• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అంటార్కిటికా: దక్షిణ ధ్రువం ఎవరికి చెందుతుంది? తమదంటే తమదని చాలా దేశాలు ఎందుకు వాదిస్తున్నాయి?

By BBC News తెలుగు
|

అంటార్కిటికా

భూమిపై అత్యంత చల్లని, అత్యధిక వేగంతో గాలులు వీచే, ద్రవ రూపంలో నీరు అతి తక్కువగా ఉండే ఖండం అంటార్కిటికా. అందుకే ఈ ప్రాంతానికి చెందిన సొంత ప్రజలంటూ ఎవరూ ఉండరు.

అయితే, ప్రపంచంలో ఇది నాలుగో అతిపెద్ద ఖండం. ఆసియా, అమెరికా, ఆఫ్రికాల తర్వాతి స్థానం అంటార్కిటికాదే. అంతేకాదు ఎక్కువ మంది సొంతం చేసుకోవాలనుకునే ఖండం కూడా ఇదే.

14 మిలియన్ల చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఉండే ఈ ఖండంలో కొంత భాగం మాదంటే మాదని ఏడు దేశాలు పోటీపడుతున్నాయి.

వీటిలో ఈ ఖండానికి పొరుగునున్న అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ, న్యూజీలాండ్ లాంటి దేశాలు ఉన్నాయి.

మరోవైపు ఫ్రాన్స్, నార్వే, బ్రిటన్‌ లాంటి సుదూర ఐరోపా దేశాలు కూడా ఇక్కడి ప్రాంతాలపై తమకు సార్వభౌమాధికారం ఉందని చెబుతున్నాయి.

అంటార్కిటికాలో శాశ్వత స్థావరాన్ని ఏర్పాటుచేసి, సార్వభౌమాధికారం ప్రకటించిన తొలి దేశం అర్జెంటీనా. 1904లోనే అర్జెంటీనా ఇక్కడ స్థావరం ఏర్పాటుచేసింది. ఇప్పటికీ మనుగడలోనున్న అత్యంత పురాతన ద ఆర్కడాస్ బేస్ ఆ దేశానిదే.

దక్షిణ అమెరికాకు చెందిన అర్జెంటీనా.. అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలను తమ దక్షిణ ప్రావిన్స్‌లు టీర్రా డెల్ ఫ్యూగో, మాల్వినాస్, సౌత్ జార్జియా, సౌత్ సాండ్‌విచ్ ఐలాండ్స్‌కు కొనసాగింపుగా భావిస్తోంది.

అయితే, ఇక్కడున్న కొన్ని ద్వీపాలు బ్రిటన్ ఆధీనంలో ఉన్నాయి. దీంతో 1908లోనే ఈ ప్రాంతంపై సార్వభౌమాధికారం తమదేనని బ్రిటన్ ప్రకటించింది. అర్జెంటీనా చెబుతున్న ప్రాంతాలతోపాటు మరికొన్ని ప్రాంతాలపైనా బ్రిటన్ సార్వభౌమాధికారం ప్రకటించింది.

మరోవైపు 1940ల్లో ఈ ప్రాంతంపై చిలీ కూడా సార్వభౌమాధికారాన్ని ప్రకటించింది. చిలీ సార్వభౌమాధికారం ప్రకటించిన ప్రాంతాల్లో కొన్ని అర్జెంటీనా, బ్రిటన్ కింద ఉన్నాయి.

అంటార్కిటికా

అన్వేషణలో భాగంగా...

మరోవైపు 20వ శతాబ్దంలో తమ నావికుల అంటార్కిటికా అన్వేషణలో భాగంగా మరికొన్ని దేశాలు ఇక్కడున్న ప్రాంతాలపై సార్వభౌమాధికారం ప్రకటించాయి.

1911లో దక్షిణ ధ్రువానికి చేరిన తొలి నావికుడు రోల్డ్ అముండ్సెన్ అన్వేషణ పేరుపై ఇక్కడ కొన్ని ప్రాంతాలు తమవని నార్వే ప్రకటించింది.

