ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు బ్రిటన్ గ్రీన్ సిగ్నల్: కొత్త స్ట్రెయిన్‌పై ప్రభావం ఎంత?
లండన్: కొత్తగా రూపాంతరం చెందిన కరోనా వైరస్ స్ట్రెయిన్‌తో అల్లాడుతోన్న బ్రిటన్.. మరో వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆ దేశ ప్రభుత్వం.. తాజాగా ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన జారీ చేసింది. కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించడానికి ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. ఈ వ్యాక్సిన్‌ను సాధారణ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకుని రావడం ఇదే తొలిసారి.
షాకింగ్: ఫైజర్ వ్యాక్సిన్ పనిచేయట్లేదా?: టీకా వేయించుకున్న నర్సుకు కరోనా పాజిటివ్: అనారోగ్యం

హెల్త్ రెగ్యులేటరీ సిఫారసుల మేరకు
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను వినియోగించడానికి అవసరమైన అనుమతులు ఇవ్వవచ్చని సూచిస్తూ బ్రిటన్ మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) ప్రభుత్వానికి సిఫారసు చేసింది. తాము అంచనా వేసినట్టే.. ఇది కరోనా వైరస్‌పై ప్రభావాన్ని చూపుతుందని, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా నిరోధించగలుగుతుందని పేర్కొంది. ఈ సిఫారసులపై బ్రిటన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు తాము అనుమతి ఇచ్చామని అధికారికంగా ప్రకటించింది.

4 నుంచి వ్యాక్సినేషన్..
జనవరి 4వ తేదీ నుంచి ఈ వ్యాక్సిన్‌ను సాధారణ ప్రజల కోసం వినియోగానికి తీసుకొస్తామని ఆరోగ్యశాఖ మంత్రి మాట్ హాన్కాక్ తెలిపారు. ఈలోగా అన్ని వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు వాటిని రవాణా చేస్తామని అన్నారు. ఇప్పటికే బ్రిటన్ 100 మిలియన్ డోసుల ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు ఆర్డర్లు ఇచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన తరువాత.. మొట్టమొదటి సారిగా వ్యాక్సిన్ తయారీకి పూనుకున్నది ఆక్స్‌ఫర్డే. అనంతరం ఆస్ట్రాజెనెకా జత కలిసింది. ఈ రెండు కలిసి ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. ఇప్పటికే ఫైజర్ వ్యాక్సినేషన్ కొనసాగుతోందక్కడ.

ఏప్రిల్‌లో తొలి ట్రయల్
ఈ ఏడాది జనవరిలో వ్యాక్సిన్ అభివృద్ధికి శ్రీకారం చుట్టాయి. ఏప్రిల్‌లో ట్రయల్స్ చేపట్టాయి. తొలి వలంటీర్‌కు వ్యాక్సిన్ ఇచ్చాయి. సత్ఫలితాలు రావడంతో.. ఇక పెద్ద ఎత్తున క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించాయి. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకాతో భారత్‌కు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వ్యాక్సిన్ డోసులను తయారు చేసే కాంట్రాక్ట్‌ను తీసుకుంది. భారత్‌లో ఈ వ్యాక్సిన్ సరఫరా బాధ్యతను సీరమ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంది. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌ను ఫిబ్రవరి చివరివారం నాటికి భారత్‌లో అందుబాటులోకి తీసుకొస్తామని సీరమ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆదార్ పునావాలా ఇదివరకే ప్రకటించారు.

71 వేల మందికి పైగా బలి...
ప్రస్తుతం బ్రిటన్‌లో సాధారణ కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటోంది. 71,567 మంది బలి అయ్యారు. 23,82,865 కేసులు నమోదు అయ్యాయి. ఈ పరిస్థితుల మధ్య కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వైరస్ స్ట్రెయిన్‌తో అల్లాడుతోంది బ్రిటన్. సాధారణ కరోనాతో పోల్చుకుంటే 70 శాతం వేగంగా విస్తరించే ప్రమాదం ఉన్నందున.. ముందు జాగ్రత్తలను తీసుకుంటోంది. భారత్ సహా అనేక దేశాలు బ్రిటన్‌తో విమాన సంబంధాలను తెంచుకున్నాయి. తాజాగా అనుమతి ఇచ్చిన ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్.. కొత్త కరోనా స్ట్రెయిన్‌పై ఏ స్థాయిలో ప్రబావం చూపుతుందనేది వేచి చూడాల్సి వస్తోంది.