వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏఐఐబీ: మోదీ ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి కోట్ల డాలర్ల రుణం తీసుకుందా? నిజం ఏంటి? - BBC Fact Check

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఏఐఐబీ బ్యాంకు

భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఎప్పుడూ లేనంత తీవ్రంగా ఉన్నాయి. అలాంటి సమయంలో బుధవారం పార్లమెంటులో ఒక లిఖితపూర్వక ప్రకటన గురించి విపక్షాలు మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి.

లద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో ఒకవైపు భారత సైనికులు చనిపోతుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

నిజానికి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన ఒక లిఖితపూర్వక ప్రకటన తర్వాత ఇది మొదలైంది.

కరోనా మహమ్మారి వల్ల ఉత్పన్నమైన పరిస్థితుల నుంచి బయటపడేందుకు కేంద్రం నిధులు ఎలా ఉపయోగించింది, వాటిని రాష్ట్రాలకు ఎలా అందించింది అని ఇద్దరు బీజేపీ ఎంపీలు ప్రశ్నించారు.

ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ ప్రశ్నకు సమాధానంగా పార్లమెంటుకు ఇచ్చిన సమాచారంతో.. చైనాలోని ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌ మెంట్ బ్యాంక్(ఏఐఐబీ) నుంచి కరోనా ప్రారంభమైన తర్వాత కేంద్రం రెండు సార్లు రుణం తీసుకుందనే విషయం వెలుగులోకి వచ్చింది.

“కోవిడ్-19 సంక్షోభం నుంచి బయటపడే చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్‌తో రెండు రుణ ఒప్పందాలపై సంతకాలు చేసింది. మొదటి రుణం 2020 మే 8న 50 కోట్ల డాలర్లు తీసుకున్నాం. ఆ నిధులను భారత్‌లో కోవిడ్-19 అత్యవసర చర్యలు, ఆరోగ్య వ్యవస్థ సన్నాహక ప్రాజెక్టుకు పాక్షిక మద్దతు అందించడానికి తీసుకున్నాం. మహమ్మారి వల్ల ఉత్పన్నమయ్యే ప్రమాదాలను ఎదుర్కోవడం, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలిగేలా జాతీయ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం” అని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

నరేంద్ర మోదీ

భారత్‌కు ఎన్ని నిధులు అందాయి?

ఏఐఐబీ నుంచి తీసుకున్న ఆ రుణంలో భారత్‌కు ఇప్పటికే 25 కోట్ల డాలర్లు అందాయని అనురాగ్ ఠాకూర్ చెప్పారు.

ఆ తర్వాత భారత్ జూన్ 19న రెండో రుణ ఒప్పందం చేసుకుంది. అంటే, జూన్ 15న తూర్పు లద్దాఖ్‌ గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోయిన నాలుగు రోజుల తర్వాత ఇది జరగడం గమనార్హం.

“2020 జూన్ 19న 75 కోట్ల డాలర్లకు రెండో రుణ ఒప్పందం జరిగింది. అది భారత కోవిడ్-19 సామాజిక భద్రత చర్యల కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు భారత ప్రభుత్వ బడ్జెట్ సాయం రూపంలో ఉంటుంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద నడుస్తున్న ఈ కార్యక్రమంలో ఎన్నో చర్యలు చేపట్టాం. దాని ప్రయోజనాలను రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందించాం” అన్నారు.

''PMGKY కిందకు వచ్చే లబ్ధిదారులందరూ ఈ రుణం నుంచి లబ్ధి పొందారు. ఇప్పటివరకూ ఈ రుణం ద్వారా అందిన మొత్తం నిధులను ఈ కార్యక్రమం కిందే ఖర్చుచేశాం’’ అని మంత్రి తెలిపారు.

అంటే భారత ప్రభుత్వం మొత్తం 125 కోట్ల డాలర్ల రుణాలు తీసుకుంది. అంటే అది 9200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ. ఈ రుణాల నుంచి భారత్‌కు ఇప్పటివరకూ 100 కోట్ల డాలర్లు, అంటే దాదాపు 7300 కోట్లు మాత్రమే అందాయి.

https://twitter.com/RahulGandhi/status/1306133465709113345

ఈ గణాంకాలు బయటికి రావడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విటర్‌లో “మోదీ ప్రభుత్వం భారత సైన్యంతో ఉందా, చైనా సైన్యంతో ఉందా” అని ప్రశ్నించారు.

https://twitter.com/srivatsayb/status/1306109225408409600

ఆ తర్వాత చాలామంది కాంగ్రెస్ నేతలు మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఒక కాంగ్రెస్ నేతయితే “ప్రధాని మోదీ డబ్బుకు మన భూమని అమ్మేస్తున్నారా” అని కూడా ట్వీట్ చేశారు.

