వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్‌ల మధ్య కూడా ఓ వివాదం

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కిమ్చీ

దక్షిణ కొరియాకు, చైనాకు మధ్య దౌత్యపరంగా వివాదాలు ఇదివరకు చాలానే వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆ రెండు దేశాల మధ్య ఓ వంటకం విషయమై గొడవ జరుగుతోంది. అది క్యాబేజీ ఊరగాయ గురించి.

గత డిసెంబర్ మొదట్లో పావో కాయి అనే వంటకంపై చైనాకు అంతర్జాతీయ సర్టిఫికేషన్ లభించింది. అయితే, దక్షిణ కొరియాలో అదే తరహాలో ఉండే కిమ్చీ అనే వంటకం ఫేమస్. దీనికి అంతర్జాతీయంగా ప్రాముఖ్యత ఉంది.

ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) ''చైనా నేతృత్వంలోని కిమ్చీ పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు’ ఇచ్చిందంటూ చైనా ప్రభుత్వ దినపత్రిక 'ద ఇంటర్నేషనల్ టైమ్స్’ ఓ కథనం ప్రచురించింది.

దక్షిణ కొరియా వ్యవసాయ శాఖ దీనిపై అధికారికంగా అభ్యంతరం తెలియజేసింది.

అయితే, తాము పావో కాయికి మాత్రమే సర్టిఫికేషన్ ఇచ్చామని, కిమ్చీకి ఇవ్వలేదని ఐఎస్ఓ స్పష్టం చేసింది.

రెండు దేశాల నెటిజన్లు సోష‌ల్ మీడియాలో ఈ విషయమై వాదులాడుకున్నారు.

అయితే, ఇలా వంటకాలు, ఉత్పత్తుల విషయమై దేశాల మధ్య వివాదాలు ఏర్పడటం కొత్తేమీ కాదు. ఇదివరకు కూడా ఇలాంటివి జరిగాయి.

అలాంటి ఐదు వివాదాలు ఇవిగో...

ఆలుగడ్డ

ఆలుగడ్డ పురిటిగడ్డ

దక్షిణ అమెరికాలో పుట్టిన ఆలుగడ్డలు ఇప్పుడు ప్రపంచమంతా పాకేశాయి.

1530ల్లో దక్షిణ అమెరికాలోని ప్రాంతాలను స్పెయిన్ ఆక్రమించిన తర్వాత ఆలుగడ్డలు యూరప్‌కు వచ్చాయి.

అప్పట్లో దక్షిణ అమెరికాలో దేశాల విభజన లేదు. దీంతో ఆ తర్వాత ఆలుగడ్డల పురిటిగడ్డ ఏదన్న విషయమై పెరూ, చిలీ దేశాల మధ్య వివాదం ఏర్పడింది.

ఆలుగడ్డ తమదని చెప్పుకునేందుకు కళలు, సైన్స్‌ను కూడా చిలీ వాళ్లు వాడుకున్నారు. నోబెల్ పురస్కార గ్రహీత పాబ్లో నెరుడా ఆలుగడ్డ గొప్పతనం గురించి ఓ రచన చేశారు.

'ప్రపంచంలోని ఆలుగడ్డల్లో 99 శాతం వాటికి చిలీ ఆలుగడ్డలతో జన్యు సంబంధం ఉంది’’ అని ఆ దేశ వ్యవసాయ మంత్రి 2008లో ప్రకటించారు.

మరోవైపు పెరూ ప్రభుత్వ వర్గాలు కూడా స్పందించాయి.

యూరప్‌కు ఆకలి తీర్చింది తమ పంటలేనని పెరూ ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటోంది. ఆలుగడ్డలకు మూలమైన సొలానియం బ్రెవికువాలే తమ భూభాగంలోని టిటికాక సరస్సు సమీపంలోనే పుట్టిందని ఆ దేశ నిపుణులు ప్రకటించుకున్నారు.

పిస్కో అనే మద్యం గురించి కూడా చిలీ, పెరూ మధ్య వాదోపవాదాలు జరిగాయి.

హమ్మస్

మిడిల్ ఈస్ట్‌లో హమ్మస్

శెనగ పిండితో చేసే హమ్మస్ అనే వంటకం విషయమై మిడిల్ ఈస్ట్ దేశాల మధ్య కూడా వివాదం ఉంది. ఇజ్రాయెల్, లెబనాన్ మాత్రం దీన్ని మరో స్థాయికి తీసుకువెళ్లాయి.

ఈ రెండు దేశాలూ తమ తమ వారసత్వ సంపదలో హమ్మస్ భాగమని ప్రకటించుకున్నాయి.

రెండు వేల ఏళ్ల కన్నా ముందు నుంచే యూదు మత పత్రాల్లో ఈ వంటకం ప్రస్తావని ఉందని ఇజ్రాయెల్ నిపుణులు వెల్లడించారు.

2008లో లెబనాన్‌లోని హమ్మస్ ఉత్పత్తిదారులు ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఓ పిటిషన్ వేశారు. చట్టవ్యతిరేకంగా హమ్మస్ తమ సొంత వంటకం అని ఇజ్రాయెల్ చెప్పుకుంటోందని ఆరోపించారు.

