ఖబడ్దార్.. బయటికొస్తే రూ.2 లక్షలు ఫైన్..
కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావలన్న ప్రభుత్వ ఆదేశాలు తొలి రెండు రోజులు దాదాపు ప్లాప్ అయ్యాయి. కఠిన చట్టాల్లో ఒకటిగా పేరుపొందిన 'అపిడమిక్ డిసీజ్ యాక్ట్-1897'ను ఇంప్లిమెంట్ చేసినప్పటికీ.. వైరస్ తో మాకేంటి భయం అన్న చందంగా చాలా మంది.. నిజంగానే అత్యవసరంగా ఇంకొంతమంది జనం రోడ్లపైకి రావడం తటస్థించింది. దీంతో రెండో రోజు రాత్రి నుంచే పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పడం మొదలుపెట్టారు. అంతేకాదు, బయటికొచ్చిన వాహనాల్ని సీజ్ చేసేస్తున్నారు. కాగా,

షాకింగ్ నంబర్..
ప్రజాస్వామికదేశమైన భారత్ లోనే ఇలా ఉంటే.. కఠిన చట్టాలు.. వాటిని క్రూరంగా అమలు చేసే విధానాలకు పేరుపొందిన గల్ఫ్ దేశాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. గతేడాది డిసెంబర్ లో కరోనా వెలుగు చూసిన తొలినాళ్లలోనే.. గల్ఫ్ లో అతి పెద్ద దేశమైన సౌదీ అరేబియాలోకి వైరస్ ఎంటరైంది. అక్కడి ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కేరళ నర్సులకు పాజిటివ్ అని తేలింది. కొద్ది రోజుల్లోనే ఆమెకు నయం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ రెండో దఫా విజృంభణలో మాత్రం వైరస్ అన్ని చోట్లా విలయతాండవం చేస్తున్నది. సౌదీలో ఆదివారం ఒక్కరోజే 119 కేసులు వెలుగుచూశారు. మొత్తంగా మంగళవారం నాటికి ఆ దేశంలో 511 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.

బెండు తీస్తారంతే..
కరోనా కేసుల సంఖ్య గంటగంటకూ పెరుగుతుండటంతో సౌదీ రాజు బిన్ సాల్మన్ దేశవ్యాప్త కర్ఫ్యూకు ఆదేశాలు జారీచేశారు. సోమవారం రాత్రి నుంచి అక్కడ కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. మొత్తం 21 రోజుల పాటు ఆంక్షలు కొనసాగుతాయని, అత్యవసర సదుపాయాలు ప్రభుత్వమే అందిస్తున్నందని, ప్రజలెవరూ రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు ఎట్టిపరిస్థితుల్లోనూ రోడ్లపైకి రావొద్దని సౌదీ ఇంటర్నల్ మినిస్ట్రీ తెలిపింది. ఒకవేళ ఎవరైనా ఆంక్షల్ని ఉల్లంఘించి బయటికొస్తే.. 10వేల రియాల్స్(భారత కరెన్సీలో సుమారు రూ.2లక్షలు) ఫైన్ విధించడంతోపాటు కఠిన కారాగార శిక్షకూడా రుచిచూడాల్సి ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది. అత్యవసర సేవలకు మాత్రం అన్ని రకాల మినహాయింపుఇచ్చింది.

గల్ఫ్ అంతటా గగ్గోలు..
సౌదీ అరేబియాతోపాటు గల్ఫ్ అంతటా కరోనా విలయంలో చిక్కుకుపోయింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో పాజిటివ్ కేసుల సంఖ్య 153కు పెరగడంతో ఆ దేశ ప్రభుత్వం దాదాపు లాక్ డౌన్ లాంటి ఆదేశాలు జారీచేసింది. మార్కెట్లు, మాల్స్ అన్నీ రెండు వారాలపాటు మూసివేతకు ఆదేశాలిచ్చింది. అంతర్జాతీయ ప్యాసింజర్ విమాన సర్వీసుల్ని కూడా రెండు వారాల పాటు రద్దు చేసింది. ఆయిల్, ఇతర వస్తువుల సరఫాను మాత్రం యధావిధిగా కొనసాగిస్తున్నప్పటికీ, వైరస్ వ్యాప్తి భయంతో కార్మికుల సంఖ్య తగ్గడంతో వాణిజ్య కార్యకలాపాలు కూడా నెమ్మదించాయి. వ్యాపార, వాణిజ్య రంగాన్ని ఆదుకునేందుకు అక్కడి ప్రభుత్వం 4.4 బిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది.

ఇదీ పరిస్థితి..
సౌదీలో 511, యూఏఈలో 153 పాజిటివ్ కేసులకు తోడు బహ్రెయిన్ లో 335, కువైట్ లో 188, ఖతార్ లో 494, ఒమన్ లో 55 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ ఇరాన్ సృష్టించిన జీవాయుధమని బెహ్రెయిన్ పాలకులు ఆరోపించారు. ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో ఉద్యోగుల సంఖ్యను కుదిస్తున్నట్లు సౌదీ సర్కారు తెలిపింది. మిగిలిన కొద్ది మంది కూడా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. మొత్తంగా కరోనా వైరస్ వల్ల గల్ఫ్ లో వ్యాపార వాణిజ్యాలు కుంటుపడటంతోపాటు ప్రాణాపాయ పరిస్థితులూ నెలకొన్నాయి.