మరోవైపు న్యూజీలాండ్, ఆస్ట్రేలియా కూడా బ్రిటిష్ నావికుడు జేమ్స్ క్లార్క్ రాస్ అన్వేషణ పేరు మీద కొన్ని ప్రాంతాలపై సార్వభౌమాధికారం ప్రకటించాయి. అప్పట్లో ఈ రెండు దేశాలూ కూడా బ్రిటన్ పరిపాలనలో ఉండేవి. బ్రిటన్ నుంచి స్వాత్రంత్ర్యం అనంతరం ఈ రెండు దేశాలు ఇక్కడ సార్వభౌమాధికారాన్ని ప్రకటించాయి.

మరోవైపు 1840లో తమ కమాండర్ జూలెస్ డ్యూమోంట్ డ్యూర్విల్ అన్వేషణ పేరు మీద కొన్ని ప్రాంతాలు తమకు చెందుతాయని ఫ్రాన్స్ వాదిస్తోంది.

అంటార్కిటికా

ఎవరికి చెందుతుంది?

సార్వభౌమాధికార ప్రకటనలు పక్కన పెడితే.. ఇక్కడ జర్మనీ, బ్రెజిల్, చైనా, అమెరికా, భారత్, రష్యా సహా 35 దేశాలు శాశ్వత స్థావరాలను ఏర్పాటుచేశాయి.

దక్షిణ ధ్రువంగా పిలిచే ఈ ప్రాంతం ఎవరికీ చెందదని చాలా దేశాలు చెబుతున్నాయి.

డిసెంబరు 1, 1959లో ఇక్కడ సార్వభౌమత్వం ప్రకటించిన ఏడు దేశాలతోపాటు మరో ఐదు దేశాలు (బెల్జియం, అమెరికా, జపాన్, దక్షిణాఫ్రికా, రష్యా) మధ్య ఒక ఒప్పందం(ద అంటార్కిటిక్ ట్రీటీ) కుదిరింది.

ముఖ్యంగా సైనిక పరమైన ఉద్రిక్తతలను అడ్డుకోవడమే లక్ష్యంగా, పచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ''ప్రపంచ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అంటార్కిటికాను శాంతియుత మార్గాల కోసమే ఉపయోగించుకుంటాం''అని దీనిలో పేర్కొన్నారు.

సార్వభౌమాధికార ప్రకటనలు పక్కనపెట్టి.. దీన్ని అంతర్జాతీయ పరిశోధనల కోసం ఉపయోగించుకుంటామని ఈ ఒప్పందంలో తీర్మానించారు.

ఇక్కడ అణు పరీక్షల నిర్వహణనూ నిషేధించారు. సైనిక పరమైన చర్యలపైనా ఆంక్షలు విధించారు. కేవలం పరిశోధనల నిమిత్తమే వీటిని అనుమతిస్తారు.

క్రమంగా ఈ ఒప్పందంపై 42 దేశాలు సంతకాలు చేశాయి. అయితే, వీటిలో 29 దేశాలు మాత్రమే ఇక్కడ పరిశోధన చేపడుతున్నాయి. కానీ అంటార్కిటికా భవిష్యత్‌ను నిర్ణయించే నిర్ణయాలు తీసుకోవడంలో ఈ దేశాలకు ఓటింగ్ హక్కులు ఉన్నాయి.

ముఖ్యంగా పరిశోధనయేతర కార్యకలాపాలపై నిషేధం విధించాలని అన్ని దేశాలూ తీర్మానించాయి.

అంటార్కిటికా

విలువైన సంపదకు నిలయం

మంచుతో కప్పివుండే ఈ ఖండంపై ప్రపంచ దేశాలకు ఎందుకు అంత ఎక్కువ ఆసక్తి? ఎందుకంటే ఈ మంచు కింద ఎంతో విలువైన సహజ సంపదలు ఉన్నాయి.

''భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఎక్కువగా ఇక్కడ దృష్టి సారించడానికి అదే కారణం''అని అంటార్కిటికాపై పరిశోధన చేసిన జర్నలిస్టు మాథ్యూ టెల్లర్ బీబీసీతో చెప్పారు.

అంటార్కిటికా ట్రీటీ ప్రకారం.. ఇక్కడ చమురు, ఖనిజాల వెలికితీత నిషేధం. అయితే శాస్త్రీయ అవసరాల కోసం ఇక్కడ పరిశోధనలు చేపట్టొచ్చు.

