వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనావైరస్: స్మశానంగా మారిపోతుందని అంతా భయపడిన ఆఫ్రికాలో కోవిడ్ మరణాలు మిగతా ప్రపంచం కంటే ఎందుకు తక్కువగా ఉన్నాయి

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఆఫ్రికా చిన్నారి

ప్రజారోగ్య వ్యవస్థలు ఎంతో దుర్బలంగా ఉన్నప్పటికీ కరోనావైరస్‌పై పోరాటంలో మాత్రం సమర్థంగా వ్యవహరించినందుకు ఆఫ్రికాలోని కొన్ని దేశాలను ప్రపంచం ప్రశంసిస్తోంది.

100 కోట్లకు పైగా జనాభా ఉన్న ఆఫ్రికా ఖండంలో ఇప్పటివరకు సుమారు 15 లక్షల కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాలు చెబుతున్నాయి.

ఆసియా, ఐరోపా, అమెరికా ఖండాలతో పోల్చితే ఈ సంఖ్య చాలా తక్కువ. ఆఫ్రికా ఖండంలో కరోనావైరస్ బారినపడి 37 వేల మంది చనిపోయారు. అమెరికా ఖండాల్లో 5 లక్షల 80 వేల మంది.. ఐరోపాలో 2,30,000, ఆసియాలో 2,05,000 మంది చనిపోయారు.

కేసులు, మరణాల ప్రపంచ నిష్పత్తితో పోల్చితే ఆఫ్రికాలో ఆ నిష్పత్తి చాలా తక్కువగా ఉంది.

'పార్టనర్‌షిప్ ఫర్ ఎవిడెన్స్ బేస్డ్ రెస్పాన్స్ టు కోవిడ్-19(పీఈఆర్‌సీ)' నివేదిక ఈ విషయం చెబుతూ ఆఫ్రికా జనాభాలో కోవిడ్ ప్రభావ తీవ్రత తక్కువగా ఉందని పేర్కొంది.

ఆఫ్రికాలో కోవిడ్ పరీక్షలు తక్కువగానే జరుగుతున్నప్పటికీ మరణాల నమోదుకానట్లు మాత్రం ఎక్కడా ఆధారాలు లేవని 'ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్సన్' హెడ్ డాక్టర్ జాన్ కెంగ్‌సంగ్ అన్నారు.

మరి.. ఆఫ్రికాలో కరోనా మరణాలు తక్కువగా ఉండడానికి కారణాలేమిటి?

ఫేస్ షీల్డ్

1) సత్వర చర్యలు

ఆఫ్రికాలో మొట్టమొదటి కరోనావైరస్ కేసు ఈజిప్టులో ఫిబ్రవరి 14న నమోదైంది. ఈ వైరస్ ఆఫ్రికాను అతలాకుతలం చేస్తుందని అంతా ఆందోళన చెందారు. దాంతో ఆఫ్రికాలోని చాలా ప్రభుత్వాలు వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన నిబంధనలు అమలు చేశారు.

లెసోథో వంటి దేశాలు ఒక్క కేసు కూడా నమోదు కాకముందే గట్టి చర్యలు ప్రారంభించాయి. దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించి మార్చి 18 నుంచి స్కూళ్లు మూసివేశారు. 3 వారాల లాక్‌డౌన్ కూడా విధించారు.

గ్రాఫ్

అయితే, లాక్‌డౌన్ ఎత్తివేసిన కొద్దిరోజులకే మే నెల ప్రారంభంలో అక్కడ కొన్ని కేసులు నమోదయ్యాయి. 20 లక్షల జనాభా ఉన్న లెసోథోలో ఇప్పటివరకు 1700 కరోనా పాజిటివ్ కేసులు 40 మరణాలు నమోదయ్యాయి.

కోవిడ్ జాగ్రత్తలు

2. ప్రజా మద్దతు

పీఈఆర్‌సీ ఆగస్టులో 18 దేశాలలో నిర్వహించిన సర్వే ప్రకారం అక్కడ ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజల మద్దతు ఉందని గుర్తించారు. సర్వే చేసిన రోజు కంటే ముందు వారం మాస్కులు పెట్టుకున్నట్లు 85 శాతం మంది చెప్పారు.