ఆ తర్వాత ట్విటర్‌లో బుధవారం #AIIB ట్రెండ్ అవడం మొదలయ్యింది. అందులో కొందరు మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తే, మరికొందరు ఈ అభివృద్ధి బ్యాంకుకు, చైనా కమర్షియల్ బ్యాంకులతో సంబంధం లేదని చెబుతూ వచ్చారు.

ఏఐఐబీ బ్యాంకు

అసలు ఏఐఐబీ బ్యాంక్ ఏంటి?

'ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్’ అంటే ఏఐఐబీ.. ఒక బహుముఖ బ్యాంక్. దీనిని మల్టీలేటరల్ బ్యాంక్ లేదా ఎండీబీ అంటారు. ఇది రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలు కలిపి ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతయ ఆర్థిక సంస్థ. ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వివిధ మ్యానిఫెస్టోలను అంగీకరించిన తర్వాత ఇది ఉనికిలోకి వచ్చింది. ఇది సభ్య దేశాలకు సామాజిక, ఆర్థికాభివృద్ధికి రుణాలు లేదా గ్రాంట్లను కూడా అందిస్తుంది.

ఎండీబీ చాలా రకాలుగా ఉండచ్చు. ఉదాహరణకు వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, ఇంటర్-అమెరికన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అన్నీ ఇలాంటివే.

100 బిలియన్ డాలర్లతో ఏఐఐబీ 2016 జనవరి నుంచి పనిచేయడం ప్రారంభించింది. దీని ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్‌లో ఉంది.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ 2013లో బాలీలో జరిగిన ఏషియా-పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్‌లో ఈ బ్యాంక్ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ తర్వాత 57 దేశాలు కలిసి దీన్ని ఏర్పాటుచేశాయి.

అమెరికా విదేశాంగ విధానాన్ని అవలంభిస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కుంటున్న అంతర్జాతీయ రుణదాతలకు ఈ బ్యాంక్ ఒక సవాలు లాంటిదని చాలా మంది విశ్లేషకులు భావిస్తున్నారు.

జపాన్ కూడా ఏఐఐబీ సభ్యదేశం కాదు. ఏషియన్ డెలవప్‌మెంట్ బ్యాంక్‌పై ఏఐఐబీ ప్రభావం ఉండడమే దానికి కారణం అని భావిస్తున్నారు.

భారత్ ఈ బ్యాంక్ వ్యవస్థాపక దేశాల్లో ఒకటిగా ఉంది. ప్రస్తుతం ఈ బ్యాంకులో 103 సభ్య దేశాలు ఉన్నాయి. ఆసియాతోపాటూ యూరప్‌లో అతిపెద్ద ఆర్థికవ్యవస్థ ఉన్న జర్మనీ కూడా ఇందులో ఉంది. ఈ బ్యాంక్‌లో అత్యధికంగా చైనాకు 26.59 శాతం వాటా ఉంది. ఆ తర్వాత స్థానంలో భారత్ ఉంది.

భారత్‌కు ఏఐఐబీలో 7.61 శాతం వాటా ఉంది. ఆ తర్వాత రష్యా, జర్మనీ పెద్ద వాటాదారులుగా ఉన్నాయి.

చైనా కరెన్సీ

ఈ బ్యాంక్‌పై చైనా ప్రభావం ఉందా?

ఏఐఐబీ తన వెబ్‌సైట్‌లో ఆసియా, అక్కడి కోట్లాది ప్రజల మెరుగైన భవిష్యత్తు కోసం శాశ్వత మౌలిక సదుపాయాల్లో, ఇతర ఉత్పాదక రంగాల్లో తాము పెట్టుబడులు పెడుతున్నట్లు స్పష్టంగా చెబుతోంది.

ఈ బ్యాంక్ పనితీరును బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చూస్తుంటారు. వీరిలో ప్రతి దేశం నుంచి ఒక్కో గవర్నర్, మరో ప్రత్యామ్నాయ గవర్నర్ ఉంటారు. భారత్ నుంచి గవర్నర్‌గా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రత్యామ్నాయ గవర్నర్‌గా భారత ప్రభుత్వ కార్యదర్శి తరుణ్ బజాజ్ ఉన్నారు.

