• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోవిడ్-19 వ్యాక్సీన్: టీకాలు సురక్షితమైనవేనా?

By BBC News తెలుగు
|

కరోనావైరస్‌కు కళ్లెం వేసేందుకు భారత్‌లో వ్యాక్సినేషన్ జరుగుతోంది. మూడు వ్యాక్సీన్లకు భారత్ ఆమోదం తెలిపింది. ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వీటిలో మొదటిది. దీన్ని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తోంది. భారత సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ రెండోది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ మూడోది.

బ్రిటన్ సహా చాలా దేశాల్లోనూ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇక్కడ ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్, ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సీన్లను ఇస్తున్నారు.

వ్యాక్సీన్లు ఇస్తున్న ప్రతిచోటా, ఇవి సురక్షితమైనవని ఆయా దేశాల ఔషధ ప్రాధికార సంస్థలు చెబుతున్నాయి. అయితే, కొన్నిచోట్ల చిన్నచిన్న దుష్ప్రభావాలు కనిపిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి.

కరోనా వ్యాక్సినేషన్

వ్యాక్సీన్ సురక్షితమైనదని ఎలా తెలుస్తుంది?

వ్యాక్సీన్‌కు సంబంధించిన ట్రయల్స్ మొదట ప్రయోగశాలల్లో జరుగుతాయి. మొదట సూక్ష్మజీవులు, ఆ తర్వాత జంతువులపై ప్రయోగాలు జరుగుతాయి. చివరగా వీటిని మనుషులపై ప్రయోగిస్తారు.

మొదట తక్కువ మందిపై ప్రయోగం జరుపుతారు. ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించకపోతేనే, తర్వాత దశ ప్రయోగాలకు వెళ్తారు.

కరోనా వ్యాక్సినేషన్

ట్రయల్స్ పాత్ర ఏమిటి?

ల్యాబ్‌లలో చేపట్టే పరీక్షల ఫలితాల్లో ఇది సురక్షితమైనదేనని తేలితే, ఇది ఎంతవరకు పనిచేస్తుందో తెలుసుకునేందుకు పరిశోధకులు ముందుకు వెళ్తారు.

అంటే భారీగా వాలంటీర్లపై ఈ వ్యాక్సీన్‌ను ప్రయోగించే దశలను వారు మొదలుపెడతారు. ఉదాహరణకు ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సీన్‌ను 40,000 మందిపై ప్రయోగించారు. వీరిలో సగం మందికి ఫైజర్ వ్యాక్సీన్ ఇచ్చారు. మరో సగం మందికి ప్లాసెబో ఇచ్చారు. ఎవరికి ఏది ఇచ్చారో చివరి వరకు వెల్లడించలేదు.

ఈ ట్రయల్స్ ఫలితాలను ఎలాంటి పక్షపాతం లేకుండా పరిశీలించారు. ఈ ప్రయోగాలన్నీ చాలా వేగంగా జరిగాయి. అయితే, అనుసరించాల్సిన అన్ని విధానాలను అనుసరించారు.

ఒక వాలంటీర్ చనిపోవడంతో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్ ట్రయల్స్‌ను మధ్యలోనే తాత్కాలికంగా ఆపేయాల్సి వచ్చింది. ఈ టీకా తీసుకున్న వేల మందిలో ఈ మృతి చెందిన వ్యక్తి కూడా ఒకరు. తర్వాత చేపట్టిన విచారణల్లో అతడు వ్యాక్సీన్ వల్ల మరణించలేదని తేలింది. దీంతో మళ్లీ ప్రయోగాలను మొదలుపెట్టారు.

భారత్ స్వదేశీ వ్యాక్సీన్ కోవాగ్జిన్ విషయంలోనూ మొదట్లో ఆందోళనలు వ్యక్తమయ్యారు. సమాచారాన్ని సరిగా వెల్లడించడంలేదని ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. అయితే, మూడో దశ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సీన్ 81 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని తేలింది.

భారత్ బయోటెక్ సమాచారం ప్రకారం.. 18 నుంచి 98 ఏళ్ల మధ్య వయసున్న 25,800 మందిపై కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్ నిర్వహించారు. వీరిలో 2,433 మంది 60ఏళ్లకుపైబడిన వారున్నారు. 4.500 మంది తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్నవారు ఉన్నారు.

