చేపలకు కరోనా ... ఇండియా నుండి దిగుమతులను నిలిపేసిన చైనా
చైనాలో మరో మారు కరోనా కలకలం రేగింది. దిగుమతి చేసుకున్న ఆహారపదార్థాల్లో కరోనా వైరస్ ఉండటం చైనాలో కలకలం సృష్టించింది. భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న చేపలలో కోవిడ్ -19 వైరస్ ఉండడంతో భారత సంస్థ నుండి చేపల దిగుమతిని తాత్కాలికంగా నిలిపివేయాలని చైనా ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది.
భారతదేశం యొక్క బసు ఇంటర్నేషనల్ నుండి చేపల దిగుమతిని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న చైనా సర్కార్ ఒక వారం పాటు చేపల దిగుమతిని నిలిపివేస్తామని కస్టమ్ కార్యాలయం ద్వారా తెలిపింది. బసు ఇంటర్నేషనల్ సంస్థ చైనాకు పంపించిన కటిల్ ఫిష్ యొక్క మూడు నమూనాలలో కరోనావైరస్ ను గుర్తించినట్లుగా సమాచారం. దీంతో ఒక వారం పాటు దిగుమతులు నిలిపివేసినట్లుగా వెల్లడించింది.
ఒక వారం తరువాత దిగుమతులు తిరిగి ప్రారంభమవుతాయని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ వారం చైనా ఇండోనేషియా సంస్థ పిటి నుండి కూడా దిగుమతులను నిలిపివేసింది. సంస్థ సరఫరా చేసిన చేపల ఉత్పత్తుల నమూనాలలో కరోనావైరస్ ను కస్టమ్స్ గుర్తించిన తరువాత అనుగ్రహ్ లాట్ ఇండోనేషియా సంస్థ ఉత్పత్తులను కూడా 7 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు గా ప్రకటించింది. ఈ 7 రోజుల తరువాత తిరిగి చేపల దిగుమతి జరగనున్నట్లుగా తెలుస్తోంది.