• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనావైరస్: చైనాకు పాకిన ఇండియన్ వేరియంట్ B1617.. హై అలర్ట్ ప్రకటించిన అధికారులు

By BBC News తెలుగు
|

చైనాలో ఐదు రోజుల పాటు సాగే లేబర్ హాలిడేస్‌కు ముందే, విదేశాల నుంచి వచ్చిన కొంతమందిలో కోవిడ్ ఉత్పరివర్తన వేరియంట్ B1617ను గుర్తించినట్లు చైనా వైద్య అధికారులు తెలిపారు.

ఈ వేరియంట్‌ను మొదట భారత్‌లో గుర్తించారు.

ఈ వేరియంట్ వల్ల ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఎదురైతే, దాన్ని ఎదుర్కొనేందుకు చైనాలో ఓ డిసీజ్ కంట్రోల్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు.

ఇండియన్ వేరియంట్‌ను గుర్తించిన తరువాత దేశంలో హై అలర్ట్ జారీ చేసినట్లు చైనా వైద్య అధికారులు తెలిపారు.

భారత్‌ నుంచి వచ్చిన యాత్రికులను 14 రోజులు క్వారంటీన్‌లో ఉంచి టెస్ట్ చేయగా, ఈ కొత్త వేరియంట్ వారిలో కనిపించిందని అక్కడి అధికారులు తెలిపారు.

కాగా, ఇండియన్ వేరియంట్ వల్లే భారత్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై నిపుణులు చర్చిస్తున్నారు.

చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) చీఫ్ ఎపిడెమియాలజిస్ట్ వూ జున్యు చైనాలో కొత్త సంక్రమణలను గుర్తించినట్లు ఏప్రిల్ 29న జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు.

అయితే B1617 వేరియంట్ ఎంత మందికి సోకింది? తీవ్రత ఎంత? అనే వివరాలు తెలుపలేదు.

"భారతదేశంలో కోవిడ్ సెకండ్ వేవ్, ఇతర దేశాల్లో కూడా పెరుగుతున్న కేసులను చూస్తుంటే కరోనా సంక్షోభం ముగియలేదని తెలుస్తోంది. అందరికీ ఇదొక హెచ్చరిక" అని ఆయన అన్నారు.

జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రతినిధి మెయి ఫెంగ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఏప్రిల్‌లో విదేశాల నుంచి వచ్చిన 364 మంది ప్రయాణికులకు కరోనా సోకినట్లు గుర్తించారని చెప్పారు. గత నెలతో పోలిస్తే ఈ నెల రోజువారీ కేసులు 20 శాతం పెరిగినట్లు తెలిపారని ప్రభుత్వ టెలివిజన్ ఛానల్ సీసీటీవీ పేర్కొంది.

హాంగ్‌కాంగ్‌కు చెందిన కార్గో షిప్ హువాయెంగ్ సన్‌రైజ్‌లో పని చేస్తున్న 11 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్థరణ అయినట్లు జెజియాంగ్ ప్రావిన్స్ వైద్య అధికారులు వెల్లడించినట్లు సీసీటీవీ తెలిపింది.

ఈ ఓడ భారతదేశం, బంగ్లాదేశ్, సింగపూర్‌ల మీదుగా జెజియాంగ్ చేరుకుంది.

అయితే వీరందరికీ కూడా B1617 వేరియంట్ సోకిందా లేదా అనేది అస్పష్టం.

చైనాలో మే 1 నుంచి 5 వరకు లేబర్ హాలిడేస్ ప్రకటించారు.

అయితే, చైనా ఇప్పటికే అంతర్జాతీయ ప్రయాణాలను నిషేధించింది.

కాగా, సెలవుల్లో ప్రజలు దేశీయ పర్యటనలు చేయవచ్చు. ఈ సమయంలో రోజుకు 5 కోట్ల మంది ప్రయాణాలు చేసే అవకాశం ఉందని చైనా రవాణా మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.

