coronavirus హేట్ క్రైమ్: ఇజ్రాయెల్‌లో భారతీయుడిపై దాడి
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌లోని తైబిరియాలో శనివారం షావేయీ ఇజ్రాయెల్ కమ్యూనిటీ సభ్యుడుపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. 2017లో మనదేశంలోని మణిపూర్ నుంచి ఇజ్రాయెల్ వెళ్లిన 28ఏళ్ల ఏమ్ షాలేమ్ సింగ్సన్ ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు.
సింగ్సన్‌ను చైనీయుడిగా భావించిన ఇద్దరు ఇజ్రాయెలీలు అతడిపై దాడి చేసినట్లు ది షావేయీ ఇజ్రాయెల్ సంస్థ ఆదివారం తెలిపింది. చైనీస్.. కరోనా.. కరోనా అంటూ సింగ్సన్‌పై దాడి చేశారు. చైనాలోనే కరోనావైరస్ పుట్టిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 6వేల మంది మృతి చెందడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని మహమ్మారిగా ప్రకటించిన విషయం తెలిసిందే.

తాను చైనీయుడ్ని కాదని, జ్యూను కూడా కాదని దాడి చేసిన వారితో తాను చెప్పినట్లు బాధిత యువకుడు తెలిపాడు. వారు ఎందుకు దాడి చేశారో తెలియదని అన్నారు.
తాను ఎంత చెప్పినా వినకుండా కరోనా కరోనా అంటూ తనపై దాడి చేశారని సింగ్సన్ తెలిపాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దాడికి పాల్పడిన ఇద్దరు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. సింగ్సన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి నిలకడగా ఉందని షావేయీ ఇజ్రాయెల్ వెల్లడించింది. ఛాతి, ఊపిరితిత్తులపై గాయాలయ్యాయని తెలిపారు.
తల్లి, నానమ్మ, సోదరుడితో సింగ్సన్ తైబేరియాస్‌లో ఉంటున్నారని.. రిలీజియస్ సెమినర్‌లో తన చదువును కొనసాగిస్తున్నారని తెలిపారు. సుమారు 10వేల మంది వరకు చైనా, తూర్పు ఆసియాకు చెందినవారు ఇజ్రాయెల్ లో ఉపాధి పొందుతున్నారు.
కాగా, ఇలాంటి దాడి జరగడం సోచనీయమని కమ్యూనిటీ పేర్కొంది. దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా, కరోనావైరస్ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లోని ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చైనీయులపై కొంత వ్యతిరేక భావన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.