మన బ్రహ్మపుత్రపై చైనా భారీ కుట్ర: ప్రపంచ పొడవైన టన్నెల్‌తో నీటి తరలింపు!
బీజింగ్: చైనా.. భారత్‌పై మరో భారీ కుట్రకు తెరతీసింది. నిన్నమొన్నటి వరకు భారత్‌తో డోక్లాం కోసం అక్రమ పోరాటం చేసిన చైనా.. ఇప్పుడు భారత జలవనరులపై కుట్ర చేస్తోంది. దీని కోసం ఏకంగా వెయ్యి కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని తవ్వేందుకు ఆ దేశ ఇంజినీర్లు గత మార్చి నెలలో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించారు.

డ్రాగన్ కుట్ర భారత్ సమీపం నుంచే..
అరుణాచల్‌ప్రదేశ్‌కు సమీప టిబెట్ నుంచి బ్రహ్మపుత్ర నదీ జలాలను ఎడారి ప్రాంతం షిన్జియాంగ్కు తరలించాలన్నది ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఈ పథకం కార్యరూపం దాల్చితే బ్రహ్మపుత్ర నది దిగువనున్న భారత్, బంగ్లాదేశ్‌లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదంతో పాటు హిమాలయాల ప్రాంతంలో పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

భారత్, బంగ్లాలకు తీరని నష్టం..
కాగా, బ్రహ్మపుత్ర నదిని చైనా వైపు ‘యార్లంగ్ సాంగ్పా'గా వ్యవహరిస్తారు. ఎత్తైన టిబెట్ పీఠభూముల నుంచి ప్రవహించే ఈ నది మనదేశానికి చెందిన అరుణాచల్‌ప్రదేశ్‌లో ప్రవేశిస్తోంది. మన భూభాగాలకు అత్యంత సమీపం నుంచే బ్రహ్మపుత్ర నదీ జలాలను తరలించుకుపోవాలని డ్రాగన్ వ్యూహ రచన చేస్తోంది. దీనికోసం ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగం నిర్మాణానికి డిజైన్లు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించిన చైనా ఇంజినీర్లు అనుమతుల కోసం ఎదురుచూస్తున్నారు.

భారత్ ఆందోళన పట్టించుకోని చైనా..
ఇప్పటికే బ్రహ్మపుత్రా నదిపై చైనా నిర్మించిన ప్రాజెక్టులకు భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అయితే, నదీ ప్రవాహానికి ఆటంకం కలిగించబోమని, అవి నీటిని నిల్వచేసే జలాశయాలు కాదని హామీ ఇచ్చింది. ఇప్పుడు దీనికి భిన్నంగా సొరంగ మార్గం నుంచే భారీగా జలాలను తరలించుకుపోవటానికి యత్నిస్తోంది ఈ డ్రాగన్ దేశం. దక్షిణ టిబెట్‌లోని సాంగ్రి కౌంటీ (అరుణాచల్‌ప్రదేశ్‌కు సమీపంలోని) నదీ భూగర్భం నుంచి ఈ సొరంగం ప్రారంభమవుతుంది. సాంగ్రి ప్రాంతంలో బ్రహ్మపుత్ర చాలా వెడల్పున బల్లపరుపుగా ప్రవహిస్తుంది. జలాలను తరలించటానికి ఈ ప్రాంతం అనువైనదిగా చైనా ఇంజినీర్లు గుర్తించారు. నది మధ్యలో కృత్రిమ దీవిని నిర్మించి బురద రాకుండా నియంత్రిత వ్యవస్థల ద్వారా సొరంగంలోకి నీటిని పంపించి తరలిస్తారని సమాచారం.
బ్రహ్మపుత్ర) నీటిని చైనా తరలిస్తే.. ఈశాన్య భారత్‌కు తీవ్ర నష్టం జరుగుతుంది. టిబెట్ పీఠభూమిలో చైనా చేపట్టిన ప్రాజెక్టుల వల్ల దిగువన బ్రహ్మపుత్రా నీటి ప్రవాహం తగ్గిపోతోందని భారత్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తోంది.

షిన్జియాంగ్ సస్యశ్యామలం కోసమే..
ఎడారులతో కూడిన కరవు ప్రాంతమైన షిన్జియాంగ్ దాహార్తిని తీర్చేందుకు ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల నుంచి నీటి మళ్లింపును చైనా చేపట్టింది. బ్రహ్మపుత్ర జలాలను భారీగా తరలించటం ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా మార్చాలన్నది తమ లక్ష్యమని ప్రాజెక్టు రూపకల్పనలో కీలకపాత్ర వహిస్తున్న ఇంజినీర్ ఒకరు తెలిపినట్లు హాంకాంగ్ నుంచి వెలువడే ‘సౌత్‌చైనా మార్నింగ్‌పోస్ట్' పేర్కొంది. కాగా, వివిధ రంగాలకు చెందిన 100 మంది శాస్త్రవేత్తలు ఈ భారీ ప్రాజెక్టుపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపింది. యునాన్ ప్రావిన్స్‌లో 600 కి.మీ. సొరంగం నిర్మాణాన్ని చైనా ఆగస్టులో ప్రారంభించింది. తాజాప్రాజెక్టుకు ఇది ముందస్తు కసరత్తుగా భావిస్తున్నారు. కాగా, ఇప్పటి వరకూ చైనా నిర్మించిన అతిపెద్ద సొరంగం పొడవు 85 కి.మీ. లియానింగ్ ప్రావిన్స్‌లోని దహువాఫాంగ్ నీటి పథకం కోసం దీనిని తవ్వారు.