వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అర్మేనియా-అజర్‌బైజాన్: శత్రు దేశం రక్షణ వ్యవస్థ కళ్లుగప్పి దాడులు చేస్తున్న డ్రోన్లు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

అజర్‌బైజాన్, అర్మేనియాల మధ్య రష్యా జోక్యంతో శనివారం కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే, ఆ తరువాత కూడా కాల్పులు కొనసాగుతున్నాయని.. ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.

కాల్పుల విరమణకు ముందు వివాదాస్పద నగార్నో-కరాబక్ ప్రాంతంలో ఒకరిపై ఒకరు చేసుకున్న దాడులు యుద్ధ తీవ్రతను ప్రపంచానికి చూపాయి.

అర్మేనియా యుద్ధ సాధనాలపై దాడులు చేస్తున్న అజర్‌బైజాన్ డ్రోన్ల వీడియోలు బయటకొచ్చాయి.

రెండు దేశాల మధ్య మూడు దశాబ్దల తరబడి జరుగుతున్న ఘర్షణలు ఇటీవల ఒక్కసారిగా పెరిగిపోయాయి.

యుద్ధానికి సంబంధించిన ఫోటోలను చూస్తుంటే టర్కీకి చెందిన బయ్రాక్‌తర్ డ్రోన్లను కూడా అజర్‌బైజాన్ ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నిఘా డ్రోన్లు తీస్తున్న చిత్రాలను అజర్‌బైజాన్ రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తోంది. దీనిలో కామికాజే డ్రోన్లు కూడా కనిపిస్తున్నాయి. నిర్దేశించిన లక్ష్యాలపై బాంబులతో ఈ డ్రోన్లు దాడులు చేస్తున్నాయి.

రెండు దేశాలూ తమ ఆయుధ సంపత్తిని విపరీతంగా పెంచుకుంటున్నాయి. అర్మేనియాతో పోలిస్తే.. అజర్‌బైజాన్ ఎక్కువగా ఆయుధాలను సిద్ధంచేసింది. అధునాతన డ్రోన్లు దీనిలో ప్రధానమైనవి.

బయ్రాక్‌తర్ డ్రోన్లు

బయ్రాక్‌తర్ డ్రోన్లు

ఈ యుద్ధంలో టర్కీకి చెందిన బయ్రాక్‌తర్ టీబీ2 డ్రోన్లపై చాలా చర్చ జరుగుతోంది. నగార్నో-కరాబక్ ప్రాంతంపై జరుగుతున్న వైమానిక దాడుల చిత్రాలను అజర్‌బైజాన్ రక్షణ శాఖ విడుదల చేస్తోంది. ఇవన్నీ బయ్రాక్‌తర్ టీబీ2 సాయంతో తీసినవేనని నిపుణులు చెబుతున్నారు.

ఈ డ్రోన్లను టర్కీ సంస్థ బయ్రాక్‌తర్ అభివృద్ధి చేసింది. వీటిని చాలా దూరం నుంచే నియంత్రించొచ్చు. పరిసరాలపై నిఘా పెట్టేందుకు, దాడులు చేసేందుకు వీటిని ఉపయోగించొచ్చు.

డ్రోన్ల మార్కెట్‌లో ఈ టీబీ2కు ప్రత్యేక స్థానముంది. లిబియాలోని ఖలీఫ్ హఫ్తార్ తిరుగుబాటు దళాలపై టర్కీ వీటిని ఉపయోగించింది. సిరియాలో గత ఫిబ్రవరిలో నిర్వహించిన ఆపరేషన్ స్ప్రింగ్ షీల్డ్‌లోనూ వీటిని ఉపయోగించింది.

ఈ డ్రోన్లను ఉక్రెయిన్‌కు టర్కీ విక్రయించింది. మరోవైపు సెర్బియా కూడా వీటిని కొనడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు అక్టోబరు 6న టర్కీకి చెందిన అనడోలు వార్తా సంస్థ తెలిపింది.

అజర్‌బైజాన్ విడుదల చేస్తున్న చిత్రాలు, దృశ్యాలను టీబీ2నే తీసిందని నిపుణులు చెబుతున్నప్పటికీ.. ఈ విషయంలో ఎలాంటి స్పష్టతాలేదు. అజర్‌బైజాన్ వీటిని ఎప్పుడు కొనుగోలు చేసిందో ఎలాంటి సమాచారమూ అందుబాటులో లేదు.

