వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోవిడ్-19: ఆందోళన రేకెత్తిస్తున్న అత్యంత ప్రమాదకరమైన కొత్త కరోనా వేరియంట్ B.1.1.529

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
కొత్త వేరియంట్

కరోనావైరస్‌లో మళ్లీ మరో కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. ఇది మునుపటి వాటికన్నా భారీగా ఉత్పరివర్తనం చెందింది.

దీని ఉత్పరివర్తనాల జాబితా చాలా పెద్దదేదని, ఇది "చాలా భయంకరమైనదని" శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఇప్పటివరకు మనం చూసిన వేరియంట్లలో ఇదే అత్యంత ఘోరమైనదని చెబుతున్నారు.

కాగా, దీని వ్యాప్తి ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. దక్షిణాఫ్రికాలోని ఒక ప్రాంతంలో మాత్రమే ఈ కేసులు బయటపడ్డాయి.

ఇది మరింతగా వ్యాప్తి చెంది ఉండవచ్చనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.

ఈ వేరియంట్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుంది? వ్యాక్సీన్లకు లొంగుతుందా? ఇప్పుడేం చేయాలి?.. ఇవీ మన ముందున్న ప్రశ్నలు.

వీటికి చాలారకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ, స్పష్టమైన జవాబులు కనిపించట్లేదు.

కొత్త వేరియంట్ భారీగా ఉత్పరివర్తనాలు చెందిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు

తక్షణ కర్తవ్యం?

ఈ కొత్త వేరియంట్‌ను B.1.1.529 అని పిలుస్తున్నారు.

శుక్రవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనికి కూడా ఒక గ్రీకు నామం (ఆల్పా, బెటా, డెల్టాలా) సూచించే అవకాశం ఉంది.

ఈ కొత్త రకం "అసాధారణ స్థాయిలో ఉత్పరివర్తనాలు" చెందిందని, ఇప్పటివరకు కనిపించిన వేరియంట్ల కన్నా ఇది భిన్నమైనదని దక్షిణాఫ్రికాలోని సెంటర్ ఫర్ ఎపిడెమిక్ రెస్పాన్స్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ తులియో డి ఒలివెరా చెప్పారు.

"ఈ వేరియంట్ మమ్మల్ని ఆశ్చర్యపరిచింది. కరోనావైరస్ పరిణామ క్రమంలో ఇది చాలా స్థాయిలు దాటి ముందుకొచ్చేసింది. దీన్లో మేం ఊహించినదాని కన్నా ఎక్కువ ఉత్పరివర్తనాలు కనిపిస్తున్నాయి" అన్నారు.

మొత్తంగా 50 ఉత్పరివర్తనాలు, స్పైక్ ప్రొటీన్‌లో 30 కన్నా ఎక్కువ ఉత్పరివర్తనాలు కనిపించాయి.

ఈ స్పైక్ ప్రొటీన్ల ద్వారానే వైరస్ మన శరీరంలోకి చొచ్చుకుపోతుంది. అందుకే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సీన్లు వీటిని లక్ష్యాలుగా చేసుకుని పనిచేస్తాయి.

ఇంకొంచం లోతుగా చూస్తే రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో 10 ఉత్పరివర్తనాలు కనిపించాయి.

మన శరీరంలోని కణాలను ముందుగా తాకేది వైరస్‌లో ఉన్న ఈ రిసెప్టర్ బైండింగ్ డొమైనే.

ప్రపంచాన్ని గడగడలాడించిన డెల్టా వేరియంట్‌లో రిసెప్టర్ బైండింగ్ డొమైన్‌లో రెండే ఉత్పరివర్తనాలు కనిపించాయి.

ఈ స్థాయిలో మ్యుటేషన్లు, వైరస్‌తో ఏ మాత్రం పోరాడలేని ఒక రోగి శరీరం నుంచి బయటపడి ఉండవచ్చు.

అయితే, చాలా రకాల మ్యుటేషన్లు చెడ్డవి కాకపోవచ్చు. ఇవి ఎలా పనిచేస్తున్నాయన్నది గమనించడం ముఖ్యం.

పూర్తిగా కొత్త మ్యుటేషన్లు

ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, చైనాలోని వుహాన్‌లో తొలుత కనిపించిన కరోనావైరస్ కంటే ఇది చాలా భిన్నంగా ఉంది.

అంటే, ఇప్పటివరకు ఉన్న వ్యాక్సీన్లు దీనిపై అంతగా ప్రభావం చూపించకపోవచ్చు.

