• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోవిడ్: 24 కోట్ల వ్యాక్సీన్లు వృథా అయిపోతున్నాయా

By BBC News తెలుగు
|
కరోనావైరస్

కోవిడ్-19పై పోరాటంలో భాగంగా ధనిక దేశాలు కోట్ల సంఖ్యలో వ్యాక్సీన్లను సమీకరించుకుంటున్నాయి..

దీని కోసం ఔషధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటూనే ఉన్నాయి. మరోవైపు, కొన్ని పేద దేశాలు ఇప్పటికీ తమ దేశ జనాభాలో 2 శాతం మందికి కూడా టీకాలు వేయలేదు.

ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సీన్ల సరఫరాను పరిశోధించే డేటా విశ్లేషణ సంస్థ ఎయిర్‌ఫినిటీ నివేదిక ప్రకారం.. ధనిక దేశాలు మొత్తంగా తమకు అవసరమైన కంటే 120 కోట్ల వ్యాక్సీన్ డోసులను అధికంగా సమీకరించుకుంటున్నాయి.

వీటిలో ఐదో వంతు, అంటే 24.1 కోట్ల టీకా డోసులను పేద దేశాలకు దానం చేయకపోతే, అవి వృథా కావొచ్చు.

వీటి సాయం లేకుండానే, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, కెనడా, జపాన్‌లలో మూడో బూస్టర్ డోస్ కూడా ఇవ్వొచ్చు.

అయితే, వీటిని పేద దేశాలకు దానం చేయాలంటే, వీటి ఎక్స్‌పైరీ డేట్ కనీసం రెండు నెలల కంటే ఎక్కువే ఉండాలి. అప్పుడే వీటిని పేద దేశాల్లోని ప్రజలకు ఇవ్వడం సాధ్యపడుతుంది.

కోవిడ్ వ్యాక్సినేషన్

సగం మందికి ఒక్కడోసు కూడా వేయలేదు..

ఇప్పటివరకు, ప్రపంచ జనాభాలో సగం మందికి పైగా ఒక్క డోసు టీకా కూడా తీసుకోలేదు.

అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్(పీఏహెచ్ఓ) ప్రచురించిన డేటా ప్రకారం.. లాటిన్ అమెరికాలో నలుగురిలో ఒకరికి మాత్రమే కోవిడ్-19 టీకా వేశారు.

"మా ప్రాంతంలోని మూడింట ఒక వంతు దేశాలు వాటి జనాభాలో 20 శాతం మందికి కూడా టీకాలు వేయలేదు. కొన్ని ప్రదేశాలలో కవరేజ్ ఇంకా తక్కువగా ఉంది" అని పీఏహెచ్ఓ డైరెక్టర్ కరిస్సా ఎఫ్.ఎటియెన్ వివరించారు.

"చాలా కరీబియన్ దీవులు, దక్షిణ అమెరికా దేశాలలో టీకా రేటు 20 శాతం కంటే తక్కువగా ఉంది. దురదృష్టవశాత్తు, గ్వాటెమాల, హోండురాస్, నికరాగువా వంటి మధ్య దేశాలలో టీకా కవరేజ్ చాలా తక్కువగా ఉంది" అని ఆమె వ్యాఖ్యానించారు.

హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రకారం.. 75 శాతం కోవిడ్-19 టీకాలు 10 దేశాలకు మాత్రమే పరిమితమయ్యాయి.

ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ అంచనా ప్రకారం ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాలు, అత్యంత పేద దేశాల కంటే 100 రెట్లు ఎక్కువగా టీకాలు వేశాయి.

వ్యాక్సీన్ గురించి ఇచ్చిన వాగ్దానాలను ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదని ద ఎకనామిస్ట్ వ్యాక్సీన్ అధ్యయనకర్త అగాథే డెమారైస్ చెప్పారు. "మేం ఇలాంటివి చాలా చూశాం. ఇది ఎప్పటికీ జరగదని మాకు తెలుసు" అని ఆమె అన్నారు.

కరోనా వ్యాక్సినేషన్

ఎన్ని టీకాలు ఇస్తామని హామీ ఇచ్చారు?

డెలివరీ చేస్తామని వాగ్దానం ఇచ్చిన వాటికి, వాస్తవానికి మధ్య వ్యత్యాసం భారీగా ఉంది.

జూన్‌లో, జీ7 సభ్య దేశాలు- కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా- పేద దేశాలకు 100 కోట్ల డోసులను విరాళంగా ఇస్తామని ప్రతిజ్ఞ చేశాయి.

ఆ హామీలో భాగంగా బ్రిటన్ 10 కోట్ల డోసులను ఇస్తామని ప్రతిజ్ఞ చేసింది. అయితే, కేవలం 90 లక్షల డోసులు మాత్రమే బ్రిటన్ విరాళంగా ఇచ్చింది.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ 58 కోట్ల డోసులను ఇస్తామని చెప్పారు. అయితే, ఇప్పటివరకు ఇచ్చింది మాత్రం 14కోట్ల డోసులే.

ఏడాది చివరి నాటికి యూరోపియన్ యూనియన్ 25కోట్ల డోసులను ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే వీటిలో 8 శాతం మాత్రమే ఇప్పటివరకు అందజేసింది.

కోవాక్స్ వైఫల్యం

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) మద్దతుతో అన్ని దేశాల మధ్య సమానంగా వ్యాక్సీన్ పంపిణీ చేయాలన్న లక్ష్యంతో కోవాక్స్‌ కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చారు.

ఈ కార్యక్రమం ద్వారా, తక్కువ ధరకే వ్యాక్సీన్లను కొనుగోలుచేసి మధ్యాదాయ దేశాలకు విక్రయిస్తారు. పేద దేశాలకు విరాళంగా అందజేస్తారు.

