• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హిమాలయాల్లోని ఈ అద్భుత పర్వతాన్ని అధిరోహించటం నిషిద్ధం... ఎందుకంటే

By BBC News తెలుగు
|

ఒక వేసవి కాలంలో బస్సులో వెళుతూ కిటికీ లోనుంచి బయటకు చూస్తున్నాను. చిన్నచిన్న కొండల మధ్య నింగినంటుతూ త్రిభుజాకారంలో ఒక భారీ శ్వేత పర్వతం ప్రత్యక్షమైంది. ఆకాశంలో మేఘాలు దాని శిఖరాన్ని కప్పేశాయి. ఆ పర్వతం సంభ్రమాశ్చర్యాలను రేకెత్తించింది. దశాబ్ద కాలంగా హిమాలయాల్లో పర్యటిస్తూ అనేకానేక పర్వతాలను చూసిన నేను.. ఇటువంటి అద్భుతమైన పర్వతాన్ని చూడటం ఇదే మొదటిసారి.

అది ఎవరెస్ట్ పర్వతం కాదు. అలాగని దేశంలో 8,000 మీటర్లకు పైగా ఎత్తున్న ఏడు పర్వతాల్లో ఒకటీ కాదు. కానీ ఆ పర్వతం అందం నన్ను కట్టిపడేసింది. నేపాల్ లోని ప్రఖ్యాత పొఖారా లోయలో పొఖారా నగరం మీద నిట్టనిలువుగా కనిపిస్తోందీ పర్వతం.

'మచ్చపుచ్చారి’ – ఈ పర్వతం పేరిది. అంటే 'చేప తోక’ అని అర్థం. ఈ పర్వతం ఎత్తు 6,993 మీటర్లు. సెంట్రల్ నేపాల్ లోని అన్నపూర్ణ పర్వత శ్రేణుల్లోనే ఇది కూడా ఉంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 10 పర్వత శిఖరాల్లో మూడు పర్వతాలు ఈ శ్రేణిలోనే ఉన్నాయి. కానీ ఆ ఎత్తైన పర్వతాలకు దూరంగా ఒంటరిగా నిలుచున్న మచ్చపుచ్చారి ఎత్తు కాస్త తక్కువైనా ఎంతో అందంగా ఉంటుంది. ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తుంది.

భౌగోళికంగా ఈ పర్వతం ఉన్న ప్రదేశం వల్ల.. దీనిని అనేక వైపుల నుంచి చూడవచ్చు. ఎంత దూరం నుంచి, ఏ కోణం నుంచి చూసినా దీని శిఖరం అత్యంత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. రెండు కోణాలు నిలువుగా ఉండి ఒకదానిని ఒకటి పెనవేసుకుంటున్నట్లుగా.. నిట్టనిలువుగా రెండు శిఖరాలుగా కనిపిస్తుంది.

హిమాలయాలు

మొదటిసారి ఈ పర్వతాన్ని చూసిన నేను ఆ తర్వాత నేపాల్ వచ్చిన ప్రతిసారీ దీని దగ్గరకు వచ్చేదాన్ని. ఫేవా లేక్‌లో మచ్చపుచ్చారి ప్రతిబింబాన్ని చూస్తూ కొన్ని రోజులు గడిపాను. కొన్ని రోజులు.. పర్వత శిఖరం మీద ఉదయం, సాయంత్రాల్లో ప్రతిఫలనమయ్యే సూర్యుడి వెలుతురును చూస్తూ గడిపాను. మరికొన్ని రోజులు పరిసరాల్లోని సారంగ్‌కోట్, ఆస్టామ్ పర్వత శ్రేణుల మీద నుంచి మచ్చపుచ్చారి అందాలను చూస్తూ గడిపాను.

చివరికి ఓ చలి కాలంలో మచ్చపుచ్చారి బేస్ క్యాంప్ వరకూ వెళ్లాను. ఆ పర్వతానికి దిగువన గల మార్డీ హిమల్ అనే చిన్న పర్వతం ఇది. ఈ క్యాంప్‌ను 2012లో ఏర్పాటు చేశారు. ఇది 4,500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడికి చేరుకోవటానికి ఐదు రోజుల పాటు 40 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. అక్కడి నుంచి మచ్చపుచ్చారిని అతి సమీపంగా ఇంకా చక్కగా చూడొచ్చు. ఇంకో 1,000 మీటర్లు పైకి ఎక్కితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇక అక్కడి నుంచి ఎవరూ ముందుకు వెళ్లటానికి వీల్లేదు.