కొన్ని టర్కీ డ్రోన్లను కొనుగోలు చేశామని అక్టోబరు 5న అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీవ్ తెలిపారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి పత్రాలనూ ఆయన విడుదల చేయలేదు. కొన్ని కొత్త డ్రోన్లు త్వరలో తమ అమ్ముల పొదిలోకి చేరబోతున్నాయని గత జూన్‌లో ఆ దేశ రక్షణ శాఖ చెప్పింది.

అజర్‌బైజాన్ ఈ డ్రోన్లను రహస్యంగా సమీకరించుకుని ఉండొచ్చని లేదా తాజా ఘర్షణలకు కొన్ని రోజుల ముందే వీటిని కొనుగోలు చేసి ఉండొచ్చని రష్యా జర్నల్ ఆర్మ్స్ ఎక్స్‌పోర్ట్స్ ఎడిటర్ ఆండ్రేయ్ ఫ్రోలోవ్ వ్యాఖ్యానించారు.

చైనా డ్రోన్లు

సంకీర్ణ స్ఫూర్తికి తూట్లు

టర్కీ డ్రోన్ల వినియోగంపై స్పష్టమైన సమాచారం అందుబాటులో లేకపోవడంతో వేరే దేశం సాంకేతికతనూ ఉపయోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు టర్కీకి సాంకేతికత బదిలీని నిలిపివేస్తున్నట్లు సోమవారం కెనడా ప్రకటించింది.

నగార్నో కరాబక్ ప్రాంతంలో టర్కీ డ్రోన్లను ఉపయోగిస్తున్నారనే ఆరోపణల నడుమ కెనడా ఈ నిర్ణయం తీసుకుంది.

నగార్నో కరాబక్ ప్రాంతంలో తీస్తున్న డ్రోన్ల చిత్రాలు, వీడియోలను చూస్తుంటే కెనడా రక్షణ సాంకేతిక సంస్థ ఎల్3హ్యారిస్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసిన సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు అనుమానం వస్తోందని కెనడాకు చెందిన ప్లౌషేర్స్ సంస్థ తెలిపింది.

కెనడా తీసుకుంటున్న చర్యలపై టర్కీ స్పందించింది. ద్వంద్వ విధానాలను అనుసరిస్తున్నారని, సైనిక సంకీర్ణ స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారని వ్యాఖ్యానించింది.

విమాన విధ్వంసక వ్యవస్థను టార్గెట్ చేసిన డ్రోన్(అజర్‌బైజాన్ విడుదల చేసిన చిత్రం)

అంతా డ్రోన్లే..

ప్రస్తుత యుద్ధంలో చాలారకాల డ్రోన్లను అజర్‌బైజాన్ సైన్యం ఉపయోగిస్తోంది. అమెరికాలోని సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ ద డ్రోన్స్ సమాచారం ప్రకారం.. వారి దగ్గర ఇజ్రాయెల్‌కు చెందిన రెండు హెరాన్ టీపీ డ్రోన్లు, పది హెర్మ్స్ 4507, 100 స్కై స్ట్రైకర్లు, 50 హెరోప్ డ్రోన్లు ఉన్నాయి.

ఇజ్రాయెల్, అజర్‌బైజాన్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఆజాద్ సిస్టమ్స్ సంస్థ ఏరోస్టార్ నిఘా డ్రోన్లు, కామికాజే ఆర్బిటర్ 1కే, ఆర్బిటర్ 3లను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం సుదూర ప్రాంతాలపై దాడి చేయగలిగే రెండు హెర్మ్స్ డ్రోన్లను అజర్‌బైజాన్ తీర గస్తీ దళం మోహరించింది.

తాజా యుద్ధానికి, ఇదివరకు జరిగిన ఘర్షణలకు ప్రధాన తేడా ఏమిటంటే.. డ్రోన్ల వినియోగమేనని కింగ్స్ కాలేజీ లండన్‌లోని సైనిక పరిశోధకుడు రాబ్ లీ.. బీబీసీ రష్యాకు తెలిపారు. ఇదివరకు అజర్‌బైజాన్ కేవలం ఆత్మాహుతి డ్రోన్లు అయిన కామికాజీ డ్రోన్లను మాత్రమే ఉపయోగించేది.

