• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శ్రీలంకలో భారత్‌కు ఎదురుదెబ్బ.. చైనా వ్యూహమే కారణమా?

By BBC News తెలుగు
|

ఈస్ట్ కంటైనర్ టెర్మినల్

ఇటీవల కాలంలో భారతదేశానికి ఇరుగు పొరుగు దేశాలతో ఉన్న సంబంధాలలో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి.

పాకిస్తాన్, చైనా, నేపాల్.. ఇప్పుడు శ్రీలంకతో సమస్యలు ఎదురవుతున్నాయి.

శ్రీలంకలో ఓడరేవులను ప్రైవేటీకరణ చేయడంపై నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. కొలొంబో పోర్ట్‌లో ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ (ఈసీటీ) అభివృద్ధి చేసేందుకు జరిగిన త్రైపాక్షిక ఒప్పందంనుంచీ శ్రీలంక వెనకడుగు వేసింది.

2019లో శ్రీలంక రాష్ట్రపతి మైత్రీపాల సిరిసేన, ప్రధాని రణిల్‌ విక్రమసింఘే హయాంలో ఈ ఈసీటీ నిర్మాణానికి సంబంధించిన త్రైపాక్షిక ఒప్పందంపై భారత్, జపాన్, శ్రీలంక సంతకం చేసాయి.

ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో 51 శాతం శ్రీలంకకు, 49 శాతం వాటా భారత్, జపాన్లకు ఉంది.

శ్రీలంకలో జరుగుతున్న నిరసనల సందర్భంగా.. ఈసీటీలో 100 శాతం వాటా శ్రీలంక పోర్ట్ అథారిటీ చేతిలోనే ఉంటుందని శ్రీలంక ప్రస్తుత ప్రధాని మహిందా రాజపక్స సోమవారం కార్మిక సంఘాలకు తెలిపినట్లు మీడియాలో రిపోర్టులు వచ్చాయి.

అనంతరం, శ్రీలంక, భారత్‌తో ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈస్ట్ కంటైనర్ టెర్మినల్

ఈస్ట్ కంటైనర్ టెర్మినల్ ఎందుకంత ముఖ్యం?

వ్యూహాత్మకంగా ఈ ఈసీటీ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. కొలొంబోకు సమీపంలో ఉన్న ఈ ఓడరేవు ద్వారా ఆ ప్రాంతంలోని 70 శాతం వ్యాపారం జరుగుతుంది. పొరుగునే ఉన్న కారణంగా భారత్ కూడా ఈ రవాణా సౌకర్యాన్ని అధికంగా ఉపయోగించుకుంటుంది.

అయితే, ఇప్పుడు భారత్ సహాయంతో ఈస్ట్ కంటైనర్ టెర్మినల్‌కు బదులు వెస్ట్ కంటైనర్ టెర్మినల్ నిర్మించాలని శ్రీలంక ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్ట్‌ను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం తరహాలో భారత్, జపాన్లతో కలిసి చేపట్టాలని శ్రీలంక భావిస్తోంది. ఈ కొత్త ప్రతిపాదన పట్ల భారత్ ఇప్పటివరకూ ఎలాంటి ఉత్సాహం కనబర్చలేదు.

మోదీతో రాజపక్స

శ్రీలంక అంతర్గత రాజకీయాలు

ఇటీవల 'వ్యాక్సీన్‌ మైత్రి’ కింద ఇండియా, శ్రీలంకకు 50 వేల డోసుల కరోనా వ్యాక్సీన్ సరఫరా చేసింది. ఈ సందర్భంగా శ్రీలంక ప్రభుత్వం భారతదేశంపై అనేక ప్రశంశలు కురిపించింది.

ఇదే సందర్భంలో, శ్రీలంక తమకు నమ్మకమైన మిత్రదేశమని భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ పేర్కొన్నారు.

ఇరు దేశాల మధ్య ఇంత మంచి స్నేహ సంబంధాలు కొనసాగుతున్న సమయంలో శ్రీలంక ఈసీటీ ఒప్పందాన్ని ఎందుకు ఉపసంహరించుకోవాలని అనుకుంటోంది?

దీని వెనుక శ్రీలంక అంతర్గత రాజకీయాలు, అందులో ట్రేడ్ యూనియన్ పాత్ర ఉన్నాయని చెన్నైలోని ఆక్స్‌ఫర్డ్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన సత్యమూర్తి అంటున్నారు.

"శ్రీలంకలో అన్ని ప్రభుత్వాలూ ట్రేడ్ యూనియన్‌తో గొడవలు పెట్టుకోవాలని అనుకోవు. ట్రేడ్ యూనియన్‌కు అక్కడ మంచి రాజకీయ పలుకుబడి ఉంది. రాజకీయలలో వారు అసంతృప్తి కనబరిస్తే, ఏ పార్టీ అయినా సరే, దానివలన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. అయితే, కొన్ని పార్టీలు ట్రేడ్ యూనియన్‌ను ఎక్కువ పట్టించుకుంటాయి. కొన్ని పట్టించుకోవు. గత ప్రభుత్వం దీనికి అంత ప్రాముఖ్యతను ఇవ్వలేదు అందుకే ఈ త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేసింది. కానీ వారి హయాంలో ఈ ప్రాజెక్ట్ పని మొదలవ్వలేదు" అని ఆయన అన్నారు.