ఎందుకంటే.. మచ్చపుచ్చారి పైకి ఎక్కటం నిషిద్ధం. పర్వత పర్యాటక రంగాన్ని ప్రధానంగా ప్రోత్సహించే నేపాల్ వంటి దేశంలో.. 8,848 మీటర్ల ఎత్తున్న ఎవరెస్టు మీద కూడా పర్వతారోహకుల రద్దీ విపరీతంగా ఉండే ఈ దేశంలో.. ఒక అద్భుతమైన పర్వతాన్ని అధిరోహించటం మీద నిషేధం విధించటం చిత్రమైన విషయమే. ఈ పర్వతాన్ని ఇంతవరకూ అధికారికంగా ఎవరూ అధిరోహించలేదు.

ఈ నిషేధం వెనుక ఒక చిత్రమైన కథ ఉంది. నాకన్నా కొన్ని దశాబ్దాల ముందు మరో వ్యక్తి కూడా ఈ పర్వతంతో ప్రేమలో పడ్డాడు. నేపాల్‌లో ట్రెక్కింగ్ అనేది వాణిజ్యపరంగా విస్ఫోటనం చెందటానికి బీజాలు వేసింది కూడా ఆయనే. ఆయన పేరు లెఫ్టినెంట్ కల్నల్ జేమ్స్ ఓవెన్ మెరియన్ రాబర్ట్స్ (1916-1997). బ్రిటిష్ సైనికాధికారి. జిమ్మీ రాబర్ట్స్ గా సుపరిచితుడు.

ఆయన 1958లో నేపాల్‌కు తొలి మిలటరీ అటాచీగా నియమితుడయ్యారు. హిమాలయాల అన్వేషణలో స్వర్ణయుగానికి ఆయన నాంది పలికారు. ఈ మంచు పర్వతాల అందాల ద్వారాలను ప్రపంచానికి తెరిచారు. ఇక్కడ మారుమూల ప్రాంతాల్లోని పర్వతాల అధిరోహణను వాణిజ్యపరంగా చేపట్టటానికి ఆయన కృషిచేశారు. దేశంలో తొలి ట్రెక్కింగ్ ఏజెన్సీ మౌంటెయిన్ ట్రావెల్‌ను 1964లో స్థాపించారు. ఈ పర్యాటక రంగం అభివృద్ధి చెందటం నేపాల్‌కు ఆర్థికంగా, స్థానిక ప్రజలకు ఉపాధిపరంగా తోడ్పాటునందిస్తోంది.

నేపాల్‌లో ఆయనను ఇప్పటికీ 'ఫాదర్ ఆఫ్ ట్రెక్కింగ్’ అని గుర్తు చేసుకుంటూ ఉంటారు.

మచ్చపుచ్చారి గురించి, దాని దిగువన క సరస్సు కింద గల ఒక ఊరి గురించి 1936లో ఒక సైనికాధికారి రాసిన లేఖతో.. జిమ్మీకి కూడా ఈ పర్వతం మీద విపరీతమైన ఆసక్తి పెరిగింది. అయితే.. ఆ రోజుల్లో నేపాల్ లోని అంతర్గత ప్రాంతాల్లో గల అనేక పర్వతాలను అధిరోహించటం నిషిద్ధమని, మక్కా, లాసా వంటి మత కేంద్రాలను అవి ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు.. బయటివారు అడుగుపెట్టకుండా ఎంత పటిష్టంగా మూసివేశారో అంతకన్నా ఎక్కువగా ఈ ప్రాంతాల్లోకి ప్రవేశం ఉండేది కాదని జిమ్మీ అనంతర కాలంలో.. 'క్లైంబింగ్ ది ఫిష్ టెయిల్’ అనే పేరుతో విల్ఫ్రెడ్ నోయిస్ రాసిన పుస్తకానికి రాసిన ముందు మాటలో వివరించారు.

జిమ్మీ ఎట్టకేలకు 1950లో మచ్చపుచ్చారిని అతి సమీపం నుంచి చూశారు. ''నా ప్రైవేటు మక్కా (పొఖారా) లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి ఇంగ్లిష్ మ్యాన్‌ని నేనే. వెన్నెలలో మచ్చపుచ్చారి మెరుస్తూ ఉంది. ఒంటరిగా నిలుచున్న ఓ మహా వైట్ పిరమిడ్’’ అని ఆయన అభివర్ణించారు.

ఈ పర్వతం తనకు ఒక ఆదర్శ పర్వతంగా మారిందని.. అది తనకే సొంతమని అనిపిస్తుందని కూడా ఆయన రాశారు. ఆ పర్వతం గురించిన ఆలోచనలు తన మిగతా జీవితాన్ని మలచాయనీ చెప్పారు.

