• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆన్‌లైన్‌లో అమ్మకానికి అమెజాన్ నకిలీ రివ్యూలు.. కుప్పలు తెప్పలుగా విక్రయం

By BBC News తెలుగు
|
అమెజాన్ పార్సిల్
Click here to see the BBC interactive

అమెజాన్ ఆన్‌లైన్ మార్కెట్‌లో విక్రయించే ఉత్పత్తుల కోసం నకిలీ రివ్యూలను కుప్పలు, కుప్పలుగా అమ్ముతున్నారని విచ్? (Which?) అనే వినియోగదారుల సంస్థ వెల్లడించింది.

ఒక్కో నకిలీ రివ్యూ ధర ఐదు పౌండ్ల నుంచి మొదలవుతుందని.. ఉత్పత్తులు లేదా నగదు తీసుకుని వీటిని విక్రయిస్తున్నారని ఆ సంస్థ తెలిపింది. ఇటువంటి నకిలీ రివ్యూలను విక్రయించే పది వెబ్‌సైట్లను తాను గుర్తించినట్లు చెప్పింది.

ఈ నకిలీ రివ్యూ పరిశ్రమ విస్తారంగా ఎదిగిందంటూ.. దీనిని ఎదుర్కోవటానికి తాము చాలా శ్రమించాల్సి వస్తోందని పేర్కొంది.

అమెజాన్ అధికార ప్రతినిధి స్పందిస్తూ... ''నకిలీ రివ్యూలను మేం తొలగిస్తాం. ఇలా దుర్వినియోగం చేసే వారిపై చర్యలు చేపడతాం’’ అని తెలిపారు.

అమెజాన్ వెబ్‌సైట్‌లో ఇతర రిటైలర్లు తమ ఉత్పత్తులను అమ్ముకోవటానికి ఆ సంస్థ వీలుకల్పిస్తుంది.

అమెజాన్ మార్కెట్‌ప్లేస్‌లోని ఉత్పత్తులకు రివ్యూ సేవలు అందిస్తామని చెప్తున్న వెబ్‌సైట్లను Which? గుర్తించింది. ఇది అమెజాన్ నియమనిబంధనలను ఉల్లంఘించటమే.

అమెజాన్

'లాయల్టీ పథకాలు’

ఈ రివ్యూ సేవల్లో 'ప్యాకేజీలు’ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఒక్కో రివ్యూ 5 పౌండ్ల నుంచి 15 పౌండ్ల వరకూ చెప్తున్నారు. అదే 50 రివ్యూల ప్యాకేజీ ధర 620 పౌండ్ల నుంచి మొదలువుతుంది. 1,000 రివ్యూల ప్యాకేజీ ధర 8,000 పౌండ్ల వరకూ చెప్తున్నారు.

తాము గుర్తించిన ఐదు రివ్యూ వెబ్‌సైట్లలో దాదాపు ఏడు లక్షల మందికి పైగా 'ఉత్పత్తి సమీక్షకులు (ప్రొడక్ట్ రివ్యూయర్లు) ఉన్నట్లు సూచిస్తున్నాయని Which? సంస్థ తెలిపింది.

ఈ ప్రొడక్ట్ రివ్యూయర్లకు ఉచితంగా కానీ, రాయితీతో కానీ ఉత్పత్తులు ఇవ్వటంతో పాటు.. కొన్ని పౌండ్ల నుంచి 10 పౌండ్లకు పైగా చిన్నమొత్తాల్లో చెల్లింపులు ఆఫర్ చేస్తున్నారు. వారు 'లాయలిటీ పథకాల’లో కూడా పాల్గొని ప్రీమియం వస్తువులు సంపాదించుకోవచ్చు.

అమెజాన్‌కు అనుమానం రాకుండా ఉండేలా రివ్యూలు ఎలా రాయాలి అనే సూచనలు కూడా సదరు వెబ్‌సైట్లు అందిస్తున్నాయని.. కొన్ని సందర్భాల్లో రివార్డులు అందుకోవటానికి అర్హత సాధించటానికి కొన్ని అర్హతలను కూడా నిర్దేశిస్తున్నాయని Which? సంస్థ వివరించింది.