కానీ కోవాక్స్‌కు సరఫరా సమస్య ఎదురవుతోంది.

కోవాక్స్ కార్యక్రమంలో భాగంగా 2021లో 200 కోట్ల డోసులను పంపిణీ చేయాలని ప్రణాళికలు రచించారు. వీటిలో ఎక్కువ శాతం భారత్ నుంచి రావాల్సినవి ఉన్నాయి.

వ్యాక్సినేషన్

అయితే, మే నెలలో కరోనా సెకండ్ వేవ్ భారత్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. దీంతో భారత ప్రభుత్వం వ్యాక్సీన్ ఎగుమతులపై నిషేధం విధించింది.

అప్పటి నుంచి, ధనిక దేశాలు విరాళంగా ఇచ్చిన డోసులపై కోవాక్స్ ఆధారపడుతోంది. ఫలితంగా సరఫరా చాలా నెమ్మదించింది.

"ప్రస్తుతం, తక్కువ సంఖ్యలో, తక్కువ కాల పరిమితితో ఉన్న టీకాలను సరఫరా చేస్తున్నారు. దీంతో వీటిని అవసరం ఉన్న దేశాలకు అనుకున్న సమయానికి సరఫరా చేయడం చాలా కష్టమైన పనిగా మారింది" అని కోవాక్స్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అరేలియా గుయెన్ బీబీసీకి చెప్పారు.

కోవిడ్ వ్యాక్సినేషన్

ధనిక దేశాలలో మిగులు ఎందుకు?

ధనిక దేశాల్లో వ్యాక్సీన్ల మిగులుకు సరఫరా సమస్య మాత్రమే కారణం కాదు.

ఎయిర్‌ఫినిటీ అధ్యయనం ప్రకారం, వ్యాక్సీన్ తయారీదారులు ప్రస్తుతం ప్రతి నెలా 150 కోట్ల డోసుల టీకాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి వీరు మొత్తంగా 1,100 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తారు.

"వ్యాక్సీన్లను భారీగానే ఉత్పత్తి చేస్తున్నారు. గత మూడు, నాలుగు నెలల్లో ఉత్పత్తి విపరీతంగా పెరిగింది" అని ఎయిర్‌ఫినిటీ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ మాట్ లిన్‌లీ చెప్పారు.

"ధనిక దేశాలు కేవలం తమ స్వప్రయోజనాలనే చూసుకుంటున్నాయని నేను అనుకోను. ఏ టీకాలు పని చేస్తాయో వారికి తెలియదు. కాబట్టి వారు వివిధ రకాల వ్యాక్సీన్లను కొనుగోలు చేయాల్సివచ్చింది" అని లిన్లీ వివరించారు.

వ్యాక్సీన్‌ల సరఫరా మెరుగ్గా ఉందని, వ్యాక్సీన్లను అదనంగా స్టాక్ ఉంచుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వాలకు అర్థమయ్యేలా చెప్పాలని ఎయిర్‌ఫినిటీ భావిస్తోంది.

రాబోయే నెలల్లో మరిన్ని ఎక్కువ డోసులను ఉత్పత్తి చేయగలరనే నమ్మకం ఉంటుంది కాబట్టి, ప్రస్తుతం అవసరం లేని టీకాలను దానం చేయవచ్చు.

''ఇది రాజకీయ ఒత్తిడికి సంబందించిన అంశం. ఎందుకంటే తమ దేశంలోనే ఇంకా ఎక్కువ డోసులు అవసరం అని ప్రజలు భావించవచ్చు. విరాళంగా ఇవ్వడాన్ని చూసి ఓటర్లు అసంతృప్తికి గురి అయ్యే అవకాశమూ లేకపోలేదు'' అని అగాథే డెమరైస్ బీబీసీకి చెప్పారు.

బ్రిటిష్ ప్రభుత్వం తన వద్ద వ్యాక్సీన్ నిల్వలు లేవని, నాలుగు మిలియన్ డోసులకు ఆస్ట్రేలియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాది చివరి నాటికి ఆస్ట్రేలియా ఈ డోసులను సరఫరా చేయనుంది.

"అవసరమైన వారందరికీ వీలైనంత త్వరగా టీకాలు వేసేలా జాగ్రత్త వహిస్తున్నాము" అని బ్రిటన్‌కు చెందిన ఆరోగ్య, సామాజిక సంరక్షణ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు.

దేశాల మధ్య టీకాల సరఫరాలో ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవడానికి ప్రపంచ దేశాల నాయకులతో సంప్రదింపులు జరపాలని యోచిస్తున్నట్లు యూఎన్‌ జనరల్ అసెంబ్లీ అధ్యక్షులు అబ్దుల్లా షాహిద్ చెప్పారు.

నిబద్ధతతో వ్యవహరించాలి..

ప్రభుత్వాలు దీనిపై స్పందించడం మాత్రమే సరిపోదని గుయెన్ అభిప్రాయపడ్డారు.

''కోవాక్స్ పట్ల అందరూ నిబద్ధతతో వ్యవహరించాలి. ఇప్పటికే సరిపడినన్ని టీకాలున్న దేశాలకు బదులుగా మాతో ద్వైపాక్షిక ఒప్పందాలకు ప్రాధాన్యత ఇవ్వండి''

''గ్లోబల్ వ్యాక్సీన్ తయారీదారులు ప్రతి నెలా 150 కోట్ల డోసులను ఉత్పత్తి చేస్తుంటే, ఇవి పేద దేశాలకు ఎందుకు చేరడం లేదు అని మనం ప్రశ్నించుకోవాలి.''

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

English summary
Covid: 24 crore vaccines are being wasted
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X