• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోవిడ్-19 వ్యాక్సీన్: ప్రపంచం భారీ నైతిక విపత్తును ఎదుర్కొంటోందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు

By BBC News తెలుగు
|

కరోనావైరస్

కోవిడ్-19 వ్యాక్సీన్ విధానాల్లో అసమానతల వల్ల భారీ నైతికపరమైన విపత్తును ప్రపంచం ఎదుర్కోబోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది.

పేద దేశాల్లో ముప్పు ఎక్కువగా ఉండే వారి కంటే ముందుగా అభివృద్ధి చెందిన దేశాల్లోని యువత వ్యాక్సీన్ తీసుకోవడం సరికాదని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అడనోమ్ వ్యాఖ్యానించారు.

''49 ధనిక దేశాల్లో 39 మిలియన్ డోసుల వ్యాక్సీన్లను ఇప్పటికే ప్రజలకు ఇచ్చారు. కానీ ఒక పేద దేశంలో కేవలం 25 డోసుల వ్యాక్సీన్ మాత్రమే పంపిణీ చేశారు''అని ఆయన అన్నారు.

కరోనావైరస్‌పై స్పందనల విషయంలో డబ్ల్యూహెచ్‌వోతోపాటు చైనా కూడా విమర్శలు ఎదుర్కొంటోంది.

అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని కాస్త ముందుగానే డబ్ల్యూహెచ్‌వో ప్రకటించి ఉండుండాల్సిందని డబ్ల్యూహెచ్‌వో ఏర్పాటుచేసిన ఓ స్వతంత్ర్య ప్యానెల్‌ విమర్శించింది. ప్రజారోగ్య చర్యలను ముందుగా తీసుకోవడంలో చైనా విఫలమైందని కూడా ప్యానెల్ విమర్శించింది.

ఇప్పటివరకు చైనా, భారత్, రష్యా, బ్రిటన్, అమెరికా కోవిడ్-19 వ్యాక్సీన్లు అభివృద్ధి చేశాయి. కొన్ని దేశాలు ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకుని టీకాలను అభివృద్ధి చేశాయి. అమెరికా, జర్మనీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఫైజర్ వ్యాక్సీన్ దీనికి ఉదాహరణ.

ఈ దేశాలన్నీ తమ జనాభాకే తొలి ప్రాధాన్యం ఇస్తామని ఇప్పటికే స్పష్టంచేశాయి.

డబ్ల్యూహెచ్‌వో ఏమంటోంది?

ఈ అంశంపై డబ్ల్యూహెచ్‌వో ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో సోమవారం టెడ్రోస్ మాట్లాడారు. ''నా గొంతు మూగబోతోంది. నేడు భారీ నైతిక విపత్తును ప్రపంచం ఎదుర్కొంటోంది. దీనికి ప్రపంచంలోని పేద దేశాలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. అక్కడ భారీ స్థాయిలో మరణాలకు ఈ వైఫల్యం కారణం అవుతుంది''అని ఆయన అన్నారు.

''ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలతో వ్యాక్సీన్ల నిల్వ, ధర పెరుగుతాయి. దీంతో మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను మనం చేరుకోలేం''

''చివరగా ఇలాంటి చర్యలన్నీ మహమ్మారి కాలాన్ని మరింత పొడిగిస్తాయి. వైరస్ కట్టడికి విధిస్తున్న ఆంక్షలను మరింత పొడిగించాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా పెరుగుతాయి''అని ఆయన అన్నారు.

కోవిడ్-19కు కళ్లెం వేయడమే లక్ష్యంగా వచ్చే నెలలో తాము మొదలుపెట్టబోయే టీకా కార్యక్రమం ''కోవాక్స్'' కోసం నిబద్ధతతో పనిచేయాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు.

''ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నాటికి అన్ని దేశాల్లోనూ టీకాలు ఇచ్చే కార్యక్రమాలు మొదలయ్యేలా చూసే బాధ్యతను అందరూ తమ భుజాలపై వేసుకోవాలని కోరుతున్నాను. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థల్లో అసమానతలను తగ్గించడంతోపాటు కోవిడ్ మహమ్మారికి కళ్లెం వేయడానికి ఇది అత్యవసరం''అని ఆయన అన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)తోపాటు అంతర్జాతీయ వ్యాక్సీన్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోవాక్స్ కార్యక్రమంలో ఇప్పటికే 180కిపైగా దేశాలు భాగస్వామ్యం అయ్యాయి. అన్ని దేశాలు ఏకతాటిపైకి రావాలని, అప్పుడే ఫార్మా సంస్థలతో మెరుగ్గా చర్చలు జరపగలమని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది.

