అమెరికాలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్: తొలికేసు: నో ట్రావెల్ హిస్టరీ: లోకల్‌గా వ్యాప్తి
వాషింగ్టన్: బ్రిటన్‌లో సరికొత్త రూపాన్ని సంతరించుకున్న కరోనా వైరస్ మహమ్మారి.. క్రమంగా అన్ని దేశాలు చుట్టబెట్టేసేలా కనిపిస్తోంది. కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్‌కు సంబంధించిన ఏడు కేసులు ఇప్పటికే భారత్‌లో నమోదు అయ్యాయి. బ్రిటన్ సహా అనేక దేశాల్లో ఆ లక్షణాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా- అగ్రరాజ్యం అమెరికాలో కొత్త స్ట్రెయిన్ ఎంట్రీ ఇచ్చింది. కొలరాడోలో తొలి కేసు నమోదు అయింది. 20 సంవత్సరాల యువకుడిలో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్‌ను గుర్తించారు. ఆ యువకుడికి ఎలాాంటి ట్రావెల్ హిస్టరీ లేకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.
హీరో రామ్ చరణ్‌కు సోకిన కరోనా: సెట్లో కలకలం: అభిమానులు ఏం చెబుతున్నారంటే?

కొత్త వేరియంట్ బీ.1.1.7గా
మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్నఆ యువకుడికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. సాధారణ కరోనా వైరస్ లక్షణాల కంటే అతని అనారోగ్య తీవ్రత అధికంగా ఉండటంతో శాంపిళ్లను సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్కు పంపించారు. బ్రిటన్‌లో వెలుగు చూసిన కరోనా వైరస్ కొత్త వేరియంట్ బీ.1.1.7గా దాన్ని నిర్ధారించారు. రాజధాని డెన్వర్ శివార్లలోని ఎల్బర్ట్ కౌంటీకి చెందిన ఆ యువకుడిని స్థానిక ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ట్రావెల్ హిస్టరీలేని యువకుడిలో..
ట్రావెల్ హిస్టరీ లేని ఓ యువకుడిలో కరోనా వైరస్ వేరియంట్ కనిపించడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటిదాకా బ్రిటన్ నుంచి స్వదేశాలకు వచ్చిన వారిలోనే ఈ కొత్త కరోనా వైరస్ మ్యూటెంట్ కనిపించింది. ఈ సారి దీనికి భిన్నంగా ట్రావెల్ హిస్టరీ లేని ఓ యువకుడిలో ఈ వేరియంట్ కనిపించడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ యువకుడికి ఎవరి ద్వారా ఈ వైరస్ సోకిందనే విషయంపై ఆరా తీస్తోంది. అతని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల గురించి దర్యాప్తు చేస్తోంది. ఎవరిని కాంటాక్ట్ కావడం ద్వారా అతనికి ఈ వైరస్ సోకిందనే విషయంపై ఆరా తీస్తున్నామని కొలరాడో గవర్నర్ జేర్డ్ పొలిస్ వెల్లడించారు.

అనేక దేశాల్లో కొత్త స్ట్రెయిన్..
భారత్ సహా ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, డెన్మార్క్, నెదర్లాండ్స్, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్, లెబనాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దక్షిణాఫ్రికాల్లో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అమెరికాలోనూ ఈ వైరస్ ప్రవేశించింది. తొలి కేసు వెలుగులోకి వచ్చిన ఎల్బర్ట్ కౌంటీని స్థానిక అధికారులు అప్రమత్తం చేశారు. ఈ వైరస్ మరింత మందికి సోకి ఉండే ప్రమాదం లేకపోలేదని అనుమానిస్తున్నారు. కరోనా లక్షణాలతో ఎవరు ఆసుపత్రికి వచ్చినా.. వాటి నమూనాలను సీడీసీకి పంపించాలంటూ ఆదేశాలను జారీ చేశారు.