ఇప్పుడు, ఈ ప్రాజెక్ట్ విషయంలో ట్రేడ్ యూనియన్ నుంచీ వ్యతిరేకత వస్తున్నప్పుడు, ప్రస్తుత ప్రభుత్వం రిస్క్ తీసుకోడానికి సిద్ధంగా లేదని నిపుణులు అంటున్నారు.

శ్రీలంక భారత్‌తో ఈ ఒప్పందం రద్దు చేసుకోవడం వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయని సీనియర్ జర్నలిస్ట్ టీఆర్ రామచంద్రన్ భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా భారత్‌కు చెందిన తమిళ్, శ్రీలంక సింహళ సమాజాల మధ్య ఉన్న గొడవలు ఒక ముఖ్య కారణమని ఆయన అంటున్నారు.

"తమిళ సమాజాన్ని అక్కడ మైనారిటీలుగా పరిగణిస్తారు. భారతదేశం నుంచీ వచ్చే ఏ సహాయాన్నైనా.. పెరుగుతున్న ఆధిపత్యానికి సూచికగా అక్కడి స్థానిక ప్రజలు భావిస్తారు. అందుకే అక్కడి పోర్ట్ యూనియన్ సభ్యులు ఈ ప్రాజెక్ట్ విషయంలో భారత్ హస్తం ఉండకూడదని భావిస్తున్నారు. పోర్ట్ యునియన్లో తమిళుల ప్రాతినిధ్యం ఉన్నప్పటికీ, నిర్ణయాధికారం సింహళుల చేతిలోనే ఉంటుంది. గత రెండు నెలలుగా ఓడరేవుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద గొంతులు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ పలు సమస్యలను ఎదుర్కుంటోంది" అని రామచంద్రన్ తెలిపారు.

ఇదంతా చూస్తుంటే, ఈ గొడవలు తమ కుర్చీకే ఎసరు పెట్టే ప్రమాదం ఉందని పాలక ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తోస్తోంది. ట్రేడ్ యూనియన్ మాత్రమే కాకుండా ఇప్పుడు సాధారణ ప్రజలు కూడా వారితో జతకట్టి నిరసనలు తెలుపడంతో ప్రస్తుత ప్రభుత్వం చిక్కుల్లో పడింది.

చైనా జోక్యం

శ్రీలంకపై చైనా నుంచీ వస్తున్న ఒత్తిడి మరో కారణమని రామచంద్రన్ అభిప్రాయపడ్డారు.

"శ్రీలంకలో చైనా జనాభా ఎంతగా పెరిగిపోతోందంటే మరో 15-20 సంవత్సరాలలో మొత్తం చైనీయులతో నిండిపోతుంది అనిపిస్తోంది. శ్రీలంకలో చైనా ప్రోజెక్టులు అనేకం నడుస్తున్నాయి. వేటిల్లోనూ చైనాను దూరం పెట్టలేదు. ఇది తనను తానుగా ఆ దేశం ఆలోచించుకోవలసిన విషయం.

ఇది చైనా రాజకీయ వ్యూహం. చిన్న దేశాలకు విపరీతంగా అప్పులు ఇస్తూ ఉంటే, చివరకు వారు కాలనీలుగా మారిపోవలసి వస్తుంది. ఇంక చిన్న దేశాలను తమ స్వంత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, అధికారం ఉండదు.

ఉదాహరణకు హంబన్‌టోటా ఓడరేవునే తీసుకోండి. శ్రీలంక, చైనా అప్పు తీర్చడంలో విఫలమైన కారణంగా హంబన్‌టోటా ఓడరేవును చైనాకు చెందిన మర్చంట్ పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్ కంపెనీకి 99 సంవత్సరాలు లీజుకు ఇచ్చింది. 2017లో ఈ ఓడరేవును ఆ కంపెనీకి 1.12 బిలియన్ డాలర్లకు అప్పగించింది. దీనితో పాటుగా, సమీపంలో ఉన్న 15 వేల ఎకరాల భూమిని చైనాకు ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు కోసం ఇచ్చింది" అని రామచంద్రన్ అన్నారు.

ప్రస్తుత శ్రీలంక ప్రభుత్వానికి చైనాతో దగ్గర సంబంధాలున్నాయని భావిస్తున్నారు

భారత్, చైనాలతో ఏకకాలంలో ముడిపడే ప్రయత్నం

సీనియర్ జర్నలిస్ట్, టైమ్స్ ఆఫ్ ఇండియా దౌత్య విభాగం సంపాదకులు ఇంద్రాణి బాగ్చీ కూడా ఈసీటీ ఒప్పందాన్ని శ్రీలంక రద్దు చేయడం వెనుక చైనా హస్తం ఉందని భావిస్తున్నారు.