కరోనా వ్యాక్సినేషన్

వ్యాక్సీన్లతో దుష్ప్రభావాలు ఉంటాయా?

వ్యాక్సీన్లతో ఎలాంటి కొత్త వ్యాధులు రావు. అయితే, ఇన్ఫెక్షన్లతో ఎలా పోరాడాలో ఇవి మన రోగ నిరోధక వ్యవస్థకు నేర్పిస్తాయి.

వ్యాక్సీన్ తీసుకున్న తర్వాత కొంతమందిలో స్వల్ప లక్షణాలు కనిపించొచ్చు. ఇదేమీ ఇన్ఫెక్షన్‌ కాదు. అయితే, వ్యాక్సీన్‌కు మన శరీరం నుంచి వచ్చే ప్రతిస్పందనలుగా వీటిని చూడాల్సి ఉంటుంది.

ప్రతి పది మందిలో ఒకరిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే కొన్ని రోజుల్లోనే ఇవి తగ్గిపోతాయి. చేయి చొప్పి, జ్వరం, తలనొప్పి, అలసట, నీరసం, తల తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.

కరోనా వ్యాక్సినేషన్

కోవిషీల్డ్‌తో రక్తం గడ్డకడుతుందా?

ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సీన్ తీసుకున్న కొందరిలో అసాధారణంగా మెదడులో రక్తం గడ్డకట్టినట్లు వార్తలు వచ్చాయి.

దీని వల్లే జర్మనీ, ఫ్రాన్స్, కెనడా సహా కొన్ని దేశాలు ఈ వ్యాక్సీన్‌పై ఆంక్షలు విధించాయి. అయితే, ఈ వ్యాక్సీన్ వల్ల కలిగే ముప్పుల కంటే ప్రయోజనాలే ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ స్పష్టంచేశాయి.

ఈ వ్యాక్సీన్‌తో పక్షవాతం, ఇతర ఏమైనా దుష్ప్రభావాలు కలుగుతున్నాయేమో పరీక్షించేందుకు శాస్త్రవేత్తలు, ఔషధ ప్రాధికార సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.

అయితే, ఈ వ్యాక్సీన్ వల్ల నిజంగానే రక్తం గడ్డ కడుతుందా? ప్రస్తుతానికి ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం లేదు.

''అలా కచ్చితంగా జరుగుతున్నట్లు ఆధారాలు లేవు. అయితే జరిగే అవకాశం ఉంది’’అని వ్యాక్సీన్ భద్రతా సమాచారాన్ని పరీక్షించే ద యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్ (ఈఎంఏ) తెలిపింది.

రక్తం గడ్డకట్టడం అనేది దుష్ప్రభావమా? లేక అదే సమయంలో వేరే కారణాలతో వచ్చిన వ్యాధా? అనేది సంస్థ పరీక్షిస్తోంది.

కరోనా వ్యాక్సినేషన్

వ్యాక్సీన్లకు ఎవరు ఆమోదం తెలుపుతారు?

అప్పటివరకు జరిగిన ట్రయల్స్ సమాచారాన్ని పరిశీలించి, ఇది సురక్షితమైనదే.. శక్తిమంతమైన వ్యాధి నిరోధక స్పందనలను కలగజేస్తుందని భావిస్తే ద డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతులు జారీ చేస్తుంది.

ఇతర దేశాల్లోనూ ఇలాంటి ఔషధ నియంత్రణా ప్రాధికార సంస్థలు ఉంటాయి. ఉదాహరణకు బ్రిటన్‌లో వ్యాక్సీన్లకు ఎంహెచ్‌ఆర్‌ఏ అనుమతులు జారీ చేస్తుంది.

అనుమతులు లభించిన తర్వాత కూడా వ్యాక్సీన్ సామర్థ్యాన్ని పరిశీలించేందుకు అన్నింటినీ జాగ్రత్తగా పర్యవేక్షిస్తుంటారు. ముఖ్యంగా దీర్ఘకాలంలో ఎలాంటి దుష్ప్రభావాలు, ముప్పులు వస్తున్నాయో లేదో చూస్తుంటారు.

కరోనా వ్యాక్సినేషన్

కోవిడ్ వ్యాక్సీన్ విషయంలో ఏం జరిగింది?