ఈ కార్యక్రమంలో భాగంగా అల్ప, మధ్యాదాయ వర్గానికి చెందిన 92 దేశాల్లో టీకాల పంపిణీకి అయ్యే ఖర్చును దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర దేశాలు భరించనున్నాయి.

''ఐదు వ్యాక్సీన్ తయారీ సంస్థల నుంచి ఇప్పటికే మేం 200 కోట్ల డోసులను సేకరించాం. మరో 100 కోట్ల డోసులకు చర్చలు జరుగుతున్నాయి. ఫిబ్రవరిలో టీకా పంపిణీని మొదలుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం''అని టెడ్రోస్ చెప్పారు.

స్పందన ఇదీ..

టెడ్రోస్ హెచ్చరికలపై బ్రిటన్ ఆరోగ్య మంత్రి మ్యాట్ హెన్‌కాక్ మాట్లాడారు. ''ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాక్సీన్లు చేరవేయడమే లక్ష్యంగా చేపడుతున్న ప్రపంచ కార్యక్రమాలకు బ్రిటన్ మద్దతు పలుకుతోంది. ఆర్థికంగానూ మేం సాయం చేస్తున్నాం''అని ఆయన అన్నారు.

''అందరికీ వ్యాక్సీన్లు అందేలా మేం కృషి చేస్తున్నాం. కోవాక్స్ కార్యక్రమానికి ఇప్పటికే 734 మిలియన్ డాలర్లను బ్రిటన్ ప్రభుత్వం వితరణ చేసింది''అని ఆయన చెప్పారు.

మరోవైపు ప్రభుత్వ గణాంకాల ప్రకారం బ్రిటన్‌లో 40 లక్షల మంది తొలి డోసు వ్యాక్సీన్‌ను ఇప్పటికే తీసుకున్నారు.

70ల వయసులో ఉన్నవారు, మరణ ముప్పు ఎక్కువగా ఉండేవారికి ఇక్కడ ముందుగా టీకాలు ఇస్తున్నారు.

ధనిక దేశాలు వ్యాక్సీన్లను భారీగా నిల్వ చేసుకుంటున్నాయని గత నెలలో పీపుల్స్ అలయన్స్ కోయిలేషన్ హెచ్చరించింది. ఇలాంటి చర్యలతో పేద దేశాలకు వ్యాక్సీన్లు దూరమయ్యే ముప్పుందని చెప్పింది.

70 అల్పాదాయ దేశాలకు తమ దేశ ప్రజల్లో కేవలం పది మందిలో ఒకరికి మాత్రమే వ్యాక్సీన్ వేయగలిగే సామర్థ్యముందని సంస్థ చెప్పింది. కెనడాను సంస్థ విమర్శించింది. ఒక్కో కెనడా పౌరుడికి ఐదు రెట్లు రక్షణ కల్పించే స్థాయిలో కెనడా వ్యాక్సీన్ ఆర్డర్లు పెట్టిందని వ్యాఖ్యానించింది.

అయితే, భారీ స్థాయిలో వ్యాక్సీన్లను నిల్వ చేస్తున్నారన్న ఆరోపణలను కెనడా అంతర్జాతీయ వ్యవహారాల శాఖా మంత్రి కరీనా గౌల్డ్ ఖండించారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలు కోవిడ్-19తో పోరాడేందుకు తాము 380 మిలియన్ డాలర్లను వితరణ చేసినట్లు ఆమె వివరించారు.

కరోనా వ్యాక్సినేషన్

ముందుగా స్పందించాల్సి ఉంది

డబ్ల్యూహెచ్‌వో ఏర్పాటుచేసిన స్వతంత్ర కమిటీ తన నివేదికలో చైనా, డబ్ల్యూహెచ్‌వోలపై విమర్శలు చేసింది. మహమ్మారి వ్యాప్తి తొలి దశల్లోనే స్పందించి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది.

2019లో వూహాన్‌లో తొలి కేసులు బయటపడినప్పుడే వైరస్ కట్టడికి చైనా పటిష్ఠమైన చర్యలు తీసుకొని ఉండుండాల్సిందని నివేదికలో వ్యాఖ్యానించారు.

ఆలస్యంగా జనవరి 30న ప్రపంచ అత్యవసర స్థితిని ప్రకటించడంపై డబ్ల్యూహెచ్‌వోను కూడా కమిటీ విమర్శించింది.

''ప్రపంచ వ్యాప్తంగా ముందుగానే హెచ్చరికలు జారీ చేయడంలో డబ్ల్యూహెచ్‌వో విఫలమైంది. తగిన సమయంలో సంస్థ స్పందించలేకపోయింది''అని కమిటీ వ్యాఖ్యానించింది.

న్యూజీలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్, లైబీరియా మాజీ అధ్యక్షుడు ఎలెన్ జాన్సన్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid-19 vaccine: WHO warns the world is facing a major moral catastrophe
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X