వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్: 9 కోట్ల జనాభా ఉన్న వియత్నాంలో కోవిడ్ మరణాలు 35.. 32 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో సుమారు 4 లక్షలు.. ఎందుకలా

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కరోనావైరస్

మహమ్మారులకు కళ్లెం వేయడంలో మెరుగ్గా పనిచేసే ప్రపంచ దేశాల జాబితా-2019లో అమెరికా, బ్రిటన్‌లు మొదటి స్థానంలో నిలిచాయి. మరోవైపు న్యూజీలాండ్, చైనా, వియత్నాం చాలా వెనుకపడ్డాయి.

ఇప్పుడు 2021లోకి వస్తే.. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ విడుదల చేసిన ఆ గ్లోబల్ హెల్త్ సెక్యూరిటీ ఇండెక్స్‌లో ఎక్కడో తప్పులున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

అమెరికాతోపాటు బ్రిటన్‌లోనూ కరోనావైరస్ పరిస్థితులు అదుపుతప్పినట్లు వార్తలు వచ్చాయి.

మరోవైపు చైనా అనుసరించిన నిరంకుశ విధానాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రశంసలు కురిపించింది.

న్యూజీలాండ్‌ కూడా మెరుగ్గా వైరస్‌కు కళ్లెం వేయగలిగింది.

వియత్నాంలో అయితే తొమ్మిది కోట్ల పైచిలుకు జనాభా ఉన్నప్పటికీ.. కోవిడ్ మరణాలు 35 మాత్రమే సంభవించాయి.

పేపర్‌లపై మెరుగ్గా కనిపించిన కొన్ని దేశాలు వాస్తవానికి దారుణంగా విఫలమయ్యాయి.

ఆరోగ్య ప్రమాణాలు తీసికట్టుగా ఉన్నాయంటూ అంచనాలువేసిన కొన్ని దేశాలు మెరుగైన ప్రతిభ కనబరిచాయి. దీనికి కారణం ఏమిటి?

కరోనావైరస్

పోల్చిచూడటం కష్టమే

''అందరూ ఒకే వైరస్‌తో పోరాడుతున్నారు. అయితే, ఫలితాల్లో మాత్రం ఎందుకు ఇన్ని తేడాలు కనిపిస్తున్నాయి?’’అని అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీకి చెందిన ప్రజారోగ్య నిపుణురాలు, ప్రొఫెసర్ ఎలిజబెత్ కింగ్ ప్రశ్నించారు.

2020 మొదట్లో కరోనావైరస్ తొలి వేవ్‌పై వివిధ దేశాల స్పందనల మీద ఓ పుస్తకాన్ని ప్రచురించిన రచయితల్లో ఆమె కూడా ఒకరు. ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికాల్లోని 30 దేశాలకు చెందిన 60 మంది రచయితలు కలిసి ఈ పుస్తకాన్ని రాశారు.

కరోనావైరస్ స్పందనల విషయంలో వేర్వేరు ప్రభుత్వాలను పోల్చిచూడటం చాలా కష్టం. ఎందుకంటే తమ చర్యలను ఒక్కో ప్రభుత్వం ఒక్కోలా కొలుస్తుంది. ఒక్కో విధమైన ప్రమాణాలు పాటిస్తుంది.

ఉదాహరణకు అనుమానిత కోవిడ్ మరణాలను కూడా కోవిడ్ మరణాల జాబితాలో బెల్జియం కలిపేసింది. దీంతో మిగతా దేశాలతో పోల్చినప్పుడు ఇక్కడ మరణాలు ఎక్కువగా సంభవించినట్లు కనిపించాయి.

జర్మనీ, ఫ్రాన్స్‌లలో కేర్ హోమ్‌లలో సంభవించిన మరణాలు పతాక శీర్షికల్లో నిలిచాయి.

బ్రిటన్ విషయానికి వస్తే ఎక్కువ శాతం మరణాలు ఆసుపత్రుల్లోనే సంభవించాయి.

