కరోనా కల్లోలం: ఐరోపాకు మరోసారి తాళం, ప్రజలకు ప్రభుత్వాల హెచ్చరికలు
లండన్: కరోనా మహమ్మారి ఐరోపాలో మరోసారి విజృంభిస్తోంది. దీంతో అప్రమత్తమైన ఆయా దేశాల ప్రభుత్వాలు మరోసారి లాక్డౌన్ విధిస్తున్నాయి. ఇప్పటికే కరోనావైరస్ మహమ్మారి బారినపడి ఐరోపా వ్యాప్తంగా 2,19,228 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కట్టడికి లాక్డౌన్ తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాయి.

బ్రిటన్లో నెలపాటు కఠిన లాక్డౌన్..
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మరోసారి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించారు. నెలరోజుల పాటు కఠినంగా లాక్డౌన్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. దేశ ప్రజలు కరోనా మహమ్మారి బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని ప్రధాని స్పష్టం చేశారు. ఐరోపా వ్యాప్తంగా కరోనా మరోసారి కరోనా విజృంభిస్తుండటంతో ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి.

గ్రీసులోనూ లాక్డౌన్.. అవన్నీ బంద్
గ్రీసులో ప్రతిరోజూ 2000కుపై కొత్త కరోనా కేసులు నమోదవుతుండటం గమనార్హం. కరోనా ప్రారంభం నాటి నుంచి ఇదే అధికం. మంగళవారం నుంచి ఈ దేశంలో లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దేశ వ్యాప్తంగా బార్లు, కేఫ్స్, రెస్టారెంట్లు, జిమ్స్ మూసివేస్తున్నట్లు తెలిపింది. నవంబర్ చివరి వరకూ ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని గ్రీస్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఆస్ట్రేలియాలో పాక్షిక లాక్డౌన్.. కానీ..
ఇక ఆస్ట్రేలియాలో కూడా మంగళవారం నుంచి రెండో లాక్డౌన్ మొదలైంది. అయితే, పాక్షిక లాక్డౌన్ విధించారు. రెస్టారెంట్లు, బార్లు రాత్రి 8గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు బంద్ అయ్యాయి. ప్రజలు ఈ సమయంలో ఇళ్లల్లోనే ఉండాలని ప్రభుత్వం సూచించింది. అవసరమైతే తప్ప బయటికి రావొద్దని స్పష్టం చేసింది. నవంబర్ చివరి వరకు కూడా ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ఛాన్సలర్ సెబాస్టియన్ కుర్జ్ తెలిపారు. అయితే, స్కూల్స్, నాన్ ఎషెన్షియల్ షాప్స్ తెరిచి ఉంచేందుకు అనుమతించింది. ఆస్ట్రేలియాలో లోకల్ ట్రాన్స్మిషన్ లేకపోయినప్పటికీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. మెల్బోర్న్లోనే అత్యధిక కేసులున్నాయి. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతుండటం, రెస్టారెంట్లు, బార్లు, పబ్లు తెరిచి ఉండటంతో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆస్ట్రేలియా ఫేమస్ హార్స్ రేస్ మెల్బోర్న్ కప్ మంగళవారం నుంచి ప్రారంభమవుతుండగా.. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

పోర్చుగల్లో 70 శాతంపై ప్రజలపై..
పోర్చుగల్ కూడా బుధవారం దేశంలోని 70 శాతం ప్రజలపై లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలోని 121 మున్సిపాలిటీల్లో పాక్షిక లాక్డౌన్ విధించింది. పోర్టో, రాజధాని లిస్బన్ ప్రాంతాల్లోని ప్రతి లక్ష మందిలో 240 కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఔట్ డోర్ మార్కెట్లు, ఈవెంట్స్ పై బ్యాన్ చేసింది. అయితే,
పాఠశాలలు మాత్రం తెరిచే ఉంటాయి.

జర్మనీలో కరోనా విజృంభణ
జర్మనీలోనూ కరోనా మరోసారి విజృంభిస్తోంది. తాజాగా ఆ దేశంలో 14,777 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో గత సోమవారం నుంచి పాక్షిక లాక్డౌన్ విధించింది. గత వారం పది రోజులుగా భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండటంతో లాక్డౌన్ నిబంధనలను మరింత కఠినం చేసింది.
టర్కీలో ఆ దేశ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ సన్నిహితంగా ఉండే ఇద్దరు ఉన్నతాధికారులకు కరోనా సోకడం కలకలం రేపింది. ఆ దేశంలో శనివారం ఒక్కరోజే 2213 కరోనా కేసులు, 75 మంది మరణించారు. ప్రజలు కరోనా బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని టర్కీ ప్రభుత్వం సూచిస్తోంది.