• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనా: ఇమామ్‌లను బంధిస్తున్న చైనా అధికారులు

By BBC News తెలుగు
|

వీగర్ ముస్లింలు

వీగర్‌ రైట్స్‌ గ్రూప్ అంచనాల ప్రకారం 2014 నుంచి జిన్‌జియాంగ్ ప్రాంతంలో సుమారు 630మంది ఇమామ్‌లను అధికారులు బందీలుగా మార్చడమో, జైలులో పెట్టడమో చేశారని.. అందులో 18మంది ఇమామ్‌లు చనిపోయారని ఉన్న వీగర్ హ్యూమన్‌ రైట్స్ ప్రాజెక్టు రిపోర్టు బీబీసీకి అందింది.

తీవ్రవాద కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, సమాజంలో విద్వేషాలను, వేర్పాటు వాదాన్ని పురిగొల్పుతున్నారని ఆరోపిస్తూ చైనా ప్రభుత్వం చాలామంది ఇమామ్‌లను అదుపులోకి తీసుకుంది.

కేవలం ఇమామ్‌లుగా పని చేస్తున్నారన్న కారణంతోనే ఈ అరెస్టులు చేస్తున్నారని వారి బంధువులు చెబుతున్నారు. మొత్తం 1,046మంది ముస్లిం ఇమామ్‌లను ప్రభుత్వం గుర్తించిందని వీగర్ హక్కుల ప్రాజెక్టు వెల్లడించింది.

ఈ 1,046 మందిలో దాదాపు ప్రతి ఒక్కరు ఏదో సందర్భంలో జైలులో గడిపారని హక్కుల సంస్థ వెల్లడించింది. అయితే వారిలో చాలామందికి తమపై మోపిన అభియోగాలు ఏంటో కూడా అధికారులు సమాచారం ఇవ్వలేదు.

ఇక 630 కేసులలో ద్వారా 304మంది మత గురువులను జైలు లేదా రీ ఎడ్యుకేషన్ క్యాంపులకు పంపారు. కోర్టుల్లో వీరి మీద మోపిన అభియోగాలను బట్టి వీరిలో 96 శాతం మందికి కనీసం 5 ఏళ్ల జైలు, 26 శాతం మందికి 20 సంవత్సరాల పైన శిక్షలు పడ్డాయి. 14మందికి జీవిత కారాగార శిక్ష పడింది.

అయితే, ఈ సమాచారమంతా కేవలం జిన్జియాంగ్ ప్రాంతంలో ఉన్న మొత్తం ఇమామ్‌ల సంఖ్యలో ఇది కేవలం చిన్న భాగం మాత్రమేనని రీసెర్చ్ ప్రాజెక్టులో పాల్గొన్న అబ్దువెలీ ఆయుప్ వెల్లడించారు.

ఇమామ్‌లను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇక్కడి ముస్లింలను చైనా సంస్కృతిలో కలిపేయడానికి చైనా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంగా దీనిని ఆయన అభివర్ణించారు.

అయితే ఈ వాదనను అంగీకరించని చైనా ప్రభుత్వం, వీగర్లు, ఇతర ముస్లిం వర్గాలు వేర్పాటువాదం వైపు మొగ్గకుండా చూసేందుకే రీ ఎడ్యుకేషన్ క్యాంపులు నిర్వహిస్తున్నామని చెబుతోంది.

వీగర్ ముస్లింలు

వేర్పాటు వాదానికి మతానికి ముడి

వీగర్ తెగకు చెందిన ముస్లింలు ఎక్కువగా ఉండే జిన్జియాంగ్ ప్రాంతంలో ఇప్పటి వరకు 10 లక్షల మందికి పైగా వీగర్లను బంధించిందని, వీరిలో చాలా మందిని వెట్టి చాకిరికి వాడుకుంటోందని, అత్యాచారాలు, బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తోందని ప్రభుత్వంపై ఆరోపణలున్నాయి.

బంధించిన వీగర్లను రీ ఎడ్యుకేషన్ క్యాంపులకు పంపుతారు. మరికొందరిని జైళ్లకు కూడా తరలిస్తారు. 2017 నుంచి ఇలా జైళ్లకు పంపే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

వీగర్లను, ఇమామ్‌లను ఎందుకు అదుపులోకి తీసుకున్నారో తెలిపే సమాచారం అందుబాటులో ఉండదు. అయితే ఎక్కువమంది ఇమామ్‌లను అరెస్టు చేయడానిక అధికారులు చూపిస్తున్న కారణాలు మాత్రం విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తున్నారనే.

ఇటీవల 51 ఏళ్ల వయసున్న ఓ ఇమామ్‌ను ఇవే కారణాల మీద అదుపులోకి తీసుకున్నారు. సామూహిక ప్రార్థనలు నిర్వహించడం, వివాహాలు జరిపించడం ఆయన చేసిన తప్పు.

