ప్రిన్సెస్ డయానా పునర్జన్మ..? బాలుడి రూపంలో పుట్టిన బ్రిటన్ యువరాణి..?
లండన్ : పుట్టుక నుంచి మరణం వరకు ఎన్నో రహస్యాలు. మరణానంతరం పునర్జన్మ ఉంటుందని కొందరంటే.. మరికొందరు మాత్రం అదంతా భ్రమ అని కొట్టి పారేస్తుంటారు. కానీ అప్పుడప్పుడు జరిగే కొన్ని ఘటనలు పునర్జన్మ ఉందేమోనన్న సందేహం కలిగేలా చేస్తాయి. ఈ మధ్యకాలంలో తనను చంపిన హంతకున్ని మరు జన్మలో గుర్తించిన బాలుని గురించి సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తాజాగా ఆస్ట్రేలియాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆస్ట్రేలియాలో ఓ నాలుగేళ్ల బాలుడి మాటలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాను గత జన్మలో బ్రిటన్ యువరాణి ప్రిన్సెస్ డయానానంటూ కుండబద్ధలు కొట్టి మరీ చెబుతున్నాడు. ఆస్ట్రేలియన్ టెలివిజన్ ప్రజెంటర్ డేవిడ్ కాంప్బెల్ కొడుకు అయిన బిల్లీ కాంప్బెల్ మాటలు విని తొలుత తల్లిదండ్రులు కూడా నమ్మలేదు. కానీ ఆ తర్వాత అతడు చెబుతున్న గుర్తులు తనప్రవర్తన చూసి వారు నమ్మక తప్పలేదు.
ప్రిన్సెస్ డయానా 1997లో చనిపోగా.. ఆతర్వాత 18ఏళ్లకు బిల్లీ జన్మించాడు. రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు డయానా ఫోటోను చూసిన బిల్లీ అది తానేనని చెప్పాడు. డయానా చిన్ననాటి సంగతులు చెప్పడంతో పాటు ఆమె కొడుకులైన ప్రిన్స్ విలియం, హ్యారీల గురించి కూడా అనే విషయాలు గుర్తు చేస్తున్నాడట. జన్మించిన కొద్ది గంటలకే చనిపోయిన డయానా సోదరుడు జాన్ గురించిన వివరాలు బిల్లీ గుర్తు చేసుకోవడం కొసమెరుపు.