బ్రిటన్లో కరోనా డేంజర్ బెల్.. వారంలో 49 లక్షల మందికి వైరస్.. ముంచుకొస్తున్న ముప్పు..!!
కరోనా మహామ్మారి మరోసారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టిందనుకుంటున్న తరుణంలో కొన్ని దేశాల్లో మరలా కరోనా వ్యాప్తి చెందుతోంది. భారత్లో వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమేణా తగ్గుతోంది. కానీ యూకే, చైనాతో పాటు మరికొన్ని దేశాల్లో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. వైరస్ మరలా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. బ్రిటన్లో కరోనా మహామ్మారి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతోంది. నాలుగో వేవ్ ముంచుకోస్తుందా అన్న భయం ప్రజల్లో వెంటాడుతోంది.

వారంలో 49 లక్షల మందికి కరోనా
బ్రిటన్లో ఒమిక్రాన్ ఉపవేరియంట్ బీఏ.2 తీవ్ర రూపం దాల్చింది. గడిచిన వారం రోజుల్లోనే 49 లక్షల మందికి పైగా వైరస్ బారిన పడినట్లు ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ తెలిపింది. అంతకుముందు వారం 43 లక్షమందికి కరోనా సోకింది. దీనిని బట్టి వైరస్ వ్యాప్తి ఏ స్ఠాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. యూకేలో ప్రతి 13 మందిలో ఒకరు కరోనా బారిన పడినట్టు బ్రిటన్ గణాంకాలు చెబుతున్నాయి. ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

ప్రధాని బోరిస్ నిర్ణయాలపై విమర్శలు..
ఈ కరోనా వేరియంట్ తీవ్ర రూపం దాల్చడంతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ మరణాల సంఖ్య మాత్రం తక్కువగానే నమోదవుతున్నట్లు తెలుస్తోంది. గతంతో పోల్చితే.. మృతుల సంఖ్య తక్కువగానే ఉందని అధికారులు తెలుపుతున్నారు. దేశంలో ఈ స్థాయిలో కరోనా వైరస్ కేసులు పెరగడానికి ప్రధాని బోరిస్ తీసుకుంటున్న నిర్ణయాలే కారణమని విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. కరోనాపై ఉన్న అంక్షలను ఎత్తివేశారు. దీంతోనే మరలా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చైనాలో కరోనా విలయం
అటు చైనాలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజువారి కేసులు 5వేలకు పైగా నమోదవుతున్నాయి. దీంతో షాంఘై నగరం తూర్పు భాగంలో లాక్ డౌన్ విధించింది. దీంతో షాంఘై నగరం సగం వరకు కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. ఇంటి నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరీక్షలు చేయించేకునే వారికి మాత్రమే బయటకు వచ్చేందుకు అనుమతి ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో తిరిగకూడదని కఠిన ఆంక్షలు విధించింది . వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలంటూ ఆజ్ఞలు జారీ చేసింది.