కనీసం రెండు వాక్యాల నిడివి గల రివ్యూలు రాయటం, ఫొటోలు జతచేయటం వంటివి ఆ అర్హతలుగా ఉదహరించింది.

నకిలీ రివ్యూలను గుర్తించటం ఎలా?

  • సందేహించటం. ఇది అత్యుత్తమ ఆయుధం కావచ్చు. ముఖ్యంగా ఒక రకం ఉత్పత్తికి మిగతా వాటికన్నా అసాధారణ రీతిలో ఎక్కువ రివ్యూలు ఉన్నట్లయితే అనుమానించి తీరాల్సిందే.
  • మళ్లీ మళ్లీ చదవటం. పలు రివ్యూల్లో ఒకే విధమైన భాష ఉందేమో చూడాలి.
  • మనకు తెలియని బ్రాండ్లు. మీరు ఆ బ్రాండును గుర్తించకపోతే.. దానికి సొంతదైన సరైన వెబ్‌సైట్ ఉందేమో, అందులో స్పష్టంగా కాంటాక్టు వివరాలు ఉన్నాయేమో చూడాలి.
  • చాలా ఎక్కువగా ఫొటోలు, వీడియోలు ఉన్న ఉత్పత్తుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఫొటోలు, వీడియోలు జతచేయాలంటూ నకిలీ రివ్యూయర్లను విక్రేతలు ప్రోత్సహిస్తూ ఉంటారు.
ప్రతీకాత్మక చిత్రం

ఈ నకిలీ రివ్యూల విక్రయం అంశంపై అత్యవసరంగా దృష్టిసారించాలని కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (సీఎంఏ)ను Which? సంస్థలో గృహ ఉత్పత్తులు, సేవల విభాగం అధిపతి నటాలీ హిచిన్స్ కోరారు.

''ఇలాంటి అక్రమాలకు పాల్పడేవారి మీద తక్షణమే చర్యలు తీసుకుని, వినియోగదారులకు భద్రత కల్పించని వెబ్‌సైట్లను బాధ్యతవహించేలా చేయాలి’’ అని ఆమె డిమాండ్ చేశారు.

ఒకవేళ ఆ నియంత్రణ సంస్థ ఈ పని చేయలేకపోతే.. ఆన్‌లైన్ వినియోగదారుల భద్రతను బలోపేతం చేయటానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు.

Which? సంస్థ గతంలో నిర్వహించిన పరిశోధనలో.. నకిలీ రివ్యూలు, సానుకూల రివ్యూలు రాసేవారికి సదరు ఉత్పత్తులకు చెల్లించిన డబ్బులు తిరిగిఇస్తామని, కమిషన్లు ఇస్తామని ఆఫర్ చేస్తున్న డజన్ల కొద్దీ ఫేస్‌బుక్ గ్రూపులను గుర్తించింది.

ఆ పరిశోధన ఫలితంగా.. నకిలీ రివ్యూలు, తప్పుదోవ పట్టించే రివ్యూలను గుర్తించి, దర్యాప్తు చేసి, చర్యలు చేపడతామని ఫేస్‌బుక్, ఈబే సంస్థలు సీఎంఏతో ఒప్పందం చేసుకున్నాయి.

అమెజాన్, ఇతర ఆన్‌లైన్ మార్కెట్ వేదికలు.. తమ వెబ్‌సైట్లలో చొరబడుతున్న నకిలీ రివ్యూలను నిరోధించటానికి, ఉత్పత్తుల మీద రివ్యూల విశ్వసనీయతను పెంచటానికి మరింత కృషి చేయాలని హిచిన్స్ పేర్కొన్నారు.

ఇటువంటి అక్రమాలకు పాల్పడేవారిని గుర్తించి నివేదించటానికి ఇతర్ టెక్నాలజీ సంస్థలతో ఒప్పందం చేసుకున్నామని అమెజాన్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. అయితే ఆన్‌లైన్ రిటైలర్లు ఒంటరిగా ఈ పని చేయలేరని పేర్కొన్నారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Amazon fake reviews for sale online
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X