ఇక, బ్యాంక్ స్టాఫ్ పనితీరును దాని అధ్యక్షుడు చూసుకుంటారు. ఆయన ఐదేళ్లకు ఒకసారి ఎన్నికల ద్వారా ఎంపికవుతారు. ప్రస్తుతం చైనాకు చెందిన జిన్ లికు ఈ బ్యాంకు అధ్యక్షుడుగా ఉన్నారు. ఈయన రెండోసారి అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు.

అయితే, ఏఐఐబీపై చైనా నియంత్రణ ఉందనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కారణం చైనాకు ఎక్కువ ఓట్ల షేర్ ఉండడం.

చైనా దగ్గర అత్యధికంగా 3 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి. ఆ తర్వాత భారత్ దగ్గర 85,924 ఓట్లు ఉన్నాయి. భారత్ ఏఐఐబీ నుంచి రుణాలు తీసుకునే అతిపెద్ద దేశాల్లో ఒకటిగా కూడా ఉంది.

కోవిడ్-19 మహమ్మారి తర్వాత ప్రభావిత దేశాలకు సాయం కోసం ఏఐఐబీ 5 బిలియన్ డాలర్ల ఒక రిలీఫ్ ఫండ్ ఏర్పాటుచేసింది. దాని ద్వారా ఈ బ్యాంక్ ఎక్కువగా భారత్‌కు సాయం చేసింది.

భారత్ 50, 75 కోట్ల డాలర్ల రుణం తీసుకుంది ఈ ఫండ్ నుంచే. దీనితోపాటూ దేశంలో జరిగే చాలా అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భారత్ ఏఐఐబీ నుంచి ఇప్పటికే 3 బిలియన్ డాలర్ల రుణాలు తీసుకుంది.

మరోవైపు , ఏఐఐబీ ఇదే కోవిడ్-19 రిలీఫ్ ఫండ్ నుంచి ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలకు 75 కోట్ల డాలర్లు, పాకిస్తాన్‌కు 50 కోట్ల డాలర్లు, బంగ్లాదేశ్‌కు 25 కోట్ల డాలర్లు కూడా ఇచ్చింది.

జిన్ పింగ్

ఏఐఐబీలో డబ్బంతా చైనాదేనా?

ఏఐఐబీకి చైనా నుంచి డబ్బు అందుతోందా అనే ప్రశ్నకు ఆర్థికవేత్త ప్రంజాయ్ గుహా ఠాకురతా సమాధానం ఇచ్చారు.

“ఇది ఒక ఎండీబీ. ఇందులో చైనా నుంచే డబ్బు రావడం ఉండదు. దీనిలో రష్యా, జర్మనీ లాంటి చాలా దేశాల డబ్బు ఉంది. అందుకే, ఈ నిధులు మొత్తం చైనా నుంచే వస్తాయని చెప్పలేం” అన్నారు.

మరోవైపు, ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ అరుణ్ కుమార్ మాత్రం దీనిపై చైనా ఆధిపత్యం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు.

“ఈ బ్యాంక్ కోసం మొదట చొరవ చూపింది చైనానే, అందుకే ఈ బ్యాంకుపై దాని ఆధిపత్యం ఉంటుదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఎక్కడ వద్దు అనేది దాని ఇష్ట ప్రకారమే జరుగుతుంది” అన్నారు.

“ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ)కు పోటీగా చైనా ఈ బ్యాంక్‌ను స్థాపించింది. ఎందుకంటే, ఏడీబీ జపాన్, అమెరికా నియంత్రణలో ఉంది. అందుకే చైనా తన నియంత్రణలో ఒక బ్యాంక్ తీసుకొచ్చింది. చైనా దగ్గర విదేశీ నిల్వలు నిండుగా ఉన్నాయి. అది చాలా దేశాల్లో పెట్టుబడులు కూడా పెడుతోంది. వన్ బెల్ట్ వన్ నేషన్ రోడ్ ప్రాజెక్ట్ కింద కూడా చైనా పెట్టుబడులు పెడుతోంది. ఈ బ్యాంక్ ఏర్పాటైన తర్వాత అది తనకు నచ్చిన చోట ఆ నిధులు ఖర్చుచేస్తోంది” అంటారు అరుణ్.

వన్ బెల్ట్ వన్ నేషన్ రోడ్ ప్రాజెక్టులో భారత్ లేదు. అయితే, ఏఐఐబీ వ్యవస్థాపక సభ్యుల్లో మాత్రం ఉంది.