"ఈస్ట్ కంటైనర్ టెర్మినల్‌లో 100 శాతం శ్రీలంక వాటా ఉండాలని అక్కడి ట్రేడ్ యూనియన్ కోరుకుంటున్నప్పుడు, భారత్‌తో వెస్ట్ కంటైనర్ టెర్మినల్ ప్రతిపాదన ఎందుకు తీసుకొస్తోంది? ఇందులో వాళ్ల ట్రేడ్ యూనియన్‌కు అభ్యంతరాలు ఉండవా? చైనాతో కలిసి చేస్తున్న ఓడరేవు ప్రాజెక్టులలో శ్రీలంక వాటా 100 శాతం ఉండాలని ట్రేడ్ యూనియన్ ఎందుకు కోరుకోవట్లేదు?

సిరిసేన ప్రభుత్వం 2019లో భారత్‌తో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నప్పుడు కూడా చైనా శ్రీలంకపై తీవ్ర ఒత్తిడిని తీసుకొచ్చింది. ప్రస్తుత రాజపక్స ప్రభుత్వం చైనాకు మరింత దగ్గరగా మసులుకుంటోందని అంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చైనాతో ఆర్థికపరమైన ఒప్పందాలు, భారత్‌తో భద్రతాపరమైన ఒప్పందాలు కుదుర్చుకోవాలని ఆశిస్తోంది. ఆ విధంగా రెండు దేశాలతోనూ ముడిపడి ఉండాలని భావిస్తోంది. అయితే, ఇలా జరగడం అనుకున్నంత సులువు కాదు" అని ఇంద్రాణి అభిప్రాయపడ్డారు.

శ్రీలంక తాజా నిర్ణయంతో భారత్ 'నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానానికి గట్టి దెబ్బే తగిలిందని చెప్పవచ్చు.

ఇది భారత విదేశాంగ శాఖ వైఫల్యమని చెప్పలేమని, శ్రీలంకతో భారత్ సంబంధాలు చాలా ఏళ్లుగా క్లిష్టంగానే ఉన్నాయి అని ఇంద్రాణి అన్నారు.

ఇరు దేశాల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే ప్రయత్నాలు

2019 నవంబర్‌లో శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన దగ్గరనుంచీ ఇప్పటివరకూ భారత్ ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేపట్టింది. ఇవన్నీ రెండు దేశాల మధ్య దూరాన్ని తగ్గించే ప్రయత్నాలని పలువురు భావిస్తున్నారు.

శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. మొట్టమొదట శుభాకాంక్షలు తెలిపినవారిలో భారత్ కూడా ఉంది. భారత విదేశాంగ మంత్రి జయశంకర్ శ్రీలంకకు వెళ్లి వారి కొత్త ప్రధానిని కలిసారు. భారత్‌కు రమ్మని ప్రధాని నరేంద్ర మోదీ తరపున ఆహ్వానించారు.

అనంతరం నవంబర్లోనే గోటాబాయ రాజపక్స భారత పర్యటనకు వచ్చారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి.

అయితే రాజపక్సకు చైనాతో దగ్గర సంబంధాలున్నయని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భారత్ పర్యటనకు రావడం పలువురిని ఆశ్చర్యపరచింది.

దీని తరువాత జనవరిలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ శ్రీలంక పర్యటన సందర్భంగా భారత్ తరుపున శ్రీలంకకు 50 మిలియన్ డాలర్ల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

అంతే కాకుండా, కరోనా వ్యాక్సీన్లు కూడా శ్రీలంకకు పంపించారు.

అయితే, ఈ ప్రయత్నాలన్నీ కూడా శ్రీలంకను భారత్‌వైపుకు లాగడానికి సరిపోవని ఇప్పుడు తేలింది.

ఈసీటీ ప్రాజెక్ట్ విషయంలో శ్రీలంక తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు.. భారత ప్రభుత్వం తరపునుంచీ ఇంకా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని రామచంద్రన్ తెలిపారు.

ఈ సమస్య పరిష్కారం కాగలదని భారత్ ఆశిస్తోంది, కానీ సమస్య కొంత జఠిలమైనదేనని, అంత సులభంగా పరిష్కారం అయ్యేలా కనిపించట్లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

కేరళ, తమిళనాడులలో భారత్ పెద్ద ట్రాన్షిప్మెంట్ పోర్టును నిర్మిస్తే శ్రీలంకపై ఆధారపడవలసిన అవసరం తగ్గుతుందని ఇంద్రాణి అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం శ్రీలంక నిర్ణయం వలన భారత్‌కు పెద్ద ఇబ్బందులే ఎదురవ్వొచ్చు కానీ భవిష్యత్తులో శ్రీలంకకు కూడా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. లేదా చైనాకి శ్రీలంక మరింత దగ్గర అయ్యే అవకాశం ఉంది అని ఇంద్రాణి తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Backlash against India in Sri Lanka
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X