కేసులను పోల్చిచూడటం మరింత కష్టం. ఎక్కువగా పరీక్షలు చేస్తే.. ఎక్కువ కేసులు బయటపడతాయి.

పరీక్షలు ఒక్కోచోట ఒక్కోలా నిర్వహించారు. మరోవైపు ఎవరికి ముందు పరీక్షలు నిర్వహించాలనే అంశంలోనూ చాలా ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి.

జనాభాలో వృద్ధుల శాతం కూడా కరోనావైరస్‌పై పోరాటంలో ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు ఇటలీలో ఐదో వంతు జనాభా 65ఏళ్లకు పైబడిన వారే. దీంతో వీరికి కరోనావైరస్ ముప్పు చాలా ఎక్కువ.

ఆఫ్రికా జనాభాలో యువత శాతం ఎక్కువ.

ప్రపంచంలో సగటు జనాభా వయసు తక్కువగా ఉండే 20 దేశాల్లో 19 ఆఫ్రికాలోనే ఉన్నాయి.

నిజానికి ప్రభుత్వం ఏం చేసింది? అనేదాని కంటే ఎంత త్వరగా స్పందించింది? అనే అంశమే దేశాల స్పందనల ఫలితాలను నిర్దేశించింది.

కరోనావైరస్

రాజకీయాలు..

ప్రభుత్వాల చర్యలు, స్పందనలను సరిపోల్చడంతోపాటు ప్రజారోగ్య విధానాలను ఇతర అంశాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయో ప్రొఫెసర్ కింగ్ బృందం విశ్లేషించింది.

ప్రజాస్వామ్యమా లేక నిరంకుశ ప్రభుత్వమా? లాంటి అంశాలతోపాటు సమాఖ్య వ్యవస్థ, అధ్యక్ష వ్యవస్థ, ఆరోగ్య సేవల విషయంలో ప్రభుత్వ సామర్థ్యం తదితర అంశాలు కూడా ప్రభుత్వ స్పందనలను ప్రభావితం చేశాయని ఆమె పేర్కొన్నారు.

5 కోట్ల మంది నివసించే వూహాన్ ప్రావిన్స్‌ను జనవరి 2020లో చైనా పూర్తిగా సీల్ చేసింది.

దీంతో ప్రజాస్వామ్య వ్యవస్థలతో పోలిస్తే నిరంకుశ ప్రభుత్వాలు మెరుగ్గా కరోనావైరస్‌తో పోరాడగలవని వార్తలు వచ్చాయి.

అయితే, ఇటలీ సహా కొన్ని పశ్చిమ ప్రజాస్వామ్య వ్యవస్థలు వరుసగా లాక్‌డౌన్‌లు విధించడంతో ఈ చర్చ తగ్గుముఖం పట్టింది.

కరోనావైరస్

రాజకీయ వ్యవస్థలు..

నిరంకుశ ప్రభుత్వాలకు తాము తీసుకునే చర్యల విషయంలో తక్కువ ఒత్తిడి ఎదురయ్యే మాట వాస్తవమే. అయితే ఆ చర్యల అమలు అనేది పూర్తి భిన్నమైన అంశం.

ప్రజల నమ్మకాన్ని నిరంకుశ ప్రభుత్వాలు పోగొట్టుకున్నట్లు అయితే, వారి వ్యూహాలు ఫలించకపోవచ్చని కింగ్ బృందం విశ్లేషించింది. ''ఆంక్షలకు ప్రజలు అలవాటు పడితే, ప్రభుత్వంపై విశ్వాసం, సమాచార ప్రసారంలో పారదర్శకత, వ్యవస్థలపై నమ్మకం సన్నగిల్లుతాయి’’అని ఆమె అన్నారు.

కేసులు, మరణాల వివరాలను రష్యా సరిగా వెల్లడించడంలేదని మొదట్లో వార్తలు వచ్చిన సంగతిని కింగ్ గుర్తుచేశారు. అయితే ఇటీవల కాలంలో సమాచారంలో లోపాలను సవరించేందుకు రష్యా ప్రభుత్వం పటిష్ఠమైన చర్యలు తీసుకుంది. ముఖ్యంగా మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు సామాజిక విధానాలను తీసుకొచ్చింది.

