వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్ రోజుల్లో బంధు మిత్రులను ఆదుకుంటున్న 'బ్యాంకర్ లేడీస్'

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
హిల్డా రోబెల్స్

అమెరికా సహా చాలా ప్రాంతాల్లో మైనారిటీలు బ్యాకింగ్‌యేతర పొదుపు సంఘాలపై ఆధారపడుతుంటారు. కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఆర్థిక వ్యవస్థలు కుదేలు కావడంతో ఈ సంఘాల పాత్ర మరింత కీలకంగా మారుతోంది.

అమెరికాకు వచ్చిన తొలి నాటి రోజులను గుర్తు చేసుకుంటూ హిల్డా రోబెల్స్ కంట తడిపెట్టుకున్నారు.

''ఒకానొక సమయంలో బాగా ఏడుపు వచ్చింది. వెనక్కి వెళ్లిపోదామని అనుకున్నాను. కొంతమందిని సాయం చేయమని అడిగాను. కానీ ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే వారికి స్పానిష్ అర్థమయ్యేదికాదు. నాకు ఇంగ్లిష్ రాదు''

20ఏళ్ల క్రితం ఆమె టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోకు వచ్చినప్పుడు రోజువారి పనులు కూడా కష్టమయ్యేవి. ఆఫీస్‌కు వెళ్లడం, డాక్టర్ దగ్గరకు వెళ్లడం చాలా ఇబ్బందయ్యేది. ఎక్కడికి వెళ్లాలన్నా.. ఎలా వెళ్లాలో అర్థమయ్యేదికాదు. ఆమెకు కారు లేదు. ఇంగ్లిష్ రాదు. సాయం చేయడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు.

బ్యాంకు అకౌంటు తెరవడం ఆమెకు దాదాపుగా అసాధ్యమే. ''బ్యాంకుకు మొదటిసారి వెళ్లినప్పుడు అకౌంటు తెరవలేకపోయాను. ఎందుకంటే నాకు సోషల్ సెక్యూరిటీ నంబరు లేదు''

''ఈ నంబరు లేకపోయినా అకౌంటు తెరిచే సదుపాయమున్న ఓ బ్యాంకు గురించి కొందరు చెప్పారు. అయితే ఇంగ్లిష్ సరిగా రాకపోవడంతో వెళ్లలేకపోయాను''

దీంతో 49ఏళ్ల రోబెల్స్ ఓ కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. లాటిన్ అమెరికాలో ప్రాచుర్యం పొందిన అనధికార పొదుపు సంఘం టండాను మొదలుపెట్టారు. దీనిలో సభ్యులంతా ఆమె కుటుంబానికి సన్నిహితులే.

బ్యాంకర్ లేడీస్

సంఘంలోని సభ్యులంతా ఒక నిర్దేశిత మొత్తాన్ని క్రమంగా సంఘంలో పొదుపు చేస్తారు. దీన్ని ప్రతి నెల ఒకరికి ఇస్తుంటారు. అందరికీ డబ్బులు వచ్చేవరకూ ఇది కొనసాగుతుంది.

అంటే, తాము పొదుపు చేసుకున్న నగదు మొత్తం అందరికీ అందుతుంది అన్నమాట. అది కూడా ఒకేసారి పెద్ద మొత్తంలో అందుతుంది. దీన్ని ఏవైనా వస్తువుల కొనుగోలుకు, పెట్టుబడులకు, రుణాల చెల్లింపులకు వాడుకోవచ్చు. మొదట్లోనే డబ్బులు అందుకున్నవారికైతే.. ఎలాంటి వడ్డీ లేకుండానే రుణం వచ్చినట్లు అవుతుంది. చివర్లో డబ్బులు అందుకునేవారికి కొంచెం ఎక్కువ నగదు వస్తుంది. అచ్చంగా ఈ సంస్థలు చిట్టీల్లానే పనిచేస్తాయి.

తనకు సంఘం నుంచి 5,000 డాలర్లు అందిన వెంటనే రోబెల్స్ తొలిసారి కారు కొనుకున్నారు. ఆమె బంధువుల్లో కొందరు గృహ రుణాల చెల్లింపులు, యూనివర్సిటీ ఫీజులు కట్టుకున్నారు. ప్రస్తుతం కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఇంట్లో జబ్బుపడిన వారికి వైద్యం అందించేందుకు, కుటుంబాలు నడిపేందుకు ఇలాంటి సంఘాలు కీలకంగా మారుతున్నాయి.

