కరోనా-5జీ వార్: రాయబారి డెత్ మిస్టరీ.. అమెరికాపైనే..ఇజ్రాయెల్‌కు చైనా టీమ్.. ట్రయాంగిల్ థ్రిల్లర్..
కరోనా విలయం, 5జీ నెట్‌వర్క్‌పై ప్రపంచ రాజకీయాలు ప్రమాదకరంగా మారిన వేళ.. ఇజ్రాయెల్ లో చైనా రాయబారి అనుమానాస్పద మృతి సంచలనం రేపింది. టెల్ అవీవ్ సిటీలో ఉంటోన్న చైనా రాయబారి డ్యు వీయ్(57) ఆదివారం తన బంగళాలో విగతజీవిగా కనిపించారు. నిజాల్ని నిగ్గుతేల్చేందుకు చైనా సర్కారు సోమవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఇజ్రాయెల్ పంపింది. మూడు దేశాల సంబంధాలపై తీవ్రప్రభావం చూపుతోన్న ఈ సంఘటన.. హాలీవుడ్ స్పై థ్రిల్లర్ కు ఏమాత్రం తీసిపోదని ఇంటర్నేషనల్ కాలమిస్టులు రాసుకొచ్చారు..
ఏపీలో కరోనా: పేకాటలో టీడీపీ ఎమ్మెల్సీ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు

అసలేం జరిగిందంటే..
చైనా విదేశీ వ్యవహారాల శాఖలో కీలక వ్యక్తిగా, సమర్థుడైన రాయబారిగా పేరుపొందిన డ్యు వీయ్.. గత ఫిబ్రవరిలోనే ఇజ్రాయెల్ లో విధులు చేపట్టారు. కరోనా ఆంక్షల కారణంగా భార్య, కొడుకును చైనాలోనే ఉంచేసి, టెల్ అవీవ్ లోని బంగళాలో ఒంటరిగా ఉంటోన్న ఆయన ఆదివారం హఠాన్మరణం చెందారు. గంటల హైడ్రామా తర్వాతగానీ ఆయన చనిపోయిన విషయాన్ని మీడియాకు వెల్లడించిన పోలీసులు.. అందుకు కారణాలను మాత్రం బయటపెట్టలేదు.

చైనా టీంలో డ్యూ భార్య..
రాయబారి ఆకస్మిక మృతిపై తొందరపడి స్పందించబోమన్న చైనా ప్రభుత్వం.. ఓ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఇజ్రాయెల్ పంపింది. సోమవారం టెల్ అవీవ్ కు చేరుకోనున్న చైనా టీమ్.. డ్యు వీయ్ బస చేసిన బంగళాను, ఆయనకు సంబంధించిన ఫైల్స్, డేటాను సేకరించడంతోపాటు చావుకు దారితీసిన పరిస్థితులను దర్యాప్తు చేయనుంది. కాగా, టెల్ అవీవ్ చేరుకున్న చైనా బృందంలో రాయబారి భార్య, కొడుకు కూడా ఉన్నారు. డ్యూ వీయ్ మృతి పట్ల ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ సంతాపం ప్రకటించింది. చైనా దర్యాప్తుకు సహకరిస్తామని టెల్ అవీవ్ పోలీసులు చెప్పారు.

పాంపియో మెరుపు పర్యటన తర్వాతే..
కరోనా కంటే ముందు నుంచే చైనాను టార్గెట్ చేస్తూ వస్తోన్న అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. వైరస్ విలయానికి కూడా డ్రాగనే కారణమని వాదిస్తున్నారు. కరోనా కారణంగా ప్రపంచదేశాలకు జరిగిన నష్టాన్ని చైనా నుంచి వసూలు చేయాల్సిందేననీ ఆయన పట్టుపడుతున్నారు. ఐక్యరాజ్యసమితి వేదికగా దేశాల మద్దతు కూడగడుతున్నారు. ట్రంప్ చేస్తోన్న ప్రయత్నాలను తీవ్రంగా నిరసిస్తూ రాయబారి డ్యు వీయ్ ఇజ్రాయెల్ పత్రికల్లో సంచలన వ్యాసాలు రాశారు. చడీచప్పుడు లేకుండా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో.. ఇజ్రాయెల్ లో మెరుపు పర్యటన చేసి వెళ్లిన కొద్ది గంటలకే చైనా రాయబారి అనుమానాస్పద రీతిలో చనిపోయారు.

అసలు కారణం ఇదేనంటూ..
చైనా రాయబారిది హత్యే అని ఇప్పటిదాకా నిర్ధారణ కానప్పటికీ.. ఆయన మరణం అమెరికాకు అవసరమన్న భావన మాత్రం అందరిలో ఉందని ‘‘జెరుసలేం పోస్ట్'' విశ్లేషకుడు లహావ్ హార్కోవ్ అభిప్రాయపడ్డారు. అమెరికా ఆంక్షలు, ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో ఇతర మార్గాల ద్వారా వ్యాపార, వాణిజ్యల వృద్ధిపై ఫోకస్ పెట్టిన చైనా.. అదే అమెరికాకు ఆప్తమిత్రుడైన ఇజ్రాయెల్ కు ఇటీవల కాలంలో బాగా దగ్గరైంది. డ్యు వీయ్ తనదైన దౌత్య చాణక్యంతో.. ఈ మధ్యలోనే ఇజ్రాయెల్ లో నిర్మించబోయే వందలాది ప్రాజెక్టులు చైనా కంపెనీలకు దక్కేలా చేశారు. ఒక దశలో అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, విదేశాంగ మంత్రి పాంపియో బహిరంగానే ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇచ్చారు. నిర్మాణరంగం, 5జీ నెట్ వర్క్ విస్తరణలో చైనాతో దోస్తీ చేస్తే అమెరికా మద్దతు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అయినాసరే, ఇజ్రాయెల్ మాత్రం చైనా వైపునకే మొగ్గుచూపుతుండటం.. అంతలోనే రాయబారి అనుమానాస్పదంగా చనిపోవడం కలకలం రేపుతున్నది.