైన్యంలో పనిచేయాలి.
క్యూబాలో 17 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య వయసున్న యువకులు రెండేళ్ల పాటు తప్పనిసరిగా సైన్యంలో సర్వీసు చేయాలి.
ఇవి కూడా చదవండి:
- ఈ కుక్కలను కొనొద్దని పశు వైద్యులు ఎందుకు చెబుతున్నారు
- భారత ఆర్మీ: అగ్నిపథ్ పథకం అంటే ఏంటి? జీతం ఎంత? ఎవరు అర్హులు?
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
- బ్లడ్ గ్రూప్స్ గురించి మీకేం తెలుసు... వాటిలో చాలా అరుదుగా దొరికే రక్తం రకాలు ఏంటి?
- కసార్ దేవి: హిమాలయాల ఒడిలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రపంచం నలుమూలల నుంచి మేధావులు ఎందుకు వస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)