''గట్టి ప్రజారోగ్య, సామాజిక నిబంధనల అమలుతో ఆఫ్రికన్ యూనియన్ సభ్య దేశాలు మార్చి, మే మధ్య కాలంలోనే వైరస్‌ను సమర్థంగా కట్టడి చేశాయి'' అని ఆ నివేదిక చెప్పింది.

అయితే, జూన్, జులైల్లో లాక్‌డౌన్ నిబంధనలు కొంత సడలించడంతో చాలా దేశాల్లో కేసులు పెరిగాయి.

ఆ తరువాత కొద్దికాలానికి ఆఫ్రికా ఖండంలోని సగం దేశాల్లో కేసులు, మరణాలలో తగ్గుదల కనిపించింది. దక్షిణార్థగోళపు చలికాలం ముగియడం దీనికి కారణమని భావిస్తున్నారు.

అయితే, కరోనా కట్టడికి అమలు చేసిన నియంత్రణలు చాలామంది ప్రజల జీవనంపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రపంచంలో అత్యంత కట్టుదిట్టమైన లాక్‌డౌన్ అమలు చేసిన దేశాల్లో ఒకటైన దక్షిణాఫ్రికాలో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 22 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.

మిగతా కొన్ని దేశాలు కూడా తాము లాక్‌డౌన్ అమలు ప్రారంభించినప్పటి కంటే కేసులు పెరిగినా కూడా ఆర్థిక వ్యవస్థను ముందుకు కదిలించేందుకు గాను నిబంధనలు సడలించాల్సి వచ్చింది.

ఆఫ్రికా యువత

3) యువజనాభా.. తక్కువ వృద్ధాశ్రమాలు

చాలా ఆఫ్రికా దేశాల్లో జనాభా సగటు వయసు కూడా వైరస్‌పై పైచేయి సాధించడంలో కలసివచ్చిందని భావిస్తున్నారు.

ప్రపంచంలోనే చాలా దేశాల్లో చోటుచేసుకున్న కోవిడ్ మరణాల్లో అత్యధికం 80 ఏళ్లు పైబడినవారివే. అయితే, ప్రపంచంలోనే అత్యధిక యువజనాభా ఉన్నది ఆఫ్రికా ఖండంలోనే.

''ఆఫ్రికాలో కోవిడ్ సోకినవారిలో 91 శాతం 60 ఏళ్ల లోపువారే. 80 శాతం కంటే ఎక్కువ మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేద''ని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.

ఆఫ్రికా జనాభాలో 65 ఏళ్లకు పైబడినవారు 3 శాతం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆఫ్రికా హెడ్ డాక్టర్ మాషిడిసో మొయితి చెప్పారు.

ఇందుకు భిన్నంగా ఐరోపా, ఉత్తర అమెరికా, ఆసియాలోని ధనిక దేశాల్లో వయోధికుల జనాభా ఎక్కువగా ఉంది.

''పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ మంది వయోధికులు ఓల్డేజ్ హోంలలో ఉన్నారు. అలాంటి వృద్ధాశ్రమాలలో కరోనావైరస్ వ్యాపించడం వల్ల ఎక్కువ నష్టం జరిగింది'' అన్నారు మొయితి.

ఆఫ్రికాలో వృద్ధాశ్రమాలు చాలా తక్కువ. పట్టణ జనాభాలోనూ వృద్ధుల సంఖ్య తక్కువగా ఉంది.

ఆఫ్రికాలోని చాలా దేశాల్లో పట్టణ ప్రాంతాల్లో పనిచేసేవారు తాము రిటైరయిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లోని తమ ఇళ్లకు వెళ్లే అలవాటుంది. అందుకే పట్టణాల్లో వృద్ధుల సంఖ్య తక్కువగా ఉంటుంది.

గ్రామాల్లో జనసాంద్రత తక్కువగా ఉండడం వల్ల అక్కడ భౌతిక దూరం పాటించడం సులభమవుతుంది కాబట్టి వైరస్ సోకే ప్రమాదం తక్కువ.