అర్మేనియా విడుదల చేసిన ఓ వీడియోలో ఒక విమానాన్ని క్షిపణి ఢీకొడుతూ కనిపిస్తోంది. ఈ విమానాన్ని చూస్తుంటే సోవియట్ కాలంనాటి యాన్2 బైప్లేన్ గుర్తుకువస్తోంది. ఇది రక్షణ సదుపాయాల కళ్లుగప్పే డ్రోన్ అయ్యుండొచ్చని వార్తలు వస్తున్నాయి.

A map of the region

అర్మేనియా కొనుగోలు చేయట్లేదు

రష్యా నిపుణడు ఆండ్రేయ్ ఫ్రోలోవ్ సమాచారం ప్రకారం.. ఇటీవల కాలంలో అర్మేనియా ఎలాంటి డ్రోన్లనూ కొనుగోలు చేయలేదు. ఎందుకంటే అజర్‌బైజన్ డ్రోన్లను అర్మేనియా చాలా తక్కువగా అంచనా వేసింది.

''డ్రోన్లను కొనుగోలు చేసే ప్రణాళికలేవీ అర్మేనియా నుంచి బయటకు రాలేదు. రష్యా వైపు నుంచి ఎలాంటి సమాచారం వెల్లడి కాలేదు. అంటే చైనా లేదా ఇరాన్ నుంచి వారు కొనుగోలు చేయాలి. అయితే ఈ వ్యవహారమంతా చాలా డబ్బులతో కూడుకున్న పని. రష్యా నుంచి కొనుగోలు చేస్తే.. వారికి రుణాలు అందుతాయి. చైనా వైపు నుంచి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు వారు సొంతంగా కొత్త డ్రోన్లు అభివృద్ధి చేస్తున్నట్లు ఎలాంటి సమాచారమూ లేదు’’

క్రంక్ నిఘా డ్రోన్లు అర్మేనియా అభివృద్ధి చేస్తుంది. అయితే నగార్నోకరాబక్ ప్రాంతంలో ఇవి ఎన్ని పనిచేస్తున్నాయో స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు.

స్పల్ప దూరాల్లో లక్ష్యాలను ఛేదించగలిగే ఉపరితల క్షిపణులను రష్యా నుంచి అర్మేనియా కొనుగోలు చేసింది. ఇవి డ్రోన్లపై బాగా పనిచేస్తాయి. అయితే ఇప్పుడు వాటిని మోహరించినట్లు ఎలాంటి వార్తలూ రావడం లేదు.

సోవియట్ కాలంనాటి ఓసా, స్ట్రెలా ఉపరితల క్షిపణులను నగార్నో కరాబక్ ప్రాంతంలో మోహరించారు. ఇవి కొన్ని అజర్‌బైజాన్ డ్రోన్లను నేల కూల్చాయి.

డ్రోన్‌పై దాడి చేస్తున్న మరో డ్రోన్

అజర్‌బైజాన్‌కు డ్రోన్లు సాయం చేస్తున్నాయా?

అర్మేనియా ప్రాంతాలపై భారీ స్థాయిలో దాడులు చేస్తున్న డజన్ల కొద్దీ డ్రోన్ల వీడియోలను అజర్‌బైజాన్ విడుదల చేస్తోంది.

ముఖ్యంగా ఆయుధాలను తరలించే వాహనాలు, ఆయుధాగారాలు, సైనిక సిబ్బందిపై ఈ దాడులు జరుగుతున్నాయి.

ఓసా, స్ట్రెలా క్షిపణి ప్రయోగ వేదికలపైనా దాడులు చేస్తున్నారు.

నగార్నో కరాబక్ ప్రాంతంలో ఎన్ని క్షిపణి ప్రయోగ వేదికలను మోహరించారు? ప్రస్తుతం ఎన్నింటిపై దాడులు జరిగాయి? లాంటి వివరాలు బయటకు తెలియడం లేదు.