ఈ అభియోగాల మీద ఆయనను 8 నుంచి 10 సంవత్సరాలు జైలులో ఉంచే అవకాశం ఉంది.

ప్రభుత్వం నియమించిన ఓ ఇమామ్‌ను కూడా ఇవే కారణాల మీద అరెస్టు చేశారు. ఆయనకు 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. మతపరమైన విధులు నిర్వర్తించడమే ఆయన చేసిన తప్పు అని ఆ ఇమామ్ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది.

చాలా సందర్భాలలో వీరిపై మోపే అభియోగాలకు కోర్టుల్లో విచారణార్హత కూడా ఉండదని, చైనా చట్టాలపై పట్టున్న జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డోనల్డ్ క్లార్క్ అన్నారు. ''గడ్డం పెంచడం, మద్యం తాగక పోవడం, విదేశాలకు ప్రయాణించకపోవడం లాంటివి కూడా మత పరమైన ఛాందస వాదాన్ని ప్రోత్సహించడంగా చెబుతారు'' అని క్లార్క్ అన్నారు.

''ప్రజలను ఏకం చేసే శక్తి ఉండటం వల్లే ఇమామ్‌లు టార్గెట్ అవుతున్నారు'' అని వీగర్ హ్యూమన్ రైట్స్ ప్రాజెక్ట్ సీనియర్ ప్రోగ్రాం ఆఫీసర్ పీటర్ ఇర్విన్ అన్నారు. ''వారి ప్రభావం ఏమిటో తెలుసు కాబట్టే, ప్రభుత్వం వారి విషయంలో మొదటి నుంచి జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తోంది'' అన్నారాయన.

అయితే, జిన్జియాంగ్‌లో ప్రజలు ఏ మాత్రం కట్టడి లేని మత స్వేచ్ఛను అనుభవిస్తున్నారని ప్రభుత్వ ప్రతినిధి ఒకరు బీబీసీతో అన్నారు.

వీగర్ ముస్లింలు

రీ ఎడ్యుకేషన్ క్యాంపులు

చైనాలో చర్కిక్ అనే తెగకు చెందిన వారిని టార్గెట్ చేయడం ఇటీవల ఎక్కువగా కనిపిస్తుంది. 1950-1970 మధ్య కాలంలో వీరిపై తీవ్రమైన అణచి వేత కొనసాగింది. ఖురాన్ ప్రతులను తగలబెట్టడం, వేష భాషలపై నిబంధనలు, నిషేధాలు విధించడం లాంటివి ఎక్కువగా జరిగాయి.

1980ల తర్వాత కొంత మార్పు వచ్చి, దెబ్బతిన్న వారి మసీదులను, ప్రార్ధనాల స్థలాలను బాగు చేయడం, కొత్తవి నిర్మించడం, పండగలు, ఉత్సవాలకు అనుమతి ఇవ్వడం లాంటి నిర్ణయాలను చైనా ప్రభుత్వం అమలు చేసింది. మొదటిసారి వీరి ఖురాన్‌ను వీగర్ తెగ భాషలోకి అనువదించారు.

అయితే, 1990 నుంచి వీగర్ తెగ ప్రజల నుంచి ఎదురైన తిరుగుబాటు తర్వాత పరిస్థితులు మారిపోయాయి. జిన్జియాంగ్ ప్రాంతంలో వీరిపై కట్టడిని పెంచారు.

2000 సంవత్సరం నుంచి చాలామంది ఇమామ్‌లను వారి పాఠ్యపుస్తకాలు కాకుండా ప్రభుత్వం అందించే విద్యకు సంబంధించిన పుస్తకాలు చదివేలా ఒత్తిడి చేశారు.

2001-2002 మధ్య కాలంలో సుమారు 16,000మంది ఇమామ్‌లు, ఇతర మత సంబంధమైన కార్యక్రమాలను నిర్వహించే వారిపై బలవంతంగా రీ ఎడ్యుకేషన్ క్యాంపుల్లో చదువు నేర్పించారు.

2001లో మొదటిసారి ఈ తరహాలో అరెస్టయిన టుర్సున్ అనే ఇమామ్ అప్పట్లో చేసిన నేరం అరబిక్‌లో ఉన్న ఖురాన్‌ను వీగర్ భాషలోకి తర్జుమా చేయడమే.

విదేశాలలో ఉంటున్న టుర్సున్ కోడలు వరసయ్యే బంధువు ఒకరు ఈ అంశంపై బీబీసీతో మాట్లాడారు. 2002లో టుర్సున్‌ను విడుదల చేశారని, కానీ ఆ తర్వాత మరో రెండు వారాలు రీ ఎడ్యుకేషన్ క్యాంప్‌కు తీసుకెళ్లారని, 2005లో నాలుగేళ్ల జైలు శిక్ష విధించారని ఆమె వెల్లడించారు.