దీనికి తోడు చాలా ఆఫ్రికా దేశాల్లో రవాణా వ్యవస్థ అరకొరగా ఉండడం కూడా కరోనా కట్టడికి వరంగా మారిందని చెప్పొచ్చు. దీనివల్ల ప్రయాణాలు తగ్గి వైరస్ వ్యాప్తి తక్కువగా ఉంది.

ఆఫ్రికాలో గొర్రెల కాపరి

4) అనుకూల వాతావరణం

అమెరికాలోని మేరిలాండ్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం చేసిన అధ్యయనం ఉష్ణోగ్రత, తేమ, అక్షాంశాల మధ్య వ్యత్యాసాలు కోవిడ్ వ్యాప్తి తీవ్రతల్లో వ్యత్యాసాలకు సంబంధం ఉందని తేల్చింది.

''మేం కరోనా తొలినాళ్లలో ఆ వ్యాధి వ్యాప్తి తీరును 50 నగరాల్లో అధ్యయనం చేశాం. తక్కువ ఉష్ణోగ్రతలు, తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు గుర్తించాం'' అని అధ్యయనానికి నేతృత్వం వహించిన మొహమ్మద్ సజాదీ చెప్పారు.

ఉష్ణ మండలానికి దూరంగా ఉన్న ఆఫ్రికా దేశాల్లో వ్యాధి వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది.

దక్షిణార్థ గోళంలో చలికాలం(జూన్, జులై, ఆగస్ట్) ఉన్నప్పుడు దక్షిణాఫ్రికాలో కేసులు ఎక్కువగా ఉన్నాయి.. ఆ తరువాత చలికాలం ముగిసిన తరువాత కేసుల సంఖ్య తగ్గింది. ఆఫ్రికా ఖండంలోని మొత్తం కేసులు, మరణాల్లో సగం దక్షిణాఫ్రికాలోనే నమోదయ్యాయి.

పోలియో వ్యాక్సిన్సు వేసే సిబ్బంది

5. సామాజిక ఆరోగ్య వ్యవస్థల పాత్ర

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వైరస్ కట్టడికి ఇంకా చర్యలు కొనసాగుతున్న దశలోనే కోవిడ్ వ్యాప్తి మొదలైంది. దీంతో ఎబోలా కట్టడి కోసం చేపట్టిన స్క్రీనింగ్, ఇతర ప్రక్రియలను కోవిడ్ కట్టడి కోసం కొనసాగించారు. కాంగో పొరుగు దేశాలూ జాగ్రత్తలు తీసుకున్నాయి. 2013-16 మధ్య ఎబోలాతో సతమతమైన పశ్చిమ ఆఫ్రికా దేశాలు ఎబోలా కట్టడి అనుభవంతో కరోనాను అదుపులో ఉంచగలిగాయి. ఎబోలాతో వ్యవహరించిన దేశాల్లో ప్రజారోగ్య ప్రమాణాలు ఇప్పుడు కరోనా నివారణకు తోడ్పడ్డాయి. రోగిని ఐసోలేషన్‌లో ఉంచడం, కాంటాక్ట్ ట్రేసింగ్ వంటివాటిలో అప్పటికే అనుభవం ఉండడంతో అదంతా పనికొచ్చింది.

నైజీరియా వంటి అధిక జనాభా గల దేశంలో పోలియో వ్యాక్సిన్ వేయడానికి గ్రామాలకు వెళ్లే సిబ్బందిని కరోనా విషయంలో ప్రజలకు అవగాహన కల్పించి, జాగ్రత్తలు తీసుకునేలా చేయడానికి వినియోగించారు.

ఆసుపత్రి వసతులు చాలా ఆఫ్రికా దేశాల్లో తక్కువగా ఉన్నప్పటికీ సామాజిక ఆరోగ్య వ్యవస్థ, విధానాలు బలంగా ఉండడం అక్కడ కరోనా వ్యాప్తి నివారణలో కీలకమైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid deaths are less in Africa when compared to the rest of the world
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X