ఓసా, స్ట్రెలా క్షిపణి ప్రయోగ వేదికలు.. సాయుధ డ్రోన్ల దాడికి తట్టుకొని నిలువలేకపోవచ్చు.

''ఓసా, స్ట్రెలా క్షిపణి ప్రయోగ వేదికలపై చాలా డ్రోన్లు దాడులు చేస్తున్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది. ఈ క్షిపణి ప్రయోగ వేదికలను పోరాట హెలికాప్టర్లు, యుద్ధ విమానాలపై పోరాటనికి సిద్ధంచేశారు. ఇవి టీబీ2లను గుర్తించడం కొంచెం కష్టమే. ఎందుకంటే టీబీ2లు చిన్నవిగా ఉంటాయి. కరాబక్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఇవి చెలరేగుతున్నాయి’’అని రాబ్ లీ చెప్పారు.

అర్మేనియాతో పోలిస్తే.. నగార్నో-కరాబక్ ప్రాంతంలోని రక్షణ వ్యవస్థలు చాలా బలహీనమైనవని రష్యా సైనిక నిపుణుడు విక్టర్ ముక్రాఖోవ్‌స్కీ చెప్పారు. కాలం చెల్లిన, కచ్చితత్వంతో పనిచేయని రాడర్లను ఇక్కడ మోహరించారని, వీటిపై డ్రోన్లు తేలిగ్గా దాడులు చేయొచ్చని వివరించారు.

''ఇంకా అసలైన ఆయుధాలు, పోరాట హెలికాప్టర్లు, పోరాట యుద్ధ విమానాలను అజర్‌బైజాన్ బరిలోకి దించలేదు’’

కరాబక్ ప్రాంతంలోని సైనిక సదుపాయాలపై దాడి చేస్తున్న డ్రోన్ల వీడియోలపై సోషల్ మీడియాలో చాలా చర్చ జరుగుతోంది.

అయితే ఆ వీడియోలను చూసి ఓ అవగాహనకు రాకూడదని విక్టర్ అంటున్నారు. దాడులు చేయడంలో విఫలమైన డ్రోన్ల చిత్రాలు, వీడియోలను వారు విడుదల చేయరని ఆయన వివరించారు.

డ్రోన్

డ్రోన్లను తట్టుకొని నిలబడొచ్చు..

డ్రోన్ల వల్ల అర్మేనియా వైపు తీవ్రమైన నష్టం సంభవించి ఉండొచ్చని లండన్‌కు చెందిన సైనిక వ్యవహారాల నిపుణుడు రాబ్ లీ వివరించారు. ''అయితే, టీబీ2 డ్రోన్లతో అజర్‌బైజాన్ వ్యూహాత్మక విజయం సాధించిందని చెప్పలేం’’అని ఆయన వ్యాఖ్యానించారు.

యుద్ధాల్లో దాడులు చేయడంలో డ్రోన్లు క్రియాశీల పాత్ర పోషిస్తున్న మాట వాస్తవమే అయిన్పటికీ.. వాటిని అడ్డుకొనే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయని విక్టర్ చెప్పారు. సిరియాలోని కొన్ని పోరాట దళాలు ఇప్పటికే డ్రోన్ల దాడుల నుంచి తప్పించుకొనే మార్గాలను అన్వేషించినట్లు ఆయన వివరించారు.

''సాయుధ వాహనాలు, పేలుడు పదార్థాలు, ఆయుధాల నిల్వల కోసం వారు భూగర్భంలో నిర్మాణాలు తయారుచేస్తున్నారు. డ్రోన్లను నిలువరించే కొత్తకొత్త ఆయుధ వ్యవస్థలను కరాబక్ కొనుగోలు చేయలేకపోవచ్చు. కానీ ఇలాంటి భూగర్భ నిర్మాణాలను తేలిగ్గా నిర్మించొచ్చు’’

కొన్నిసార్లు డమ్మీ ఆయుధాల నిల్వలు తయారుచేసి డ్రోన్లను బురిడీ కొట్టించొచ్చు. అజర్‌బైజాన్ విడుదల చేసిన ఒక వీడియోలో ఒక డమ్మీ ఉపరితల క్షిపణి వ్యవస్థపై డ్రోన్ దాడిచేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Armenia-Azerbaijan: Drones carrying out blind attacks on enemy defense system
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X