మనుషులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగం: ఎదురయ్యే సవాళ్లేంటీ? ఎలా అధిగమించాలి? బ్రిటన్ ఘనత
లండన్: ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్ కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందనే ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఎవ్వరూ ఇవ్వలేకపోతున్నారు. ఏడెనిమిది వరకు కరోనా వ్యాక్సిన్లు ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్నాయి. దశలవారీగా సాగుతోన్న ఆ ట్రయల్స్ విజయవంతమైతే గానీ వ్యాక్సిన్ అందుబాటులోకి రాదనడంలో సందేహాలు అనవసరం. భారత్ సహా మరికొన్ని దేశాల్లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి. భారత్‌లో మూడు వ్యాక్సిన్లకు సంబంధించిన ట్రయల్స్ కొనసాగుతున్నాయి.
కరోనా కథ మళ్లీ మొదటికి: ప్రధాని మోడీ హెచ్చరికలు.. నిజమే: రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల

బ్రిటన్‌లో భారీ ఎత్తున
బ్రిటన్‌లోనూ వ్యాక్సిన్లపై ప్రయోగాలను కొనసాగిస్తున్నారు అక్కడి నిపుణులు. ఈ సందర్భంగా కొన్ని సవాళ్లు వారికి ఎదురయ్యాయి. వాటిని అధిగమించి మరీ ట్రయల్స్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు. కరోనా వైరస్ లక్షలాదిమందిని బలి తీసుకుంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సిన్ తయారీ కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఈ రేసులో బ్రిటన్ ఫ్రంట్ రన్నర్‌గా ఉంటోంది. వ్యాక్సిన్ ప్రయోగాల కోసం బ్రిటన్ ప్రభుత్వం 33.6 మిలియన్ పౌండ్ల నిధులను కేటాయించింది. ఈ నిధులను జాతీయ హెల్త్ సర్వీసుల నుంచి ఖర్చు చేస్తోంది.

నిబంధనలు తప్పనిసరి..
వ్యాక్సిన్ పరీక్షల కోసం సిద్ధపడే వలంటీర్ సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉండాలి. ఆ తరువాతే అతనికి కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్‌లో భాగస్వామిని చేస్తారు. ఆ వలంటీర్‌కు 18 నుంచి 30 ఏళ్ల లోపు వయస్సు ఉండాలి. భద్రతాపరమైన వాతావరణంలో వలంటీర్‌పై వ్యాక్సిన్‌ను ప్రయోగిస్తారు. అనుక్షణం అతని ఆరోగ్య పరిస్థితులను గమనిస్తుంటారు. వ్యాక్సిన్ ఏ మేర ప్రభావం చూపుతుందనేది ఇక్కడ ప్రధానం. వ్యాక్సిన్‌ను ప్రయోగించిన అనంతరం అతని ఆరోగ్యం, సైడ్ ఎఫెక్ట్స్, వైరస్ ప్రభావం ఎంత మేర తగ్గిందనే అంశాలపై దృష్టి సారిస్తారు.

90 మంది వలంటీర్లపై ప్రయోగాలు
బ్రిటన్‌లో 90 మంది వలంటీర్లను ప్రస్తుతం ఈ ప్రయోగాల కోసం ఎంపిక చేశారు. వారికి ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లిస్తోంది. మనుషులపై ప్రయోగాల వల్ల వ్యాక్సిన్ ఎంత మేర ప్రభావాన్ని చూపుతుందనేది ఖచ్చితంగా నిర్దారించడానికి అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ ప్రయోగించిన అనంతరం.. అది ఆరోగ్యంపై మాత్రమే ప్రభావం చూపుతుందా? లేక ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ సంక్రమించకుండా అరికట్టగలుగుతుందా? అనే విషయాన్ని నిర్ధిరించడానికి వీలు కలుగుతుంది.

ఏడాదిపాటు ఆరోగ్యంపై ఆరా..
కరోనా వ్యాక్సిన్‌ను ప్రయోగించిన అనంతరం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏవైనా సంభవించే అవకాశంపై ఆరా తీయడానికి కనీసం ఏడాదికాలం పాటు ఆ వలంటీర్‌పై ఆరోగ్యంపై నిపుణలు కన్నేసి ఉంచుతారు. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం లేదని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితి వస్తే మళ్లీ విరుగుడును ప్రయోగించాల్సి ఉంటుంది. ఇదివరకు కలరా, టైఫాయిడ్, మలేరియా, ఇన్‌ఫ్లూయెంజా, ట్యూబర్క్యులోసిస్, డెంగ్యూ వంటి అనారోగ్య కారకాలపై ట్రయల్స్ నిర్వహించారు. దాన్నే ప్రాతిపదికగా తీసుకుని కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలను చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన ఓ నివేదికను బ్రిటన్ నిపుణులు ప్రభుత్వానికి పంపించారు. అదింకా ఆమోదం పొందాల్సి ఉంది.