వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చీకటి ఒప్పందాల వేదికే పనామా: ఏంటీ మొసాక్ ఫోన్సెకా?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/పనామా సిటీ: పనామాకు చెందిన మొసాక్‌ ఫోన్సెకా.. ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. నల్లధనం దేశాల సరిహద్దులు దాటుతున్న తీరుపై ఈ సంస్థ నుంచి లీకైన దాదాపు కోటి 15 లక్షల రహస్య పత్రాలు 'పనామా పేపర్స్‌'లో బహిర్గతమై సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో అత్యంత కీలకంగా మారిన మొసాక్‌ ఫోన్సెకా పాత్ర ఏమిటి? అసలు ఎవరిదీ సంస్థ? అది చేసే పనేంటి? అనే విషయాలపై ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది. పనామా నగరం కేంద్రంగా ఉన్న మొసాక్‌ ఫోన్సెకా సంస్థ పని హవాలా సొమ్మును దేశాల సరిహద్దులు దాటించడమేనని ఆరోపణలు ఉన్నాయి.

మొసాక్‌ ఫోన్సెకా ఒక సంస్థగా 1977లో ప్రారంభమైంది. రామన్‌ ఫోన్సెకా, జుర్గెన్‌ మొసాక్‌.. ఇద్దరూ విడివిడిగా ఉన్న తమ చిన్న 'లా' సంస్థలను విలీనం చేసి దీన్ని నెలకొల్పారు. డబ్బు, అధికారం, రహస్యాలకు సంబంధించిన నేపథ్యాలలో ఇద్దరికీ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉంది. ఫోన్సెకా పనామాలోనే పుట్టిపెరిగి, న్యాయశాస్త్రం చదివారు.

మొసాక్‌ జర్మన్‌ జాతీయుడైన పనామా వాసి. ఫోన్సెకా రచయితగానూ పేరొందారు. పనామా అధ్యక్షుడికి సలహాదారుగా పనిచేసిన ఆయనకు ప్రపంచ రాజకీయాలు బాగా తెలుసు. మొసాక్‌ కూడా పనామా విదేశీ సంబంధాల కౌన్సిల్‌లో పనిచేశారు. ప్రతిష్ఠాత్మక క్లబ్‌ యూనియన్‌లో సభ్యుడు. బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్స్‌లో శాఖ ఏర్పాటు చేయడం ద్వారా ఈ సంస్థ దశ తిరిగిందని చెప్పవచ్చు.

కాగా, ప్రభుత్వాధినేతలు.. ప్రముఖులు కొల్లగొట్టిన సొమ్మును గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు తరలించడంలో ఈ సంస్థ కీలకపాత్ర పోషిస్తుంటుంది. పనామాలో బోగస్‌ కంపెనీలను సృష్టించి వాటిల్లోకి డబ్బును మళ్లించేందుకు అక్రమార్కులకు సహాయం చేస్తుంటుంది. అంతేగాకుండా, న్యాయ సంబంధమైన సమస్యలు రాకుండా చూసుకునేందుకు ప్రత్యేకంగా న్యాయవాదులను నియమిస్తుంది.

అందుకు పెద్దమొత్తంలో షేర్లు తీసుకుంటుందని ఆరోపణలు ఉన్నాయి. అర్జెంటీనా మాజీ అధ్యక్షుడి అక్రమార్జనను దారి మళ్లించేందుకు అమెరికాలోని నెవాడా స్టేట్‌లో ఈ సంస్థ 123 బోగస్‌ కంపెనీలను సృష్టించిందన్న ఆరోపణలున్నాయి. అదీగాక, దాదాపు 40 ఏళ్లుగా ఇంకెన్నో బినామీ సంస్థల్లో పెట్టుబడుల పేరుతో అక్రమార్కుల నల్లధనానికి కాపలాగా ఉండటంలో మొసాక్‌ ఫోన్సెకా దిట్ట అని చెబుతున్నారు.

కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలను రహస్యంగా ఉంచడంలో ఈ సంస్థ అత్యంత జాగ్రత్తగా ఉంటుంది. కానీ, ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌.. మరికొన్ని మీడియా సంస్థలు ఆ రహస్యాలను బట్టబయలు చేశాయి. 1977 నుంచి 2015 డిసెంబర్‌ వరకు బ్యాంకు ఖాతాలు.. క్లయింట్ల రికార్డులు.. తదితర వివరాలన్నీ ఇప్పుడు బహిర్గతం అయ్యాయి.

కాగా, మొసాక్‌ ఫోన్సెకా మాత్రం తాము సంస్థలకు న్యాయపరమైన.. పరిపాలనా పరమైన సహాయాన్ని చట్టం పరిధుల మేరకే అందిస్తామని, రహస్య పత్రాల లీక్‌పై సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొంది.

All you need to know about Panama Papers and Indians found on the list

చీకటి ఒప్పందాలకు వేదికగా పనామా

పనామా.. మధ్య అమెరికాలోని కేవలం 40 లక్షల మంది జనాభా ఉన్న ఓ చిన్న దేశం. కానీ, లక్షల కోట్ల రూపాయల అక్రమ నిల్వలకు అడ్డాగా మారింది. నల్లధన కుబేరుల వివరాలను బహిర్గతం చేసి ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన పనామా పేపర్స్‌తో ఇప్పుడా దేశం పేరు కూడా మార్మోగుతోంది.

సింగపూర్‌ లాగే పనామాలోనూ వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉండేవి. బ్యాంకింగ్‌, పెట్టుబడులకు ఈ దేశ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడంతో ఫైనాన్షియల్‌ హబ్‌గా మారింది. అయితే ప్రస్తుతం ఈ దేశం మనీలాండరింగ్‌ హబ్‌గా పేరొందింది.

ఎన్నో చీకటి ఒప్పందాలకు పనామా వేదికైంది. పన్నులు ఎగ్గొట్టి ఎంతోమంది ప్రపంచ ప్రముఖులు అక్రమంగా కూడబెట్టిన సంపాదనను ఇక్కడే దాచి ఉంచారనే నిజాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. నల్లధనంపై ఇటీవల జరిపిన ఎన్నో పరిశీలనల్లో పనామా అక్రమ నిల్వల వివరాలు బయటపడలేదు.

అయితే ప్రస్తుతం పనామా పేపర్స్‌ ద్వారా బయటపడిన రహస్యాల ద్వారా పనామాలోని చీకటి కోణం వెలుగులోకి వచ్చింది. కాగా, నల్లధనానికి పనామా ఓ చీకటి దేశంగా మారుతోందని ఓఈసీడీ సెంటర్‌ ఫర్‌ ట్యాక్స్‌ పాలసీ డైరెక్టర్‌ పాస్కల్‌ సెయింట్‌ అమన్స్‌ తెలిపారు.

English summary
Panama Papers have leaked the significant documents about Mossack Fonseca firm in Panama which has helped investors around the world to evade tax, launder money, among others.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X