• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోవిడ్: ఎవరెస్ట్ శిఖరానికి విస్తరించిన కరోనావైరస్... నేపాలీ అధికారులు నిజాలు దాస్తున్నారా?

By BBC News తెలుగు
|
కరోనా వైరస్

కాఠ్‌మాండూ ఆసుపత్రుల్లో ఇప్పటికే 17 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఎవరెస్ట్ బేస్ క్యాంపు అధికారులు తెలిపారు. బేస్ క్యాంపులు మాత్రమే కాకుండా కాస్త ఎత్తయిన ప్రదేశాల్లో ఉన్న మరి కొన్ని క్యాంపుల నుంచి కూడా పర్వతారోహకులను చికిత్స కోసం పంపించినట్లు వెల్లడించారు.

ఎవరెస్ట్ బేస్ క్యాంపు దగ్గర నుంచి వచ్చిన తర్వాత చాలా మందికి కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు ఒక ప్రైవేటు హాస్పిటల్ సిబ్బంది బీబీసీకి చెప్పారు.

అయితే, ఎవరెస్ట్ బేస్ క్యాంపు దగ్గర కేసులు ఉన్న విషయాన్ని నేపాల్ ప్రభుత్వం ధ్రువీకరించలేదు. ఇదంతా చూస్తుంటే పర్వతారోహణకు ఈ బేస్ క్యాంపును మూసివేయాల్సి వస్తుందనే భయంతో అధికారులు నిజాలు వెల్లడించటం లేదనే భయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎవరెస్ట్ యాత్రల వల్ల నేపాల్ ప్రభుత్వానికి అధిక ఆదాయం లభిస్తుంది. కానీ, గత సంవత్సరం కోవిడ్ మహమ్మారి కారణంగా పర్వతారోహణను నిలిపేశారు.

అయితే, పర్వతారోహణకు వెళ్లే ముందు పర్వతారోహకులు బేస్ క్యాంపు దగ్గర క్వారంటైన్ లో ఉండాలని అధికారులు నిర్దేశిస్తున్నారు. కానీ, అక్కడ కేసుల సంఖ్య పెరిగితే అది తీవ్ర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది.

నేపాల్‌లో ఇటీవల కాలంలో కరోనావైరస్ కేసుల సంఖ్య పెరిగింది. అయితే, నేపాల్ పర్యటక రంగ అధికారులు మాత్రం ఈ విషయంపై స్పందించ లేదు.

బేస్ క్యాంపు దగ్గర కేసులు ఉన్నట్లు తమకు ఎటువంటి సమాచారం లేదని నేపాల్ పర్యటక, సాంస్కృతిక, పౌర విమానయాన శాఖ అండర్ సెక్రటరీ ప్రేమ్ సుబేదీ బీబీసీకి చెప్పారు.

"ఇప్పటి వరకు బేస్ క్యాంపు దగ్గర కేసులు నమోదైనట్లు పర్యటక మంత్రిత్వ శాఖకు సమాచారం లేదు" అని ఆయన అన్నారు.

కరోనా వైరస్

పాజిటివ్ కేసులు

కాఠ్‌మాండూ వెళ్లిన కొంత మంది పర్వతారోహకులకు కోవిడ్ పాజిటివ్ నిర్ధరణ అయిందని బేస్ క్యాంపు దగ్గర ప్రభుత్వ క్లినిక్ నిర్వహించే హిమాలయన్ రెస్క్యూ అసోసియేషన్ బీబీసీకి తెలిపింది.

ఎవరెస్ట్ అధిరోహించి వెనక్కి వెళ్లిన వారిలో 17 మందికి పాజిటివ్ నిర్ధరణ అయినట్లు హిమాలయన్ రెస్క్యూ అసోసియేషన్ అధికారి ల్హక్పా షేర్పా చెప్పారు.

సభ్యులను పర్వతారోహణకు పంపే ముందే వారి ఆరోగ్య వివరాలను తెలియచేయాలని పర్వతారోహణలను నిర్వహించే బృందాలను కోరినట్లు ఆయన చెప్పారు.

కోవిడ్ లక్షణాలైన దగ్గు లాంటి వాటితో కనిపిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోందని ఎవరెస్ట్ బేస్ క్యాంపు క్లినిక్ డాక్టర్ ప్రకాష్ ఖరేల్ చెప్పారు.

"ఇక్కడకు వచ్చిన పర్వతారోహకులలో చాలా మందికి దగ్గు ఉంది. కానీ, ప్రస్తుతం ఇతర లక్షణాలతో ఉన్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారు ఐసోలేషన్ లోకి వెళ్ళేలా చూస్తున్నాం" అని ఖరేల్ చెప్పారు.

ఎవరెస్ట్ ప్రాంతం నుంచి వచ్చిన వారిలో కోవిడ్ లక్షణాలు కనిపించినట్లు హాస్పిటల్ సిబ్బంది ఆస్థా పంత్ కూడా వెల్లడించారు. అయితే ''ఎంత మందికి పాజిటివ్ వచ్చిందో మేము చెప్పలేం" అని ఆమె అన్నారు.

