బీర్లు తాగి పసికందు పక్కన పడుకున్న తల్లి: తెల్లారేసరికి పాప మృతి, నేరం కాదంటూ కోర్టు
న్యూయార్క్: ఓ బాలింత మహిళ బీరు తాగింది. ఆ తర్వాత తన పాప పక్కన పడుకుంది. అంతకుముందు ఆ పసికందుకు పాలు పట్టి, డైపర్ కూడా మార్చింది. తలుపులు వేసి ఆ పాప పక్కన పడుకుంది. పసికందుతోపాటు మరో నాలుగేళ్ల కూతురు కూడా అక్కడే పడుకుంది. అయితే, తెల్లారేసరికి ఆ పసికందు ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన అమెరికాలోని మేరీలాండ్‌లో చోటు చేసుకుంది.

మద్యం వాసనతో ఊపిరాడక పసికందు మృతి..
వివరాల్లోకి వెళితే.. మేరీల్యాండ్‌కు చెందిన మురియల్ మోరీసన్ అనే మహిళ వర్చువల్ పార్టీలో రెండు మూడు బీర్లు తాగింది. ఇతర మద్యం కూడా సేవించింది. ఆ తర్వాత ఇంటికి వచ్చి తన నాలుగేళ్ల కూతురితోపాటు మరో నెలల కూతురు వద్దకు వచ్చి పడుకుంది. తెల్లారేసరికి పాప రంగు మారింది. కదలని స్థితిలోకి వెళ్లింది. ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పాప మృతి చెందిందని తెలిపారు. కాగా, తల్లి నుంచి వచ్చిన మద్యం వాసనతో ఊపిరాడక ఆ పాప మరణించిందని తేల్చారు.

నేరం కాదంటూ కోర్టు..
ఈ క్రమంలో మురియల్పై కేసు నమోదైంది. అయితే, తల్లి నిర్లక్ష్యం కారణంగానే బిడ్డ మృతి చెందిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఆమె ఎలాంటి నేరానికి పాల్పడలేదని కోర్టు అభిప్రాయపడింది. అంతేగాక, బీరు వాసన వల్ల ఊపిరాడక మరణిస్తారనే విషయం ఎక్కడా లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో మురియల్ మోరీసన్ జైలు శిక్షను తప్పించుకున్నారు. 2013లో 20ఏళ్ల జైలు శిక్ష విధించగా.. తాజాగా ఆ శిక్షను కోర్టు సస్పెండ్ చేసింది.

ఏడాదికి 3500 మంది పసికందులు మృతి..
కాగా, ప్రతి సంవత్సరం అమెరికాలో ఇలా తల్లులు మద్యం సేవించి పిల్లల వద్ద పడుకోవడం వల్ల 3500 మంది చిన్నారులు మరణిస్తుండటం గమనార్హం. ఈ విషయాన్ని గమనించిన అమెరికా ఆరోగ్య భద్రతా నిపుణులు.. తల్లిదండ్రులు మద్యం సేవించినప్పుడు తమ చిన్న పిల్లల వద్ద పడుకోకూడదని పేర్కొంటున్నారు. అలాంటి సమయంలో పిల్లలను వేరే ఊయలల్లో వేసి పడుకోబెట్టాలని సూచిస్తున్నారు.