భారత సంతతి చెఫ్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్న ఆస్ట్రియా యువరాణి ఆకస్మిక మృతి
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన చెఫ్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్న ఆస్ఠ్రియా యువరాణి మరియా గాలిట్జీన్(31) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. మే 4న హూస్టన్ నగరంలోని వారి నివాసంలోనే జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రేమ పెళ్లి..
కాగా స్థానిక పత్రికల్లో వచ్చిన సంతాప ప్రకటనల ద్వారా ఈ విషయం బయటికి తెలిసింది. యువరాణి మరియా గాలిట్జీన్ 2017లో హూస్టన్‌లో ఉంటున్న భారత సంతతికి చెందిన చెఫ్ రిషి రూప్ సింగ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రిన్స్ పీటర్ గాలిట్జీన్, ప్రిన్సెస్ మరియా అన్నా కుమార్తె అయిన మరియా గాలిట్జీన్.. ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తుండేవారు.

యాపిల్ లాంటి కొడుకు..
అయితే, అక్కడే చెఫ్‌గా పనిచేస్తున్న రిషి రూప్ సింగ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడం వివాహ బంధంతో వారిద్దరూ ఒక్కటయ్యారు. మరియా గాలిట్జీన్-రూప్ సింగ్ దంపతులకు రెండేళ్ల కుమారుడు మాక్సిమ్ ఉన్నాడు. కాగా, యువరాణి గత కొంత కాలంగా తన ఫేస్బుక్ పేజీని కుమారుడి ఫొటోలతో నింపేస్తుండేవారు. తన కుమారుడు మాక్సిమ్ తనకు యాపిల్ పండులా కనిపిస్తున్నాడని ఆ యువరాణి తన పోస్టుల్లో వ్యాఖ్యానించారు.

ఇంటీరియర్ డిజైనర్‌గా యువరాణి..
1988లో లగ్జంబర్గ్‌లో ఆస్ట్రియా ప్రిన్సెస్ మరియా అన్నా, ప్రిన్స్ పీటర్ గాలిట్ీజన్ దంపతులకు మరియా గాలిట్జీన్ జన్మించారు. యువరాణి మరియాకు ముగ్గురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నారు. యువరాణి మరియాకు ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడే వారి కుటుంబం రష్యాకు మకాం మార్చింది. అక్కడే గ్రాడ్యూయేషన్ పూర్తి చేసుకున్న మరియా.. ఆర్ట్ అండ్ డిజైన్ కాలేజీలో చేరేందుకు బెల్జియంకు వెళ్లారు. ఆ తర్వాత బ్రస్సెల్స్, చికాగో, ఇల్లినాయిస్, హూస్టన్ నగరాల్లో ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేశారు.