• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనా: హైపర్‌సోనిక్ క్షిపణితో ముప్పు ఒక్క అమెరికాకేనా? ప్రపంచం మొత్తానికీ ప్రమాదం పొంచి ఉందా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
చైనా హైపర్‌సోనిక్ మిసైల్

చైనా రెండు నెలల కిందట(ఆగస్టులో) అణ్వాయుధ సామర్థ్యం గల అత్యాధునిక హైపర్‌సోనిక్ క్షిపణిని పరీక్షించింది. ఇది అమెరికా నిఘావర్గాలను ఆశ్చర్యపరిచింది.

అంతర్జాతీయ పత్రిక 'ఫైనాన్షియల్ టైమ్స్’ తన తాజా రిపోర్టులో ఈ హైపర్‌సోనిక్ మిసైల్ పరీక్ష గురించి చెప్పింది. పేరు బయటపెట్టని ఐదు వర్గాల నుంచి తమకు అందిన సమాచారం ఆధారంగా ఆ కథనం రాసినట్లు 'ఫైనాన్షియల్ టైమ్స్’ పేర్కొంది.

అయితే, చైనా అధికారికంగా ఈ వార్తలను ఖండించింది. అప్పుడు తాము పరీక్షించింది హైపర్‌సోనిక్ మిసైల్ కాదని, అది ఒక స్పేస్ క్రాఫ్ట్ అని చెప్పింది.

చైనా ఖండించినప్పటికీ, ఈ వార్త ప్రపంచమంతా కలకలం సృష్టిస్తోంది.

అమెరికా, రష్యా, చైనా చాలాకాలంగా హైపర్‌సోనిక్ ఆయుధాల తయారీకి ప్రయత్నిస్తున్నాయి.

ఇందులో భాగంగా ఒక గైడెడ్ వెహికల్ నిర్మిస్తారు. దానిని రాకెట్‌తో అంతరిక్షంలోకి ప్రయోగిస్తారు. అది తర్వాత భూమి చుట్టూ తిరుగుతూ తన లక్ష్యం దిశగా ముందుకు వెళ్తుంది.

అమెరికా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌కు చిక్కకుండా ఉండడానికి, అణ్వాయుధాలు తీసుకెళ్లగలిగే ఈ హైపర్‌సోనిక్ గైడెడ్ వెహికల్ చైనాకు సహకరించవచ్చని చైనా అణ్వాయుధ విధానంలో నిపుణులు, ఎంఐటీ ప్రొఫెసర్ టేలర్ ఫేవల్ ఫైనాన్షియల్ టైమ్స్‌కు చెప్పారు.

ఫేవల్‌తోపాటూ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది నిపుణులు ఈ హైపర్‌సోనిక్ క్షిపణి ప్రయోగం వార్తపై స్పందిస్తున్నారు. కొంతమంది దీనిని భవిష్యత్తుకు ఒక హెచ్చరికగా చూస్తున్నారు.

మరికొందరు నిపుణులు దీనిని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.

ఈ టెక్నాలజీ గురించి అణ్వాయుధాలు, రక్షణ రంగానికి సంబంధించిన కొందరు నిపుణులతో బీబీసీ మాట్లాడింది. వీటి ప్రభావం గురించి తెలుసుకునే ప్రయత్నం చేసింది.

హైపర్‌సోనిక్ మిసైల్ అంటే..

'హైపర్‌సోనిక్ మిసైల్' అంటే ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా తన లక్ష్యం వైపు దూసుకెళ్లే క్షిపణి అని అర్థం.

కానీ, హైపర్‌సోనిక్ ఆయుధాలకు ఉన్న ప్రత్యేకత ఈ వేగం ఒక్కటే కాదు.

"హైపర్‌సోనిక్ సాంకేతికత చాలా పురాతనమైనది. బాలిస్టిక్ మిసైళ్లు కూడా ధ్వని కంటే ఎక్కువ వేగంతో వెళ్తాయి" అని సెంటర్ ఆఫ్ ఎయిర్‌ పవర్ స్టడీస్‌, అణ్వాయుధాల నిపుణులు మన్‌ప్రీత్ సేఠీ చెప్పారు.

అయితే, హైపర్‌సోనిక్ ప్రత్యేకత ఏమిటి?

లక్ష్యాన్ని ఛేదించడంలో ఈ క్షిపణికి ఉన్న సామర్థ్యమే దానికి సమాధానం అని రక్షణ రంగ నిపుణులు రాహుల్ బేడీ తెలిపారు.

"గత 30-35 ఏళ్లలో హైపర్‌సోనిక్ క్షిపణి అత్యాధునిక మిసైల్ టెక్నిక్. దీనితో మొదట ఒక వెహికల్ క్షిపణిని అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత అది ఎంత వేగంగా లక్ష్యం వైపు దూసుకొస్తుందంటే, ఆ వేగంలో యాంటీ మిసైల్ సిస్టమ్ దానిని ట్రాక్ చేసి ధ్వంసం చేయడం అసాధ్యం అవుతుంది" అని చెప్పారు.

ఏదైనా ఒక ఆయుధం ఉపయోగం దానిని మించిన ఆయుధం వచ్చేంతవరకే ఉంటుంది అని చెబుతారు. బాలిస్టిక్ మిసైల్, హైపర్‌సోనిక్ మిసైల్ విషయంలో కూడా అదే జరిగింది.

"బాలిస్టిక్ మిసైల్ కూడా హైపర్‌సోనిక్ వేగంతో దూసుకెళ్తుంది. కానీ, దానిని ఒక చోటు నుంచి ప్రయోగిస్తే, అది ఎక్కడ పడుతుందో కూడా తెలుస్తుంది. అందుకే, ఆ మిసైళ్లను ట్రాక్ చేయడం సులభం. అంతేకాదు లాంచ్ చేసిన తర్వాత ఆ మిసైళ్ల దిశను కూడా మార్చవచ్చు" అంటారు సేఠీ.

కానీ, హైపర్‌సోనిక్ మిసైల్‌ను లాంచ్ చేసిన తర్వాత కూడా దాని దిశను మార్చవచ్చు. ఈ క్షిపణి వాతావరణంలో హైపర్‌సోనిక్ వేగంతో తన లక్ష్యం దిశగా దూసుకెళ్తుంది. అంటే, బాలిస్టిక్ మిసైళ్లలా అది ఆర్క్, ప్రొజెక్టైల్ ఏర్పడేలా చేయదు. అందుకే దాని లక్ష్యం ఏంటి అనేది తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. అలా సూపర్‌సోనిక్ మిసైల్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌కు కూడా చిక్కదు.

సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక దేశం హైపర్‌సోనిక్ క్షిపణిని ప్రయోగించినపుడు, యాంటీ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ సాయంతో దానిని అడ్డుకోవడం దాదాపు అసాధ్యం గా మారుతుంది.

ఎందుకంటే, సూపర్‌సోనిక్ టెక్నాలజీతో ప్రయోగించిన క్షిపణుల దిశను లాంచింగ్ తర్వాత కూడా నిర్దేశించవచ్చు. ఈ మిసైల్ రాడార్‌కు కూడా చిక్కదు. అందుకే అది ఏ లక్ష్యం దిశగా వెళ్తోందో గుర్తించడంలో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది.

అమెరికాకు సవాలు

సూపర్‌సోనిక్ మిసైల్ పరీక్షలు జరిగినట్లు వచ్చిన వార్తలు రాగానే అమెరికా నిఘా ఏజెన్సీలకు షాక్ ఇచ్చాయని పత్రికలు రాశాయి.

కానీ, చైనా తాము అలాంటి వార్తలను ఖండించింది. కానీ, మీడియా రిపోర్టుల్లో చెప్పిన వివరాలను బట్టి నిపుణులు దీనిపై మాట్లాడుతున్నారు.

"చైనా తన టెక్నాలజీ బేస్‌ను ఇంత బలోపేతం చేసుకుంటుందని, ఇలాంటి టెక్నాలజీని అభివృద్ధి చేస్తుందని అమెరికా అసలు ఊహించి ఉండదు. ఎందుకంటే, గత 25-30 ఏళ్లుగా రివర్స్ ఇంజనీరింగ్ చేసిన చైనా తన క్షిపణి వ్యవస్థ నుంచి సైన్యం ఉపయోగించే పరికరాల వరకూ అభివృద్ధి చేసింది. అందుకే, ఇది కచ్చితంగా అమెరికాకు షాక్ ఇచ్చే విషయమే అవుతుంది" అంటారు రాహుల్ బేడీ.

అయితే, ఈ టెక్నాలజీని మనం అమెరికాకు పెను సవాలుగా చూడాల్సిన అవసరం ఉందా.

ఈ వార్తలు వచ్చిన తర్వాత అమెరికా, చైనా మధ్య ఒక సమాన బంధం ఏర్పడింది అంటారు రాహుల్

ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పటివరకూ బయటికి రాలేదు. కానీ, ఫైనాన్షియల్ టైమ్స్ తనకు అందిన సమాచారం ఆధారంగా హైపర్‌సోనిక్ మిసైల్ పరీక్ష చాలా విజయవంతం అయ్యిందని చెప్పింది.

అయితే, చైనా మిసైల్ దాదాపు 32 కిలోమీటర్ల దూరం నుంచి మొదటి మిసైల్‌ను హిట్ చేసిందని అందులో చెప్పారు. కానీ, అది చాలా చిన్న విషయం.

ఈ ప్రయోగంతో చైనా కౌంటరింగ్ కేపబిలిటీ పెరిగింది. నంబర్ వన్‌గా దేశంగా ఉండాలనే అమెరికా హోదాకు సవాలు విసిరినట్లు అయ్యింది.

అయితే, ఈ వార్తలకు ఇప్పుడు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని భారత సైన్యం మాజీ డైరెక్టర్, జనరల్ ఆఫ్ ఆర్టిలరీ పీఆర్ శంకర్ అంటున్నారు.

