చైనా బరితెగింపు:యుద్ధానికి వీలుగా సరిహద్దులో కొత్త ఆర్మీ కంటోన్మెంట్లు -శాటిలైట్ చిత్రాల్లో బట్టబయలు
గడిచిన పది రోజుల వ్యవధిలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం పాల్గొన్న సార్క్, జీ-20 సదస్సుల్లో చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ మాట్లాడుతూ.. తాము శాంతికాముకులమని, సరిహద్దు వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని చిలక పలుకులు పలికారు. కానీ వాస్తవంలో చైనా మరింత బరితెగించినట్లు వ్యవహరిస్తున్నది. భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి ఆరు నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతలను మరింత పెంచుతూ డ్రాగన్ కొత్త జిత్తులు వేస్తున్నట్లు సాక్ష్యాధారాలతో సహా బట్టబయలైంది. వివరాల్లోకి వెళితే..
భార్య నగ్న వీడియోలు లైవ్ స్ట్రీమింగ్ -నచ్చితే పంపుతానని బేరాలు -గుంటూరు కేసులో మరో ట్విస్ట్

గ్రామాల ముసుగులో కంటోన్మెంట్లు..
ఎల్ఏసీకి అతి సమీపంగా, భూటాన్ సరిహద్దులోని చైనా భూభాగంలో కీలక ప్రదేశమైన తోర్సా రివర్ వ్యాలీలో డ్రాగన్ ఆర్మీ భారీ ఎత్తున కొత్త నిర్మాణాలు చేపట్టింది. ఇంటిగ్రేటెడ్ గ్రామాల పేరుతో కొత్తగా చేపట్టిన ఈ నిర్మాణాలు ముమ్మాటికీ ఆర్మీ కంటోన్మెంట్లకు అనుబంధంగా ఏర్పాటు చేసినవేనని భారత ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. సరిహద్దుకు సమీపంగా నిర్మించిన పంగ్డా గ్రామంలో దాదాపు 30 ఇళ్లను ఏర్పాటు చేశారు. ఇవి సాధారణ పౌరులు నివసించడానికేనని డ్రాగన్ వాదిస్తున్నప్పటికీ అక్కడ ఆర్మీ తప్ప జనం కదలికలు లేవని శాటిలైట్ చిత్రాల్లో వెల్లడైంది.
చంద్రబాబుకు భారీ షాక్: తిరుపతిలో పోటీకి పనబాక నో? -వైసీపీ సాయిరెడ్డి సంచలనం -నిమ్మగడ్డ చక్రం

ఇంటిగ్రేటెడ్ హైడ్రామా..
భారత్ సహా పొరుగు దేశాల సరిహద్దుల ఆక్రమణే లక్ష్యంగా చైనా ‘ఐదు వేళ్ల' వ్యూహాన్ని అమలు చేస్తున్నది. అందులో భాగంగా.. టిబెట్‌ను కుడిచేతి అరచేయిగా.. లదాక్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్‌ప్రదేశ్‌లను ఐదు వేళ్లలాగా భావిస్తోంది. ఈ ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ విలేజెస్ పేరుతో ఏడాది కాలంగా చైనీస్ ఆర్మీ హైడ్రామా నడిపిస్తోంది. సాధారణ ప్రజల కోసమే కడుతున్నామని బుకాయిస్తున్నా, సదరు నిర్మాణాలు ఆర్మీ వాడకానికి కూడా పనికొచ్చేలా బంకర్లు, ఆయుధ గోడౌన్లు, అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలను అక్కడ ఏర్పాటు చేశారు.

శాటిలైట్ చిత్రాల్లో గుట్టు రట్టు..
అంతరిక్ష పరిశోధనల సంస్థ మ్యాక్సర్ తన గోయే-1 శాటిలైట్ ద్వారా చిత్రీకరించిన హైరిజల్యూషన్ ఫొటోలను తాజాగా విడుదల చేసింది. తోర్సా రివర్ వ్యాలీలో ‘పంగ్డా' పేరుతో కొత్త వెలసిన తీరుగానే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం సరిహద్దులోనూ చైనా కొత్త గ్రామాలను నిర్మించినట్లు భారత ఆర్మీ వర్గాలు గుర్తించాయి. సడెన్ గా యుద్ధానికి పిలుపునిస్తే, వెంటనే చొరబడేందుకు వీలుగా చైనీస్ ఆర్మీ అత్యంత పకడ్బందీగా ఈ ఇంటిగ్రేటెడ్ గ్రామాలను నిర్మిస్తున్నదని, వాటికి అనుబంధంగా నాలుగు లేన్ల భారీ రహదారులను కూడా నిర్మించారని ఆ వార్గాలు తెలిపాయి. అయితే, భారత్ సైతం చైనాకు సవాలుగా సరిహద్దుకు ఇవతలి భాగంలో అత్యాధునిక రోడ్లను నిర్మిస్తున్నదని, అక్కడికి టూరిస్టులను అనుమతించే దిశగానూ ఆలోచనలు చేస్తున్నదని ఆర్మీ వర్గాలు పేర్కొన్నాయి.

చలికాలంలో యుద్ధానికి సిద్ధంగా..
వివాదాస్పద డోక్లామ్ పీఠభూమికి చేరువలో భూటాన్ భూభాగంలోకిచొచ్చుకొచ్చి మరీ ఎల్ఏసీకి దగ్గరగా చైనా కొత్త గ్రామాన్ని నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాల్లో బయటపడింది. దీంతో తమ భూభాగాన్ని చైనా ఆక్రమించలేదంటూ భూటాన్ చేసిన ప్రకటన తేలిపోయింది. అదే సమయంలో భారత సైన్యం కదలికలపై నిఘా కోసం చైనీస్ ఆర్మీ.. లదాక్ నుంచి సిక్కిం వరకు అధునాతన రాడార్ వ్యవస్థను ఏర్పాటుచేసుకునే పనిలోనూ నిమగ్నం అయింది. చలికాలంలోనూ యుద్ధానికి సిద్ధమంటూ రెండు దేశాల ఆర్మీ అధికారులు ఇదివరకే ప్రకటించిన నేపథ్యంలో సరిహద్దులో ఏం జరగబోతోందనే టెన్షన్ పెరిగిపోయింది. మరోవైపు, ఉద్రిక్తతల నివారణ కోసం భారత్, చైనాలు సైనిక, దౌత్య మార్గాల్లో చేస్తోన్న చర్చలన్నీ విఫలం అవుతూ వస్తున్నాయి.