
వణికించిన జంట భూకంపాలు: రోడ్ల మీదికి జనం పరుగులు: 100 మందికిపైగా గాయాలు
జకర్తా: ఇండోనేషియాను జంట భూకంపాలు వణికించాయి. ఒకదాని వెంట ఒకటి చోటు చేసుకున్న ఈ భూకంపాలు స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. తీవ్రత స్థానికులను తీవ్ర అలజడికి గురి చేసింది. భయాందోళనలతో రోడ్ల మీదికి పరుగులు పెట్టేలా చేసింది. భూకంపాల ధాటికి పలు భవనాలు బీటలు వారాయి. ఒకట్రెండు చోట్ల నేలమట్టం అయ్యాయి. ఇప్పటిదాకా ప్రాణనష్టం సంభవించినట్లు వార్తలు రాలేదు. ఆస్తినష్టం చెప్పుకోదగ్గ స్థాయిలో చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తోన్నాయి.
ఇండోనేషియాలోని బుక్కింట్టింగ్గి రీజియన్‌లో అర్ధరాత్రి దాటిన తరువాత 1:22 నిమిషాలకు తొలి భూకంపం సంభవించింది. అనంతరం ఉదయం 9:43 నిమిషాలకు మరోసారి భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా రికార్డయింది. ఇండోనేషియా పశచిమ ప్రాంతంలోని బుక్కింట్టింగ్గి రీజియన్‌లో గల పుత్రజయ, క్లాంగ్, క్లాంగ్ వ్యాలీ, పెటాలింగ్ జయ, షా ఆలం ప్రాంతాల్లో దీని తీవ్రత కనిపించింది. స్థానికులు భయంతో రోడ్ల మీదికి పరుగులు పెట్టారు.

తూర్పు సుమత్ర ప్రావిన్స్, బుక్కిట్టింగ్గి రీజియన్ వాయవ్య దిశగా 66 కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాన్ని భూకంపం కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూమి ఉపరితలం నుంచి 12 కిలోమీటర్ల లోతున చోటు చేసుకున్న ఫలకాల కదలికల వల్ల భూమి కంపించినట్లు స్పష్టం చేసింది. సుమత్రా ప్రావిన్స్ సముద్ర తీరంలో ఉంటుందని, సునామీ భయాందోళనలు లేవని ఇండోనేషియా మెటెరియాలజీ-క్లైమెటాలజీ చీఫ్ ద్వికోరిట కర్ణావతి తెలిపారు.
భూకంపం తీవ్రతకు పలు భవనాలు ధ్వంసమైనట్లు వార్తలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటిదాకా ప్రాణనష్టం సంభవించనప్పటికీ. 105 మంది గాయపడినట్లు సమాచారం ఉందని కర్ణావతి చెప్పారు. వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. పశ్చిమ సులవేసి ప్రావిన్స్‌లో భూకంపం తీవ్రత అధికంగా నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ప్రావిన్స్‌లోని వెస్ట్ పాసనం జిల్లాలో చెప్పుకోదగ్గ స్థాయిలో భవనాలు ధ్వంసం అయ్యాయని చెప్పారు.