వ్యాధి నిరోధక స్పందనలను కలుగజేసేందుకు జన్యు కోడ్‌లను ఉపయోగించి ఫైజర్-బయోఎన్‌టెక్ వ్యాక్సీన్‌ను తయారు చేశారు. ఈ వ్యాక్సీన్‌ను ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సీన్‌గా పిలుస్తున్నారు.

ఇది మనుషుల కణాల పనితీరుపై ఎలాంటి ప్రభావం చూపదు. అయితే, కోవిడ్‌తో ఎలా పోరాడాలో రోగ నిరోధక వ్యవస్థకు నేర్పిస్తుంది.

కొన్నిసార్లు వ్యాక్సీన్లలో అల్యూమినియం లాంటి పదార్థాలను కూడా కలుపుతారు. వీటి వల్ల వ్యాక్సీన్ల స్థిరత్వం, సామర్థ్యం పెరుగుతాయి.

కరోనా వ్యాక్సినేషన్

దుష్ప్రభావాల సంగతి ఏమిటి?

చాలా కొన్ని కేసుల్లో మాత్రం దుష్ప్రభావాలు కనిపిస్తాయి. ఈ కేసులను జాగ్రత్తగా పరిశీలిస్తారు. దేని వల్ల ఈ దుష్ప్రభావాలు వచ్చాయో తేలుస్తారు.

ఫైజర్ వ్యాక్సీన్ తీసుకున్న కొందరిలో తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించినట్లు బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ తెలిపింది. ఎవరికైనా అలర్జీలు ఉంటే, వ్యాక్సీన్ తీసుకోవడం మంచిదికాదని సంస్థ సూచించింది.

వ్యాక్సీన్ వ్యతిరేక కథనాలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వస్తుంటాయి. చాలా వరకు వీటికి ఎలాంటి ఆధారాలు ఉండవు.

ముందే కోవిడ్ ఉంటే?

ఒక వేళ ముందే కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకినవారు కూడా వ్యాక్సీన్ తీసుకోవచ్చు. ఎందుకంటే సహజంగా వచ్చే రోగ నిరోధక శక్తి ఎక్కువ కాలం ఉండదు. వ్యాక్సీన్ తీసుకుంటే ఎక్కువ కాలం రక్షణ ఉంటుంది.

అయితే, కోవిడ్ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాతే, వ్యాక్సీన్‌ను తీసుకోవాల్సి ఉంటుంది?

కరోనా వ్యాక్సినేషన్

వ్యాక్సీన్లలో జంతు మాంసం ఉంటుందా?

చిన్నారులకు ఇచ్చే ఫ్లూ వ్యాక్సీన్లలో పంది కొవ్వు ఉన్న మాట వాస్తవమే. ఇతర కొన్ని వ్యాక్సీన్లలోనూ జంతు సంబంధిత పదార్థాలుంటాయి.

కోవిడ్‌తో పోరాడేందుకు సిద్ధంచేసిన ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా వ్యాక్సీన్లలో ఎలాంటి పంది మాంసాన్ని ఉపయోగించలేదు. అయితే, ఈ వ్యాక్సీన్లలో ఆల్కహాల్ ఉపయోగించారని ద బ్రిటన్ ఇస్లామిక్ మెడికల్ అసోసియేషన్ చెప్పింది. అయితే, బ్రెడ్ తయారీలో ఉపయోగించే దానికంటే తక్కువ ఆల్కహాల్‌ను వీటిలో ఉపయోగించారు.

కరోనా వ్యాక్సినేషన్

వ్యాక్సీన్ గురించి ఆందోళన వస్తే...

కోవిడ్ ఇన్ఫెక్షన్‌తో పోరాడేందుకు అత్యుత్తమమైన రక్షణ వ్యవస్థలు వ్యాక్సీన్లేనని పరిశోధనలు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తీవ్రమైన అనారోగ్యం బారిన పడకుండా ఈ వ్యాక్సీన్లు రక్షణ కల్పిస్తాయి.

అయితే, ఇన్ఫెక్షన్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఎంతవరకు ఈ వ్యాక్సీన్లు అడ్డుకోగలవో స్పష్టంగా తెలియడం లేదు. ఒక వేళ నిజంగా ఇవి వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలిగితే, మనం కోవిడ్‌కు కళ్లెం వేయొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid-19 Vaccine: Are Vaccines Safe
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X