• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దీర్ఘకాలిక కోవిడ్‌: ‘రిపోర్టులన్నీ నార్మల్‌గానే వచ్చాయి. కానీ అడుగేస్తే నరకం కనిపించేది’

By BBC News తెలుగు
|

కోవిడ్ చాలా మంది జీవితాలను మార్చేసింది.

లండన్‌లో హెల్త్ కోచ్‌గా పని చేస్తున్న 31 సంవత్సరాల జాస్మిన్ హేయర్ కోవిడ్ బారిన పడ్డారు.

Coronavirus

దాంతో ఆమె లండన్ వదిలి తన తల్లితండ్రుల దగ్గరకు వెళ్లాల్సి వచ్చింది.

ప్రస్తుతం ఆమె ముందు రెండే లక్ష్యాలు ఉన్నాయి.

ఒకటి ఆమె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం.

రెండవది దీర్ఘకాలిక కోవిడ్ బారిన పడిన వారికి సరైన చికిత్స తీసుకునేలా సలహాలు ఇవ్వడం.

ఆరోగ్యకరమైన జీవితం ఎలా గడపాలో శిక్షణ ఇచ్చే జాస్మిన్ లాంటి వారికి తన శరీరాన్ని కూడా కదల్చలేకపోవడం ఊహించలేని విషయం.

ఆమె యోగా టీచర్ అయ్యేందుకు శిక్షణ తీసుకుంటున్నారు.

లండన్‌లో ఆమె వ్యక్తిత్వానికి సరిపోయే విధంగా మంచి జీవితం గడుపుతూ ఉండేవారు.

మార్చి నెలలో ఒక వారం రోజుల పాటు జలుబు లాంటి లక్షణాలతో బాధపడిన తర్వాత ఆమెకు నెమ్మదిగా వాసన, రుచి కోల్పోయినట్లు అనిపించింది.

ఆమె కష్టాలకు అది ఆరంభం. ఆమెతో పాటు ఫ్లాట్‌లో ఉండే వ్యక్తికి కూడా వైరస్ సోకింది. దాంతో ఆమె ఇంటి లోపలే ఉండిపోయారు.

ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారింది. ఆ నెలంతా ఆమె భయంతోనే గడిపారు.

దగ్గు, జ్వరం లేకపోవడంతో డాక్టర్లు ఆమెను ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు.

కోలుకుంటున్నాననే అనుకున్నారు కానీ..

ఆమె తను కోలుకుంటున్నాననే అనుకున్నారు. కానీ మే నెలలో శ్వాస తీసుకోవడానికి జాస్మిన్ ఇబ్బంది పడ్డారు.

"ఇంటి చుట్టూ నడిచినా కూడా అగ్గి మీద నడిచినట్లుగా అనిపించేది" అని ఆమె చెప్పారు.

జూన్ నెలలో 10 నిమిషాలు వ్యాయామం చేయడానికి ప్రయత్నించి ఆమె ఒక వారం రోజుల పాటు మంచానపడ్డారు.

ఆ తర్వాత చేతుల మీద దద్దుర్లు వచ్చి, చీమలు పాకుతున్నట్లుగా అనిపించింది అని ఆమె చెప్పారు.

బరువు తగ్గిపోవడం, నెలసరి సక్రమంగా రాకపోవడం, ఎసిడిటి, గుండె కొట్టుకునే వేగం పెరగడం, దడ, నిద్ర పట్టకపోవడం లాంటి లక్షణాలతో బాధపడినట్లు జాస్మిన్ వివరించారు.

రోజులో చాలాసార్లు అకస్మాత్తుగా ఆందోళనకు గురై, మానసిక ఒత్తిడికి గురవుతూ ఉండేవారు.

ఇక ఈ బాధను ఒక్కరే భరించలేక ఆమె తన తల్లితండ్రుల దగ్గరకు వెళ్లిపోయారు.

"నాకు మంచం మీద దుప్పటి వేసుకోవడానికి కూడా సహాయం అవసరం అవుతూ ఉండేది" అని జాస్మిన్ చెప్పారు.

ఆమె లక్షణాలను డాక్టర్లు కేవలం ఆందోళన మాత్రమేనని కొట్టిపారేశారు.

ఈ జబ్బు లక్షణాలకు వైద్యపరంగా ఆధారాలేవీ లేకపోవడం ఆమెను నిస్పృహకు గురి చేసేది.

ఆమెను ఒంటరితనం బాధించేది. ఒక రోజు ఆమెకు యాంటిబాడీ పరీక్షలో పాజిటివ్ వచ్చింది.

ఆమె ఊపిరితిత్తుల పని తీరు నెమ్మదిగా మెరుగవడం మొదలయింది.

కొన్ని రోజుల తర్వాత కొంతసేపు నడవడానికి బయటకు వెళ్లేవారు.

"ఈ మొత్తమంతా ఒక అగ్గి ఉప్పెనలా అనిపించింది" అని జాస్మిన్ చెప్పారు.

"గుండె పట్టేసినట్లు అయి, ఒక సుడిగాలి ఊపిరితిత్తులను పట్టేసి, గుండెను వేగంగా కొడుతున్నట్లుగా అనిపించేది. నాకెందుకో చనిపోతున్నట్లు అనిపించేది. జీవితం నా నుంచి వెళ్ళిపోతున్నట్లు అనిపించేది" అని జాస్మిన్ చెప్పారు.

దాంతో ఆమె ఎక్స్ రే, రక్త పరీక్షలు, ఎలక్ట్రో కార్డియోగ్రామ్ చేయించుకున్నారు.