14ఏళ్ల క్రితం తొలిసారి ఈ సంఘాన్ని రోబెల్స్ మొదలుపెట్టారు. మధ్యలో కొన్ని నెలలు విరామం ఇస్తూ.. ప్రతిసారి మళ్లీ దీన్ని కొనసాగిస్తున్నారు.

''ఇలాంటి సంఘాల వల్ల ప్రజలు తమ అవసరాలను తీర్చుకోవడం చూస్తుంటే చాలా సరదాగా అనిపిస్తుంటుంది. వీటి వల్ల వడ్డీలకు అప్పులు తెచ్చుకోవడం తగ్గుతుంది. ముఖ్యంగా లాటిన్ అమెరికన్లకు ఇలాంటి సంఘాలతో చాలా లబ్ధి చేకూరుతోంది''

ఇలాంటి సంప్రదాయ నగదు పొదుపు విధానాలు ప్రపంచ వ్యాప్తంగా కనిపిస్తుంటాయి. రుణాల సంఘాలు, రోస్‌కాస్, రొటేటింగ్ సేవింగ్స్, చిట్టీలు తదితర పేర్లతో వీటిని పిలుస్తుంటారు.

మెక్సికోలో వీటని టండాలుగా పిలుస్తుంటారు. హ్యూస్, సూసుస్, బ్యాలెట్ కమిటీ అని కూడా వీటిని పిలుస్తుంటారు. అమెరికాలోని వలసదారులు ఇలాంటి పొదుపు సంఘాల్లో ఎక్కువగా చేరుతుంటారు.

కరోనావైరస్ వ్యాప్తి నడుమ ఆరోగ్య సంక్షోభంతోపాటు ఆర్థిక కష్టాలు ఎక్కువయ్యాయి. దీంతో కొన్ని కుటుంబాలకు ఈ బ్యాంకింగేతర పొదుపు వ్యవస్థలే కీలకమయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేని వలసదారులను ఇవి ఎంతగానో ఆదుకుంటున్నాయి.

అమెరికాలో ఆర్థిక వ్యవస్థలు, సామాజిక సేవల అందుబాటుపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. కరోనావైరస్ వ్యాప్తికి ముందు కూడా.. అందరికీ రుణాల అందుబాటు విషయంలో మిగతా ధనిక దేశాలతో పోలిస్తే.. అమెరికా వెనుకబడే ఉండి.

15ఏళ్లకుపైబడిన ఏడు శాతం మంది అమెరికన్లకు ఎలాంటి బ్యాంక్ అకౌంట్ లేదని 2017లో నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. ఇది కెనడాలో కంటే ఒక శాతం, బ్రిటన్ కంటే నాలుగు శాతం ఎక్కువని ప్రపంచ బ్యాంకు తెలిపింది.

అమెరికాలో 25 శాతం మందికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేవు లేదా రుణాల కోసం బ్యాంకింగేతర సేవలను వారు ఆశ్రయిస్తున్నారు.

యూనివర్సిటీ విద్యకు నోచుకోని, పేద నల్లాజాతీయులు, లాటిన్ అమెరికన్లు ఇలాంటి విధానాలవైపు మొగ్గుచూపుతున్నారు. రుణాలు కావాలంటే.. బ్రాంకింగేతర సేవలైన రోజువారి చెల్లింపులు, వడ్డీలకు డబ్బులు ఇచ్చేవారివైపు చూస్తున్నారు.

అయితే, ఇలాంటి బ్యాంకింగేతర సేవలతో చాలా ముప్పుంది. వీరు ఎక్కువగా వడ్డీలను వసూలు చేస్తుంటారు. వీటిని చెల్లించలేని పక్షంలో తీవ్ర పరిణామాలు కూడా ఉంటుంటాయి. అదే పొదుపు సంఘాల్లో అయితే.. భద్రత, విశ్వసనీయత ఉంటాయి.

''బ్యాంకింగ్ వ్యవస్థలు అందుబాటులో లేనప్పుడు ఇలాంటి సంఘాలతో మంచి ప్రయోజనం ఉంటుంది''అని కెనడాలోని రాస్‌కాస్ విధానాలపై అధ్యయనం చేస్తున్న యార్క్ వర్సిటీ ప్రొఫెసర్ కరోలిన్ హొస్సెయిన్ వివరించారు.

''బ్యాంకుల్లో కొంత నగదు మాత్రమే ఉంటుంది. నగదు తక్కువ ఉండేటప్పుడు.. ముప్పు తక్కువ ఉండేవారికి ఇవ్వాలని వారు కోరుకుంటారు''

''అందుకే నగదు కోసం ఇలాంటి విధానాలపై ఆధారపడితే కొంతవరకూ అవసరాలు తీరుతాయి''

ఇలాంటి సంఘాలను మహిళలే ఎక్కువగా నడిపిస్తారని, వీరిని ''బ్యాంకర్ లేడీస్'' అని పిలుస్తారని డా.హొస్సెయిన్ వివరించారు.