హమ్మస్‌ను తమ సొంత వంటకంగా గుర్తించాలని లెబనాన్ ప్రభుత్వం యురోపియన్ యూనియన్‌లో పిటిషన్ కూడా వేసింది.

ఈ రెండు ప్రయత్నాలూ విఫలమయ్యాయి.

ఇజ్రాయెల్ సహా మిడిల్ ఈస్ట్ అంతటికీ హమ్మస్ చెందుతుందని యురోపియన్ యూనియన్ ప్రకటించింది.

దీంతో ఆ తర్వాత 'హమ్మస్ యుద్ధం’ మొదలైంది. భారీ హమ్మస్‌లను రూపొందిస్తూ గిన్నిస్ బుక్‌‌ రికార్డులు నమోదు చేసేందుకు ఇజ్రాయెల్, లెబనాన్ పోటీపడ్డాయి. ప్రస్తుతం 10,450 కేజీల హమ్మస్‌తో లెబనాన్ పేరిట రికార్డు ఉంది.

జొలోఫ్ రైస్

జొలోఫ్ రైస్

పశ్చిమ ఆఫ్రికాలోని సెనగల్, ఘనా, నైజీరియా, గాంబియా, సియర్రా లియోన్, లిబీరియా, క్యామెరూన్ లాంటి దేశాల్లో జొలోఫ్ రైస్ చాలా ఫేమస్.

అయితే, దీన్ని తయారుచేసే విధానం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. ఏ దేశానికి ఆ దేశం తమ వంటకమే అద్భుతంగా ఉంటుందని చెప్పుకుంటుంటాయి.

జొలోఫ్ రైస్‌ గురించి 2017లో ఓ టీవీ ఇంటర్వ్యూలో నైజీరియా సమాచార, సాంస్కృతిక శాఖ మంత్రి లాయ్ మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి జొలోఫ్ రైస్ ఏ దేశంలో బాగుంటుందని అని అడిగితే... ఎక్కడ పుట్టిందని అడిగారేమో అనుకుని సెనగల్ అని లాయ్ బదులిచ్చారు.

సెనగల్‌లో అత్యధికంగా ఉండే వొలోఫ్ తెగ వాళ్లే జొలోఫ్ రైస్ వంటకాన్ని సృష్టించారని ప్రచారంలో ఉంది.

లాయ్ సమాధానంపై సోషల్ మీడియాలో నైజీరియన్లు మండిపడ్డారు. దీనిపై చివరికి దేశ ఉపాధ్యక్షుడు యెమి ఒసింబాజో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. నైజీరియా జొలోఫ్ రైస్ అత్యుత్తమమని ఆయన బహిరంగంగా ప్రకటించారు.

బక్లావా

టర్కీ, గ్రీస్ మధ్యలో ఒబామా...

టర్కీ, గ్రీస్ మధ్యలో రాజకీయంగా చాలా అంశాల మీద తీవ్ర స్థాయిలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

వంటకాల విషయంలోనూ ఇదే తీరు కొనసాగింది.

బక్లావా అనే వంటకం తమదంటే తమదని ఈ రెండు దేశాలు వాదించుకున్నాయి.

2012లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బరాక్ ఒబామా గ్రీస్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వైట్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన ఓ విందు గురించి మాట్లాడి చిక్కుల్లో పడ్డారు.

గ్రీకు వంట నిపుణుడు మరియా లోయి చేసిన బక్లావా తనకు తెగ నచ్చిందంటూ ఒబామా అప్పుడు చెప్పారు.

దీంతో టర్కీ మీడియా దీనిపై తీవ్రంగా స్పందించింది.

అంతకు కొన్నేళ్ల ముందు సిప్రస్ దేశ జాతీయ వంటకంగా బక్లావాను చూపిస్తూ యురోపియన్ యూనియన్ చేసిన ప్రచారం కూడా టర్కీలో నిరసన స్వరాలకు కారణమైంది.

బాస్మతి బియ్యం

భారత్, పాకిస్తాన్ మధ్య...

భారత్, పాకిస్తాన్ మధ్య వివాదాలకు కొదువ లేదు.

బాస్మతి బియ్యం విషయమై కూడా ఈ రెండు దేశాల మధ్య ఓ వివాదం ఉంది.

యురోపియన్ యూనియన్‌కు వెళ్తున్న బాస్మతి బియ్యం ఎగుమతుల్లో మూడింట రెండొంతులు భారత్ నుంచే వెళ్తున్నాయి. మిగిలిన ఒక వంతు పాకిస్తాన్ ఎగుమతి చేస్తోంది.

బాస్మతి బయ్యానికి జియో ట్యాగింగ్ కోసం భారత్ దరఖాస్తు చేసింది.

జియో ట్యాగింగ్ వస్తే, యురోపియన్ యూనియన్‌కు భారత్ నుంచి వెళ్లే బాస్మతి బియ్యాన్ని మాత్రమే బాస్మతి బియ్యం అని పిలుస్తారు.

దీంతో ఈ విషయమై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

అయితే, ఈ అంశంలో యురోపియన్ కమిషన్ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Countries that are struggling for cuisine
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X