ఇంతకుముందు బయటపడిన వేరియంట్లలో కనిపించిన మ్యుటేషన్లు ఇందులోనూ ఉన్నాయి. వాటి ద్వారా ఈ కొత్త వేరియంట్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది.

ఉదాహరణకు N501Y అనే మ్యుటేషన్ వల్ల కరోనావైరస్ సులువుగా వ్యాప్తి చెందుతుంది.

మరొ కొన్ని రకాల ఉత్పరివర్తనాలు, శరీరంలోని యాంటీబాడీస్ వైరస్‌ను గుర్తించకుండా చేస్తాయి.

అయితే, ఇందులో పూర్తిగా కొత్త మ్యుటేషన్లు కూడా కనిపించాయి.

"ఈ కొత్త మ్యుటేషన్ల వల్ల ఈ వేరియంట్ ఒకరి నుంచి ఒకరికి సులువుగా, త్వరగా వ్యాపించవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. అంతే కాకుండా, ఇది రోగనిరోధక వ్యవస్థలో ఇతర భాగాలపై కూడా దాడి చేయవచ్చు.

అయితే, గతంలో కూడా ఇంతలా భయపట్టే వేరియంట్లు బయటపడ్డాయి. కానీ, అవి వాస్తవంలో పెద్దగా ప్రభావం చూపలేదు.

బీటా వేరియంట్ గురించి ఇలాగే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోవడంలో దీనికి సాటి లేదని భయపడ్డారు.

కానీ, దాన్ని మించిపోయిన డెల్టా వేరియంట్ ప్రపంచాన్ని వణికించింది.

"బీటా వేరియంట్ రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునేదే తప్ప మరేమీ కాదు. డెల్టా వేరియంట్‌లో ఇన్ఫెక్టివిటీ ఉంది. అలాగే ఓ మోస్తరుగా రోగనిరోధక వ్యవస్థను తప్పించుకునే గుణం ఉంది. ఈ కొత్త వేరియంట్‌లో ఈ రెండూ అధిక స్థాయిలో ఉన్నాయి" అని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రవి గుప్తా చెప్పారు.

దక్షిణాఫ్రికాలోని 80 పైనే కేసులు

ప్రయోగశాలలో శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టమైన సమాధానాలు ఇస్తాయి. కానీ, వాస్తవ ప్రపంచంలో వైరస్‌ను పర్యవేక్షించడం ద్వారా జవాబులు మరింత త్వరగా వస్తాయి.

ఇది ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, ఆందోళనలకు కారణమయ్యే అంశాలు కనిపిస్తున్నాయి.

దక్షిణాఫ్రికాలోని గౌటెంగ్ ప్రావిన్స్‌లో 77 కేసులు, బోట్స్వానాలో నాలుగు కేసులు, హాంకాంగ్‌లో ఒకటి (సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి) బయటపడ్డాయి. వీరందరికీ కొత్త వేరియంట్ కారణంగానే కోవిడ్ సోకినట్లు స్పష్టమైంది.

అయితే, ఇంత కన్నా వేగంగానే ఈ వేరియంట్ వ్యాప్తి చెందినట్లు సూచనలు కనిపిస్తున్నాయి.

సాధారణ పరీక్షల్లో ఈ వైరస్ చిత్రమైన ఫలితాలను (ఎస్-జీన్ డ్రాపవుట్ అంటారు) ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

అందువల్ల గౌటెంగ్ ప్రాంతంలో 90 శాతం కేసులు ఇదే వేరియంట్ వల్ల కావొచ్చు.

దక్షిణాఫ్రికాలోని "ఇతర ప్రాంతాలకు కూడా ఇది వ్యాప్తి" చెంది ఉండవచ్చు.

అయితే, ఇది డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తుందా, అంతకన్నా తీవ్రమైనదా, వ్యాక్సీన్ల ద్వారా పొందిన రక్షణ వ్యవస్థను తప్పించుకుంటుందా అనే అంశాలు స్పష్టంగా తెలియలేదు.

ఇలా చాలా ప్రశ్నలకు జవాబులు లభించకపోయినా, ఈ కొత్త వేరియంట్ ఆందోళన కలిగించేదేనని శాస్త్రవేత్తలు అంటున్నారు.

దీన్ని మరింత జాగ్రత్త పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడూ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

అన్ని జవాబులూ దొరికే వరకూ వేచి చూడలేమని, మహమ్మారి మనకు ఇప్పటికే నేర్పించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid-19: The most dangerous new corona variant of concern is B.1.1.529
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X