''ఈ సంఘాలను నడిపే మహిళలను బ్యాంకర్ లేడీస్ అని పిలుస్తారు. వీరు అందరికీ అందుబాటులో ఉంటారు. సాధారణంగా వీరు తమ ఇంటికి పొరుగునో లేదా సమీపంలోనే ఉంటారు''

''ఈ లావాదేవీలకు పెద్ద దస్తావేజులు, దస్రాలతో పనుండదు. ఎందుకంటే ఇదేమీ బ్యాంకు కాదు. కుటుంబ సభ్యులు, సన్నిహితులపై నమ్మకంతో ప్రజలు వీటిలో చేరుతారు''

బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండే కొందరూ ఇలాంటి విధానాలను అనుసరిస్తుంటారు. ముఖ్యంగా వలసదారులైన తల్లితండ్రుల ద్వారా ఇలాంటి సంఘాలతో పరిచయాలు ఉండేవారు వీటిలో మొదటివరుసలో ఉంటారు.

నగదు అందుబాటులో ఉండటంతోపాటు ప్రజల మధ్య నమ్మకం, విశ్వాసం పెరగడానికీ ఈ సంఘాలు తోడ్పడతాయని కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన లీ మార్టిన్ చెప్పారు. బ్యాంకు రుణాలు అందుబాటులో లేనివారికి ఇలాంటి సంఘాలే కీలకమని అన్నారు.

అయితే, మైనారిటీలతోపాటు ఎలాంటి ధ్రువపత్రాలు అందుబాటులో లేనివారు ఇలాంటి సేవలు ఎక్కువగా ఉపయోగించుకోవడంతో వీటి పరిధిని గుర్తించడం కష్టమని హొస్సెయినీ వివరించారు. ఆఫ్రికా-కరీబియన్ వాసుల్లో బ్యాంకింగేతర పొదుపుపై ఆమె పరిశోధన చేస్తున్నారు.

''అమెరికా, కెనడా, యూరప్ లాంటి చాలా ప్రాంతాల్లో ఇలాంటి సంఘాల గురించి బయటకు పెద్దగా తెలియదు. ఎందుకంటే చాలా మంది దీన్ని అక్రమమని భావిస్తుంటారు. మరోవైపు సేవింగ్స్ ఖాతాల తరహాలో దాచుకున్న నగదుకు ఇక్కడ ఎలాంటి వడ్డీ ఇవ్వరు''

అయినప్పటికీ, పశ్చిమ దేశాల్లో ఇలాంటి పొదుపు సంఘాలు క్రియాశీలంగా పనిచేస్తున్నాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇలాంటి ఏదో ఒక పొదుపు విధానంలో 77 శాతం మంది పాలుపంచుకుంటున్నట్లు 2004లో లాస్ ఏంజెలిస్‌లోని కొరియన్-అమెరికన్ గార్మెంట్ బిజినెస్ యజమానుల సర్వేలో తేలింది.

తమ తోటి ప్రజలకు ఇలా రుణ సదుపాయాన్ని అందుబాటులో ఉంచడంతో చాలా ప్రయోజనాలుంటాయి. ఉదాహరణకు 2000 చివరి నుంచి 2010 మధ్య యూరో సంక్షోభం తలెత్తినప్పుడు స్పెయిన్‌లో చైనా వలసదారులు ఇబ్బందుల నుంచి గట్టెక్కెందుకు ఇలాంటి సంఘాలే దోహదపడ్డాయి.

బ్యాంకర్ లేడీస్

పతనం అవుతున్న ఆర్థిక వ్యవస్థ... చైనా వ్యాపారులపై పెద్దగా ప్రభావం చూపలేదని, ఎందుకంటే కష్టకాలంలో వారు ఒకరిని మరొకరు ఆదుకుంటూ ముందుకు వెళ్లారని 2014లో ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది.

కరోనావైరస్ సంక్షోభంలోనూ అనారోగ్యం పడినప్పుడు, ఉద్యోగాలు కోల్పోయినప్పుడు.. కరెంటు, ఇంటి బిల్లులు చెల్లించేందుకు ఇలాంటి సంఘాలు ఎంతో సాయం చేశాయని రోబెల్స్ వివరించారు.