అయితే, సమాచార ప్రసారంలో పారదర్శకత లోపించడంతో ఇప్పటికీ ప్రభుత్వ విధానాలను ప్రజలు నమ్మడంలేదని బీబీసీ రష్యా పరిశోధనలో తేలింది. ముఖ్యంగా దేశీయంగా అభివృద్ధి చేసిన వ్యాక్సీన్ విషయంలో ఇక్కడి ప్రజల్లో చాలా సందేహాలు ఉన్నాయని వెల్లడైంది.

అదే సమయంలో కొన్ని ప్రజాస్వామ్య దేశాలు కూడా సమాచారాన్ని వెల్లడించడంలో పారదర్శకతను పాటించలేదని కింగ్ గుర్తుచేశారు.

కరోనావైరస్

కరోనావైరస్ కేసులను కొన్ని దేశాలు కావాలనే ఎక్కువగా చెబుతున్నాయని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో వ్యాఖ్యానించారు.

ఇలాంటి వ్యాఖ్యాలతో ఆయన సైన్స్‌ను ధిక్కరించారని పుస్తక రచయితలో ఒకరైన సవ్‌పాలోని ఎఫ్‌జీవీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎలీజ్ మసార్డ్ డా ఫోన్సెకా చెప్పారు.

''ఇలాంటి మహమ్మారులను అడ్డుకునే శక్తి బ్రెజిల్‌కు ఉంది. కానీ సరైన సమయంలో చర్యలు తీసుకోలేదు. ముప్పును తక్కువగా అంచనావేశారు. ఫలితంగా కోవిడ్ కేసులతో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలింది’’అని ఆమె అన్నారు.

సమాఖ్య వ్యవస్థల్లో ఆరోగ్య సంరక్షణపై అధికారాలను స్థానిక ప్రభుత్వాలకు కేంద్రం బదిలీ చేస్తుంటుంది. దీంతో లాక్‌డౌన్‌లు విధించడం, వ్యాక్సీన్ల కొనుగోలు తదితర చర్యలను స్థానిక ప్రభుత్వాలే వేగంగా తీసుకోగలిగాయి.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కూడా వైరస్ ముప్పును తక్కువగా అంచనావేశారు. రాష్ట్రాలు తీసుకున్న చర్యలతో విభేదించారు.

కోవిడ్‌తో మూడు రోజులు ఆసుపత్రిలో గడిపిన అనంతరం వైరస్‌ను ఆయన సాధారణ ఫ్లూతో పోల్చారు. దేశం మొత్తాన్ని అనవసరంగా లాక్‌డౌన్‌లో పెట్టామని ఆయన అన్నారు.

కరోనావైరస్

మెరుగైన చర్యలతో..

ప్రజారోగ్య వ్యవస్థలు అంతంత మాత్రంగా ఉండే కొన్ని దేశాలు మెరుగ్గా కరోనావైరస్‌తో పోరాడిన విషయాన్ని ప్రొఫెసర్ కింగ్ గుర్తుచేశారు. వెంటవెంటనే చర్యలు తీసుకోవడం వల్లే ఇది సాధ్యపడిందని ఆమె అన్నారు.

''మాస్క్‌లు పెట్టుకునేలా చూడటం, సామాజిక దూరం పాటించడం, అనుమానిత కోవిడ్ కేసులను ట్రాక్ చేయడం లాంటి చర్యలు మెరుగైన ఫలితాలను ఇచ్చాయి’’అని ఆమె చెప్పారు.

ఇలా వైరస్‌ను మెరుగ్గా కట్టడి చేసిన దేశాల జాబితాలో వియత్నాం గురించి మొదటగా చెప్పుకోవాలి.

