కరోనా కొత్తరకం వైరస్: చాలా స్పీడ్ గా స్ప్రెడ్..పరిశీలిస్తున్నామన్న డబ్ల్యుహెచ్వో
కరోనాతో ప్రపంచమంతా పోరాడుతున్న సమయంలో బ్రిటన్ లో కరోనా కొత్తరకం వైరస్ వెలుగులోకి వచ్చింది. అయితే ఈ కొత్త రకం వైరస్ పై తాము అధ్యయనం చేస్తున్నామని డబ్ల్యుహెచ్వో ప్రకటించింది. ఇప్పటివరకు బ్రిటన్‌లో 1000 మందిలో కొత్తరకం వైరస్ ను గుర్తించినట్లుగా సమాచారం ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ కంటే ఇది భిన్నంగా ప్రవర్తిస్తోంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని అయితే దీనిపై మరింత అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

బ్రిటన్ లో కరోనా కొత్త వైరస్ రకం గుర్తించిన అధికారులు
ఇప్పటికే అనేక రకాల కరోనా వైరస్ లను గుర్తించామని తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉన్నతాధికారి మైకేల్ ర్యాన్ సమయం గడుస్తున్న కొద్దీ కరోనా వైరస్ రూపాంతరం చెందుతుందని స్పష్టం చేశారు. కొత్తరకం వైరస్ ని గుర్తించడంతో అప్రమత్తమైన బ్రిటన్ ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. లండన్‌లో రోజువారి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠినమైన కరోనా వైరస్ పరిమితులను విధించింది. ఆరోగ్య కార్యదర్శి వైరస్ యొక్క కొత్త రకమే తాజా వ్యాప్తికి కారణమని పేర్కొన్నారు . గ్రేటర్ లండన్ సమీపంలోని కెంట్ మరియు ఎస్సేక్స్ లలో చాలా తీవ్రంగా కరోనా వ్యాప్తి చెందుతుందని , ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య కార్యదర్శి మాట్ హాన్కాక్ అన్నారు.

కొత్త వైరస్ కేసులు 1,000 కి పైగా.. బాగా పెరిగిన కరోనా కేసులకు ఈ రకమే కారణం అని అనుమానాలు
కొన్ని ప్రాంతాల్లో ప్రతి ఏడు రోజులకు కేసులు రెట్టింపు అవుతున్నాయని ఆయన అన్నారు. దక్షిణ ఇంగ్లాండ్‌లో కోవిడ్-19 కేసుల పెరుగుదల కరోనావైరస్ యొక్క కొత్త వైవిధ్యంతో ముడిపడి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. అధికారులు కొత్త వైరస్ ను అంచనా వేస్తున్నారని, అయితే ఇది తీవ్రమైన వ్యాధికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పే ఆధారాలు ఏమీ లేవని ఆయన అన్నారు. మేము ప్రస్తుతం ఇంగ్లాండ్ యొక్క దక్షిణాన ప్రధానంగా ఈ వేరియంట్‌తో 1,000 కి పైగా కేసులను గుర్తించామని చెప్పిన ఆరోగ్య కార్యదర్శి అయినప్పటికీ దాదాపు 60 వేర్వేరు స్థానిక అధికార ప్రాంతాలలో కూడా కేసులు గుర్తించబడ్డాయి అని ఆయన చెప్పారు.

కేసుల పెరుగుదలతో లండన్ లో టైర్ 3 పరిమితులు
ప్రస్తుత వేరియంట్ల కంటే కొత్త వేరియంట్ వేగంగా పెరుగుతోందని ప్రాథమిక విశ్లేషణలు సూచిస్తున్నాయని చెప్పారు .అంతేకాదు ఈ కొత్త రకం వైరస్ వ్యాక్సిన్ కు లొంగేది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లండన్ లో టైర్ 3 పరిమితుల ప్రకారం, బార్లు, పబ్బులు మరియు రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల్లో కొత్తరకం వైరస్ పై తీవ్ర భయాందోళన నెలకొందని చెప్తున్నారు. ప్రజలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం చేయడాన్ని కూడా తగ్గించమని అధికారులు పేర్కొంటున్నారు. క్రిస్మస్ షాపింగ్ చేయడానికి ప్రజలు సెంట్రల్ లండన్‌కు ప్రయాణించరాదని ఆరోగ్య కార్యదర్శి హాంకాక్ అన్నారు.

కొత్త వైరస్ పై లోతుగా సాగుతున్న అధ్యయనం .. పేర్కొన్న డబ్ల్యూహెచ్ఓ
లండన్‌లో ఉన్న హైఅలర్ట్ కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క అత్యవసర పరిస్థితుల చీఫ్ డాక్టర్ మైఖేల్ ర్యాన్ మాట్లాడుతూ, యుకె ఆరోగ్య సంస్థ యూకేలో నివేదించబడిన కొత్త జాతి కరోనా వైరస్ గురించి అంచనా వేయడానికి బ్రిటిష్ మరియు ఇతర ఆరోగ్య అధికారులతో కలిసి పని చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ రకమైన మార్పులు చాలా సాధారణం అని ఆయన స్పష్టం చేశారు . అయితే ప్రస్తుతం క్రిస్మస్ సీజన్ కావడంతో ప్రజలు విపరీతంగా షాపింగ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో లండన్‌లో కఠినమైన లాక్ డౌన్ ఆంక్షలు పెట్టి వ్యాప్తిని నిరోధించడం కోసం వైద్య శాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కరోనా కొత్త రకం వైరస్ ఇప్పుడు బ్రిటన్ వాసులను బెంబేలెత్తిస్తోంది.