''చాలా మందికి ఇవే అధారమయ్యాయి. మాకు మాత్రమే ప్రభుత్వం అందించిన ఉపశమన చెక్కు అందింది. ఇక్కడ చాలా మందికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ లభించలేదు. ఎందుకంటే వారి దగ్గర ఎలాంటి పత్రాలూ లేవు''

ఇతర పెట్టుబడుల్లానే రోస్‌కాస్‌లోనూ ముప్పు ఉంటుంది. కొన్నిసార్లు కొంత మంది దగ్గర కట్టడానికి డబ్బులు ఉండవు. కొందరైతే డబ్బులు తీసుకొని పరారై పోతుంటారు.

డబ్బులు అటూఇటు కావడం చాలా అరుదుగా జరుగుతుందని రోబెల్స్ వివరించారు. ఏమైనా తేడా వస్తే తన సొంత జేబులోని డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుందని ఆమె చెప్పారు.

కుటుంబాలు, ఆప్తుల మధ్యే ఈ సంఘాలు నడుస్తుండటంతో.. డబ్బులు ఏమైనా ఎగవేస్తే సామాజికంగానూ ప్రభావాలు పడుతుంటాయి.

అయితే, మోసం చేసిన వారిపై కేసులు వేసే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అంతా ప్రైవేటుగానే జరుగుతుంది. ఇక్కడ బ్యాంకుల్లో పెట్టినంత రక్షణ మాత్రం ఉండదు.

2018లో ఈ విధానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు యాహూ ఫైనాన్స్.. టండా యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఎవరూ చేరకపోవడంతో దీన్ని కొన్ని నెలలకే పక్కన పడేయాల్సి వచ్చింది.

''ఇక్కడ రెండు సమస్యలున్నాయి. మొదటిది.. ఇవి కొందరు మైనారిటీలు మాత్రమే ఉపయోగించే అనధికార బ్యాంకింగ్ కార్యకలాపాలని ప్రజలు భావిస్తుంటారు. రెండోది తమ డబ్బులు భద్రంగా ఉంచుతారని తోటి వారిపై భరోసా పెట్టడం''అని డా.హొస్సెయిన్ వివరించారు.

బ్యాంకర్ లేడీస్

అయితే, కోవిడ్-19 వ్యాప్తి నడుమ ఉత్తర అమెరికాలోని యువత కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. టెక్నాలజీ సాయంతో నిధులను పంచుకునేందుకు క్రౌడ్‌ఫండింగ్ నుంచి రోస్‌కాస్ వరకూ అన్ని మార్గాలనూ ఆశ్రయిస్తోంది.

టండాలతో పొదుపు చేయాలనే సంకల్పంతోపాటు తోటివారిపై నమ్మకమూ పెరిగినట్లు డాలస్‌లోని యూనివర్సిటీ పరిపాలనా విభాగం ఉద్యోగి, 30ఏళ్ల మయరా మార్టినేజ్ తెలిపారు. ఇవే లేకపోతే పొదుపు చేయాలనే ఆలోచనే ఉండేదికాదని ఆమె వివరించారు.

''ఇది మీకు మీరే తీసుకునే నిర్ణయం కాదు.. ఎందుకంటే మీకు మీరే తీసుకునే నిర్ణయాలపై ఎక్కువ నిర్లక్ష్యం వహిస్తారు. దీనిలో పక్కవారి పాత్ర ఉండటంతో.. కొంచెం సీరియస్‌గా తీసుకుంటారు''

ఆర్థిక వ్యవస్థలో ఊహించని పరిణామాలు చోటుచేసుకునేటప్పుడు.. ఇలాంటి విధానాలు కొంత వరకూ భద్రత కల్పిస్తాయని మార్టినేజ్ చెప్పారు. కోవిడ్-19 నడుమ సోదరి, ఆమె భర్త ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆమె వివరించారు.

''ఈ వారం ఆమెకు టండా నుంచి డబ్బులు అందాయి. దీంతో ఏం ఫర్వాలేదని భర్తకు ఆమె భరోసా ఇచ్చింది''అని మార్టినేజ్ వివరించారు.

''మా టండాను మా అమ్మే నడిపిస్తోంది. దీనిలో మా కుటుంబంలోని అన్ని తరాలవారూ భాగస్వాములయ్యారు''.

పెద్దవారు విశ్రాంతి తీసుకున్న తర్వాత.. ఇలాంటి టండాను ఆమె కూడా నడిపిస్తారా?

ఇలాంటి టండాను నడిపించడానికి ఎలాంటి అభ్యంతరమూలేదని ఆమె నవ్వుతూ చెప్పారు. అయితే అంతా తమ కుటుంబ సభ్యులపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
'Banker ladies' taking care of relatives and friends in the days of coronavirus
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X