చివరికి 1957లో మచ్చపుచ్చారిని అధిరోహించటానికి జిమ్మీ సమాయత్తమయ్యారు. దీనిని అధిరోహించే మొట్టమొదటి పర్వతారోహకుల బృందం ఏర్పాటైంది. విల్ఫ్రెడ్ నోయిస్ ఈ బృందానికి సారథి. ఆయన కథనం ప్రకారం.. సగం దూరం వెళ్లాక సదుపాయాల సమస్యల వల్ల పర్వతారోహకుల బృందంలో సభ్యుల సంఖ్యను రెండుకు తగ్గించాల్సి వచ్చింది. ఆ పరిస్థితిలో జిమ్మీ చాలా తేలికగా తన కలను వదిలిపెట్టాడు. మద్దతుగా వచ్చిన బృందాన్ని తీసుకుని కిందికి వెళ్లటానికి ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. నోయిస్, మరో పర్వతాహకుడు ముందుకు సాగారు. కానీ.. శిఖరం మరో 45 మీటర్ల ఎత్తు ఉందనగా.. వాతావరణం అనుకూలించకపోవటంతో వారు కూడా వెనుదిరగాల్సి వచ్చింది.

ఆ విఫలప్రయత్నం అనంతరం.. నేపాల్ ప్రభుత్వాన్ని జిమ్మీ ఒక అసాధారణ కోరిక కోరారు. మచ్చపుచ్చారిని అధిరోహించకుండా నిషేధాజ్ఞలు విధించాలన్నది ఆ కోరిక. హిమాలయ పర్వతాల్లో మచ్చపుచ్చారి శాశ్వతంగా ఎవరూ అధిరోహించని పర్వతంగా ఉండిపోయేలా చూడాలన్నది ఆయన విన్నపం.

ఆశ్చర్యం ఏమిటంటే.. నేపాల్ సర్కారు అందుకు అంగీకరించింది.

హిమాలయాలు

పొఖారా, ఆ పరిసరాల్లో నివసించే గూర్ఖా జాతి ప్రజలైన గురుంగ్‌లతో జిమ్మీకి చాలా సన్నిహితమైన సంబంధబాంధవ్యాలు ఉండేవి. మచ్చపుచ్చారికి అత్యంత సమీపంలోని చోమ్రాంగ్ గ్రామంలోని గురుంగ్ ప్రజలకు మచ్చపుచ్చారి ఒక పవిత్ర పర్వతం. విదేశీ పర్వతారోహకులు తాము పవిత్రంగా భావించే పర్వతం మీదకు ఎక్కటం వీరిని బాధపెట్టేది.

నిజానికి నేపాల్ హిమాలయాల్లోని పలు పర్వతాలు పలు జాతుల వారికి పవిత్రమైన పర్వతాలే. ఆ కారణంగా ఆయా పర్వతాలను అధిరోహించటానికి నేపాల్ సర్కారు అనుమతులు ఇవ్వకుండా ఆగలేదు. జిమ్మీ కూడా ఆ పర్వతాలు ఎక్కకుండా ఉండలేదు.

బహుశా.. మచ్చపుచ్చారి మీద ఆయనకు గల అనిర్వచనీయమైన అభిమానం, గురుంగ్ ప్రజల మీద ఉన్న ప్రేమ కారణంగా.. ఆ పర్వతాన్ని ఎవరూ అధిరోహించకుండా నిషేధించాలని ఆయన కోరివుంటారేమో.

నేపాల్ ప్రభుత్వాన్ని ఆయన ఎలా ఒప్పించగలిగారనేది ఇప్పటికీ రహస్యమే. అయితే.. ఇప్పటివరకూ మనిషి పాదం మోపని ఈ పర్వత శిఖరాన్ని అధిరోహించటం చట్టవిరుద్ధమన్న ఆదేశాలకు నేపాల్‌ జనం విస్తారంగా ఆమోదించారు.

వాస్తవానికి.. ఈ పర్వతాన్ని అధిరోహించకుండా నిషేధం విధించటంలో జిమ్మీ రాబర్ట్స్ పాత్రను జనం దాదాపుగా మరచిపోయారు కూడా. ఈ పర్వతం పవిత్రమైనదని, కాబట్టి దానిని అధిరోహించటం నిషిద్ధమని ఇప్పుడు జనంలో ఉన్న అభిప్రాయం.

''మచ్చపుచ్చారి మీద కాలు పెట్టకూడదు. దానిని కళ్లతోనే ఆరాధించాలి’’ అని పొఖారా నివాసి, కవి తీర్థ శ్రేష్ట నాతో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Climbing this amazing mountain in the Himalayas is forbidden
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X