వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా తన చుట్టూ శత్రువులున్నా.... ఎందుకు దూకుడుగా వెళ్తోంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

చుట్టూ శత్రువులున్నా.. చైనా ఎందుకు దూకుడుగా వెళ్తోంది?

చైనా సవాళ్లను ఎదుర్కొంటోందా? లేదా ప్రపంచానికే సవాల్ విసురుతోందా?

తాజాగా హాంకాంగ్‌లో నేషనల్ సెక్యూరిటీ చట్టాన్ని అమలు చేయడం ద్వారా అంతర్జాతీయ వార్తల పతాక శీర్షికల్లో చైనా నిలిచింది.

చైనా చర్యను పశ్చిమ దేశాలు బహిరంగంగా తప్పుపట్టాయి. అమెరికా, బ్రిటన్.. తాము ఇదివరకు కుదుర్చుకున్న కొన్ని ఒప్పందాల నుంచి వైదొలగాయి.

గత కొన్నేళ్లుగా స్వయం ప్రతిపత్తిగల హాంకాంగ్‌పై చైనాలోని అధికార కమ్యూనిస్టు పార్టీ తన పట్టును బిగిస్తూ వస్తోంది. తాజాగా అమలు చేసిన నేషనల్ సెక్యూరిటీ చట్టం కూడా దానిలో భాగమే.

అయితే, అన్నివైపుల నుంచీ ఒత్తిడి ఎదుర్కొంటున్న తరుణంలోనూ ఇలాంటి చర్యలు తీసుకోవడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మే 4న, రాయిటర్స్ వార్తా సంస్థ ఓ కథనం ప్రచురించింది.

’’1989లో టియనాన్‌మెన్ స్క్వేర్‌లో ఊచకోత తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చైనా వ్యతిరేక భావజాలం విపరీతంగా పెరిగిందని చైనా ప్రభుత్వానికి ఒక అంతర్గత నివేదిక అందింది. కరోనావైరస్ వ్యాప్తి వల్ల ఈ వ్యతిరేకత మరింత ఎక్కువవుతోందని, అమెరికాను నేరుగా ఢీకొట్టే పరిస్థితులూ రావొచ్చుని నివేదిక పేర్కొంది. దీన్ని హోం శాఖ.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు పంపించింది. అమెరికాలో కరోనా కేసులు పెరిగేకొద్దీ.. రెండు దేశాల పరిస్థితి మరింత దిగజారుతుందని నివేదికలో అంచనా వేశారు.’’అని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.

హాంకాంగ్ ఎన్నికల్లో ఓటమి జరిగి ఏడాది గడవక ముందే.. తాజా చట్టాన్ని అక్కడ అమలు చేసేందుకు చైనా ప్రయత్నిస్తోంది. కోవిడ్-19తో ప్రపంచ వ్యాప్తంగా చైనా విమర్శలు ఎదుర్కొంటోంది. వైరస్ విషయంలో చైనా పారదర్శకత పాటించలేదని ఆరోపణలున్నాయి.

దౌత్య సంబంధాల సమీక్ష

చైనాతో దౌత్య, వాణిజ్య సంబంధాలను అగ్ర దేశాలు సమీక్షించుకుంటున్నాయి. చైనా నుంచి వచ్చే దిగుమతుల సంఖ్యనూ తగ్గిస్తున్నాయి.

అమెరికా అయితే అన్నివైపుల నుంచీ ఉచ్చు బిగిస్తోంది. చైనా వ్యతిరేక భావజాలాలు తమకు చేటు చేస్తాయని చైనా నాయకులకు తెలుసు. అయినప్పటికీ.. అమెరికా సహా అగ్రదేశాలకు ఆగ్రహం తెప్పించే చర్యలను వారు ఎందుకు తీసుకుంటున్నారు?

కేవలం పశ్చిమ దేశాలకు మాత్రమే కాదు.. పొరుగున్న భారత్ లాంటి దేశాలతోనూ చైనా దూకుడుగా వ్యవహరిస్తోంది. భారత్‌తో బిలియన్ డాలర్ల వ్యాపార సంబంధాలున్నప్పటికీ.. ఇలాంటి చర్యలను తీసుకుంటోంది.

చైనాలోని కమ్యూనిస్టు పార్టీ జాతీయవాదం వైపు మొగ్గు చూపాలా? లేక లౌకికవాదం వైపా అనే చర్చ చైనా అంతటా జరుగుతోంది. కొందరైతే దూకుడు విధానాలు చైనాకే చేటు చేస్తాయని అంటున్నారు.

ప్రపంచ వ్యాప్తంగానున్న చైనా వ్యతిరేక భావజాలాన్ని పట్టించుకోకుండా దూకుడుగా పోతే అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుందని చాలామంది చైనా వాసులే భావిస్తున్నారు.

చైనా రాజకీయ వ్యవస్థను అత్యుత్తమ వ్యవస్థగా చూపించడమే మన లక్ష్యం. ప్రపంచమంతా కరోనా మహమ్మారితో అతలాకుతలం అవుతుంటే చైనా అంతర్జాతీయ నాయకత్వాన్ని అందిపుచ్చుకోగలదు. అయితే కరోనావైరస్ సంక్లిష్టమైన అంతర్జాతీయ పరిణామాలను చైనా అర్థం చేసుకోవడం లేదు. అలాంటి సమయంలో దూకుడు విధానాలతో ఎలాంటి ఉపయోగమూ ఉండదు. మనకు కావాల్సింది.. మనకు దొరికిన దాని మధ్య చాలా తేడా ఉంది అని ఆన్‌లైన్ సెమినార్‌లో చైనాలోని రెన్‌మిన్ యూనివర్సిటీలో అంతర్జాతీయ వ్యవహారాల ప్రొఫెసర్ షీ ఇన్‌హాంగ్ వ్యాఖ్యానించారు.

కరోనా వ్యాపిస్తున్న సమయంలో చైనా ప్రభుత్వ మీడియా చాలా దూకుడుగా వ్యవహరించింది. "చైనా తమ సామర్థ్యాన్ని ఉపయోగించి వైరస్ వ్యాప్తిని నియంత్రించింది. కానీ అమెరికా చేయలేకపోయింది"అని ఎద్దేవా చేసింది. ఇలాంటి ధోరణితో చైనాకే చేటు జరిగే ముప్పుందని ఇన్‌హాంగ్ వ్యాఖ్యానించారు.

"గత 40 ఏళ్లలో చైనా కష్టపడి ఈ స్థాయికి రాగలిగింది. కానీ ప్రస్తుతం అనుసరిస్తున్న దూకుడు విధానాలతో వ్యతిరేకత పెరుగుతోంది" అని సౌత్‌చైనా మార్నింగ్ పోస్ట్‌లో రొమేనియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద స్టడీ ఆఫ్ ద ఆసియా-పసిఫిక్ అధిపతి ఆండ్రై లుంగు ఓ కథనం రాశారు.

"గత 40 ఏళ్లుగా చైనా ప్రజలు శ్రమ, సృజనాత్మకత, త్యాగాలతో సాధించిన అద్భుత ఆర్థిక అభివృద్ధిని ఎంత కొనియాడినా తక్కువే. చైనా దౌత్యవేత్తలూ దీనిలో క్రియాశీల పాత్ర పోషించారు. ఇదివరకు కాస్త ఇబ్బందుల్లో సంబంధాలున్న దేశాలతో కూడా వారు సంబంధాలను మెరుగు పరిచారు. అది జపాన్ లేదా అమెరికా అయినా కావొచ్చు. ఐక్యరాజ్యసమితి, ప్రపంచ వాణిజ్య సంస్థల్లోనూ చైనా తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంది. అసాధ్యంగా భావించిన అంశాలను చైనా దౌత్యవేత్తలు సుసాధ్యం చేశారు. వ్యక్తిగత సంబంధాలను మెరుగు పరచుకొని ప్రజల నమ్మకాన్ని గెలిచారు" అని లుంగు రాసుకొచ్చారు.

"అది చైనా దౌత్యంలో స్వర్ణ యుగం. అప్పుడు అంతా క్రమశిక్షణతో ఉండేవారు. వారి దృష్టి చైనా ప్రజలపై కాదు.. విదేశీ వ్యవహారాలపై ఉండేది. కానీ ఇప్పుడు చైనా దౌత్యంపై అన్నిచోట్లా ప్రశ్నలు వస్తున్నాయి. వీరు చైనాను కొనియాడే వ్యవస్థకు కీలుబొమ్మల్లా మారిపోయారు. మంచి దౌత్యవేత్తలు.. వివాదాలను తగ్గిస్తారు.. పెంచరు. కానీ నేటి చైనా దౌత్యవేత్తలు విదేశీ ప్రభుత్వాలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. విదేశీ మీడియాతోపాటు విదేశీ నేతలపైనా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, స్వీడన్, బ్రెజిల్ ఇలా అన్నిచోట్లా ఇది కనిపిస్తుంది. కోవిడ్-19 చైనా వల్లే వ్యాప్తి చెందుతుందని విమర్శలు వచ్చినా.. వాటిని పట్టించుకోకుండా దూకుడుగా వ్యవహరిస్తున్నారు" అని ఆయన వివరించారు.

చైనా సైనికులు

చాలా దేశాలతో వివాదాలు

ఇటీవల లద్దాఖ్ సరిహద్దుల్లో భారత్‌తో చైనా హింసాత్మక ఘర్షణకు దిగింది. దశాబ్దాల తరవాత ఇలాంటి ఘటన రెండు దేశాల మధ్య చోటుచేసుకుంది. దక్షిణ చైనా సముద్రంలో మరోవైపు వియత్నాం, మలేసియాలతో వివాదాలు రాజుకున్నాయి. తైవాన్‌పై ఒత్తిడి చేయడమే లక్ష్యంగా తైవాన్ జల సంధిలో యుద్ధ విన్యాసాలు చేసింది. మరోవైపు ఆస్ట్రేలియా వైన్, మాంసం ఎగుమతులను నిషేధిస్తామని హెచ్చరికలూ జారీచేసింది.

మరోవైపు కమ్యూనిస్టు పార్టీ ప్రయోజనాలకు మద్దతు పలకడమే లక్ష్యంగా చైనా దౌత్యవేత్తలు దూకుడుగా సైబర్ కాంపెయిన్‌లు చేస్తున్నారు. నేపాల్‌లోని ఓలి ప్రభుత్వం ప్రస్తుతం సంక్షోభంలో ఉంది. ఇక్కడి చైనా దౌత్య కార్యాలయం క్రియాశీలంగా వ్యవహరిస్తోంది. నేపాల్‌లోని అధికార పార్టీ నాయకులతో చైనా దౌత్యవేత్త హౌ యాంకీ వరుస సమావేశాలు జరుపుతున్నట్లు కనిపిస్తోంది.

నేపాల్‌లో చైనా జోక్యంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు నేపాల్‌లో భారత్‌ ప్రాబల్యం తగ్గుతుందనీ ఆందోళన వ్యక్తమవుతోంది.

చైనా దూకుడు విధానాలు పెరగడంతో ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని దేశాలు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందిస్తున్నాయి. గాల్వన్ లోయలో 20 మంది భారత సైనికులు అమరులైన ఘటనలో భారత్‌కు అమెరికా బహిరంగంగా మద్దతు పలికింది.

భారత్, జపాన్, మలేసియా, ఆస్ట్రేలియా కూడా.. చైనాతో వాణిజ్యాన్ని తగ్గించుకుంటున్నాయి. చైనా నుంచి ఆటోమేటిక్ రూట్‌లో వచ్చే విదేశీ పెట్టుబడులను భారత్ నిలిపివేసింది. జర్మనీ కూడా ఇదే చేసింది. ఐరోపా సమాఖ్య అంతటా ఇలాంటి డిమాండ్లు వినిపిస్తున్నారు. ఫ్రాన్స్‌లో చైనా దౌత్యవేత్తలు అక్కడి ప్రభుత్వ విధానాలపై గందరగోళంలో పడ్డారు.

వైన్, మాంసం, బార్లీలను చైనా నిషేధించినా.. భయపడేదిలేదని ఆస్ట్రేలియా కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.

టిక్‌టాక్ సహా 52 చైనా యాప్‌లను భారత్ నిషేధించింది. చైనా విదేశీ పెట్టుబడులను నిలువరించడమే లక్ష్యంగా చాలా దేశాలు నిబంధనలను మార్చుకొంటున్నాయి. ఇటీవల జరిగిన వర్చువల్ సమావేశంలో సైనిక పరికరాల ఒప్పందంపై భారత్, ఆస్ట్రేలియా సంతకం చేశాయి.

ఇలాంటి ఒప్పందమే జపాన్, భారత్‌ల మధ్య కూడా జరిగే అవకాశముంది. వన్ చైన్ పాలసీ కింద తైవాన్ తమలో భాగమని చైనా భావిస్తోంది. కానీ డబ్ల్యూహెచ్‌వో తైవాన్‌కు అబ్జర్వర్ స్టేట్ హోదా ఇచ్చింది. ప్రపంచంలో అంతటా వ్యతిరేకత వ్యక్తమైనా చైనా ఎందుకు తల వంచడం లేదు?

దూకుడు కారణం ఏమిటి?

దూకుడును చైనా వ్యూహంగా ఉపయోగిస్తోందని భారత్ విదేశాంగ శాఖ కార్యదర్శి శ్యామ్ శరణ్ వ్యాఖ్యానించారు.

"ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నా.. వారి దూకుడు మాత్రం తగ్గట్లేదు. హాంకాంగ్ లేదా తైవాన్ లేదా దక్షిణ చైనా సముద్రం.. అంతటా దూకుడు కనిపిస్తోంది. సంక్షోభ సమయంలోనూ భారత్‌తో వారు వివాదానికి దిగారు. కరోనావైరస్‌ను కట్టడి చేసేందుకు అమెరికా లాంటి దేశాలు కష్టపడుతుంటే.. చైనా ఇప్పటికే కట్టడి చేసింది. అందుకే వారిని వారే సూపర్ పవర్‌గా చెప్పుకుంటున్నారు. అయితే ఈ దూకుడుతో వారికి ఒరిగేమీ ఉండదని నాకు అనిపిస్తోంది. చైనాపై అందరూ సందేహ పడుతునారు. చైనా దౌత్యం, పెట్టుబడులు, రుణాలను సందేహిస్తున్నారు. అమెరికా, బ్రిటన్ అయితే సూటి ప్రశ్నలు సంధిస్తున్నాయి" అని ఆయన అన్నారు.

టియానన్‌మెన్ స్క్వేర్ ఊచకోత ఘటన తర్వాత కూడా చైనా ఇదే దూకుడుతో వ్యవహరించిందా?

"చైనా అప్పట్లో అంత శక్తిమంతమైన దేశం కాదు. అందుకే దూకుడు ప్రదర్శించలేదు. ఇప్పుడు ప్రపంచంలో చైనా రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. సైనిక శక్తిగానూ మారింది. వారు వ్యూహాత్మకంగా దూకుడును ప్రదర్శిస్తున్నారు. కానీ ఇది వారికి ఉపయోగపడుతుందా? అనే అంశంపై సందేహాలున్నాయి. చైనా జాతీయవాదానికి గట్టి మద్దతు పలుకుతున్నట్లు ప్రపంచ దేశాలకు సందేశాన్ని ఇచ్చింది" అని శ్యాం అన్నారు.

చుట్టుపక్కల అన్ని దేశాలతోనూ వైరం పెరిగిన తరుణంలో.. స్వదేశంలో తమ ప్రతిష్ఠను పెంచుకునేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ జాతీయవాదాన్ని ఉపయోగించుకుంటుంది. నాలుగు దశాబ్దాల తర్వాత 2020 మొదటి త్రైమాసికంలో చైనా జీడీపీ 6.8 శాతం తగ్గిపోయింది.

కరోనావైరస్ విజృంభిస్తున్న తరుణంలో చైనా నిరుద్యోగ రేటు 10 శాతానికి పెరిగింది. 60 కోట్ల మంది చైనా ప్రజల నెలవారీ వేతనం రూ.10,670 కంటే తక్కువే ఉందని మే 29న ఇచ్చిన ప్రసంగంలో చైనా ప్రధాని లీ కెచియాంగ్ అంగీకరించారు.

జిన్‌పింగ్, డోనాల్డ్ ట్రంప్

హాంకాంగ్‌లో నేషనల్ సెక్యూరిటీ చట్టాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తున్న తరుణంలో.. చైనాలో తైవాన్‌పై వాడీవేడీ చర్చలు జరుగుతున్నాయి. సైన్యం సాయంతో తైవాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్లు వచ్చాయి. అయితే అది అంత సులువేం కాదు.

తైవాన్.. రెండో హాంకాంగ్‌లా మారబోదని తైవాన్ అధ్యక్షుడు ఇంగ్ వెన్ బహిరంగంగా సవాల్ విసిరారు.

హాంకాంగ్‌లో నేషనల్ సెక్యూరిటీ చట్టాని అమలు చేస్తే.. చైనాపై ఆంక్షలు విధించడానికి అమెరికా, బ్రిటన్ సిద్ధంగా ఉన్నాయి. యూరప్ కూడా కోపంగానే ఉన్నప్పటికీ.. చైనా పట్టించుకోవట్లేదు.

హాంకాంగ్ విషయంలో విదేశీ విమర్శలు వెల్లువెత్తితే చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నేతృత్వంలోని చైనా కమ్యూనిస్టు పార్టీకి మరింత మేలు జరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
America, however, is setting a trap from all sides. Chinese leaders know that anti-China ideologies hurt them. However .. why are they taking action that angers the top countries including America?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X