అవన్నీ సాధారణంగానే ఉన్నాయి. దాంతో, డాక్టర్లు ఆమె ఊపిరితిత్తులు బాగానే ఉన్నాయని, కోవిడ్ వలన చాలా బాధ అనుభవిస్తున్నారేమోననే అనుమానం వ్యక్తం చేశారు.

యూకేలో వచ్చిన 100 దీర్ఘకాలిక కోవిడ్ కేసులను చూస్తున్న రాయల్ బ్రామ్ప్టన్ హాస్పిటల్‌లో డాక్టర్ విలియం మాన్ ఆమెకు చికిత్స ఇవ్వడం మొదలుపెట్టారు.

ఆయన చికిత్సతో మొత్తం ఆట స్వరూపమే మారిపోయింది అని జాస్మిన్ అంటారు.

ఆమెకు ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తినట్లు తెలుసుకున్నారు.

ఆమె శ్వాస స్థాయిలు ఊపిరితిత్తుల రోగికి ఉన్నట్లు 53శాతం మాత్రమే ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.

ఆమె కుడి ఊపిరితిత్తిపైన ఒక ఆటంకం ఉన్నట్లు డాక్టర్లు తెలుసుకున్నారు. వాటిని చిన్న చిన్న రక్తపు గడ్డలుగా గుర్తించారు.

దాంతో అవి పలచబడేందుకు ఆమె మందులు తీసుకోవడం మొదలుపెట్టారు.

ఆమె గుండె చుట్టూ నీరు చేరినట్లు ఎకో కార్డియోగ్రామ్ పరీక్షల్లో తేలింది.

గ్రంథులకు జ్వరం కల్గించే ఎప్స్టీన్ బార్ యాంటీబాడీల పరీక్షలో కూడా ఆమెకు పాజిటివ్ అని తేలింది.

కోవిడ్‌కి దీనికి ఏమైనా సంబంధం ఉందేమో అనే అంశంపై మరింత పరిశోధన జరగాలని ఆమె ఆశిస్తున్నారు.

ఈ నెలాఖరుకి ఆమె మరోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది.

"ఈ దీర్ఘకాలిక కోవిడ్ నన్ను నాశనం చేసేసింది. నన్ను మానసికంగా, శారీరకంగా బంధించేసింది" అని ఆమె చెప్పారు.

"నేను ఒక గూట్లో ఉండిపోయాను. నేనెలా ఉండేదానినో ఆలోచించుకుంటూ బాధపడ్డాను. కానీ, నేను ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు పోరాడుతున్నాను" అని జాస్మిన్ చెప్పారు.

దీర్ఘకాలిక కోవిడ్ అంటే ఏమిటి?

కరోనావైరస్ సోకిన వారు కొన్ని రోజులు లేదా వారాలలోపే కోలుకోవచ్చు.

కానీ కొంత మందికి వాటి లక్షణాలు చాలా రోజులు ఉండవచ్చు.

దీర్ఘకాలిక కోవిడ్ గురించి ఇంకా పూర్తిగా అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికొక సార్వత్రిక నిర్వచనం లేదు.

ఇది సోకితే, అలసట, దగ్గు, తలనొప్పి, కీళ్లనొప్పులు రావచ్చు.

మొదటి సారి ఇన్ఫెక్షన్ సోకిన వారిలో ప్రతి ఐదుగురిలో ఒక్కరికి ఐదు వారాల తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ప్రతిఏడుగురిలో ఒక్కరికి 12 వారాల తర్వాత దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి.

35-49 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న మహిళలు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు.

తేలికపాటి లక్షణాలు కనిపించిన వారిలో కూడా ఆ తర్వాత దీర్ఘకాలిక లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.

దీర్ఘకాలికంగా ఉండే కోవిడ్ చికిత్స చేయడానికి ఇంగ్లాండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ 10 మిలియన్ పౌండ్లను వెచ్చించి క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. (ఆధారం: ఎన్హెచ్ఎస్)

చాలామంది సరైన సమయంలో వైద్య సహాయం తీసుకోవడం లేదని జాస్మిన్ విచారం వ్యక్తం చేశారు.

దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలను పొందుపరిచి తన కథను పది మందితో పంచుకోవడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు.

"నాకు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది సందేశాలను పంపిస్తున్నారు. నేను రాసిన వివరాలను ఒక అమ్మాయి డాక్టర్‌కి చూపించడం వల్ల ఆమెకు చాలా వైద్య పరీక్షలు చేయిస్తున్నారు" అని జాస్మిన్ చెప్పారు.

"ఈ పరిస్థితి అంతా ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు. చెప్పాలంటే మీకు మీరే ఒంటరిగా మిగిలిపోతారు" అని ఆమె అన్నారు.

తిరిగి లండన్ వెళ్లి, యోగ శిక్షకురాలి కోర్సు పూర్తి చేస్తాననే ఆశతో జాస్మిన్ ఉన్నారు.

వ్యాయామం చేయడానికి, ఎక్కువ సేపు మాట్లాడటానికి ఇప్పటికీ ఆమెకు కష్టంగానే ఉంది. ఆమె ప్రస్తుతం రాయడంలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తున్నారు.

"నాకు చాలా సుదూర ప్రయాణంలా అనిపిస్తోంది. అందుకే నేనేదైనా మంచి చేయాలని అనుకున్నాను.

"నేను చాలా నేర్చుకున్నాను. నా అనుభవాన్ని, దీనికి చికిత్స అందిస్తున్న డాక్టర్లతో సహా అందరితో పంచుకోవాలని నాకుంది” అని జాస్మిన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Chronic Covid: ‘All reports came normal But it looks like hell'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X