జనం పెద్ద సంఖ్యలో ఒకే చోట గుమికూడవద్దని వూ జున్యు హెచ్చరించారు.

మరింత ప్రభావవంతమైన వ్యాక్సీన్ తయారీ దిశగా పరిశోధనలు

ఏప్రిల్ 29న ప్రభుత్వ వార్తా పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం, కరోనా వైరస్‌తో పోరాడేందుకు మరింత సమర్థవంతమైన వ్యాక్సీన్ కనుగొనేందుకు బయోఎన్‌టెక్ పరిశోధనలు చేస్తోంది.

ఫైజర్-బయోఎన్‌టెక్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సీన్, చైనీస్ ఎడినోవైరస్ వ్యాక్సీన్ డోసుల మిశ్రమంతో ప్రయోగాలు చేస్తున్నారు.

రెండిటినీ నిర్దిష్ట మోతాదులలో కలిపితే కోవిడ్‌ను మరింత సమర్థవంతంగా ఎదుర్కునే అవకాశాలు ఉన్నాయేమో పరిశీలిస్తున్నారు.

ప్రస్తుతం ఈ దిశలో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి.

కరోనావైరస్

కొత్త నేషనల్ డిసీజ్ కంట్రోల్ బ్యూరో

చైనా ప్రభుత్వం ఏప్రిల్ 28న కొత్తగా నేషనల్ డిసీజ్ కంట్రోల్ బ్యూరోను ఏర్పాటు చేసినట్లు జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.

రాబోయే రోజుల్లో ప్రజారోగ్య వ్యవస్థలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు దీన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

జాతీయ ఆరోగ్య కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ వాంగ్ హెషెంగ్ ఈ కొత్త బ్యూరోకు డైరెక్టర్‌గా వ్యవహరించనున్నారు.

పాత వ్యవస్థలో లోపాలను సరి చేస్తూ కొత్త వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు కృషి చేస్తుందని చైనా ప్రభుత్వం తెలిపింది.

భారతదేశానికి పంపిన సహాయం

చైనా కస్టమ్స్ విభాగం గణాంకాల ప్రకారం ఏప్రిల్ నెల ప్రారంభం నుంచి భారత్‌కు 5,000 వెంటిలేటర్లు, 21,569 ఆక్సిజన్ జనరేటర్లు, 2.148 కోట్ల మాస్కులు, సుమారు 3,800 టన్నుల మందులను పంపినట్లు చైనా రాయబారి సన్ వియడాంగ్ ఒక ట్విటర్ పోస్టులో తెలిపారు.

అయితే, ఇవన్నీ కూడా చైనా ఉచితంగా ఇవ్వలేదని, భారతదేశం.. చైనా నుంచి ఇవన్నీ కొనుగోలు చేసిందని ఈ ట్వీట్‌కు బదులిస్తూ కొందరు నెటిజన్లు స్పందించారు.

చైనా వస్తువుల ధరలను పెంచుతోందని కొంతమంది ఆరోపించారు.

గ్లోబల్ టైమ్స్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, ఏప్రిల్ 29న విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి... విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భారత్‌కు పంపించేందుకు అమెరికా కంపెనీలు కొనుగోలు చేసిన ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల షిప్మెంట్‌ను చైనా నిలిపివేసిందనే ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు.

ఇదంతా ఫేక్ న్యూస్ అని తెలుపుతూ, భారత్‌కు చైనా సహాయం అందిస్తుందని మరోసారి హామీ ఇచ్చారు. ఇప్పటికే మొదటి విడత ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇండియాకు పంపించారని తెలిపారు.

అయితే, ఏప్రిల్ 26 నుంచి ప్రభుత్వ ఎయిర్‌లైన్స్ సిచువాన్.. కార్గో విమానాల రాకపోకలను నిలిపివేసిన విషయంపై వ్యాఖ్యానించేందుకు ఆయన నిరాకరించారు.

"ఇది వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Coronavirus: Indian variant B1617 identified in China .. High alert issued by authorities
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X