అంటార్కిటికా కింద దాదాపు 2 లక్షల మిలియన్ బ్యారెళ్ల చమురు ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయని టెల్లర్ వివరించారు.

''ఇది కువైట్, అబుధాబిల దగ్గర ఉన్నదాని కంటే చాలా ఎక్కువ''అని ఆయన చెప్పారు.

అంటార్కిటికా

అయితే, వీటిని అన్వేషించడం ఇప్పుడు కుదరదు. ఎందుకంటే నిషేధం అమలులో ఉంది. మరోవైపు వీటిని వెలికి తీయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని.

ఎందుకంటే ఇది ఆర్కిటిక్‌లా కేవలం మంచు ఫలకాలతో లేదు. ఇక్కడ భారీ శిలలు ఉన్నాయి.

మరోవైపు మంచు ఫలకాలు కూడా నాలుగు కి.మీ. కంటే ఎక్కువ లోతు వరకు ఉంటాయి.

చమురు, సహజ వాయువుతోపాటు ఇక్కడ బొగ్గు, సీసం, ఉక్కు, క్రోమియం, కాపర్, బంగారం, నికెల్, ప్లాటినం, యురేనియం, సిల్వర్ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.

మరోవైపు అంటార్కిటిక్ సముద్రం కూడా భారీ మత్స్య సంపదకు నిలయం. ఇక్కడ చేపల వేటను కమిషన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ అంటార్కిటిక్ మెరీన్ లివింగ్ రిసోర్సెస్ నియంత్రిస్తూ ఉంటుంది.

2016లో 1.6 మిలియన్ చదరపు కి.మీ. సముద్ర ప్రాంతంపై హక్కుల కోసం యూఎన్ కమిషన్ ఆన్ లిమిట్స్ ఆఫ్ ధ కాంటినెంటల్ షెల్ఫ్ (సీఎల్‌పీసీ)ని అర్జెంటీనా ఆశ్రయించింది. హక్కులను కూడా పొందింది.

అంటార్కిటికా

మంచినీటికి నిలయం

ప్రస్తుతం అందరూ మంచు ఫలకాలు, సముద్రం కింద ఖనిజ సంపదపై దృష్టి సారిస్తున్నారు. అయితే, అంతకంటే విలువైన మంచి నీటికి ఈ ఖండం నిలయం.

అంటార్కిటాపై గడ్డకట్టిన మంచు రూపంలో.. ప్రపంచంలో ఎక్కడా లేనంత మంచి నీరు ఉంది. భవిష్యత్‌లో ఇది బంగారం కంటే విలువైన వనరుగా మారుతుందనడంలో సందేహం లేదు.

భూమిపై నుండే మంచి నీటిలో 70 శాతం అంటార్కిటికాలోనే ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. ఎందుకంటే భూమిపై 90 శాతం మంచు ఇక్కడే ఉంది.

ఉపరితలంపై కనిపిస్తున్న నదులు, సరస్సుల కంటే భూమిలోపల చాలా మంచి నీరు ఇక్కడ గడ్డకట్టి ఉంది.

మరోవైపు నిర్మలంగా ఉండే ఇక్కడి ఆకాశంలో ఎలాంటి రేడియో సంకేతాల అవరోధాలు ఉండవు. అంతరిక్ష పరిశోధనలకు, ఉపగ్రహాలపై నిఘా పెట్టేందుకు ఇది చాలా మంచి ప్రాంతం.

''రహస్యంగా సమాచారాన్ని సేకరించేందుకు, ఇతర దేశాలపై నిఘా పెట్టేందుకు ఇక్కడి ప్రాంతాలను ఉపయోగించుకునే ముప్పుంది''అని టెల్లర్ వివరించారు.

ఇక్కడ చైనా ఏర్పాటుచేసిన తియాషన్ స్థావరాన్ని నిఘా కోసం ఉపయోగించుకుంటున్నారని ఆస్ట్రేలియా 2014లోనే ఆరోపించింది.

ఇన్ని సహజ వనరులకు నిలయం కాబట్టే.. ఈ ప్రాంతం మాదంటే మాదని చాలా దేశాలు సార్వభౌమాధికారాన్ని ప్రకటిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
To whom does the South Pole belong? Why do so many countries claim to be their own
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X