తాము పంపిన పర్వతారోహకులకు పాజిటివ్ వచ్చిందని, అయితే వారంతా ఇప్పుడు కోలుకున్నారని పర్వతారోహణలు నిర్వహించే ఒక బృందం చెప్పింది.

"గత నెలలో కాఠ్‌మాండూలో రెండు వేర్వేరు ఆసుపత్రుల్లో మూడు సార్లు నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది" అని నార్వేకి చెందిన క్లైంబర్ ఎర్లెండ్ నెస్ చెప్పారు.

ఎత్తయిన ప్రాంతాలలో సహజంగా కలిగే అనారోగ్యమని ఆయన మొదట భావించారు. కానీ, బేస్ క్యాంపు నుంచి తిరిగి వచ్చేసిన తర్వాత ఆయనకు పాజిటివ్ అని తెలిసింది.

కరోనా వైరస్

అనుమానం ఎందుకు రావడం లేదు?

కరోనావైరస్ లక్షణాలను ఎత్తైన ప్రాంతాల్లో కలిగే సాధారణ అనారోగ్యంగా తప్పుగా భావించే ప్రమాదముందని పర్వతారోహకులు భయపడుతున్నారు.

"ఎక్కడ పడితే అక్కడ ప్రజలు దగ్గుతుండటం వినవచ్చు" అని ఫర్టెన్‌బ్యాక్ అడ్వెంచర్స్ టీమ్ లీడర్ లుకాస్ ఫర్టెన్‌బ్యాక్ చెప్పారు.

అయితే, ఇది పర్వతారోహకులు సాధారణంగా దగ్గే దగ్గు కాదు. వారు జ్వరం, ఒళ్ళు నొప్పులు లాంటి ఇతర లక్షణాలతో కూడా బాధపడుతున్నట్లు సులభంగా చెప్పేయవచ్చు" అని ఆయన అన్నారు.

ఈ ఏడాది క్లైమ్బింగ్ సీజన్ ఏప్రిల్ 26 నాటికి ఎవరెస్ట్ అధిరోహించేందుకు ప్రభుత్వం 394 అనుమతులు ఇచ్చినట్లు పర్యాటక శాఖ వెబ్ సైటు తెలియచేస్తోంది. అంటే, సహాయ సిబ్బందితో సహా మొత్తం 1500 మంది పర్వతం అధిరోహిస్తారు.

కాఠ్‌మాండూలో కోవిడ్‌కు చికిత్స గాని, లేదా ఇక్కడ ఉష్ణోగ్రతలను తట్టుకునే విధంగా శిక్షణ తీసుకుని ఎవరెస్ట్ బేస్ క్యాంపు దగ్గరకు వచ్చే వారి గురించి కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

"వారు కోలుకుని ఉండవచ్చు. కానీ, వారు తమతో పాటు వైరస్‌న‌ు తీసుకుని వచ్చే ప్రమాదముంది" అని అంటున్నారు.

కాఠ్‌మాండూ వెళ్లకుండా బేస్ క్యాంపు దగ్గరే ఇక్కడ వాతావరణ పరిస్థితులకు తట్టుకునే శిక్షణ తీసుకుంటే మంచిదని ఆయన సూచించారు.

కరోనా వైరస్

టెస్టింగ్ కిట్లు లేవు

అయితే, ఎవరెస్ట్ బేస్ క్యాంపు దగ్గర పర్వతారోహకులకు పరీక్షలు నిర్వహించేందుకు కోవిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో లేవు. ప్రభుత్వం ఇంకా పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వలేదని డాక్టర్ ఖరేల్ చెప్పారు.

కొంత మంది పెద్ద పెద్ద పర్వతారోహక బృందాల వారు సొంతంగా టెస్టింగ్ కిట్లు తెచ్చుకున్నట్లు తెలిపారు. దాంతో వారు పాజిటివ్ వచ్చిన వారిని వెంటనే ఐసోలేషన్ లో పెట్టేందుకు ఉపయోగపడుతోంది.

అయితే, ఇప్పటి వరకు కేవలం 17 కోవిడ్ పాజిటివ్ కేసులు మాత్రమే నిర్ధరణ అయినట్లు హిమాలయన్ రెస్క్యూ అసోసియేషన్ అధికారులు తెలిపారు.

’’ఈ పాజిటివ్ కేసుల వివరాలన్నీ మాకు తెలియకపోవడం విచారకరం'' అని బేస్ క్యాంపు అధికారి ఒకరు బీబీసీతో అన్నారు.

"ఈ వివరాలు తెలిస్తే కాంటాక్ట్ ట్రేసింగ్ చేసి వైరస్ వ్యాప్తిని త్వరగా నిరోధించగలం. పర్వతారోహకులను కూడా వెంటనే ఐసొలేట్ చేసే అవకాశం ఉంటుంది" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Covid: Coronavirus spread to Mount Everest Are Nepali authorities hiding the facts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X