దక్షిణ కొరియా భారీగా పరీక్షలు నిర్వహించి, ఖర్చుతో కూడిన విధానాలతో సాధించిన పురోగతిని వియత్నాం సాధారణంగానే అందుకోగలిగింది.

ఎబోలాతో తీవ్రంగా ప్రభావితమైన పశ్చిమాఫ్రికా దేశాలు తమ కమ్యూనిటీ నెట్‌వర్క్‌లతో కోవిడ్ కేసులను మెరుగ్గా ట్రాక్ చేశాయి.

కరోనావైరస్ తొలి వేవ్ సమయంలో ఇదివరకటి మహమ్మారుల నుంచి నేర్చుకున్న పాఠాలు దక్షిణాఫ్రికాకు చక్కగా ఉపయోగపడ్డాయని ప్రొఫెసర్ కింగ్ చెప్పారు.

అయితే రెండో వేవ్ సమయంలో ఇక్కడ పరిస్థితులు బాగా దిగజారాయి. గతేడాది చివర్లో మొదలైన కొత్త కరోనావైరస్‌తో ఇక్కడ కోవిడ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి.

కరోనావైరస్

అవే కీలకం

ప్రజలు అనుసరించేందుకు అనువుగా ఉండే వ్యూహాలే మంచి ఫలితాలు ఇస్తాయని ప్రొఫెసర్ కింగ్ చెప్పారు.

ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లో అసమానతలను కరోనావైరస్ కళ్లకుకట్టింది. పేదరికం, జెండర్, ఉద్యోగ నైపుణ్యాలు, వలసదారులు ఇలాంటి అంశాలు ప్రజల్లో ముప్పులను ప్రభావితం చేశాయి.

ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఒక్కోదేశం ఒక్కో తరహా విధానాలతో ముందుకు వచ్చింది.

పిల్లలను ఇంటిలో ఉంచి చదివించిన తల్లిదండ్రులకు ప్రత్యేక సెలవు రాయితీని ఇవ్వాలని జర్మనీ నిర్ణయించింది.

కరోనావైరస్

చైనా అనుసరించిన నిరంకుశ విధానాల కంటే ఇలాంటి విధానాలే ఉత్తమమైనవని ప్రొఫెసర్ కింగ్ భావిస్తున్నారు.

''కఠినమైన లాక్‌డౌన్ నిబంధనలు అమలుచేసే సమయంలో ప్రజలు ఆకలితో చనిపోకుండా చైనా చర్యలు తీసుకుంది.

అయితే ఇలాంటి నిరంకుశ విధానాలతోనే వైరస్‌కు మెరుగ్గా కళ్లెం వేయగలమని చెప్పకూడదు. ఎందుకంటే న్యూజీలాండ్, జర్మనీ లాంటి ప్రజాస్వామ్య వ్యవస్థలూ మెరుగ్గా స్పందించాయి’’అని ఆమె అన్నారు.

స్పందనలను చాలా అంశాలు ప్రభావితం చేస్తాయని, అయితే ఎంత వేగంగా ప్రభుత్వం స్పందించిందనే అంశంపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయని ఆమె వివరించారు.

కేసులు వేగంగా పెరగడానికి, ప్రజారోగ్య వ్యవస్థలు కుప్పకూలడానికి ఆలస్యంగా చర్యలు తీసుకోవడమే కారణమని చెబుతున్న పరిశోధనలతో ఆమె ఏకీభవించారు.

''ఆలస్యంగా స్పందించడమంటే.. కేసులు, మరణాలు పెరిగేందుకు అవకాశం కల్పించడమే. దీంతో ప్రజారోగ్య వ్యవస్థలు, ఆర్థిక స్థితిగతులు కుప్పకూలుతాయి’’అని బ్రిటన్‌లోని ఎక్సెటెర్ యూనివర్సిటీ ఎన్విరాన్‌మెంటల్ ఎకానమిక్స్ ప్రొఫెసర్ అయాన్ జే బ్యాట్‌మన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid deaths 35 in Vietnam with a population of 9 crores
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X