"ఏ దేశాల దగ్గర అంతరిక్ష కార్యక్రమాలు ఉంటాయో, వాటికి హైపర్‌సోనిక్ టెక్నాలజీ ఉంటుంది. కానీ దానిని ఆయుధంగా మార్చాలంటే గ్రౌండ్ కంట్రోల్ సిస్టమ్‌తోపాటూ శాటిలైట్, ఇంటిగ్రేషన్, వార్‌హెడ్‌లతోపాటూ ఒక మొత్తం సిస్టమ్ అవసరం. చైనా దానికి ఇంకా చాలా దూరంలో ఉంది" అన్నారు ఆయన.

ప్రపంచానికి ప్రమాద ఘంటికలా

60 ఏళ్ల క్రితం కూడా ప్రపంచ చరిత్రలో ఇలాంటి సందర్భమే ఎదురైంది. అప్పుడు కూడా అమెరికా ప్రభుత్వానికి సవాలు ఎదురైంది.

దానిని క్యూబా మిసైల్ సంక్షోభంగా చెబుతారు. ఆ సమయంలో అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య అణుయుద్ధం వచ్చే పరిస్థితి ఏర్పడింది.

చివరికి రెండు దేశాల వైపు నుంచి ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నాలు జరిగాయి. అణుయుద్ధాన్ని ఆపడానికి ఎన్నో ఒప్పందాలు కూడా జరిగాయి.

అలాంటి ఒప్పందాలతో అణుయుద్ధం లాంటి పరిస్థితిని అడ్డుకోవచ్చని మన్‌ప్రీత్ సేఠీ కూడా భావిస్తున్నారు.

ఒక దేశం అణ్వాయుధాన్ని ప్రయోగిస్తే, ఇంకో దేశం కూడా అదే పని చేస్తుందని, అలా రెండు దేశాలూ నాశనం అవుతాయనే విషయం క్యూబా మిసైల్ సంక్షోభం తర్వాత ప్రపంచానికి అర్థమైంది. అందుకే అణుయుద్ధాలను ఆపడానికి చాలా ఒప్పందాలు జరిగాయి అన్నారు.

కానీ, 2001లో ఏబీఎం ట్రీటీ నుంచి తప్పుకొన్న అమెరికా యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ తయారీ ప్రారంభించింది. ఉత్తర కొరియా లాంటి చిన్న దేశాల నుంచి కాపాడుకోడానికే డిఫెన్స్ సిస్టమ్ తయారు చేస్తున్నామని అది తనను సమర్థించుకుంది.

కానీ, అమెరికా మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ తయారు చేస్తే మన క్షిపణులు దానిని ఏం చేయలేవని చైనా, రష్యా భయపడ్డాయి. దాంతో రెండు దేశాలూ హైపర్‌సోనిక్ మిసైల్ తయారీని ప్రారంభించాయి. అమెరికా తన మిసైల్ సిస్టమ్‌తో తమను రక్షించుకోగలదని, అందుకే ఇంటర్‌సెప్టార్‌కు చిక్కకుండా లక్ష్యాన్ని తాకేలా తాము మిసైళ్లు తయారు చేస్తున్నామని చెప్పుకొన్నాయి.

కానీ ఈ క్షిపణి వల్ల ప్రపంచానికి ఏదైనా ముప్పు ముంచుకొస్తుందా అనే ప్రశ్న వస్తుంది. దానికి మన్‌ప్రీత్ సేఠీ సమాధానం ఇచ్చారు.

"మొదట్లో మనం కోరుకున్నప్పుడు అణుయుద్ధం చేయచ్చు అనేలా ఉండేది. యుద్ధం ప్రారంభించడం అనే నిర్ణయం మన చేతుల్లోనే ఉండేది. కానీ, ఇప్పటి టెక్నాలజీతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అందుకే ఇది ప్రపంచానికే ప్రమాదకరంగా మారింది. హైపర్‌సోనిక్ క్షిపణితో అణు బాంబుతోపాటూ సంప్రదాయ బాంబులు లాంచ్ చేసే సామర్థ్యం కూడా ఉంటుంది. కానీ ఏది లాంచ్ చేశారు అనేది వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. సంక్షోభ సమయంలో ఏ దేశమైనా ఏదో చెడు జరగబోతోందనే అనుకుంటుంది".

"రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి, సైన్యం ట్రిగర్ రెడీ మోడ్‌లో ఉన్న సమయంలో వాటిలో ఒక దేశం హైపర్‌సోనిక్ మిసైల్ లాంచ్ చేస్తే, గందరగోళ పరిస్థితుల్లో అణుశక్తి ఉన్న రెండో దేశం దానిని అణ్వాయుధం అనుకుని అణు బాంబు ప్రయోగించే అవకాశం ఉంది. అలా రెండు దేశాలూ అణు యుద్ధం కోరుకోకపోయినా, దాన్ని ప్రారంభించినట్లు అవుతుంది" అంటారు సేఠీ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
China: Is US the only threat with a hypersonic missile? Is the whole world in danger
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X