ఆడవాళ్ల భుజాలు చూసినా ఉద్రేకమా? ఇదేమీ సెక్స్ యాక్టివిటీ కాదు: డ్రెస్ వివాదంపై బ్రిటన్ ఎంపీ ఫైర్
''హలో హలో. మీరు చేసే కామెంట్లకు సమాధానాలిచ్చే తీరిక నాకు లేదు. కానీ ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. నేనేమీ మందుతాగి పార్లమెంట్ కు రాలేదు. హ్యాంగోవరూ లేదు. అలాగని టీనేజ్ పొకడ కూడా కాదు. పోనీ బిడ్డకు పాలిచ్చే తల్లినీ కాను. ఇది సెక్స్ యాక్టివిటీ కానేకాదు. ఇప్పుడే చెత్తకుప్ప నుంచి లేచిరానూలేదు. నాకేం తెలుసు? ఆడవాళ్ల భుజాలు చూసినా ఉద్రేకపడేవాళ్లున్నాంటారని?'' అంటూ 59 ఏళ్ల ట్రేసీ బ్రాబిన్ చేసిన ప్రకటన ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది.

సభ్యసమాజానికి ఏం చెబుదామని?
ట్రెసీ బ్రాబెన్.. బ్రిటన్ పార్లమెంటులో ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ. షాడో(ప్రతిపక్ష) కేబినెట్ లో డిజిటల్ మీడియా సెక్రటరీ కూడా. రెండ్రోజుల కిందట బ్రెగ్జిట్ పై చర్చలో భాగంగా పార్లమెంటులో జరిగిన చర్చలో ఆమె అద్భుతంగా మాట్లాడారు. అయితే ఆ సమయంలో ట్రెసీ ధరించిన డ్రెస్ భుజాల నుంచి జారిపోవడం, ఆ ఫొటోలు వైరల్ కావడంతో వివాదం చలరేగింది. ‘‘బాధ్యతగల ఎంపీ ఇలాంటి బట్టలేసుకుని పార్లమెంట్ కు రావొచ్చా? భుజాలు చూపించడం ద్వారా సభ్యసమాజానికి ఏం చెప్పదల్చుకున్నారు?''అంటూ ట్రోలర్లు ట్రెసీపై విరుచుకుపడ్డారు.

కుక్కకాటుకు చెప్పు దెబ్బ
ట్రోలర్ల వేధింపులు గంటగంటకూ పెరిగిపోవడంతో ఎంపీ ట్రెసీ బ్రాచెన్ ట్విటర్ లోనే చెప్పుతెగిపోయే రీతిలో సమాధానమిచ్చారు. తానేమీ తాగుబోతును కానని మొదలుపెట్టి.. ఆడవాళ్ళ భుజాలు చూసినా చొంగ కార్చుకునేవాళ్లుంటారా? అంటూ చెడామడా ఏకిపారేసింది. స్పీకర్ పిలవడంతో సడెన్ గా నిలబడ్డానని, సభలో తాను మాట్లాడే విషయం అందరికీ వినబడాలన్న ఉద్దేశంతో మైక్ ముందుకు వంగానని, దాందో డ్రెస్ కొంచెం స్లిప్ అయి ఉండొచ్చని, అంతమాత్రానికే ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరంలేదని ఎంపీ వివరించారు. మహిళలు రోజువారీగా ఎదుర్కొనే లైంగిక వేధింపులకు ఇదొ ఉదాహరణ అని చెప్పారు.

శభాష్ ట్రెసీ..
తన హాప్ షోల్డర్ డ్రెస్ వివాదంపై ట్రోలర్లకు దిమ్మతిరిగేలా ఎంపీ ట్రెసీ బ్రాబెన్ రాసిన పోస్టు విపరీతంగా వైరల్ అవుతోంది. మెజార్టీ నెటిజన్లు ఆమెను పొడుడుతుండగా, కొందరు మాత్రం విమర్శలు చేస్తూనేఉన్నారు. భారత పార్లమెంటులోనూ గతేడాది ఇలాంటి సందర్భమే చోటుచేసుకుంది. టీఎంసీ నుంచి కొత్తగా ఎన్నికైన నుస్రత్ జహాన్, మిమి చక్రవర్తిలు జీన్స్, మోడ్రన్ డ్రెస్సుల్లో లోక్ సభకు రావడం, వాళ్లపై ట్రోలర్లు విరుచుకుపడటం, ఎంపీలు కూడా అదే స్థాయిలో తిప్పికొట్టడం తెలిసిందే.