కోవాగ్జిన్ ట్రయల్స్ నిలిపేసిన బ్రెజిల్- భారత్ బయోటెక్ పై కౌంటర్ అటాక్
హైదరాబాదీ వ్యాక్సిన్ తయారీ సంస్ధ భారత్ బయోటెక్ బ్రెజిల్ లో నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలకు విఘాతం ఏర్పడింది. బ్రెజిల్ లోని ఫార్మా కంపెనీలతో వ్యాక్సిన్ సరఫరా కోసం కుదుర్చుకున్న 324 మిలియన్ డాలర్ల ఒప్పందంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో భారత్ బయోటెక్ దాన్ని రద్దు చేసుకుంది. దీంతో ప్రతిగా తమ దేశంలో భారత్ బయోటెక్ నిర్వహిస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాలను రద్దు చేస్తూ బ్రెజిల్ నిర్ణయం తీసుకుంది.
బ్రెజిల్ లోని ఫార్మా కంపెనీలతో ఒప్పందం రద్దు చేసుకున్నా అక్కడి డ్రగ్ నియంత్రణ బోర్డుతో కలిసి ట్రయల్స్ కోసం పనిచేస్తామని భారత్ బయోటెక్ నిన్న ప్రకటించింది. అయితే బ్రెజిల్ ప్రభుత్వం మాత్రం ఇందుకు అంగీకరించలేదు. తమ దేశంలో ఫార్మా సంస్ధలతో డీల్ రద్దు చేసుకున్న తర్వాత భారత్ బయోటెక్ ప్రయోగాలను కూడా అనుమతించేందుకు బ్రెజిల్ నిరాకరించింది. దీంతో భారత్ బయోటెక్ అర్ధాంతరంగా తమ ప్రయోగాలు నిలిపేయాల్సి వస్తోంది. బ్రెజిల్ ఫార్మా సంస్ధలతో కుదుర్చుకున్న డీల్ ప్రకారం భారత్ బయోటెక్ ఆ ప్రభుత్వానికి 20 మిలియన్ వ్యాక్సిన్ డోసులు పంపాల్సి ఉంది.

అయితే భారత్ బయోటెక్ బ్రెజిల్ ఫార్మా కంపెనీలతో డీల్ రద్దు చేసుకున్నట్లు ప్రకటించినా కారణాలు మాత్రం వెల్లడించలేదు. దీంతో అటు బ్రెజిల్ ప్రభుత్వం కూడా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ప్రయోగాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేసినా కారణాలు చెప్పకుండా మౌనం వహిస్తోంది. దీంతో కీలకమైన సమయంలో భారత్ బయోటెక్ వ్యాక్సిన్లు బ్రెజిల్ కు అందుబాటులో లేకుండా పోతున్నాయి. అయినా ఇరు వర్గాలు మాత్రం తమ పట్టు కొనసాగించేలా కనిపిస్తున్నాయి.