ఐఎంఎఫ్, ఏడీబీ లాంటి సంస్థలు షరతులతో రుణాలు ఇస్తుంటాయి. ఏఐఐబీ కూడా అలాగే చేసుంటుంది. కానీ, భారత్‌కు రుణం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అనేదే అతిపెద్ద ప్రశ్న అంటారు ప్రొఫెసర్ అరుణ్ కుమార్.

“భారత్ దగ్గర 500 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. మన బ్యాంకులు చాలా ఎక్కువగా రుణాలు ఇవ్వలేవు. అందుకే మనం దాని నుంచి రుణం తీసుకుంటున్నాం. మనం మన డబ్బును స్వయంగా ఖర్చు చేసి మన సొంత పాలసీ అమలుచేయాలి. స్వతంత్రంగా ఉండాలి. ఎందుకంటే మన విధాన రూపకల్పనలో ఈ సంస్థలు జోక్యం చేసుకుంటాయి” అంటున్నారు.

“భారత ద్రవ్య లోటు 23 శాతానికి దిగువకు వెళ్లింది. అలాంటప్పుడు భారత్ రుణాలు తీసుకోకూడదు. కోవిడ్-19 కోసం భారత్ రుణం తీసుకుంది, పేదలకు ఇవ్వడానికి మన దగ్గర నిధులు, 90 మిలియన్ టన్ను ధాన్యం నిల్వలు ఇప్పటికే ఉన్నాయి. వాటిని పంచవచ్చు. వరల్డ్ బ్యాంక్, ఏఐఐబీ, ఏడీబీ నుంచి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది. ఆ విషయంలో పూర్తి స్పష్టత లేద”ని అరుణ్ కుమార్ చెప్పారు. .

చైనా కరెన్సీ

భారత్-చైనా సరిహద్దు వివాదం తర్వాత చైనా వస్తువులపై నిషేధం విధించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఆ తర్వాత జులైలో 59, సెప్టెంబర్‌లో 118 చైనా యాప్స్ పై భారత్ నిషేధం విధించింది.

దానితోపాటూ పొరుగు దేశాల సంస్థలు మన రాష్ట్రాల్లో టెండర్లు వేయాలంటే, ముందు హోంమంత్రిత్వ శాఖ అనుమతులు తీసుకోవాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చైనాను నియంత్రించడానికే అలా చేశారని భావిస్తున్నారు.

ఏఐఐబీ రుణం ఇచ్చిన తర్వాత దానిపై కథనం రాసిన చైనా ప్రభుత్వ వార్తాపత్రిక 'గ్లోబల్ టైమ్స్’ ఈ నిర్ణయం ఇంతకు ముందే తీసుకున్నారని చెప్పింది. సరిహద్దు ఘర్షణల వల్ల రెండు దేశాల ఆర్థిక సంబంధాలపై ఎలాంటి ప్రభావం లేదనే విషయం దీనితో స్పష్టమైందని కూడా రాసింది.

చైనాకు భారత్ పట్ల మంచి ఉద్దేశం ఉందని, అది ఇరుదేశాల ఆర్థిక సంబంధాల్లో ఎలాంటి ఆటంకాన్నీ కోరుకోవడం లేదని కథనంలో చెప్పింది.

గ్లోబల్ టైమ్స్ కథనం ప్రకారం చూస్తే, చైనా ఏఐఐబీని తన ఆస్తిలా భావిస్తున్నట్లు అనిపిస్తోంది.

అయితే, ఏఐఐబీపై చైనా ప్రభావం ఎక్కువే ఉన్నప్పటికీ, బ్యాంకు పూర్తిగా చైనా నియంత్రణలో లేదని, బ్యాంక్‌లో ఉన్న నిధులు చైనాకు చెందినవి మాత్రమే కాదని బీబీసీ ఫ్యాక్ట్ చెక్ పరిశోధనలో తేలింది.

ఏఐఐబీ ఒక మల్టీలేటరల్ డెవలప్‌మెంట్ బ్యాంక్. ఆసియాలో సామాజిక, ఆర్థిక ఫలితాలను మెరుగుపరచడమే దాని లక్ష్యం అని తెలిసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Is it true that Modi govt had taken loan from Chinese bank.లద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనా సైన్యంతో జరిగిన ఘర్షణలో ఒకవైపు భారత సైనికులు చనిపోతుంటే, మరోవైపు కేంద్ర ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X