2003-2005 మధ్య కాలంలో పోలీసులు ఆయనను తీవ్రంగా వేధించారని కూడా టుర్సున్ కోడలు బీబీసీకి చెప్పారు. 2009లో విడుదలైన టుర్సున్‌ను తిరిగి 2017లో తిరిగి జైలుకు పంపారు.

నెల రోజుల కిందట తన తల్లికి 13 సంవత్సరాల జైలు శిక్ష విధించారని, తన తమ్ముళ్లకు 5 ఏళ్లపాటు శిక్ష విధించారని, అసలు తాము చేసిన నేరమేంటో కూడా వారికి తెలియదని టుర్సున్ కోడలు తెలిపారు.

తన తండ్రి అప్పటికే జీవిత కారాగారం అనుభవిస్తున్నారని, మత ఛాందసాన్ని, వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నారంటూ తమ కుటుంబ సభ్యులపై అభియోగం మోపారని టుర్సున్ కోడలు వెల్లడించారు.

తన తల్లి, తండ్రి, తమ్ముడు, మామ ఎన్నాళ్లు జైల్లో ఉంటారో కూడా తెలియదని, ప్రభుత్వ లక్ష్యం తమను అణచి వేయడమేని టుర్సున్ కోడలు తెలిపారు.

వీగర్ ముస్లింలు

డిటెన్షన్ క్యాంపుల నుంచి జైళ్లకు...

డిటెన్షన్ క్యాంపులకు వెళ్లిన వారు కొందరు తిరిగి రారని, ఇలా ప్రభుత్వ నిర్బంధంలోకి వెళ్లిన 18మంది ఇమామ్‌ల జాడ లేదని వీగర్ హక్కుల సంస్థ వెల్లడించింది.

2018లో ప్రభుత్వ అనుమతితో నడిచే వీగర్ ముస్లిం తెగ భాషకు చెందిన ఓ పత్రిక చీఫ్ ఎడిటర్‌ను చైనా అధికారులు డిటెన్షన్ క్యాంపుకు తరలించారు. తర్వాత ఆయన ఏమయ్యారో సామాన్య ప్రజలకు తెలియలేదు.

అయితే, ఆయన మరణించారని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన అధికారులు, మృతదేహాన్ని మాత్రం వారికి ఇవ్వలేదు.

వీగర్ ముస్లింలు

రహస్య ప్రార్ధనలకూ శిక్షలు

డిటెన్షన్ క్యాంపుల గురించి 2019లో ప్రపంచ వ్యాప్తంగా గగ్గోలు పుట్టగానే తాము వారందరని విడిచి పెట్టామని చైనా అధికారులు ప్రకటించారు. అయితే, క్యాంపుల్లో ఉన్న వారిని సాధారణ జైళ్లకు తరలించారు తప్ప విడుదల చేయలేదని హక్కుల కార్యకర్తలు ఆరోపించారు.

జిన్జియాంగ్ ప్రాంతంలోని జైళ్లలో జనాభా విపరీతంగా పెరిగిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. 2017-2018 మధ్య కాలంలో జైళ్లలో ఖైదీల సంఖ్య 30,000 నుంచి ఏకంగా 230,000 పెరిగింది ఆ పత్రిక వెల్లడించింది.

ఇక ప్రభుత్వం దగ్గర వీగర్లకు సంబంధించిన సమాచారం దొరకడం కూడా కష్టమే. 2018లో జిన్జియాంగ్ ప్రాంతంలో కోర్టుల్లోని 7,714 శిక్షలకు సంబంధించిన సమాచారమే అందుబాటులో ఉండగా, 74,348 మందిపై కేసులు నమోదైనట్లు తేలింది.

వీరిలో ఎక్కువ మంది వీగర్లు కాగా, వీరిపై ఉన్న ఆరోపణలు కూడా వేర్పాటువాదం, మత ఛాందస వాదాన్ని ప్రోత్సహించడమే.

2018లో ఓ ఇమామ్‌కు 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించగా, రహస్యంగా ఖురాన్ పఠించడం, ప్రార్ధనలు చేస్తున్నాడనే ఆరోపణలపై ఆయనకు విధించిన శిక్షను రెండింతలు చేశారు అధికారులు. కానీ, ఈ కేసుకు సంబంధించిన సమాచారం కోర్టు డేటా బేస్ నుంచి మాయమైంది. ఇప్పుడాయన 2038లో జైలు నుంచి విడుదలవుతారు.

ఇమామ్‌లపై కారణాలు లేకుండా, కారణాలు ఉన్నా అవేమిటో చెప్పకుండా అరెస్టులు, శిక్షలు విధిస్తూ చైనా ప్రభుత్వం వీగర్ ముస్లిం తెగను తీవ్ర స్థాయిలో అణచివేతకు గురి చేస్తోందని హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Chinese authorities arrest imams in China
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X